ముంబై: తండ్రి బాల్ ఠాక్రే, మామయ్య రాజ్ ఠాక్రేల్లో ఉన్న చరిష్మా లేదు, వారిద్దరిలా అనర్గళ ఉపన్యాసకుడు కూడా కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. క్షేత్రస్థాయిలో శివసేనను నిలదొక్కుకునేలా చేయడంలో సఫలీకృతం అయ్యాడు. అంతేకాదు హిందుత్వ భావజాలమున్న శివసేనను బుద్ధిస్టు దళితులకూ, హిందీ మాట్లాడేవారికీ చేరువయ్యేలా చేయడంలో కృతకృత్యుడయ్యారు ఉద్ధవ్ ఠాక్రే.
రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు కొందరిని అంచనావేయడంలో పొరబడే ప్రమాదం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే విషయంలో అదే జరిగిందని భావించొచ్చు. ఉద్ధవ్ ఠాక్రేని సంకుచితవాదిగా అంతా భావిస్తారు. కానీ నిజానికి విశాల భావాలున్న వ్యక్తి. తనపై ఉన్న అపోహని తొలగించుకొని ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. దూకుడు స్వభావం కలిగిన శివసేన భావజాలాన్ని బట్టి ఉద్ధవ్ ఠాక్రేని అలా అంచనావేసి ఉండవచ్చు. కానీ దగ్గర్నుంచి చూసినవాళ్లు ఠాక్రే స్టైలేంటో సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు.
స్వభావ రీత్యా, అనుభవం రీత్యా బాల్ ఠాక్రే వారసుడు, శివసేన పార్టీ నడపగలిగిన వాడు రాజ్‌ఠాక్రేనేనని అంతా భావించారు. అయితే మృదుస్వభావి, విశాల స్వభావం కలిగిన ఉద్ధవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం సొంత మామ రాజ్ ఠాక్రేతో తలపడాల్సి వచ్చింది.
- బాల్ ఠాక్రే మీనా థాయ్‌ల కుమారుడు ఉద్దవ్ ఠాక్రేకు వైల్డ్ లైఫ్ అన్నా ఫొటోగ్రఫీ అన్నా ఆసక్తి.
- ఉద్ధవ్‌కి ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో మిలింద్ గునాజీ ఒకరు. తండ్రి బాల్ ఠాక్రేలా, రాజ్ ఠాక్రే మాదిరిగానే ఉద్ధవ్ కూడా తొలుత కార్టూనిస్టే. ఆ తరువాత ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరిగింది.
- 1960లో జన్మించిన ఉద్ధవ్ ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వరై్టజింగ్ ఏజెన్సీని స్థాపించారు. 1985లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక ‘సామ్నా’ పత్రికను వెనకుండి నడిపించారు.
- 1990లో ములుంద్‌లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
- 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు.
- 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు.
- 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే అంత మోదీ గాలిని సైతం తట్టుకొని 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. దీంతో బీజేపీ ప్రభుత్వంలో భాగం కావాల్సి వచ్చింది.
- 2019 ఎన్నికల్లో మాత్రం ముంబైలో తనకున్న పట్టునేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఉద్ధవ్ సిద్ధపడలేదు. ఫలితంగా బీజేపీయేతర పార్టీల మద్దతు కోరి, శివసేన లక్ష్యసాధనలో దాదాపు సఫలీకృతం అయ్యింది. కూటమి ప్రభుత్వంలో ఉద్ధవ్‌కు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. దీంతో మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న పొత్తుకి ఫుల్ స్టాప్ పడినట్లయింది.
ఉద్ధవ్ స్టైలే వేరు..
Published Wed, Nov 27 2019 3:06 AM | Last Updated on Wed, Nov 27 2019 8:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment