Maharashtra Election 2019
-
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
ముంబై : మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతామని మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం తెలిపారు. ఉద్యోగాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆలోచిస్తున్నామని, దానికి సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల వల్ల గత ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లపై వెనకడుగు వేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా, బీజేపీ-శివసేన మధ్య ప్రభుత్వ ఏర్పాటు చెడటంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీపీ ఎమ్మెల్యే. -
రాయని డైరీ: అజిత్ పవార్ (ఎన్సీపీ)
‘‘సీఎం గారు లోపల బిజీగా ఉన్నారు. కాసేపు వెయిట్ చెయ్యండి’’ అన్నాడు అతడెవరో లోపల్నించి వచ్చి! ‘‘సీఎంలు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కొత్త సీఎంలు ఇంకా బిజీగా ఉంటారు. ఉద్ధవ్ ఠాక్రే లాంటి సీఎంలు ప్రధాని కన్నా బిజీగా ఉంటారు. అది నువ్వు చెప్పే పని లేదు. నా పేరు అజిత్ పవార్. లోపలికెళ్లి చెప్పు. వెయిట్ చేసేంత టైమ్ లేదు నాకు’’ అన్నాను. ‘‘సీరియస్ మేటర్ సార్, డిప్యూటీ సీఎంగా ఎవర్ని తీసుకోవాలో డిస్కస్ చేస్తున్నారు’’ అన్నాడు! అతడెవరికో సీఎం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడో తెలిసిందంటే అదంత సీరియస్ డిస్కషన్ కాదని సీఎం అనుకుంటున్నాడని నాకు అర్థమైంది. ‘‘లోపల ఎవరు ఉన్నారు?’’... నన్ను లోపలికి పోనివ్వకుండా ఆపిన మనిషిని అడిగాను. ‘‘ఎవరూ లేర్సార్. సీఎం సార్ ఒక్కరే ఉన్నారు’’ అన్నాడు. ‘‘మరి డిస్కషన్స్ అన్నావు?’’ అన్నాను. అతను నవ్వాడు. డిస్కషన్స్‌కి మనుషులే ఉండాలా సార్! ఫోన్లు ఉంటే సరిపోదా?’’ అన్నాడు. సీఎం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడో తెలిసిన మనిషికి సీఎం ఎవరితో డిస్కస్ చేస్తున్నాడో కూడా తెలిసే ఉంటుంది. ‘‘ఫోన్లో ఎవరు?’’ అని అడిగాను. ‘‘సారీ సర్, అవన్నీ చెప్పకూడదు. కానీ మీ పేరు అజిత్ పవార్ అంటున్నారు కాబట్టి చెబుతున్నాను. పృథ్వీరాజ్ చవాన్‌తో మాట్లాడుతున్నారు. బాలాసాహెబ్ థోరత్తో మాట్లాడుతున్నారు. శరద్ పవార్‌తో మాట్లాడుతున్నారు’’ అన్నాడు. ‘‘నా పేరు అజిత్ పవార్ కాబట్టి చెబుతున్నాను అన్నావు!! అదేంటి?!’’ అన్నాను. ‘‘సీఎం గారు చవాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ‘అజిత్‌కి ఇవ్వకుండా మీకు ఇవ్వగలనా!’ అన్నారు. బాలాసాహెబ్‌తో మాట్లాడుతున్నప్పుడూ.. అదే మాట అన్నారు.. ‘అజిత్‌కి ఇవ్వకుండా మీకు ఇస్తే బాగుంటుందా..’ అని. రెండుసార్లు సీఎం నోటి నుంచి మీ మాట విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా చూస్తున్నాను. లోపల మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోపల ఎవరెవరు మాట్లాడుకుంటున్నదీ మీకు చెప్పకపోవడం ధర్మం కాదనిపించింది. అందుకే చెప్పాను’’ అన్నాడు అతను. ‘‘మరి మీ సీఎం గారు శరద్ పవార్‌తో మాట్లాడుతున్నప్పుడు నా పేరు వినిపించలేదా?’’ అని అడిగాను. ‘‘తెలీదు సార్. ‘చెప్పండి శరద్‌జీ’ అని సీఎం గారు అంటున్నప్పుడు లోపల ఉన్నాను. ఆ తర్వాత బయటికి వచ్చేశాను.. మీరొచ్చారంటే’’ అన్నాడు. ‘‘సరే, నేను వచ్చి వెళ్లానని మీ సీఎం గారికి చెప్పు’’ అని.. నా పేరు, నా ఫోన్ నెంబరు ఉన్న కార్డు అతడికి ఇచ్చాను. ‘‘మీ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ సీఎం గారికి తెలియకుండా ఉంటాయా సార్’’ అని నవ్వాడతను. ‘‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు తెలిసే ఉంటుంది. తర్వాత బిజీ అయి ఉంటారు కదా. తెలియకపోవచ్చు. మర్చిపోకుండా ఈ కార్డివ్వు’’ అని చెప్పి వచ్చేశాను. గేటు దాటుతుంటే ఉద్ధవ్ నుంచి ఫోను! ‘‘సారీ అజిత్ జీ. మీ పని మీదే బిజీగా ఉన్నాను. పోర్ట్‌ఫోలియోలు తెగట్లేదు. అన్ని పార్టీలకీ హోమ్ కావాలి. అర్బన్ డెవలప్మెంట్ కావాలి. రెవిన్యూ కావాలి, హౌసింగ్ కావాలి. ఎవరూ అంతకు తగ్గట్లేదు’’ అంటున్నాడు!! డిప్యూటీ సీఎం పోస్ట్ గురించి కాకుండా క్యాబినెట్ పోస్ట్‌ల గొప్పదనం గురించి మాట్లాడుతున్నాడంటే నాకు ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో శరద్ జీ నుంచి ఉద్ధవ్కేవో సూచనలు, సలహాలు అందినట్లే ఉంది! -మాధవ్ శింగరాజు -
మహా కూటమి ‘మహో’దయం
మహారాష్ట్రలో రాజకీయ పోరు రసవత్తరంగా ముగి సింది. ఈ పోరులో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి, ప్రభుత్వ ఏర్పా టుద్వారా మహోదయానికి శ్రీకారం చుట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్లో శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కగా, బీజేపీ మహాగుణపాఠం నేర్చుకుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెం బ్లీలో, ఏ రాజకీయ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 145ను చేరుకోలేకపోవడంతో హంగ్ ఏర్పడింది. సీఎం పీఠం పంచుకునే విషయమై బీజేపీ–శివసేనల మధ్య రాజకీయ విభేదం తలెత్తింది. బీజేపీ తాము కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమ వాదన చెల్లుబాటు అవుతుందనే భావనతో శివసేనను లెక్కచేయలేదు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన శివసేన కొత్త మిత్రులను వెతుక్కుంది. పలు చర్చల తరువాత కనీస ఉమ్మడి ప్రణాళికతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్– ఎన్సీపీ–శివసేనల మధ్య అంగీకారం కుది రింది. మహారాష్ట్ర ఎపిసోడ్లో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదటగా బీజేపీని ఆహ్వానించిన గవర్నర్, తరువాత శివసేన, ఆ తరువాత ఎన్సీపీని ఆహ్వానించారు. కానీ, గవర్నర్ ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తికాకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కేంద్ర కేబినేట్ ఆ సిఫార్సును ఆమోదించడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. దీనిపై కూటమి నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అత్యవసర అంశంగా పరిగణించిన కోర్టు విచారణ చేపట్టింది. ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే, హడావుడిగా అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసిన గవర్నర్.. చీకట్లోనే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. అనూహ్యంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఎరగా వేసి, ఎన్సీపీ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం చూపిస్తామని బీజేపీ భావించింది. కానీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్ వైపు నిలబడటంతో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మరోవైపు కూటమి వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నవంబర్ 27, సాయంత్రం లోపు, అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేయాలని, ఫ్లోర్ టెస్ట్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన తర్వాత తన ఓటమిని ముందే అంగీకరించిన ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశంలో బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఈ ఉదంతంతో తెలుగు రాష్ట్రాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాల్సింది. అక్కడ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు, పదవుల ఆశ చూపినా ఏ ఒక్కరూ వాటికి లొంగలేదు. కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన ఎమ్మెల్యేలు పార్టీల కోసం నిలబడ్డారు.162 మంది కూటమి ఎమ్మెల్యేలు ఒక్కటిగా ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అనంతర పరిణామాలు, భవిష్యత్ మరాఠా రాజకీయాలను మలుపుతిప్పే రెండు ముఖ్యమైన సమీకరణాలను తెరపైకి తెచ్చాయి. ఒకటి, ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని ఠాక్రే కుటుంబం నుంచి మనవడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీచేసి గెలి చారు. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారి ఒకరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నారు. ఇక రెండవ విషయం, మరాఠా యోధుడు శరద్ పవార్ తరువాత ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇన్ని రోజులు శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్ మరియు కూతురు సుప్రియా మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు, తన అన్న శరద్ పవార్‌కు వ్యతిరేకంగా, అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపటంతో, ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి పవార్ వారసురాలు సుప్రియాకు మార్గం సుగమమైంది. మహారాష్ట్రలో ఈ మహా కూటమి ‘మహో’దయంతో, దేశంలో బీజేపీ ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మినహా చెప్పుకోదగిన ఏ ఒక్క పెద్ద రాష్ట్రాలలోనూ అధికారంలో లేకుండా పోయింది. మహా రాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి. వ్యాసకర్త: కొనగాల మహేష్, జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్ : 98667 76999 -
మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం!
ముంబై: మహారాష్ట్ర 14వ శాసనసభ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కోలంబర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మాజీ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ (ఎన్సీపీ), హరిభావు భగడే (బీజేపీ) తదితరులు ప్రమాణం చేశారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే, ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయకముందే అసెంబ్లీ కొలువుదీరి.. ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేస్తుండటం గమనార్హం. ‘గత కొన్ని దశాబ్దాలుగా అసెంబ్లీలో మొదట ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేసేవారు. ఆ వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి లేరు. సీఎం ప్రమాణం చేయకుండానే ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది అరుదైన దృశ్యం’ అని మహారాష్ట్ర అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి రాజేంద్ర భగవత్ మీడియాకు తెలిపారు. -
గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే దంపతులు!
ముంబై: శివసేన అధినేత, కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ బుధవారం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. ఒకవైపు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు ఉద్ధవ్ రాజ్‌భవన్ వెళ్లి.. మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. గురువారం ముంబైలోని శివాజీ పార్కులో అట్టహాసంగా జరగనున్న కార్యక్రమంలో మహా వికాస్ అఘాది (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి) తరఫున ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం భేటీ అయి.. ఉద్ధవ్ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మూడు పార్టీల నేతలు బృందంగా వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. తమ కూటమికి 166మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలిపారు. ఇందుకుప్రతిగా ఉద్ధవ్‌కు లేఖ రాస్తూ.. డిసెంబర్ 3లోగా అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు లేఖ ఇవ్వాల్సిందిగా సూచించారు. మరోవైపు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో కొత్త మార్పు రాబోతోంది. మిషన్ కంప్లీట్ అయింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారు’ అని పేర్కొన్నారు. -
సుప్రీం తీర్పు ఏం చెప్పిందంటే..
న్యూఢిల్లీ: అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యే పరిస్థితి లేదు కానీ ప్రజాస్వామ్య విలువలపైనా, సుపరిపాలన పొందాలన్న పౌరహక్కుల పైనా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలే చేసింది. అసెంబ్లీలో బలనిరూపణకు ఫడ్నవీస్ సర్కార్‌కు ఒక్కరోజు గడువు మాత్రమే ఇచ్చింది. విశ్వాస పరీక్ష ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. బలపరీక్షలో పారదర్శకత కోసం రహస్య బ్యాలెట్ కాకుండా మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులైపోయినా ఇంకా ప్రభుత్వంపై స్పష్టత లేనందున ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని తెలిపింది. -
ఉద్ధవ్ స్టైలే వేరు..
ముంబై: తండ్రి బాల్ ఠాక్రే, మామయ్య రాజ్ ఠాక్రేల్లో ఉన్న చరిష్మా లేదు, వారిద్దరిలా అనర్గళ ఉపన్యాసకుడు కూడా కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. క్షేత్రస్థాయిలో శివసేనను నిలదొక్కుకునేలా చేయడంలో సఫలీకృతం అయ్యాడు. అంతేకాదు హిందుత్వ భావజాలమున్న శివసేనను బుద్ధిస్టు దళితులకూ, హిందీ మాట్లాడేవారికీ చేరువయ్యేలా చేయడంలో కృతకృత్యుడయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. రాజకీయ పార్టీల్లో కొన్నిసార్లు కొందరిని అంచనావేయడంలో పొరబడే ప్రమాదం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ ఠాక్రే విషయంలో అదే జరిగిందని భావించొచ్చు. ఉద్ధవ్ ఠాక్రేని సంకుచితవాదిగా అంతా భావిస్తారు. కానీ నిజానికి విశాల భావాలున్న వ్యక్తి. తనపై ఉన్న అపోహని తొలగించుకొని ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. దూకుడు స్వభావం కలిగిన శివసేన భావజాలాన్ని బట్టి ఉద్ధవ్ ఠాక్రేని అలా అంచనావేసి ఉండవచ్చు. కానీ దగ్గర్నుంచి చూసినవాళ్లు ఠాక్రే స్టైలేంటో సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. స్వభావ రీత్యా, అనుభవం రీత్యా బాల్ ఠాక్రే వారసుడు, శివసేన పార్టీ నడపగలిగిన వాడు రాజ్ఠాక్రేనేనని అంతా భావించారు. అయితే మృదుస్వభావి, విశాల స్వభావం కలిగిన ఉద్ధవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం సొంత మామ రాజ్ ఠాక్రేతో తలపడాల్సి వచ్చింది. - బాల్ ఠాక్రే మీనా థాయ్‌ల కుమారుడు ఉద్దవ్ ఠాక్రేకు వైల్డ్ లైఫ్ అన్నా ఫొటోగ్రఫీ అన్నా ఆసక్తి. - ఉద్ధవ్‌కి ఉన్న అతికొద్దిమంది మిత్రుల్లో మిలింద్ గునాజీ ఒకరు. తండ్రి బాల్ ఠాక్రేలా, రాజ్ ఠాక్రే మాదిరిగానే ఉద్ధవ్ కూడా తొలుత కార్టూనిస్టే. ఆ తరువాత ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరిగింది. - 1960లో జన్మించిన ఉద్ధవ్ ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వరై్టజింగ్ ఏజెన్సీని స్థాపించారు. 1985లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక ‘సామ్నా’ పత్రికను వెనకుండి నడిపించారు. - 1990లో ములుంద్‌లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. - 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు. - 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు. - 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే అంత మోదీ గాలిని సైతం తట్టుకొని 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. దీంతో బీజేపీ ప్రభుత్వంలో భాగం కావాల్సి వచ్చింది. - 2019 ఎన్నికల్లో మాత్రం ముంబైలో తనకున్న పట్టునేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఉద్ధవ్ సిద్ధపడలేదు. ఫలితంగా బీజేపీయేతర పార్టీల మద్దతు కోరి, శివసేన లక్ష్యసాధనలో దాదాపు సఫలీకృతం అయ్యింది. కూటమి ప్రభుత్వంలో ఉద్ధవ్‌కు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. దీంతో మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఉన్న పొత్తుకి ఫుల్ స్టాప్ పడినట్లయింది. -
ఎప్పుడేం జరిగిందంటే..
మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మంగళవారం ఉదయం నుంచీ చోటు చేసుకున్న అనూహ్య మార్పుల క్రమమిదీ... - ఉదయం 10.39: ఫడ్నవీస్ బలపరీక్షకు బుధవారం సాయంత్రం వరకు గడువునిచ్చిన సుప్రీంకోర్టు. - 11.32: మహారాష్ట్ర పరిణామాలకు నిరసనగా రాజ్యాంగ దినోత్సవ పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్; శివసేన ప్రతిపక్షాలు - 12.07: సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేస్తున్నారనీ, 162 మంది మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారంటూ శివసేన నేత ఏక్నాథ్ షిండే వ్యాఖ్య - 12.18: అసెంబ్లీలో బలనిరూపణ పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన కాంగ్రెస్ చీఫ్ సోనియా - 01.18: పార్టీ ఎమ్మెల్యేలందరూ ముంబై రావాలని బీజేపీ పిలుపు. - 03.01: బుధవారం బలనిరూపణకి సుప్రీంకోర్టు సమయాన్నిచ్చిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డాతో ప్రధాని మోదీ భేటీ - 03.16: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో సమావేశం అనంతరం మరో ఐదేళ్ల పాటు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అంటూ శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటన. - 03.18: అజిత్ పవార్ తమతోనే ఉన్నాడన్న సంజయ్ రౌత్ - 03.42: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా - 04.34: గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన ఫడ్నవీస్ - 05.06: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కోలంబ్కర్ నియామకం - 05.50: కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ప్రకటన - 06.07: ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిం చాలని గవర్నర్‌ని కోరిన కాంగ్రెస్ - 7.47: ఓడిన, అవకాశవాద పార్టీల కూటమి ప్రజల మద్దతు పొందదన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు - 9.12: ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్రను ప్రశ్నించిన వామపక్షాలు. - 9.39: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి చేరుకున్న అజిత్ పవార్ - 9.39: రాజ్‌భవన్‌కు చేరుకున్న ఉద్ధవ్ - 9.46: ముంబైలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం -
సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్
సాక్షి, ముంబై: అపర చాణక్యుడిగా పేరు పొందిన మరాఠా యోధుడు శరద్ పవార్ మహా డ్రామాకు ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రాత్రికి రాత్రి చిన్నాన్నకే గట్టి షాక్ ఇచ్చి బీజేపీతో జత కట్టి ఆదరాబాదరాగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో ఎన్సీపీకి గట్టి షాకే తగిలింది. అజిత్ పవార్ చర్యను పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పవార్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అధికారం వస్తుంది, పోతుంది కానీ బంధాలే కలకాలం నిలుస్తాయి అంటూ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన వాట్సాప్ స్టేటస్‌లో కూడా ఉంచారు. రెండు రోజులుగా అజిత్‌ను తిరిగి పార్టీలోకి రావాలని ఎన్సీపీ నేతలు, పవార్ కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆమె భర్త సదానంద్ సూలే విశ్వ ప్రయత్నాలే చేశారు. అయినా అజిత్ లొంగలేదు. చివరికి శరద్ పవార్ స్వయంగా రంగంలోకి దిగారు. తన సతీమణి ప్రతిభా పవార్ అంటే అజిత్ ఎంత ఆరాధిస్తారో ఆయనకు బాగా తెలుసు. అందుకే అజిత్‌ని దారిలోకి తెచ్చే బాధ్యత తన సతీమణికే అప్పగించారు. ప్రతిభా పవార్ ప్రయత్నాలతో పాటు, ఎమ్మెల్యేలు కూడా తన వెంట లేరన్న సత్యాన్ని గ్రహించుకున్న అజిత్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న షరతుతోనే అజిత్ రాజీనామా చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన రాజకీయ భవిష్యత్‌పై అజిత్ అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. -
రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బలపరీక్షను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు వేగంగా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్ ట్రీ హోట్‌లో శివసేన నేతలు, మరియట్ హోటల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అజిత్ పవార్‌పై ఎన్సీపీ ఒత్తిడి శివసేన, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్సీపీకి ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ చివరిక్షణంలో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్.. రేపటి బలపరీక్షలో కీలకం కానున్నారు. అజిత్ పవార్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అజిత్‌ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అజిత్ పవార్‌తో మంగళవారం శరద్ పవార్ కుటుంబసభ్యులు మంతనాలు జరిపారు. శరద్ పవార్ భార్య రంగంలోకి దిగి.. అజిత్‌తో మాట్లాడారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. తిరిగి ఎన్సీపీ గూటికి వస్తే.. శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అజిత్‌కు వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఎన్సీపీ నేతలు ఒత్తిడి.. అటు బీజేపీ నేతలు ఆశల నేపథ్యంలో అజిత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. బుధవారం నాటి బలపరీక్షలో అజిత్ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అజిత్ బీజేపీ సర్కారును కూల్చుతారా? లేక నిలబెడతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. -
మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్ వర్గం) బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అజిత్ పవార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత శరద్ పవార్‌తో మాట్లాడించినట్టు సమాచారం. అజిత్‌ను బుజ్జగించి తిరిగి తనవైపు తిప్పుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ అజిత్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. శరద్ పవార్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతునివ్వబోరని ఛగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిన అజిత్‌కు ఎమ్మెల్యేలెవరూ మద్దతునివ్వడం లేదని, ఎన్సీపీకి 54మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 53మంది శరద్ పవార్ వెంటే ఉన్నారని, స్వయంగా ఎమ్మెల్యే అయిన అజిత్ ఒక్కడే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. -
మాకు 162మంది ఎమ్మెల్యేల మద్దతుంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్సీపీ ముఖ్య నేత అజిత్ పవార్ ఒక్కసారిగా తిరుగుబాటు చేసి.. బీజేపీతో చేతులు కలుపడంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహరాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష విషయమై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించనుండగా.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు సోమవారం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 162మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు ఉదయం 10 గంటలకు నేను, షీండే, చవాన్, వినాయక్ రావత్ తదితర నేతలతో కలిసి గవర్నర్‌ను కలిశాం. మా కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ తరఫున లేఖ ఇచ్చాం. గవర్నర్ ఎప్పుడు కోరితే అప్పుడు 162 మంది ఎమ్మెల్యేలను ఆయన ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు. తప్పుడు పత్రాలతో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైందని, కానీ తమ కూటమికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్రలోని రాజకీయ డ్రామాపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. బీజేపీకి మెజారిటీ లేదనే విషయం అందరికీ తెలిసిందేనని, గతంలో తమకు మెజారిటీ లేదనే విషయాన్ని అంగీకరిస్తూ బీజేపీ గవర్నర్‌కు లేఖ కూడా రాసిందని గుర్తు చేశారు. ఇక, అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ విషయమై పార్టీ నేతలు తగిన సమయంలో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు అజిత్ వర్గం ఎమ్మెల్యేలు క్రమంగా తమవైపు చేరుతున్నారని, ప్రస్తుతం 53మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తెలిపారు. -
వెంటనే బలపరీక్ష జరగాలి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుబట్టాయి. బీజేపీ ఉద్దేశపూరితంగానే బలపరీక్షను జాప్యం చేయాలని చూస్తోందని, ఈ రోజు లేదా రేపటిలోగా బలపరీక్షకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాయి. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా శివసేన పార్టీ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మహారాష్ట్రలో హడావిడిగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారని సింఘ్వీ దుయ్యబట్టారు. అజిత్ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు ధ్రువీకరిస్తూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వారు లేఖ ఎంతమాత్రం ఇవ్వలేదని సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అజిత్ వద్ద ఉన్న లేఖతో బీజేపీ అతి తెలివి ప్రదర్శించిందని, గవర్నర్ ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన అఫిడవిట్లను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, విచారణ పరిధిని పెంచడం ఇష్టంలేని సుప్రీంకోర్టు ఈ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరించింది. ఉద్ధవ్ ఠాక్రేకు 48మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 56మంది శివసేన ఎమ్మెల్యేలు, 44మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతునిస్తున్నారని సింఘ్వీ స్పష్టం చేశారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు, బేరసారాలను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష జరగాలని, 24 గంటల్లో అసెంబ్లీ బలనిరూపణ చేసుకునేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సింఘీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇవ్వవద్దని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం శివసేన కూటమికి ఉందని తెలిపారు. బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ కూడా పేర్కొంటున్నదని, ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా జాప్యమెందుకని, వీలైనంత త్వరగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బలపరీక్ష జరగడం ముఖ్యమని, గెలుపోటములు కాదని అన్నారు. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! శివసేన తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందన్న అజిత్ పవార్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఏదని ప్రశ్నించారు. తమ వద్ద 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి అఫడవిట్లు ఉన్నాయని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం శాసనసభాపక్ష నేత అజితే ఫిరాయించారని ఆరోపించారు. సభలో బలముంటే నిరూపించుకోవడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని సిబల్ నిలదీశారు. తెల్లవారుజామునే హడావిడిగా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేశారని, చడీచప్పుడు లేకుండా హడావిడిగా ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని విమర్శించారు. సభలో వీడియో రికార్డింగ్ ద్వారా బలపరీక్ష జరగాలని కోరారు. ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన తీరుగానే మహారాష్ట్రలోనూ బలపరీక్ష జరగాలని కోర్టును కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా ఉండి కలిసి పోటీ చేసిన శివసేన.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించిందని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. శివసేన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శివసేన తీరుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, అనంతర పరిణామాల్లో ఒక పవార్ బీజేపీతో ఉండగా.. మరొక పవార్ శివసేనతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న శివసేన కూటమే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలపై గవర్నర్‌ను అనుమానించాల్సిన అవసరం లేదని, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ కలిసి సమావేశమైన తర్వాతే గవర్నర్‌కు లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారని చెప్పారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. ఫడ్నవిస్‌కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? అంటూ ప్రశ్నించింది. దీనికి రోహత్గి స్పందిస్తూ.. అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఫడ్నవిస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ విచణతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకలో యెడియూరప్ప సర్కారు ఏర్పాటు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఎప్పటిలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలో సుప్రీంకోర్టు చెప్పజాలదని రోహత్గి వాదించారు. చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి? ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ తరఫు లాయర్ మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. తమదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని చెప్పుకొచ్చారు. ఎన్సీఎల్పీ నాయకుడిగా తమ పార్టీకి చెందిన 54మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు ఇచ్చానని తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు లేఖ ఇచ్చానని సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పార్టీలోనే పరిష్కరించుకుంటామని, వెంటనే ఈ పిటిషన్‌పై విచారణ నిలిపివేయాలని అజిత్ లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
బీజేపీ టార్గెట్ 180.. ఆ నలుగురిపైనే భారం!
ముంబై : బలపరీక్షలో తన ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బంపర్ మెజారిటీతో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినట్టు తెలుస్తోంది. మీడియా కంటపడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 145. కానీ, బీజేపీ 170 నుంచి 180 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. ఇటీవలికాలంలో బీజేపీలో చేరిన నారాయణ్ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్ నాయక్, బాబన్‌రావు లోనికర్లకు ‘ఆపరేషన్ ఆకర్ష’ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. వీరిలో నారాయణ్ రాణె, విఖె పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామందితో వీరికి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇక, గణేశ్ నాయక్, బాబన్‌రావు ఎన్సీపీ మాజీ నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వీరికి మంచి సంబంధాలున్నాయి. వీరి ద్వారా పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు నేతలు పలువురు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చారని అంటున్నారు. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్నట్టు చెప్తోంది. ఈ 15మంది స్వతంత్రుల్లో 11మంది ఇప్పటికే మద్దతు లేఖలు ఇచ్చారు. ఇక, ఇటీవల చేతులు కలిపిన అజిత్ పవార్ 27 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను తనవెంట తీసుకొచ్చే అవకాశముందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదే జరిగితే 143 నుంచి 146 మంది మద్దతు బీజేపీకి దక్కినట్టు అవుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగే స్పీకర్ ఎన్నికలో తమ నేతను సభాపతిగా ఎన్నుకుంటే.. సగం బలపరీక్ష నెగ్గినట్టేనని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకునేందుకు అటు శరద్ పవార్ కూడా శాయశక్తులా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక, బీజేపీ అజిత్‌పైనే గట్టి నమ్మకమే పెట్టుకుంది. ‘అజిత్ వెంట 27 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముంది. ఎన్నికల్లో పార్టీ రోజువారీ వ్యవహారాలు చూసుకోవడమే కాదు.. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఖర్చులను పూర్తిస్థాయిలో అజితే భరించారు. ఇటు కాంగ్రెస్, సేన ఎమ్మెల్యేలకు కూడా ఆయన సాయం చేశారు. కాబట్టి ఆయన వెంట పెద్దఎత్తున ఎమ్మెల్యేలు కలిసివచ్చే అవకాశముంది’ అని ఒక బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. మొత్తం 29 మంది (16 మంది చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, 13 మంది స్వతంత్రులు)లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతునిస్తున్నారు. వీరిలో చాలామందికి బీజేపీ గట్టిగానే గాలం వేస్తోంది. వీరిలో ఎక్కువమంది బీజేపీలో చేరే అవకాశముందని భావిస్తున్న కమలదళం.. శివసేన ఎమ్మెల్యేల్లో కూడా కొందరిని తనవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేల్లో ఎస్పీ, ఎంఐఎం మినహా మిగతా 19, 20 మంది మద్దతు తనదేనని బీజేపీ ధీమాగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేల డిమాండ్లకు అంగీకరించడమే కాదు.. ఫిరాయింపునకు సిద్ధపడితే మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమంటూ బీజేపీ ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఆపరేషన్ ఆకర్ష ఫలిస్తే బలపరీక్షలో నెగ్గడం చాలా సులభమని కాషాయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. -
మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సంక్షోభంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో 24 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో కానీ, గవర్నర్ వద్ద కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్‌భవన్ మెజారిటీని నిరూపించజాలదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిరాయింపులు నిరోధించాలంటే వెంటనే బలపరీక్ష జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, బలపరీక్షకు రెండు, మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. 24 గంటల్లోగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వరాదని, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం కనీసం 7రోజుల గడువు ఇవ్వాలని బీజేపీ తరఫు న్యాయవాది కోరగా.. 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం చేయరాదని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ధర్మసనాన్ని అభ్యర్థించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! గవర్నర్ నిర్ణయంలో తప్పేముంది? కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ముందు పొత్తులకు సంబంధించి గవర్నర్‌కు అన్ని విషయాలు తెలుసునని, కూటమి పొత్తుల గురించి కూడా ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతిస్తూ బీజేపీ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను ఆయన సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదట మూడు పార్టీలను గవర్నర్ ఆహ్వానించారని, ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోవడంతో విధిలేక రాష్ట్రపతి పాలన విధించారని వివరించారు. అనంతర పరిణామాల్లో ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చిందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. బీజేపీకి మద్దతునిస్తూ 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అజిత్ పవార్ ఇచ్చారని, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత హోదాలో అజిత్ లెటర్ హెడ్లో ఎమ్మెల్యేలతో సంతకాలతో ఈ లేఖ ఉందని వివరించారు. చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి? బీజేపీ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఈ 170 మంది ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్ద ఉందని వివరించారు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ విచక్షణాధికారాలు ఉంటాయని, గవర్నర్ నిర్ణయంపై న్యాయసమీక్ష చేసే అధికారం కోర్టుకు లేదని, వెంటనే ఈ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను ఆహ్వానించే హక్కు గవర్నర్‌కు ఉందని, 170 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చాక దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తప్పేముందని, ప్రశ్నించారు. గవర్నర్ విడివిడిగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేరు కదా అని వ్యాఖ్యానించారు. పార్టీలు సమర్పించిన జాబితానే గవర్నర్ విశ్వసిస్తారని తెలిపారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ ఎవరికీ జవాబుదారీ కాదని పేర్కొన్నారు. ఫిరాయింపులపై ఆలోచించాకే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని సొలిసిటర్ జనరల్ చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఆదివారం సెలవురోజు అయినప్పటికీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఫడ్నవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఫడ్నవీస్ గవర్నర్‌కు రాసిన లేఖను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ లేఖలను సోలిసిటర్ జనరల్ సోమవారం న్యాయస్థానానికి అందజేశారు. ఈ రెండు లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఆదివారం విచారణ సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరూ లేకపోవడంతో ఆ లేఖలను తమకు అందజేసే బాధ్యత తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. అయితే, 24 గంటల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫడ్నవీస్‌ను ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆ లేఖలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం ‘24 గంటల్లోగా బల నిరూపణను ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను గవర్నర్ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్‌కు ఫడ్నవీస్ పంపిన లేఖలను పరిశీలించిన తరువాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం’ అని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలన్న వినతిని సైతం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ వినతిని పరిశీలించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సెలవు రోజైనప్పటికీ ఆదివారం విచారణను కోర్టు ప్రారంభించడం విశేషం. చదవండి: విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం! -
మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న బీజేపీ.. ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను వేర్వేరు హోటళ్లకు తరలించి.. వారు జంప్ కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. అయినా ఆయా పార్టీలను ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి బీజేపీ నిఘా పెట్టినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో తిరుగుతున్న ఇద్దరు పోలీసులను ఎన్సీపీ నేతలు గుర్తించి నిలదీయడం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ సర్కార్ ఉసిగొల్పడంతోనే పోలీసులు ఇలా మాములు చొక్కాలు ధరించి.. తమపై గూఢచర్యం నెరుపుతున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో పోలీసులు కనిపించడంతో అప్రమత్తమైన ఎన్సీపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలను ఆ హోటల్ నుంచి హోటల్ హయత్‌కు ఆదివారం సాయంత్రం మార్చింది. ముంబై పొవైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో ఇద్దరు పోలీసులు కనిపించడంతో వారిని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ నిలదీశారు. పోలీసుల ఐడీ కార్డులు చెక్‌చేసిన ఆయన.. ‘ఉన్నతమైన పదవుల్లో ఉన్న మీరు ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ తిరుగుతున్నారని చెబితే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్లమా?’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ తరఫున పోలీసులు గూఢచర్యం నెరుపుతున్నారని, ఎమ్మెల్యేల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీజేపీకి చెరవేస్తున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సైతం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్లో బీజేపీ కూడా రూమ్‌లు బుక్ చేస్తోందని, తద్వారా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ గాలానికి అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు తరలించారు. అటు శివసేన తన ఎమ్మెల్యేలను గట్టి నిఘా నడుమ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని లలిత హోటల్లో ఉంచింది. -
నెత్తి పగలకొడతాం.. కాళ్లు విరగ్గొడతాం!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘మహా వికాస్ అఘాది’ పేరిట ఏర్పాటుకానున్న సంకీర్ణ సర్కారు విషయమై శుక్రవారం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే.. శివసేనలో చీలిక వచ్చే అవకాశముందనే కథనాలు వస్తున్నాయి. పలువురు శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసిందని, శివసేన ప్రభుత్వ ఏర్పాటు యత్నాలకు బ్రేక్ వేసేందుకు కమలదళం ఈ మేరకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీ చీలిక యత్నాలపై తీవ్రంగా స్పందించారు. ఎవరైనా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. తీవ్ర హింసాత్మక చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఎవరైనా శివసేన ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తే.. మేం వారి తల పగలగొడతాం. దాంతోపాటు కాళ్లు కూడా విరగొడతాం. ఆ తర్వాత వారి బాగోగులు కూడా శివసేననే చూసుకుంటుంది. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం. ఇందుకోసం అంబులెన్స్ కూడా సిద్ధం చేస్తాం’ అని అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
మారిన బెర్త్.. ఇంత అవమానమా?
ముంబై: మిత్రపక్షం బీజేపీకి కటీఫ్ చెప్పిన శివసేనకు మరో ఝలక్.. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కూర్చునే సీటును మార్చేశారు. ఇప్పటివరకు పెద్దలసభలో మూడో వరుసలోని సీటులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూర్చునేవారు. కానీ ఆయన సీటును ఇప్పుడు ఐదో వరుసలోని కూర్చీలోకి మార్చారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధంతరంగా తన సీటును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఆయన లేఖ రాశారు. రాజ్యసభలో తన సీటు మార్చడం తీవ్ర ఆశ్చర్యం కలిగించిందని, శివసేన మనోభావాలను దెబ్బతీయడానికి, తమ పార్టీ గొంతును అణచివేయడానికే ఉద్దేశపూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. తనను, శివసేనను అవమానించడానికే ఇలా సీటు వరుసను మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నట్టు తాము ఇంకా అధికారిక ప్రకటన చేయలేదని, అయినప్పటికీ సీటు వరుసను ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ-శివసేన తమ మధ్య దోస్తీకి కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి పంపకం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బీజేపీకి దూరం జరిగిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో ఇటు కాంగ్రెస్, ఎన్సీపీతోనూ ఇంకా ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంతోపాటు ఆ పార్టీ ఎంపీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. -
రాయని డైరీ: శరద్ పవార్ (ఎన్సీపీ చీఫ్)
నేను వెళ్లేటప్పటికే సోనియాజీ నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు! ‘‘సారీ సోనియాజీ మిమ్మల్ని మీ ఇంట్లోనే ఎంతోసేపటిగా నా కోసం వేచి ఉండేలా చేశాను’’ అన్నాను నొచ్చుకుంటూ. సోనియా నవ్వారు. ‘‘నేనెక్కడ మిమ్మల్ని నాకోసం ఎంతోసేపటిగా వేచి ఉండేలా చేస్తానోనన్న జాగ్రత్తతో ముందుగానే నేను మీకోసం వేచి ఉన్నాను పవార్జీ. టైమ్ చూడండి. వస్తానన్న సమయానికంటే కాస్త ముందుగానే వచ్చారు మీరు’’ అన్నారు. ‘‘హాహ్హాహా.. అవునా సోనియాజీ’’ అని సోఫాలో ఒక వైపు కూర్చున్నాను. ‘‘కూర్చోండి పవార్జీ’’ అన్నారు సోనియాజీ! వస్తానన్న సమయానికంటే ముందే వచ్చినట్లు.. కూర్చోవలసిన సమయమింకా రాకముందే కూర్చున్నట్లున్నాను!! ‘‘సారీ సోనియాజీ మీరు కూర్చోమనక ముందే కూర్చున్నట్లున్నాను’’ అన్నాను. ‘‘సారీ నేను చెప్పాలి పవార్జీ. మీరు కూర్చోడానికి ముందే ‘కూర్చోండి’ అని నేను మీతో అని ఉండవలసింది’’ అన్నారు సోనియా. సోనియాజీలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సొంత పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఆమె కోసం సందర్శకుల గదిలో గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చేది! ‘‘వీళ్ల కాన్ఫిడెన్స్ చూశారా పవార్జీ! గవర్నర్ పిలిచి మరీ కూర్చోమంటే కూర్చోవడం చేతకానివాళ్లు.. ‘వీళ్లెలా కూర్చుంటారో, ఎన్నాళ్లు కూర్చుంటారో మేమూ చూస్తాం’ అని మనల్ని అంటున్నారు!’’ అన్నారు సోనియాజీ. ‘‘విన్నాను సోనియాజీ. నేను ఢిల్లీ వచ్చే ముందు కూడా బీజేపీ వాళ్లెవరో నాకు వినబడేలా గట్టిగా ఎవరితోనో అంటున్నారు.. ఎవరు ఎవరితో కలిసినా చివరికి మహారాష్ట్రలో గవర్నమెంట్‌ని ఫామ్ చేయబోయేది వాళ్లేనట’’ అన్నాను. ‘‘చూపిద్దాం పవార్జీ. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిస్తే ఎలా ఉంటుందో బీజేపీకి చూపిద్దాం’’ అన్నారు సోనియాజీ. ‘‘ఏం చేద్దాం సోనియాజీ? ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెడదామా సీఎం సీట్లో..’’ అన్నాను. ‘‘ఏం ఆలోచిస్తున్నారు పవార్జీ! మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్యను కూర్చోబెట్టామా.. మహారాష్ట్రలో ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెట్టడానికి! రాజస్తాన్‌లో సచిన్ పైలట్‌ని కూర్చోబెట్టామా మహారాష్ట్రలో ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెట్టడానికి! నలభైలలో ఉన్న చిన్నారులనే సీఎం సీటుకు వద్దనుకున్నప్పుడు ఇరవైలలో ఉన్న పసికందును సీఎం సీట్లో కాంగ్రెస్ ఎలా కూర్చోబెడుతుంది?’’ అన్నారు సోనియా. సోనియాజీలోకి మళ్లీ పాత సోనియాజీ ప్రవేశించినట్లున్నారు. కాంగ్రెస్ కన్నా ఎన్సీపీకి పది సీట్లు ఎక్కువ వచ్చిన సంగతి పక్కనపెట్టి, సీఎం పోస్టు కాంగ్రెస్ చేతిలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు! ‘‘సోనియాజీ.. కాంగ్రెస్వీ, ఎన్సీపీవి కలిపి శివసేన కన్నా ఎన్ని ఎక్కువ సీట్లు ఉన్నాయో మీరు లెక్కేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా, ఎన్సీపీకన్నా ఎన్ని ఎక్కువ సీట్లున్నాయో శివసేన లెక్క వేసుకుని కూర్చుంది’’ అన్నాను. ‘‘లాజిక్ ఆలోచించండి పవార్జీ’’ అన్నారు సోనియా! నాకేం లాజిక్ అందలేదు. అంకెల్ని మించిన లాజిక్ ఏముంటుంది?! ‘‘పవార్జీ.. ఫడ్నవిస్‌ని కూర్చోమన్నారు. కూర్చోలేకపోయాడు. ఠాక్రేని కూర్చోమన్నారు. కూర్చోలేకపోయారు. కూర్చోమన్నప్పుడు కూర్చోలేకపోయిన వారు సీఎం సీటుకు సూట్ అవుతారా, కూర్చోమనకుండానే కూర్చున్నవారు సీఎం సీటుకు సూట్ అవుతారా ఆలోచించండి..?’’ అన్నారు సోనియాజీ. సోనియా చెప్పదలచుకోనిదేమిటో అర్థం చేసుకోడానికి నేను పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదని నాకు అర్థమైంది. - మాధవ్ శింగరాజు -
కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన చర్చలు ప్రారంభం!
ముంబై: మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి ప్రణాళికపై దృష్టి పెట్టాయి. అదేక్రమంలో పదవుల పంపకాలపైనా జోరుగా చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్‌తో అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యాయని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో తెలిపారు. ఆయన బుధవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కోఆర్డినేషన్ కమిటీ నేతలతో సమావేశమై.. చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలకాంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పదవుల పంపకాలపై భేదాభిప్రాయాలు, సంకీర్ణ ప్రభుత్వపు ఉమ్మడి విధానంపై మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయాన్ని వెలువరిస్తామని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం పదవిపై తర్జనభర్జన ముఖ్యమంత్రి పదవి కోసమే శివసేన బీజేపీతో కొట్లాడి.. కాషాయ కూటమి నుంచి వైదొలిగింది. ఇప్పుడు అనూహ్యంగా తనకు బద్ధశత్రువలైన కాంగ్రెస్-ఎన్సీపీలతో శివసేన చేతులు కలుపుతోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎన్సీపీ కూడా పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్లు పంచాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోందని, ఈ డిమాండ్‌పైనే చర్చల్లో పీటముడి ఏర్పడే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు శివసేన మాత్రం సీఎం పదవి తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా సీఎం పదవి తమ పార్టీ నేతే చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి పంపకానికి శివసేన సిద్ధపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: సీఎం పదవి మాదే: సంజయ్ రౌత్ -
సీఎం పదవిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఛాతినొప్పి కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. లీలావతి ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదేనని, తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన నేత పగ్గాలు చేపట్టనున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారన్న వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!! సీఎం పదవిని మాకూ పంచాల్సిందే! ప్రస్తుత అధికార పంపిణీ విషయంలో శివసేన-ఎన్సీపీ మధ్య చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చిన ఎన్సీపీ.. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మొదటి రెండున్నరేళ్లు శివసేన సీఎం పదవిని చేపడితే.. ఆ తర్వాతి రెండేన్నరేళ్లు తమకు ఆ పీఠాన్ని అప్పగించాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ డిమాండ్‌తో సంకీర్ణ పక్షాల మధ్య పీటముడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ కీలకమైన స్పీకర్ పదవి కోరుతున్నట్టు సమాచారం. మొత్తానికి పదవుల పంపకాలు కొలిక్కి వస్తే... వచ్చేనెలలోపే ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఛాతి నొప్పి కారణంగా గత సోమవారం సంజయ్ రౌత్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నేత సంజయ్‌రౌత్ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
‘కాంగ్రెస్‌కు పోయేకాలం వచ్చింది’
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఉపయోగించుకోలేదని మహారాష్ట్ర ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ మేనన్ విమర్శించారు. మహారాష్ట్రను బీజేపీకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఇదే తరహాలో వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు నిరాకరించి బీజేపీ గెలుపునకు బాటలు పరిచిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక పార్టీ నిర్ణయాన్ని విస్మరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో కలిసి నడవాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లిందంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ వెనక్కి తగ్గడంతో అవకాశం శివసేనకు వచ్చింది. అయితే ఎన్సీపీతో కలిసి శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ తర్జనభర్జలు పడింది. ఇక ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఎన్సీపీకి వచ్చినా మద్దతు విషయంలో కాంగ్రెస్ జాప్యం చేసింది. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఆహ్వానం అందింది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి. .@INCIndia leadership always puts their party before the Nation. In Loksabha they stubbornly refused regional alliances and helped BJP sweep. Now they are giving #Maharashtra on a platter to BJP. It's moribund attitude will decimate it soon. — Preeti Sharma Menon (@PreetiSMenon) November 12, 2019 -
శివసేనకు షాకిచ్చిన గవర్నర్..!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు ప్రచారం జరగడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న (సోమవారం) శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్.. నేడు (మంగళవారం) ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు ముగియకముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపారని ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు తాము అడిగిన గడువు ఇవ్వకపోగా.. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు వీలులేకుండా రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్ సాగుతున్నట్టు వస్తున్న వార్తలతో శివసేన, ఎన్సీపీ కంగుతిన్నాయి. ఒకవేళ గవర్నర్ రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆయన నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్‌తో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మూడు రోజుల గడువు ఇచ్చిన గవర్నర్.. తమకు అంత గడువు ఇవ్వడానికి నిరాకరించడంపైనా శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఎన్సీపీ కూడా గుర్రుగా ఉంది. తమకు ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలన అంటూ లీకులు ఇస్తున్నారని మండిపడింది. ఇక, శివసేనకు మద్దతిచ్చే విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్ ముంబై చేరుకున్నారు. సేనకు మద్దతుపై కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని ఖర్గే తెలిపారు. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!!
ముంబై: మహారాష్ట్రలో కొత్త పొత్తు పొడిచే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో కటీఫ్ చెప్పిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతునిస్తామని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టంచేయగా.. కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసంలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శివసేన ప్రభుత్వాన్ని బయటినుంచి మద్దతునివ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచిచూస్తున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటులో తమకు మరికొంత గడువు ఇవ్వాలని గవర్నర్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గవర్నర్ బీఎస్ కోశ్యారీని కలిశారు. (చదవండి: శివసేనకు ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్..!) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటకు మ్యాజిక్ ఫిగర్ 145 కాగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో సంకీర్ణ కూటమి బలం 160కి చేరుకుంది. దీంతో సునాయసంగా సేన కూటమి సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో సేన నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారన్న వాదన వినిపిస్తోంది. ఎన్సీపీ కూడా ఇదే డిమాండ్ చేస్తోందని, ఉద్ధవ్‌ను సీఎం చేయాలని, అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని ఎన్సీపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే, సీఎం పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్న ఓ సీనియర్ శివసేన నేత.. ఠాక్రే సీఎం అయితే, తిరుగుబాటును లేవనెత్తవచ్చునని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. -
శివసేనకు ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్..!
ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీతో దూరం జరిగిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు చకచకా పావులు కదుపుతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోంది. శివసేన సర్కారుకు మద్దతునివ్వాలా? వద్దా? అన్నది ఇంకా తేల్చుకోలేకపోతోంది. శివసేన ప్రభుత్వాన్ని బయటినుంచి మద్దతునివ్వాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో మరిన్ని సంప్రదింపులు అవసరమని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించిన మీదటే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతున్న శివసేనకు ఈ మేరకు ట్విస్ట్ ఇచ్చింది. అంతకుముందు సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనాయకులు భేటీ అయి.. మహారాష్ట్ర పరిణామాలు, శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశంపై చర్చించారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏకే ఆంథోని, అహ్మద్ పటేల్ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ భేటీ జరుతుండగానే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. శివసేన ప్రభుత్వానికి మద్దతునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా సోనియాను ఠాక్రే కోరారు. అయితే, పార్టీ ముఖ్య నేతలతో సోనియా భేటీ అనంతరం సీడబ్ల్యూసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర పరిణామాలపై సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా చర్చించిందని, అనంతరం మహారాష్ట్ర పార్టీ నేతలతోనూ చర్చలు జరపామని, ఈ విషయంలో శరద్ పవార్‌తో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. మరోవైపు గవర్నర్ ఆహ్వానం మేరకు శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, ఏక్నాథ్ షిండే రాజ్‌భవన్ చేరుకున్నారు. గవర్నర్‌ను కలిసి వారి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిపై బీజేపీ చిటపటలాడుతోంది. ఒకప్పుడు బాబా సాహెబ్ సేనగా ఉన్న శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిపోయిందంటూ బీజేపీ నేత మినాక్షి లేఖి ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
ఆస్పత్రి పాలైన సంజయ్ రౌత్
ముంబై: శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చేరారు. ఛాతి నొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరో మూడు రోజులు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని, చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కుటుంబసభ్యులు చెప్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నేత సంజయ్‌రౌత్ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శివసేన అధినాయకత్వం వ్యూహాలకు అనుగుణంగా అటు బీజేపీని ఇరకాటంలో పెడుతూ.. ఇటు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పొత్తుకు లైన్ క్లియర్ చేయడంలో సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తుండగా.. మరోవైపు ఆయన ఆస్పత్రి పాలుకావడం పార్టీ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసిందని చెప్పాలి. -
వడివడిగా అడుగులు.. ఠాక్రే-పవార్ కీలక భేటీ!
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేసింది. ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే అలవోకగా మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. అత్యంత కీలకమైన ఈ భేటీలో పదవులు పంపకాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. పదవుల పంపకాల్లో భాగంగా శివసేన ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా.. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కి అసెంబ్లీ స్పీకర్ వంటి కీలక పదవులను సేన ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5గంటలకు శివసేన నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఇక, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షంగా ముచ్చెమటు పట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం పదవిపై మిత్రపక్షం శివసేనతో రాజీ కుదరకపోవడంతో ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ సిద్ధమైంది. రెబల్ ఎమ్మెల్యేలను కూడా తనవైపు తిప్పుకొని.. గట్టి ప్రతిపక్షంగా సేన కూటమిని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. -
వాళ్లు బీజేపీని వీడేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎంపీ
ముంబై : మహారాష్ట్రలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ హుసేన్ దల్వాయి అన్నారు. తమ పార్టీ ఎంపీలు ప్రలోభాలకు లొంగరు అని.. అధిష్టానం సూచనలను వారు శిరసా వహిస్తారని విశ్వాసం చేస్తారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కూటమిగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీ- శివసేన మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారంతో అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని భావించిన శివసేనకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షాకిచ్చారు. ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తేల్చిచెప్పడంతో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన శివసేన వారిని హోటల్‌కు తరలించి.. వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు ప్రచారమవుతున్నాయి.(చదవండి : ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం; సోనియాకు లేఖ!) ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ హుసేన్ దల్వాయి గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఒకేమాటపై ఉన్నారు. పార్టీ నియమాలను ఉల్లంఘించరు. అధిష్టానం చెప్పినట్లుగా నడుచుకుంటారు. రాష్ట్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి రానివ్వం. ఎన్సీపీ మా మిత్రపక్షం. వాళ్లు మాతోనే ఉన్నారు. బీజేపీ నుంచి మహారాష్ట్రను కాపాడేందుకే ప్రజలు మాకు ఓటేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై మేము చర్చించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నాయకుడిని ముఖ్యమంత్రిని కానివ్వబోం. మా ఎమ్మెల్యేలను కొనాలనే బీజేపీ ప్రయత్నాలు ఫలించవు. ఎన్నికలకు ముందుకు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. కాగా 288 శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... మిత్రపక్షం ఎన్సీపీ, శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేయాలని హుసేన్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం విదితమే. -
శివసేనకు షాక్.. శరద్ సంచలన ప్రకటన!
ముంబై: ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరిస్తుండటంతో ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సీఎం పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్న శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ మద్దతు కోసం సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నెరిపిన దౌత్యం ఫలించలేదు. ప్రభుత్వంలో చేరేది లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెగేసి చెప్పారు. ప్రజాతీర్పునకు అనుగుణంగా తాను, తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చుంటామని తేల్చిచెప్పారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలనుకోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రతిపక్షం పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. ప్రభుత్వ ఏర్పాటులో నేను భాగం కాదలుచుకోలేదు. కొన్నిరోజులపాటు నేను ముంబైలో ఉండటం లేదు. పుణె, సతారా, కరాద్ ప్రాంతాల్లో పర్యటించబోతున్నాను’ అని శరద్ బుధవారం తెలిపారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగా శరద్‌తో భేటీ అయినట్టు రౌత్ చెప్తున్నప్పటికీ.. బీజేపీ రహిత ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోరేందుకు ఆయన పవార్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
మహారాష్ట్రలో కీలక పరిణామాలు..!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు శివసేన ముఖ్య నేతలు సంజయ్ రౌత్, రాందాస్ కదం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలువగా.. అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌తో భేటీ అయి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. గవర్నర్‌తో తమ భేటీ మర్యాదపూర్వకమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని రౌత్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా శివసేన ముందుకువస్తే.. ఆ పార్టీతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునన్న ఊహాగానాల నేపథ్యంలో శరద్ పవార్ సోనియాతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో వీరి భేటి జరిగింది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనంటూ ఎన్సీపీ ఇప్పటికే సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. శివసేన హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆయన బీజేపీ అధినాయకత్వంతో చర్చిస్తున్నారు. సీఎం పదవి పంచే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. చదవండి: మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!! ఇక, మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ వందకుపైగా స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఆ పార్టీ మెజారిటీ మార్కుకు చాలా దూరం నిలిచిపోయింది. మరోవైపు 56 స్థానాలు గెలిచిన రియల్ కింగ్‌మేకర్‌గా అవతరించిన శివసేన సీఎం పీఠాన్ని సగకాలం తమకు పంచాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం పదవిని పంచేందుకు బీజేపీ ఏమాత్రం సిద్ధపడటం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని చెప్తున్నా.. అదీ ఎంతవరకు సాధ్యమనేది తేలడం లేదు. ఈ నెల 8వ తేదీ లోపు ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోతే.. మహారాష్ట్రలో గవర్నర్ పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. -
ఆయన్ని రప్పించండి.. రెండు గంటల్లో ముగిస్తారు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ శివసేన నాయకుడు కిశోర్ తివారీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా సందిగ్ధం తొలిగిపోవాలంటే బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపాలని కోరింది. ఆయన వస్తే సంక్షోభం వెంటనే తొలిగిపోతుందని, ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుందని లేఖలో వివరించారు. ‘‘ఈ సంక్షోభం సమసిపోవాలంటే శివసేనతో చర్చలు జరపడానికి నితిన్ గడ్కరీని రంగంలోకి దించాలి. ఆయన ‘సంకీర్ణ ధర్మా’న్ని పాటించడమే కాకుండా ఈ సంక్షోభానికి రెండు గంటల్లోనే మార్గాన్ని చూపిస్తారు’’ అని లేఖలో పేర్కొన్నారు. ఫడణ్‌విస్ వ్యక్తిగత శైలిపై అభ్యంతరాలున్నాయని, సీనియర్ అయిన నితిన్ గడ్కరీని స్వరాష్ట్రానికి రప్పిస్తే రాష్ట్రం అద్భుతంగా ప్రగతి చెందుతుందని ఆయన తెలిపారు. కాగా ఫడ్నవిస్ కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలవడం, మరోవైపు సోనియా గాంధీ అధ్యక్షతన ప్రతిపక్షాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కిశోర్ తివారీ లేఖ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా.. పలువురు బీజేపీ సీనియర్ నేతలు, శ్రేణులు రాష్ట్రంలో రీ-ఎలక్షన్‌కు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయ్‌కుమార్ రావల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు..!!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయ్‌కుమార్ రావల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు బీజేపీ సీనియర్ నేతలు, శ్రేణులు రాష్ట్రంలో రీ-ఎలక్షన్‌కు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘శివసేనతో పొత్తు పెట్టుకొని ఉండాల్సింది కాదని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మాకు చాన్స్ ఇవ్వండి. మేం ఈసారి పోటీ చేసి గెలిచి చూపిస్తామని వారు అంటున్నారు’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అనుచరుడైన జయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘శివసేనతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లో తాము పోటీ చేయలేకపోయామని, మరికొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతున్న శివసేన.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకురాకపోవడంతో ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ వందకుపైగా స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయినా ఆ పార్టీ మెజారిటీ మార్కుకు చాలా దూరం నిలిచిపోవడంతో 56 స్థానాలు గెలిచిన శివసేన రియల్ కింగ్‌మేకర్‌గా అవతరించింది. అయితే, ఎన్నికల తర్వాత తమకు సీఎం పదవి కావాల్సిందేనని, చెరిసగం చొప్పున సీఎం పదవిని పంచితేనే బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని శివసేన తెగేసి చెప్తోంది. అందుకు బీజేపీ కూడా ఏమాత్రం సిద్ధపడటం లేదు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని చెప్తున్నా.. అదీ ఎంతవరకు సాధ్యమనేది తేలడం లేదు. ఈ నెల 8వ తేదీ లోపు ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోతే.. మహారాష్ట్రలో గవర్నర్ పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. -
నో సీఎం పోస్ట్: 13 మంత్రి పదవులే ఇస్తాం!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం పదవిని చెరిసగం పంచాల్సిందేనని, అధికారం విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను పాటించాలని శివసేన గట్టిగా కోరుతున్నప్పటికీ.. అందుకు బీజేపీ ఏమాత్రం అంగీకరించడం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీకి కేవలం 13 మంత్రి పదవులే ఇస్తామని , ఇక ముఖ్యమంత్రి పదవి ఐదేళ్లూ బీజేపీ చేతిలోనే ఉంటుందని, ఈ విషయంలో సేనతో ఎలాంటి డీల్ చేసుకునేది లేదని బీజేపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు 26 మంత్రి పదవులను తమ వద్ద ఉంచుకోవాలని, అదేవిధంగా టాప్ 4 మంత్రిపదవుల విషయంలో సేనతో ఎలాంటి చర్చలకు, బేరసారాలకు తావులేదని కమలదళం భావిస్తోంది. సేన మాత్రం సీఎం పోస్ట్‌ను చెరిసగం పంచాలని, కీలక మంత్రిపదవుల్లోనూ సగం తమకు ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఇరుపార్టీల నడుమ పీటముడి కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు దేవేంద్ర ఫడ్నవిస్ సిద్ధమవుతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో రేపో, ఎల్లుండో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తమ డిమాండ్ల మేరకు బీజేపీ దిగిరాకపోవడంతో శివసేన మరింత మొండి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాము లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానిస్తోంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు కైవలం చేసుకున్నాయి. 17మంది బీజేపీ రెబల్స్ గెలువడంతో వారి మద్దతు తమకే ఉంటుందన్న ధీమాతో ఉన్న బీజేపీ శివసేన డిమాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు కాషాయపార్టీల నడుమ ఎలాంటి డీల్ కుదురుతుందని, ఎవరు రాజీపడతారు? లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా.. మళ్లీ కలహాల కాపురమే అవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
థాక్రే చేతిలోనే రిమోట్ కంట్రోల్.. సీఎం పదవిని పంచాల్సిందే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన పార్టీ ఆదివారం సంచలన వ్యాఖ్యలే చేసింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా.. ప్రభుత్వానికి సంబంధించి రిమోట్ కంట్రోల్ తమ చేతిలోనే ఉందని తేల్చి చెప్పింది. 1995 నుంచి 1999 వరకు బీజేపీ-శివసేన కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు తన చేతిలోనే ఉందని, ప్రభుత్వం తాను చెప్పినట్టు వినక తప్పదని సేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లినప్పటికీ.. అనుకున్నస్థాయిలో రాణించలేకపోయింది. 2014లో ఒంటరిగా పోటీ చేసి 122 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. అటు శివసేనకు కూడా గతం కంటే స్థానాలు తగ్గాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీది కీలక పాత్ర కావడంతో అధికార పంపిణీ విషయంలో శివసేన గట్టిగా బేరసారాలు జరుపుతోంది. అధికారాన్ని చెరోసగం పంచాల్సిందేనని, సీఎం పదవిని రెండు పార్టీల మధ్య కూడా చెరిసగం పంచాలని శివసేన గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా థాక్రే వారసుడు ఆదిత్యా ఠాక్రే తొలిసారి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సీఎం పదవి కోసం ఆ పార్టీ గట్టిగానే పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో తన కాలమ్ ‘రోఖ్‌థోఖ్’లో సంజయ్ రౌత్ ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ‘2014లో శివసేనకు 63 సీట్లు రాగా.. ఇప్పుడు 56 సీట్లే వచ్చాయి. కానీ, అధికారానికి సంబంధించి రిమోట్ కంట్రోల్ మాత్రం పార్టీ చేతిలోనే ఉంది. బీజేపీ నీడలోనే శివసేన ఉండిపోతుందన్న భ్రమ పటాపంచలైంది. పులి (శివసేన చిహ్నం) చేతిలో కమలంపువ్వు (బీజేపీ గుర్తు) కార్టూన్ ప్రస్తుత పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఎవరినీ తేలికగా తీసుకోవద్దని సూచిస్తోంది’ అని రౌత్ ఈ వ్యాసంలో తేల్చి చెప్పారు. సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా, పార్లమెంటులో పార్టీ చీఫ్‌విప్‌గా ఉన్న రౌత్ తన వ్యాసంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ డిమాండ్లపై ఏమాత్రం వెనుకకు తగ్గబోమని విస్పష్ట సంకేతాలు ఇచ్చారు. -
ఒక్కరు కూడా ఓటు వేయలేదు!
ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లా మనిబేలి గ్రామస్థులు సోమవారం నాటి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 135 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. వీరు ఈ నాటి పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా గ్రామానికి కరెంట్, రోడ్డు సౌకర్యం లేకపోవడమే పోలింగ్ బహిష్కరణకు కారణం. దేశంలో నూటికి నూరు శాతం విద్యుత్ సదుపాయాన్ని సాధించామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్ర విద్యుత్ బోర్డు దృష్టిలో ఈ గ్రామం ఉన్నప్పటికీ విద్యుత్ సదుపాయం లేకపోవడం నిజంగా శోచనీయం. ఇంకా రాజకీయ నాయకుల వెంటబడి కరెంట్ కావాలి, రోడ్డు కావాలి అంటూ తిరిగే ఓపిక తమకు లేదని, ఓ ఆఖరి ప్రయత్నంగా అసెంబ్లీ పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించామని నటర్వ్ భాయ్ టాడ్వీ అనే 60 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ కింద రెండేళ్ల క్రితం తమ గ్రామానికి 8 కిలోమీటర్ల రోడ్డు మంజూరు అయ్యిందని, అయితే అది ఇప్పటికీ కాగితాలకే పరిమితం అయిందని గ్రామస్థులు తెలిపారు. ఓ పక్క అడవి ప్రాంతం, మరో పక్క నర్మదా నడి డ్యామ్ బ్యాక్ వాటర్ ఉన్న కారణంగా ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని తెల్సింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న నదూర్బార్ జిల్లాలో ఈ గ్రామం ఉండడం కూడా ఓ శాపంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ వన్ పరిధిలోకి వచ్చే అక్కల్కువా తహిసిల్‌లో ఈ గ్రామం ఉంది. (చదవండి: మహారాష్ట్ర, హరియాణా పోలింగ్ విశేషాలు) -
ఆర్టికల్ 370: వారిని చరిత్ర క్షమించబోదు!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ప్రతిపక్షాలు అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రతిపక్షాల మూర్ఖపు వాదనను, వారు చేస్తున్న హేళనను చరిత్ర గుర్తుంచుకుంటుందని, వారిని చరిత్ర క్షమించబోదని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడ్ జిల్లా పర్లీలో గురువారం ఆయన ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారని, అదే సమయంలో కమలం కార్యకర్తల్లో ఉత్సాహం కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని మోదీ అన్నారు. పరాజయ నిరాశమయ దృక్పథంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలా సేవ చేయగలదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఓటర్ల మాదిరిగానే బీడ్ జిల్లా ఓటర్లు బీజేపీ వైపే ఉన్నారని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతున్నదని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎల్లుండితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
పెద్దాయన మనవడికి తిరుగులేదా?
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే (29) ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఇటీవల ప్రధానంగా ఆకర్షించిన పత్రికా శీర్షికల్లో ఒకటి. ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి కావడమే కాకుండా పిన్న వయస్సులో పోటీ చేస్తుండడం వల్ల కూడా ఆయన ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షకుడిగా నిలబడ్డారు. ఠాక్రే ఇంటి పేరు కారణంగా ఆయనకు పరిచయం అక్కర్లేదు. బాల్ ఠాక్రే 53 ఏళ్ల క్రితం శివసేనను ముంబైలో ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అది కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి ప్రజల్లో మంచి పట్టును సాధించింది. థాకరే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో దింపడం ద్వారా రాజకీయ చక్రం తిప్పగలిగారు. బీజేపీతో 25 ఏళ్ల అనుబంధాన్ని తెంపేసుకొని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా శివసేన బాగా దెబ్బతిన్నది. తిరిగి రాజకీయంగా మంచి పట్టు సాధించాలనే లక్ష్యంతో, శివసేన పార్టీలో ఎక్కువ మంది నాయకులు 65 ఏళ్లకు పైబడిన వారవడంతో, యువకులను ఆకర్షించడం కోసం 29 ఏళ్లకే ఆదిత్య ఠాక్రేను రంగంలోకి దింపింది. ఇక ఆదిత్య ఠాక్రే విజయం తథ్యమని తెలుస్తోంది. ఠాక్రే కుటుంబం పట్ల ఉన్న గౌరవమే కాకుండా ఆయన సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఆయన విజయం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు మినహా అనేక సార్లు వర్లి నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన ఎన్సీపీ తమ అభ్యర్థిగా బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు సురేశ్ మానేను నిలబెట్టారు. స్థానిక నియోజక వర్గంలో ఆయన పేరు ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేదు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సచిన్ అహిర్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనపై శివసేన అభ్యర్థి సునీల్ షిండే పోటీ చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరిన సచిన్ అహిర్, ఠాక్రేకు మద్దతుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే విజయం ఖాయమని తెలుస్తోంది. (చదవండి: ఆదిత్యకు కలిసొచ్చేవి ఇవే...) -
ఏమీ చేయలేకపోతే.. గాజులు తొడుక్కో..!!
ముంబై: 13 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా ఏ పని చేయకపోతే.. ఆ వ్యక్తి గాజులు తొడుక్కోవడం ఉత్తమమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విరుచుకుపడ్డారు. అహ్మద్ నగర్ జిల్లా శ్రీగోండా నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్సీపీ మాజీ నేత బాబన్‌రావు పచ్పుటేపై పవార్ నిపులు చెరిగారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల మంత్రిగా పనిచేసిన పచ్పుటే 2014లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్-ఎన్సీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పటికీ తనను ఏ పని చేయనివ్వలేదని పచ్పుటే విమర్శలు చేశారు. తాజాగా శ్రీగోండా నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ఘనశ్యాం షెలార్ తరఫున ప్రచారం నిర్వహించిన పవార్.. పచ్పుటే విమర్శలపై స్పందించారు. ‘పచ్పుటే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు చేయడం తప్ప ఏ పనిని చేయనివ్వలేదని పేర్కొన్నారు. మంత్రి సంతకాలు చేస్తేనే ఏదైనా ఉత్తర్వుగా మారుతోంది. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులకు ఆమోదం లభిస్తుంది. సంతకాలు చేసి కూడా.. ఏ పని చేయలేకపోయానని అనడంలో అర్థముందా? మంత్రిగా ఉండి కూడా ఏ పనిచేయలేకపోతే.. ఆ వ్యక్తి గాజులు ధరించాలి’ అని పవార్ ఘాటుగా పేర్కొన్నారు. -
వీర్ సావర్కర్‌కు భారతరత్న!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. హిందూత్వ సిద్ధాంత రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చింది. సావర్కర్‌తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కమలదళం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందరికీ ఇళ్లు, ఆరోగ్యం, మంచినీటి సరఫరా కల్పిస్తామని తెలిపింది. రాష్ట్రాన్ని కరువురహితంగా చేసేందుకు 11 డ్యామ్‌లతో మహారాష్ట్ర వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ‘సీఎం పీఠంపై వివాదం లేదు’ -
మాజీ సీఎం కుమారులు.. పల్సి గ్రామ మనువళ్లు
సాక్షి, భైంసా(ముథోల్): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుభీర్ మండలం పల్సి గ్రామ అల్లుడు. పల్సి గ్రామానికి చెందిన వైశాలిని విలాస్రావుదేశ్ముఖ్కు ఇచ్చి వివాహం జరిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన విలాస్‌రావుదేశ్‌ముఖ్ దంపతులకు ముగ్గురు కుమారులు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన పెద్ద కొడుకు అమిత్దేశ్ముఖ్, చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు రితేశ్‌దేశ్‌ముఖ్ బాలివుడ్లో కథానాయకుడిగా రాణిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ సొంతగడ్డ లాథూర్‌లో అసెంబ్లీ పోరు కొనసాగుతోంది. ఇద్దరు కొడుకులు కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఇందులో లాథూర్ అర్బన్ నుంచి అమిత్దేశ్ముఖ్, లాథూర్ రూరల్ నుంచి చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ పోటీకి దిగారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దేశమంతటా బీజేపీ గాలివీస్తున్నప్పటికీ తమ తండ్రి సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఈ కుటుంబం ముందుకెళ్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా విలాస్‌రావుదేశ్‌ముఖ్ లాథూర్ ప్రాంతంలో విస్తరించిన సేవలే వీరి గెలుపునకు నాంది పలుకుతాయని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. ప్రచార బాధ్యతలు రితేశ్పైనే... మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం అక్కడ రాజకీయవారసత్వం కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించింది. ఇద్దరు సోదరులకు గెలిపించేందుకు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రచార బాధ్యతలు నెత్తినవేసుకున్నారు. ప్రచార పర్వంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ వేదికలపై ప్రసంగాలు చేస్తూ హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. లాథూర్ తన సొంత గడ్డ అని ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ చేసిన సేవలకు ప్రజలు గెలిపించి తీరుతారంటూ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. వైశాలినితో ముగ్గురు కుమారులు పల్సి గ్రామంలో ఆసక్తి.. ప్రస్తుతం లాథూర్ ఎన్నికల ప్రచార తీరు... అక్కడి సభలపై పల్సి గ్రామంలో ఆసక్తి నెలకొంది. పిళ్లుబాయి మనువళ్లు ఎమ్మెల్యేలుగా నిల్చున్నారని వారంతా చర్చించుకుంటున్నారు. మరాఠీ చానళ్లలో మీడియా కథనాలు చూస్తూ అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. లాథూర్ రాజకీయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. పిళ్లుబాయి మనువళ్లు.. పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండవ భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్ముఖ్తో వివాహం జరిపించారు. పిళ్లుబాయి మనువడే రితేశ్ అంటూ పల్సివాసులు చెప్పుకుంటున్నారు. జెడ్పీ మొదటి చైర్మన్ రంగారావు ఊరిపేరే ఇంటిపేరుగా వస్తోంది. పల్సి గ్రామం వారికి ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. అప్పట్లో జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా ఎన్నికైన పల్సికర్ రంగారావు అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలు స్వగ్రామంలోనే చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ మామ పెద్ద కర్మ నిర్వహించే 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు. వైశాలి చిన్న తనంలో పెరిగిన ఇల్లు అంతటా చర్చ... రితేశ్ తల్లి వైశాలిని చిన్ననాడు పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులు అంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది ఇంటికి మరమ్మతు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలు ఉన్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు. రితేశ్ జెనీలియాల పెళ్లి వేడుకకు పల్సి గ్రామస్తులు ముంబయికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ అంత్యక్రియలకు సైతం పల్సి గ్రామస్తులు లాథూర్‌కు చేరుకున్నారు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులతో పల్సి గ్రామానికి విడదీయలేని అనుబంధమే ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా పోటీచేయడంతో మళ్లీ ఈ గ్రామస్తుల చూపు లాథూర్వైపునకు మళ్లింది. ప్రతిరోజు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రసంగాలను పల్సి గ్రామస్తులు తమ ఇళ్ల నుంచే తిలకిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పల్సి గ్రామస్తుల చూపంతా లాథూర్ జిల్లాపైనే ఉంది. -
తేజస్ ఠాక్రేకు యువసేన బాధ్యతలు?
సాక్షి ముంబై: ఠాక్రే కుటుంబం నుంచి వారసులు మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈసారి ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఠాక్రే కుటుంబానికి చెందిన మూడోతరం యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే.. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడం తెల్సిందే. మరోవైపు ఆదిత్య ఠాక్రే తమ్ముడు తేజస్ ఠాక్రే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆయన స్థానంలో యువసేన అధ్యక్షుని బాధ్యతలను తేజస్ ఠాక్రేకు అప్పగించనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. సంగంనేర్, అహ్మద్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో తన తండ్రి ఉద్ధవ్‌తో కలిసి తేజస్ ఠాక్రే పాల్గొన్నారు. అడవిలోనే ఉంటాడు: ఉద్ధవ్ తన చిన్న కుమారుడి రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఉద్ధవ్ ఠాక్రే తోసిపుచ్చారు. ఎన్నికల ర్యాలీలను చూసేందుకు మాత్రమే తేజస్ వచ్చాడని తెలిపారు. ఇంట్లో కంటే అడవిలోనే ఎక్కువగా గడుపుతుంటాడని వెల్లడించారు. తండ్రి, బీజేపీ నాయకులతో కలసి వేదిక పంచుకున్న తేజస్‌కు శివసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘ఎవరు వచ్చారు. శివసేన టైగర్ వచ్చాడు’ అంటూ నినాదాలు చేశారు. వన్యప్రాణి, జంతు ప్రేమికుడైన తేజస్.. అరుదైన పాములు, బల్లులు కనుగొనేందుకు పరిశోధనలు చేస్తుంటారు. (చదవండి: శివసేన కొంపముంచిన పొత్తు) -
కొంపముంచిన పొత్తు; శివసేనకు షాక్
సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ వాతావరణం వేడేక్కగా మరోవైపు శివసేన కార్పొరేటర్లు ఆ పార్టీకి షాకిచ్చారు. సీట్ల పంపకాల అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కళ్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది శివసేన కార్పొరేటర్లు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు తమ రాజీనామా పత్రాలను పంపించారు. పొత్తు ముంచేసింది.. అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21వ తేదీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంతో రాజకీయ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా వేడెక్కాయి. అన్ని పార్టీలు విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలకు మరో 10 రోజులుందనగా కళ్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది కార్పొరేటర్లతోపాటు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామాలు చేయడం ఒక్కసారిగా రాజకీయంగా దుమారం లేపింది. ఈ సంఘటన శివసేనతోపాటు బీజేపీకి తలనొప్పిగా మారనుంది. థానే జిల్లాలో శివసేనకే పట్టుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇలాంటి నేపథ్యంలో శివసేనతోపాటు ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఈ సంఘటన తీవ్ర తలనొప్పిగా మారింది. శివసేన, బీజేపీల కూటమి అభ్యర్థులకు స్థానిక కార్పొరేటర్ల వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి రానుంది. ఇదిలా ఉండగా రాజీనామా చేసిన కార్పొరేటర్లు స్థానిక నేత ధనంజయ్ బోడారేకు మద్దతుగా తమ రాజీనామా చేసినట్టు మీడియాకు తెలిపారు. సీట్ల పంపకాల సమయంలో శివసేనకు ఈ సీటు కేటాయించాలని కోరినప్పటికీ కళ్యాణ్ నియోజకవర్గం సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. తమ అభ్యర్థి గణపత్ గైక్వాడ్‌కు మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు బీజేపీ సూచించడంతోనే నిరసనలు వెలువెత్తుతున్నాయని తెలిసింది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి శివసేన, బీజేపీలో చేరిన నాయకులను ఎన్నికల బరిలోకి దింపడంపై కూడా అసంతృప్తి వెల్లువెత్తింది. అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే వారందరిని టిక్కెట్ నిరాకరించడంతో వారితోపాటు వారి మద్దతుదారులలో అసంతృప్తి పెరిగింది. థానేలోనే 211 మంది పోటీ థానే జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 211 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలతో సహా చిన్న చిన్న పార్టీలు ఇలా మొత్తం 36 పార్టీలు తమ అభ్యర్థులను థానే జిల్లాలో బరిలోకి దింపాయి. బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 16 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), వంచిత్ ఆఘాడిలు 13 మంది చొప్పున అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక ఎన్సీపీ 10 మందిని, శివసేన, బీజేపీలు తొమ్మిదేసి మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరిలో 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది కార్పొరేటర్లున్నారు. 83 మంది స్వతంత్ర అభ్యర్థులు.. థానే జిల్లాలో ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున బరిలోకి దిగారు. జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలువురు టిక్కెట్ కోసం ప్రయత్నించి భంగపడి బరిలోకి దిగగా మరి కొందరు మాత్రం కావాలనే ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలోకి దిగారు. జిల్లాలోని 18 అసెంబ్లీ నియోకవర్గాల్లో అత్యధికంగా 12 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉల్లాస్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా తూర్పు కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు, పశ్చిమ కళ్యాణ్, బేలాపూర్ మొదలగు రెండు అసెంబ్లీలలో తొమ్మిదేసి మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొంతమేర తలనొప్పిగా మారనుంది. వీరిలో కొందరు పెద్ద ఎత్తున ఓట్లు చీల్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
370 రద్దుపై వైఖరేంటి?
సాంగ్లీ/షోలాపూర్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తమవైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసి దేశాన్ని ఒక్కతాటి కిందకు తెచ్చారని గురువారం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కొనియాడారు. కశ్మీర్లో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేశామన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్, పవార్ అసత్య ప్రచారం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘ఇండియాలో కశ్మీర్ అంతర్భాగం కావాలని దేశమంతా కోరుకుంటుంటే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడుతున్నాను. ఎందుకంటే ఓట్ల కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా?’ అని అమిత్ షా ప్రశ్నించారు. తమకు పార్టీ ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై మనదేశం విజయం సాధించినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ముందుగా అటల్‌బిహారి వాజపేయి అభినందించారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దేశం కోసం అధికార పక్షాన్ని అభినందించామన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలు.. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ వైమానిక దాడులను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. (చదవండి: 2024 నాటికి వారిని దేశం నుంచి పంపిస్తాం) -
పీఎంసీ కుంభకోణం: ఆర్థిక మంత్రి నిర్మల హామీ
సాక్షి, ముంబై: పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) కుంభకోణంపై ఆందోళన చేస్తున్న ఖాతాదారులకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. మరోసారి ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నగదు విత్డ్రాయల్స్పై ఉన్న పరిమితలను సవరించమని కోరతానన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ముంబైలోని బీజేపీ ఆఫీస్‌లో నిర్మలా సీతారామన్ మీడియా సమావేశానికి రాగా.. అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న బ్యాంక్ కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని కలిసి మాట్లాడారు సీతారామన్. తాను మరోసారి ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని తెలిపారు. అలాగే ఆర్థికశాఖ కార్యదర్శులను కూడా అసలు ఏం జరిగిందనే అంశంపై పరిశీలించాలని ఆదేశించానని చెప్పారు. పీఎంసీ కుంభకోణం నేపథ్యంలో ఆర్బీఐ ఆ బ్యాంక్ నుంచి నగదు ఉపసంహరణను రూ. 25వేలకే పరిమితం చేసింది. -
ఆ అవార్డ్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా పవార్ మాట్లాడుతున్నారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తాను దేశానికి కట్టుబడి లేకపోతే.. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటే తనకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఎందుకిచ్చినట్టని ప్రశ్నించారు. ఆ అవార్డ్‌తో సత్కరించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఓవైపు తనను పద్మ విభూషణ్ ఇచ్చి.. మరోపక్క తనపై వేలెత్తి చూపడం దేనికని ఎండగట్టారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇంత అయోమయం పనికి రాదని ప్రధాని మోదీపై పవార్ ఘాటు విమర్శలు చేశారు. -
‘అన్ని స్థానాల్లో మేము చిత్తుగా ఓడిపోతాం’
ముంబై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వ్యవహారం చిచ్చుపెట్టింది. తాను సూచించిన నాయకులకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహించిన ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పార్టీ అధిష్టానం తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముంబైలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, అతికష్టం మీద మూడు నుంచి నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి రానని స్పష్టం చేసిన సంజయ్ నిరుపమ్... శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఢిల్లీ నేతలకు అర్థం కావడంలేదు. వారు నిజాలు పరిగణనలోకి తీసుకోకుండా.. ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలను నేను ఖండిస్తున్నాను. అందుకే ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఎంపిక తీరును చూస్తుంటే అన్ని స్థానాల్లో ఓడిపోతుందని... డిపాజిట్ కూడా దక్కదని అర్థమవుతోంది. మహా అయితే ముంబైలో నాలుగు సీట్లలో విజయం సాధిస్తుంది. నలుగురు బలమైన అభ్యర్థుల పేర్లను మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి మల్లికార్జున ఖర్గేకు సూచించాను. కానీ ఆయన నా మాటలు లెక్కచేయలేదు. వారందరి పేర్లను తిరస్కరించారు’ అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి సన్నిహితులుగా ఉన్న నాయకులను మెల్లమెల్లగా ఆయన నుంచి దూరం చేయాలని కొంత మంది కుట్రపన్నుతారంటూ సంజయ్ ఆరోపించారు. పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎటువంటి వారో తెలుసుకోకుండానే టికెట్లు కేటాయించారని విమర్శించారు. సీనియర్ నేతలను సంప్రదించకుండానే ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. ప్రస్తుత విషయాల గురించి పార్టీ అధిష్టానం పట్టించుకోనట్లైతే తాను త్వరలోనే పార్టీని వీడతానని హెచ్చరించారు. కాగా పదిహేనేళ్ల క్రితం శివసేన నుంచి బయటికి వచ్చిన సంజయ్ నిరుపమ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. అదే విధంగా ముంబై కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే ఎంతో మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. అక్టోబరు 21న పోలింగ్ జరుగనుండగా.. అదే నెల 24న కౌంటింగ్ జరుగనుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ-శివసేన ఇప్పటికే దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. -
ఆ కుటుంబం నుంచి తొలి వ్యక్తి.. 56 ఏళ్ల తరువాత బరిలో
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ముంబైలోని వర్లి స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన తండ్రి పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చేతుల మీదుగా బీ ఫామ్‌ను అందుకున్నారు. అయితే బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన నుంచి తొలిసారి ఠాక్రే కుటుంబం పోటీ చేస్తుండటం విశేషం. 53 ఏళ్ల కిందట (1966) స్థాపించిన శివసేనలో ఠాక్రే కుటుంబం నుంచి పోటీ చేస్తున్న తొలి వ్యక్తిగా ఆదిత్యా నిలిచారు. గతంలో మహారాష్ట్ర రాజకీయాలను కంటిసైగతో శాసించిన బాల్ ఠాక్రే తెర వెనుక నుంచి నడిపించారు కానీ.. ఎన్నికల బరిలో ఎప్పుడూ నిలవలేదు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ.. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిన ఉద్దవ్ కూడా ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్పీ) అధినేత రాజ్ ఠాక్రేది కూడా ఇదే పరిస్థితి. అయితే తాజాగా సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఇక తన వారుసుడిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఆదిత్యా ఠాక్రేను ఎన్నికల రంగంలోకి దింపింది. ఆయన విజయానికి అత్యంత సురక్షితంగా భావించిన వర్లి నుంచి పోటీలో నిలపాలని నిర్ణయించింది. మరోవైపు పొత్తులో భాగంగా చెరో రెండున్నరేళ్లు సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగానే ఆ స్థానంలో ఆదిత్యాను పోటీలోకి తీసుకువచ్చారు. అంతకంటే ముందు డిప్యూటీ సీఎం పదవి కోసం ఇప్పటికే ఠాక్రే కర్చీఫ్ వేసిన విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలకు గాను ఆదివారంమే 20మంది అభ్యర్థులను ఠాక్రే ప్రకటించారు. -
‘మహా’ కాంగ్రెస్ తొలి జాబితా
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 51 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఖరారు చేసింది. అభ్యర్థుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ భికర్ స్థానం నుంచి, పార్టీ రాష్ట్ర చీఫ్ విజయ్ బాలసాహెబ్ థోరాట్ సంగమ్నెర్ నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ లాతూర్ సిటీ నుంచి, మాజీ హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కూతురు ప్రణితి సోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ సీనియర్‌నేత నితిన్ రౌత్ నాగ్‌పూర్ నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ముంబైలోని వర్లి స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఠాక్రే కుటుంబం తరఫున ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. -
మరాఠీల మొగ్గు ఎటువైపో?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సైరన్ మోగడంతో ముంబైలో రాజకీయ పార్టీల కదలిక లు జోరందుకున్నాయి. తమ తమ నియోజక వర్గాలలో ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏ వార్డులో ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఆయా పార్టీల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు బేరీజు వేసుకుంటున్నారు. మరాఠీ ఓటర్లున్న నియోజక వర్గాలలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని వ్యూహం పన్నుతున్నాయి. ముంబైలో సుమారు 24 లక్షల మరాఠీ ఓటర్లున్నారు. మరాఠీ ప్రజల శాతం తగ్గిపోతున్నప్పటికీ ముంబైలో వారి ఓట్లే కీలకం కానున్నాయి. అనేక నియోజక వర్గాలలో మరాఠీ ఓట్లు ఫలితాలను తారుమారు చేస్తాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకుల దృష్టి ఆ ఓట్లపైనే ఉంది. రెండు కూటముల మధ్యే పోరు.. ముంబైలో శివసేన–బీజేపీ, కాంగ్రెస్–ఎన్సీపీ మధ్య పొత్తు కుదిరితే ఈ రెండు కూటముల మధ్య నేరుగా పోరు జరగనుంది. బహుజన్ వంచిత్ ఆఘాడి ఏర్పడిన తరువాత అసెంబీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) కూడా బరిలో దిగేందుకు సన్నహాలు చేస్తోంది. దీంతో కొన్ని చోట్ల ద్విముఖ పోటీ, మరికొన్ని చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీ జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాలలో ఇప్పటి నుంచి నడుం బిగించారు. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అందులో శివ్డీ, వర్లీ, మాహిం, వడాల, తూర్పు బాంద్రా, కాలీనా, బోరివలి, చెంబూర్, జోగేశ్వరీ, తూర్పు ఘాట్కోపర్, పశ్చిమ ఘాట్కోపర్, చాందివలి, విలేపార్లే, వర్సోవా, కాందివలి, మాగఠాణే తదితరా నియోక వర్గాలలో మరాఠీ ఓట్లు ఫలితాలను నిర్ణయిస్తాయి. సునీల్ ప్రభు, రవీంద్ర వైకర్, ప్రకాశ్ సుర్వే, పరాగ్ అలవ్ణి, భారతీ లవేకర్, సంజయ్ పోత్నీస్, ఆశీష్ శేలార్, సదా సర్వణ్కర్ తదితర మరాఠీ ఎమ్మెల్యేలకు తమ తమ నియోజక వర్గాలలో మంచి పట్టు ఉంది. ఈ సారి కూడా వారి మళ్లీ అభ్యర్తిత్వం కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఈ నియోజక వర్గాలలో మరాఠీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. అంతేగాకుండా ఈ నియోజక వర్గాలలో మరాఠీ కార్పొరేటర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఎన్సీపీ, ఎమ్మెన్సెస్, సమాజ్‌వాది పార్టీ, ఎంఐఎం మినహా ఇక్కడ అన్ని పార్టీల ఎమ్మెల్యేలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో మరాఠీ ఓట్లతోనే వారంతా గెలిచారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేయలేదు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. శివసేన, ఎమ్మెన్సెస్కు మరాఠీ ఓటర్ల అండ ఉన్నప్పటికీ కొంచెం అటు, ఇటుగా మిగతా పార్టీలకు కూడా ఓట్లు పోలయ్యే ప్రమాదముంది. ఇదే సమయంలో వంచిత్ ఆఘాడి కూడా మొదటిసారి బరిలో దిగడంతో మరాఠీ ఓట్లు చీలిపోయి ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రాబల్యం తగ్గిపోతుండటంతో.. ఇప్పటికే ముంబైలో మరాఠీ ఓటర్లు తగ్గుతున్నారు. 2001లో మధ్యముంబైలో మరాఠీ ప్రజల సంఖ్య 45 లక్షలు ఉండగా 2011లో ఈ సంఖ్య 44 లక్షలకు పడిపోయింది. ముంబైలో మొత్తం 94,58,397 ఓటర్లున్నారు. ప్రసుత్తం అందులో మరాఠీ ఓటర్లు కేవలం 24 లక్షలున్నారు. దీంతో ముస్లీం, ఉత్తరభారతీయ ఓటర్లను కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి దువ్వే ప్రయత్నం చేయగా మరాఠీ, దక్షిణ భారతీయుల ఓటర్లను శివసేన–బీజేపీ కూటమి ఆకర్షించే ప్రయత్నం చేయనున్నాయి. ఈ ప్రజలకు ఎలాంటి హామీలిచ్చి తమవైపు ఆకర్షించుకోవాలనే దానిపై ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కొన్ని చోట్ల మరాఠీ ఓటర్లు తగ్గడంతో ఇతర ప్రాంతాల ఓటర్లే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయనున్నాయి. -
‘మళ్లీ నేనే ముఖ్యమంత్రిని...ఎనీ డౌట్?’
ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసే పోటీ చేస్తాయని.. మరోసారి తానే ముఖ్యమంత్రిని అవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం శనివారం మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షం శివసేన సమాన సంఖ్యలో సీట్లు డిమాండ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. అవన్ని అవాస్తవాలే అని.. సీట్ల పంపకం గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ లోపు ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం గూర్చి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో శివసేన మంత్రుల సహకారంతోనే తన కేబినేట్ నిర్ణయాలు తీసుకుందన్నారు ఫడ్నవిస్. అంతేకాక ఈ ఐదేళ్లలో ఏ శివసేన మంత్రి కూడా తన కేబినేట్ నిర్ణయాలను వ్యతిరేకించలేదని.. ఏ నిర్ణయం గురించి కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి రాలేదన్నారు. మరో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా అని ప్రశ్నించగా.. అందులో ఎలాంటి సందేహం లేదని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ.. తాను సామ్నా చదవను అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒంటరిగా పోటీ చేశాయి. అయితే బీజేపీ 122 స్థానాల్లో గెలుపొంది మెజారిటీ సీట్లు సాధించిన పార్టీగా నిలవగా.. శివసేన కేవలం 63 స్థానాలకే పరిమితమయ్యింది. అనంతరం రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 27న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబరు 21న పోలింగ్.. 24న కౌంటింగ్ ఉంటుంది.