బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Maharashtra Assembly Elections 2024: MLA Ajit Pawar Interesting Comments Over Baramati Assembly Seat, Video Inside | Sakshi
Sakshi News home page

బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Nov 20 2024 7:41 AM | Last Updated on Wed, Nov 20 2024 10:07 AM

MLA Ajit Pawar Interesting Comments Over Baramati Assembly Seat

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ బారామతిలోని పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్‌ పవార్‌, ఆ తర్వాత అజిత్‌ పవార్‌ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్‌ పవార్‌ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్‌ పవార్‌ గెలిచారు.

దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్‌ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్‌ పవార్‌ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్‌ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్​సీపీ(ఎస్​పీ) తరఫున యుగేంద్ర పవార్‌ బరిలో నిలిచారు. అజిత్‌ పవార్‌ సోదరుడు శ్రీనివాస్‌ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్‌ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్‌ భార్య సునేత్ర పవార్‌ ఓడిపోయారు. ఎన్​సీపీ(ఎస్​పీ) తరఫున పోటీ చేసిన శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement