
సాక్షి, ముంబై: అపర చాణక్యుడిగా పేరు పొందిన మరాఠా యోధుడు శరద్ పవార్ మహా డ్రామాకు ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. రాత్రికి రాత్రి చిన్నాన్నకే గట్టి షాక్ ఇచ్చి బీజేపీతో జత కట్టి ఆదరాబాదరాగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో ఎన్సీపీకి గట్టి షాకే తగిలింది. అజిత్ పవార్ చర్యను పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పవార్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అధికారం వస్తుంది, పోతుంది కానీ బంధాలే కలకాలం నిలుస్తాయి అంటూ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే తన వాట్సాప్ స్టేటస్‌లో కూడా ఉంచారు. రెండు రోజులుగా అజిత్‌ను తిరిగి పార్టీలోకి రావాలని ఎన్సీపీ నేతలు, పవార్ కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు.
శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆమె భర్త సదానంద్ సూలే విశ్వ ప్రయత్నాలే చేశారు. అయినా అజిత్ లొంగలేదు. చివరికి శరద్ పవార్ స్వయంగా రంగంలోకి దిగారు. తన సతీమణి ప్రతిభా పవార్ అంటే అజిత్ ఎంత ఆరాధిస్తారో ఆయనకు బాగా తెలుసు. అందుకే అజిత్‌ని దారిలోకి తెచ్చే బాధ్యత తన సతీమణికే అప్పగించారు. ప్రతిభా పవార్ ప్రయత్నాలతో పాటు, ఎమ్మెల్యేలు కూడా తన వెంట లేరన్న సత్యాన్ని గ్రహించుకున్న అజిత్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న షరతుతోనే అజిత్ రాజీనామా చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన రాజకీయ భవిష్యత్‌పై అజిత్ అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment