బరిలో భారీగా నేతల బంధుగణం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి
బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు!
పవార్ వర్సెస్ పవార్
బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్‌గా ఉంది. ఎన్సీపీ (ఎస్‌పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్‌ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.
భార్యాభర్తల సవాల్
ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్‌పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు.
ఎందరో వారసులు...
శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్‌రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్‌లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు.
ఎంఎన్‌ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు.
మోహన్‌రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్‌రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్‌కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.
తండ్రీ కూతుళ్ల పోటీ
గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్‌ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్‌లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్‌పై బరిలోకి దిగారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment