మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, 39 చోట్ల ఎన్సీపీ హవా కొనసాగుతోంది.
మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉద్దవ్ వర్గం శివసేన 18 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 12 స్థానాల్లో ఆధిక్యంతో సరిపెట్టుకోగా.. అటు కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే 23 చోట్ల తమ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
అయితే ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే.. నిజమైన శివసేన ఏదనే విషయంలో మరాఠీ ప్రజలు స్పష్టం తీర్పును వెల్లడించారు. ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేననే అసలు పార్టీలుగా ప్రజలు తేల్చినట్లు తెలుస్తోంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఏక్‌నాథ్ షిండే అని మహా ఓటర్లు తేల్చి చెప్పారు.
ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకా
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏక్‌నాథ్‌షిండే.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేశారు,.. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, బీర్లు తయారు చేసే సంస్థలోపనిచేశారు. శివసేన ఫైర్‌బ్రాండ్ నేత దివంగత ఆనంద్ దిఘే ఆశిస్సులతో 1997లో థానే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసి నెగ్గడంతో శిండే రాజకీయ ప్రయాణం ఊపందుకుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఏక్‌నాథ్.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. శిండే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌కు ప్రియశిష్యుడు కూడా.
మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. .
ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ ఆఘాడీ కూటమిలో కొనసాగుతున్నాయి. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. ధనుస్సు, బాణం గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది.
ఇక శనివారం వెలువడుతున్న మహారాష్ట్రలో ఫలితాల్లో ఎన్డీయే కూటమి కూటమి సంచలన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 288 స్థానాలకు గానూ 221 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, ఎన్సీపీ 39 చోట్ల ఆధిక్యాన్ని హవా కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్డీయే శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు నేటి సాయంత్రం ముంబై వెళ్లనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటీ కానున్నారు. ఇక నవంబర్ 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment