అధికార కూటమి అభ్యర్థులకు అందిస్తున్నారు
ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు.
అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment