national congress party
-
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
సహాయ మంత్రి మాకొద్దు: ఎన్సీపీ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఇవ్వజూపిన సహాయమంత్రి (స్వతంత్ర హోదా) పదవిని భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయమంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలపగా మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని వివరించారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్సీపీకి కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్లో ఎన్సీపీకి ఇద్దరు సభ్యులున్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కారే లోక్‌సభలో సభ్యులుగా ఉన్నారు. -
ఎన్సీపీలో కలవరం.. అజిత్ పవార్ కొత్త డిమాండ్..
ముంబయి: ఎన్సీపీలో ప్రధాన బాధ్యతను సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు అప్పజెప్పుతూ శరద్ పవార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..పార్టీ నిర్ణయానికి ఎదురుచెప్పలేక అప్పటికి సరే అని తలాడించిన అజిత్ పవార్.. ప్రస్తుతం కొత్త మెలిక పెట్టారు. పార్టీలో తనకు కొత్త బాధ్యత కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎన్సీపీలో కొత్త కలవరం మొదలైంది. మహారాష్ట్ర అసెంబ్లీలో తనకున్న ప్రతిపక్ష నాయకుని బాధ్యత వద్దంటూ అధిష్ఠానానికి అజిత్ పవార్ తెగేసి చెప్పారు. ముంబయిలో జరిగిన 24 వ వసంతోత్సవ వేడుకల్లో ఈ మేరకు తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా పూర్తి న్యాయం చేస్తానని చెప్పారు. ప్రతిపక్ష నాయకునిగా మాత్రం పనిచేయలేనని తెలిపారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు అజిత్ పవార్. శివసేన పార్టీలో చీలికలు వచ్చి, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత గతేడాది జులై నుంచి అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: న్యూయార్క్‌లో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం -
హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర
-
Maharashtra: ‘గవర్నర్ కోటా’తో మళ్లీ ఎరవేస్తారా?
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో పంపించిన గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల జాబితాను మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సోమవారం రద్దు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కార్యాలయానికి రాసిన లేఖలో గవర్నర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా మరో జాబితా గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే 12 మంది ఎమ్మెల్సీల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గత మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం 2020 నవంబర్‌లో 12 మంది సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది. కాని గవర్నర్ ఈ జాబితాను ఆమోదించకుండా సంవత్సర కాలంపాటు పెండింగులో ఉంచారు. ఆ తరువాత శిందే 50 మంది మద్దతుదారులతో తిరుగుబాటుచేసి శివసేన నుంచి బయటపడ్డారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. దీంతో ప్రభుత్వం మారిపోవడంతో గతంలో మహా వికాస్ ఆఘాడి పంపించిన జాబితా నిరుపయోగంగా మారింది. దీంతో ఈ జాబితాను రద్దు చేయాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గవర్నర్‌కు లేఖ రాశాయి. దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయం ఆఘాడి ప్రభుత్వం పంపించిన జాబితాను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా లేఖ రాసింది. దీంతో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమందికి ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తాజాగా మళ్లీ 12 మంది ఎమ్మెల్సీల పేర్లతో కూడిన జాబితా రూపొందించి గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. అప్పట్లో శిందేతోపాటు శివసేన పార్టీ నుంచి బయటపడిన మద్దతుదారులు ఎమ్మెల్సీ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. రెండో దశ మంత్రివర్గ విస్తరణకు ముందే గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల అంశం తెరమీదకు వచ్చింది. దీంతో కనీసం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి కొందరినైన సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుండవచ్చని శిందే వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. లేదంటే అసంతృప్తి హద్దులుదాటి శిందే వర్గం నుంచి బయటపడే ప్రమాదం లేకపోలేదు. దీంతో శిందే, ఫడ్నవీస్ వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్సీలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం లభిస్తుందనేది వేచిచూడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సమావేశాలకు ముందే ఖాళీగా ఉన్న 12 మంది ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసే ప్రయత్నం శిందే, ఫడ్నవీస్ చేయనున్నారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ ప్రభుత్వానివి కుట్ర రాజకీయాలు: ఎన్సీపీ ఎమ్మెల్సీలుగా 12 మంది పేర్లను ప్రతిపాదించాలని గతంలో మహా వికాస్ అఘాడి చేసిన సిఫార్సును ఉపసంహరించుకోవాలని ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ సోమవారం తీవ్రంగా విమర్శించింది. గవర్నర్ కోటా కింద మరింత మంది నేతలను అధికార శిబిరంలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీలుగా నామినేషన్ కోసం 12 మంది పేర్లను సిఫారసు చేసింది,అయితే ఫైల్‌ను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆమోదించలేదు. ఎంవీఏ సూచించిన 12 పేర్లలో ప్రముఖంగా కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరిన నటి ఊర్మిళ మటోండ్కర్ కూడా ఉన్నారు. ఈ సిఫార్సును ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించాలని శిందే ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిందని, కొత్త ప్రభుత్వ నిర్ణయాన్ని కోశ్యారీ అంగీకరించారని ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజాగా నామినేషన్ల జాబితాను త్వరలో అందజేస్తామని శిందే ప్రభుత్వం గవర్నర్‌కు తెలిపింది. ఎన్సీపీ ప్రధాన అధికార ప్రతినిథి మహేష్ తపసే సోమవారం మాట్లాడుతూ, ‘శిందే ప్రభుత్వం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు ప్రశ్నార్థకంగా ఉంది. దానిపై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉంది’ అని గత ఎంవీఏ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను రద్దు చేయాలనే నిర్ణయం విపక్షాలకు చెందిన మరింత మందిని ఆకర్షించడానికి బీజేపీ–శిందే శిబిరంలోని నేతలు ‘క్యారెట్’ అని విమర్శించారు. ఎంవీఏ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను అధిగమించాలనే ఏకైక ఎజెండాతో శిందే మంత్రివర్గం నడుస్తోంది’ అని తపసే ఆరోపించారు. ఈ చర్యద్వారా మహారాష్ట్రలో ఓటర్ల మనోభావాలు బీజేపీ–శిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం: రెబల్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి.. ఎమ్మెల్యేకు రాజీనామా, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు దగ్గర పడిన టైంలోనే తిరిగి స్వరాష్ట్రంలో అడుగుపెట్టాలని, మద్ధతు ప్రకటించాలని షిండే వర్గం భావిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్‌థాక్రే రాజీనామా చేయడం తమకు సంతోషాన్ని ఇవ్వడం లేదని రెబల్స్‌లో కొందరు భావిస్తున్నారు. ఉద్దవ్ థాక్రే మేం లేవనెత్తిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన రాజీనామా మాకేం సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పోరాడుతున్నప్పుడు.. మా నాయకుడిపై కూడా కోపం తెచ్చుకున్నందుకు మేమంతా బాధపడ్డాము.. అందుకు కారణం.. ఎన్సీపీ, సంజయ్ రౌత్. ప్రతీరోజూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేసిన కామెంట్లే.. మాలో అసంతృప్తిని రగిల్చాయి. వాళ్ల వల్లే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు చెడిపోయి.. పొసగని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా సంజయ్ రౌత్ జోక్యాలు ఎక్కువై పోవడం పట్ల మాలో చాలామందికి అసంతృప్తిగా ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చేయడంతో పాటు బీజేపీతో జట్టు కట్టడంపై మేమంతా ఏకతాటిగా నిలిచి డిమాండ్ చేశాం అని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్‌ఖర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎనిమిది రోజుల కిందట మొదలైన మహారాజకీయ సంక్షోభం.. బుధవారం రాత్రి ఉద్దవ్ థాక్రే రాజీనామాతో తెర పడింది. మహా వికాస్ అగాఢి కూటమిని వ్యతిరేకిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలతో గుజరాత్ సూరత్‌కు చేరుకున్నారు షిండే. ఆ సమయంలో ముంబై నుంచి మంతనాలు మొదలుకావడంతో.. రెబల్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు గువాహతి(అస్సాం)కు షిప్ట్ చేశారు. అక్కడ మరికొందరు తిరుగుబాటుకు మద్ధతు ప్రకటించారు. నలభై మంది శివ సేన ఎమ్మెల్యేలు పది మంది ఇతరులు.. మొత్తంగా 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు కూటగట్టుకున్నాడు ఏక్నాథ్ షిండే. చదవండి: మహా రాజకీయం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం! -
ఎంఐఎంతో జట్టు కట్టం: శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్.. కాస్త కటువుగానే స్పందించారు. ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్ జలీల్‌ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్. అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
Sakshi Cartoon: నితీశ్‌ను రాష్ట్రపతిని చేస్తాం..లేదంటే
లేదంటే అందరూ మిమ్మల్ని రాష్ట్రపతి అభ్యర్థి అనుకుంటున్నారు.. మీరు పీఎం అభ్యర్థి కదా! -
ప్రధానితో పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇరువురు నేతలు దాదాపుగా గంట సేపు చర్చలు జరిపారు. ప్రధాని కార్యాలయం వారిద్దరి ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. ‘‘రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధానిని కలుసుకున్నారు’’ అన్న వాక్యం మినహాయించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలను ఆ ట్వీట్లో ప్రస్తావించలేదు. మరోవైపు పవార్ తన ట్వీట్లో ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నాను. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించాను’’ అని పేర్కొన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పవార్ ప్రధానిని కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా పేరున్న పవార్ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన వ్యక్తి . శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలికలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోల్ తరచూ శివసేన, ఎన్సీపీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో పవార్ నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన ప్రధానిని కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ప్రధానికి పవార్ లేఖాస్త్రం ప్రధానిని కలుసుకోవడమే కాకుండా పవార్ శనివారం మోదీకి ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి హోం మంత్రి అమిత్ షాకి బాధ్యతలు అప్పగించిన సహకార మంత్రిత్వ శాఖపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయని, కేంద్రంలో ఇందులో ఏ విధంగా జోక్యం చేసుకున్నప్పటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పవార్ ఆ లేఖరో పేర్కొన్నారు. బ్యాంకింగ్ చట్ట సవరణల్ని గురించి ప్రస్తావించారు. కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ మేరకే కేంద్రం నడుచుకోవాలన్నారు. సహకార వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘చాలా రోజులుగా పవార్ ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ సాధ్యమైంది. బ్యాంకింగ్ సెక్టార్ అంశంలో మేము చేసిన విజ్ఞప్తిని ప్రధాని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం’’ అని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు. -
‘హోంమంత్రి రాజీనామా అవసరం లేదు’
-
100 కోట్ల కథ: హోంమంత్రి రాజీనామా అవసరం లేదు
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు రెండు రోజులుగా కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసు మహారాష్ట్రలో కీలక పరిణామాలకు దారి తీసింది. ఏకంగా ప్రభుత్వంలో ఓ భారీ కుదుపు ఏర్పడింది. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ.వంద కోట్లు వసూల్ లక్క్ష్యంగా పెట్టుకున్నారని ఓ మాజీ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలపై కథ నడుస్తోంది. దీనిపై తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమకు శివసేన నుంచి ఎలాంటి ఒత్తిడులు రావడం లేదని శరద్ పవార్ తెలిపారు. హోంమంత్రిపై ఆరోపణలు చేసిన పరమ్‌వీర్ సింగ్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కరోనాతో ఆస్పత్రిలో ఉన్న అనిల్ దేశ్ముఖ్తో ఎలా చర్చించారని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉన్న వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేశారని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా అంశం ప్రస్తావనకు రాలేదు అని శరద్ పవార్ తెలిపారు. అనిల్ ఆస్పత్రిలో ఉన్నాడని నిరూపించేందుకు అన్ని రికార్డ్‌లు ముఖ్యమంత్రికి పంపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామా ప్రస్తావన అవసరమే లేదు అని పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ ఎన్సీపీకి చెందిన వ్యక్తి. దీంతో దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు. చదవండి: మళ్లీ అక్కడే మరో మృతదేహం -
మహా కూటమి ‘మహో’దయం
మహారాష్ట్రలో రాజకీయ పోరు రసవత్తరంగా ముగి సింది. ఈ పోరులో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి, ప్రభుత్వ ఏర్పా టుద్వారా మహోదయానికి శ్రీకారం చుట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్లో శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కగా, బీజేపీ మహాగుణపాఠం నేర్చుకుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెం బ్లీలో, ఏ రాజకీయ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 145ను చేరుకోలేకపోవడంతో హంగ్ ఏర్పడింది. సీఎం పీఠం పంచుకునే విషయమై బీజేపీ–శివసేనల మధ్య రాజకీయ విభేదం తలెత్తింది. బీజేపీ తాము కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమ వాదన చెల్లుబాటు అవుతుందనే భావనతో శివసేనను లెక్కచేయలేదు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన శివసేన కొత్త మిత్రులను వెతుక్కుంది. పలు చర్చల తరువాత కనీస ఉమ్మడి ప్రణాళికతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్– ఎన్సీపీ–శివసేనల మధ్య అంగీకారం కుది రింది. మహారాష్ట్ర ఎపిసోడ్లో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదటగా బీజేపీని ఆహ్వానించిన గవర్నర్, తరువాత శివసేన, ఆ తరువాత ఎన్సీపీని ఆహ్వానించారు. కానీ, గవర్నర్ ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తికాకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కేంద్ర కేబినేట్ ఆ సిఫార్సును ఆమోదించడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. దీనిపై కూటమి నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అత్యవసర అంశంగా పరిగణించిన కోర్టు విచారణ చేపట్టింది. ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే, హడావుడిగా అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసిన గవర్నర్.. చీకట్లోనే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. అనూహ్యంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఎరగా వేసి, ఎన్సీపీ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం చూపిస్తామని బీజేపీ భావించింది. కానీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్ వైపు నిలబడటంతో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మరోవైపు కూటమి వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నవంబర్ 27, సాయంత్రం లోపు, అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేయాలని, ఫ్లోర్ టెస్ట్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన తర్వాత తన ఓటమిని ముందే అంగీకరించిన ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశంలో బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఈ ఉదంతంతో తెలుగు రాష్ట్రాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాల్సింది. అక్కడ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు, పదవుల ఆశ చూపినా ఏ ఒక్కరూ వాటికి లొంగలేదు. కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన ఎమ్మెల్యేలు పార్టీల కోసం నిలబడ్డారు.162 మంది కూటమి ఎమ్మెల్యేలు ఒక్కటిగా ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అనంతర పరిణామాలు, భవిష్యత్ మరాఠా రాజకీయాలను మలుపుతిప్పే రెండు ముఖ్యమైన సమీకరణాలను తెరపైకి తెచ్చాయి. ఒకటి, ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని ఠాక్రే కుటుంబం నుంచి మనవడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీచేసి గెలి చారు. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారి ఒకరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నారు. ఇక రెండవ విషయం, మరాఠా యోధుడు శరద్ పవార్ తరువాత ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇన్ని రోజులు శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్ మరియు కూతురు సుప్రియా మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు, తన అన్న శరద్ పవార్‌కు వ్యతిరేకంగా, అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపటంతో, ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి పవార్ వారసురాలు సుప్రియాకు మార్గం సుగమమైంది. మహారాష్ట్రలో ఈ మహా కూటమి ‘మహో’దయంతో, దేశంలో బీజేపీ ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మినహా చెప్పుకోదగిన ఏ ఒక్క పెద్ద రాష్ట్రాలలోనూ అధికారంలో లేకుండా పోయింది. మహా రాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి. వ్యాసకర్త: కొనగాల మహేష్, జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్ : 98667 76999 -
‘శివసేన అత్యాశనే కొంప ముంచింది’
సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మహారాష్ట్రలో శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని ఆయన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని శుక్రవారం రాత్రి వరకు అందరు అనుకున్నారు. కానీ, తెల్లారేసరికి ఎవరూ ఊహించని విధంగా ఉదయం ఎనిమిది గంటల లోపే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని పరిణామాలు రాష్ట్రంతోపాటు దేశంలోనే తీవ్ర కలకలం రేకేత్తించేలా చేశాయి. ఈ ఊహించని పరిణామాలపై ముంబైతోపాటు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలంటి నేపథ్యంలో తెలుగు ప్రజల అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.. రాజకీయాల్లో అవకాశవాదులదే ఆధిపత్యం ఓటు ఎవరికి వేసిన అది అవకాశ వాదుల చేతికి ఆయుధంగా మారుతుండటం విషాదకరం. ఓటర్ల మనోభావాలను క్రూరంగా అవహేళన చేస్తూ ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషం. కాని జనాదేశాన్ని కాదని మొదట్లో శివసేన పార్టీ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి, అధికారం కోసం వెంపడ్లాడడం, ఇప్పుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించడం. చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనం మాత్రమే అనిపిస్తోంది. అవకాశవాదులదే ఆధిపత్యం కొనసాగుతోంది. – సంగెవేని రవీంద్ర (మహారాష్ట్ర తెలుగురైటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి) ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఎవరు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తు అయితే బలపరీక్ష నిరూపణ మరో ఎత్తు కానుంది. రాజకీయాల్లో విలువలులేకుండా పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్రలో గత నెల రోజులుగా కొనసాగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దనేది అర్థంకాని పరిస్థితి. అందుకే ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా సరే రాష్ట్రప్రజల హితవు కోసం రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. – మాదిరెడ్డి కొండారెడ్డి (తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి). శివసేన అత్యాశనే కొంప ముంచింది ముఖ్యమంత్రి పీఠంపై పెంచుకున్న అత్యాశనే శివసేన పార్టీ కొంపముంచింది. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై అంతగా ఆశపెంచుకోకుంటే ఇలా జరిగేది కాదు. ఆర్పీఐ నేత రామ్‌దాస్ ఆఠావలే పేర్కొన్నట్టుగానే భారతీయ జనతా పార్టీకి మూడేళ్లు, శివసేన పార్టీకి రెండేళ్లపాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అంగీకరించి ఉండాల్సింది. ఈ విషయంపై చర్చలకు ఇరు పార్టీలు ముందుకు వచ్చినట్టయితే మహారాష్ట్ర రాజకీయాల్లో నేటి పరిస్థితి ఉద్బంవించి ఉండేది కాదు. – పుట్టపాక తిరుపతి (చర్నీ రోడ్డు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు) బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర హితవు కోసం బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది. ఓ వైపు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ రోజు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. మరోవైపు రాష్ట్రపతి పాలన కారణంగా రాష్టంలో రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇతర సమస్యలు పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఎంతో అవసరం. దీంతో బీజేపీ, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకుంది. – కొదురుపాక మహేష్ (కాందివలి) విశ్వాసం పోతోంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే రాజకీయాలతోపాటు రాజకీయ నాయకులపై విశ్వాసం పోతోంది. ఎవరిని నమ్మాలో..? ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. పార్టీ సిద్దాంతాలు లేవు. పదవులకోసం పాకులాటే కని్పస్తోంది. ఈ రోజు ఓ పారీ్టలో ఉన్నవారు రేపు ఏ పారీ్టలో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా పార్టీ నాయకులే కాకుండా రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు, ఎన్నికల తర్వాత మరొకరితో పొత్తు పెట్టుకుంటున్నాయి. మరోవైపు సొంత పారీ్టల ఎమ్మెల్యేలపై విశ్వాసం లేక రహస్య స్థలాల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడటం రాజకీయాల్లో అత్యంత శోచనీయం. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయాలపై సామాన్య ప్రజలకు విశ్వాసం పోతోంది. – పోతు రాజారాం (ఆంధ్ర మహాపభ ట్రస్టీ చైర్మన్) ఇది వెన్ను పోటే మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, అజిత్ పవార్‌తో కలిసి ప్రజాసామ్యానికి వెన్నుపోటు పోడిచారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖారారైన సమయంలో ఇలా చేయడం సబబుకాదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వంలో కూడా అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి లేదా ఇతర కీలక మంత్రి పదవి లభించి ఉండేది. కాని ఆయన వెన్నుపోటు పొడిచారు. – నాయన జగదీశ్ (థానే జిల్లా శివసేన సౌత్ సెల్ కార్యధ్యక్షులు) బల పరీక్షలో పరాజయం ఖాయం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మురిసిపోతుంది. కానీ, అజిత్ పవార్‌కు ఎన్సీపీ మద్దతు లేదు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టం. నవంబరు 30 వ తేదీన బీజేపీ బలపరీక్షలో పరాజయం అయిన తర్వాత మళ్లీ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం. – వాసాల శ్రీహరి (వంశి) (శివసేన) బీజేపీ చేస్తే తప్పా? కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జతకడితే తప్పులేదు. కాని బీజేపీ ఎన్సీపీతో జత కడితే తప్పా..? రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ అజిత్‌పవార్ మద్దతు తీసుకుంది. దీంట్లో బీజేపీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నించింది. కాని బీజేపీని పక్కనబెట్టాలని శివసేన చూసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం అవుతుండడంతో రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇలా ముందుకు వచి్చంది. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. –కోడూరు శ్రీనివాస్ (రాయిగడ్ జిల్లా బీజేపీ సౌత్ సెల్ ప్రధాన కార్యధర్శి) -
శివసేనకు షాక్.. శరద్ సంచలన ప్రకటన!
ముంబై: ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరిస్తుండటంతో ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సీఎం పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్న శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ మద్దతు కోసం సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నెరిపిన దౌత్యం ఫలించలేదు. ప్రభుత్వంలో చేరేది లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెగేసి చెప్పారు. ప్రజాతీర్పునకు అనుగుణంగా తాను, తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చుంటామని తేల్చిచెప్పారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించాలనుకోవడం లేదు. ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రతిపక్షం పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. ప్రభుత్వ ఏర్పాటులో నేను భాగం కాదలుచుకోలేదు. కొన్నిరోజులపాటు నేను ముంబైలో ఉండటం లేదు. పుణె, సతారా, కరాద్ ప్రాంతాల్లో పర్యటించబోతున్నాను’ అని శరద్ బుధవారం తెలిపారు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగా శరద్‌తో భేటీ అయినట్టు రౌత్ చెప్తున్నప్పటికీ.. బీజేపీ రహిత ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోరేందుకు ఆయన పవార్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. -
‘మహా’ రాజకీయం: వ్యంగ్య కార్టూన్!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టు వీడటం లేదు. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ సందిగ్దతపై ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడో క్రాస్టో సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఓ కార్టూన్ వేసి ట్విటర్లో షేర్ చేశారు. శివసేన పార్టీ అధికార గుర్తు అయిన బాణం...బీజేపీ చిహ్నం కమలానికి గురి ఎక్కుపెట్టినట్లుగా కార్టూన్‌ను చిత్రీకరించారు. కాగా గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ సంకేతాలు జారీ చేస్తూ బీజేపీని హెచ్చరిస్తోంది.(చదవండి : బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు) మరోవైపు మహారాష్ట్రకు మరో ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రినని దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘ముఖ్యమంత్రి పీఠంపై మేమెప్పుడూ 50:50ఫార్ములా పాటిస్తామని వారికి చెప్పలేదు. మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సైతం శివసేనకు సిఎం పదవి ఇవ్వడంపై ఏనాడు హామీ ఇవ్వలేదు. వచ్చే ఐదేళ్ల పాటు కూటమితో కలిసి స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వం మహించనుంది. మాకు పది మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అలాగే మరో ఐదుగురు కూడా మాకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు’ అని తెలిపారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం!
ముంబై: మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ (ఎంఎస్సీ) బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై మనీ ల్యాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం తాను ఈడీ ముందు హాజరవుతానని స్వయంగా శరద్ పవార్ ప్రకటించడంతో ముంబైలో ఎన్సీపీ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం ముందు, ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కొన్ని రోజుల్లో ఇది అంతరించిపోనుందని వారు విమర్శించారు. వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందు వల్ల కావాలనే పవార్‌ను లక్ష్యంగా చేసుకున్నారని మోదీ ప్రభుత్వంపై ఎన్సీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్ విరుచుకుపడింది. ఈడీ ఆఫీసుకు శరద్ పవార్ వస్తున్నారని తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు ముంబైలోని ఆ కార్యాలయం ముందు ధర్నా చేస్తారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కార్యాలయం బయట పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఈడీని దుర్వినియోగం పరుస్తున్నారు.. ఎంఎస్సీ కుంభకోణంలో శరద్ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీపీ ఒక ప్రకటనను విడుదల చేసింది. పవార్ పేరు ఈడీ కేసులో ఉందని బీజేపీ కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్ జారీ చేసినట్లు తెలుస్తోందని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ విలేకరులతో అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని, పార్టీ అధ్యక్షుడిని కించపరిచే కుతంత్రాలను తాము సహించమన్నారు. పరిస్థితులను ఎదుర్కొంనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్యుంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేశారని మాలిక్ ఆరోపించారు. అలాగే ఈడీ కార్యాలయాన్ని పవార్ సందర్శించే మాటకు కట్టుబడి ఉంటారని తెలిపారు. అధికార బలంతో, రాజకీయ శక్తితో బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల గొంతులను నొక్కేస్తుందని, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేను అలాగే చేశారని మాలిక్ ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌పై కేసుతో ఆ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం గందళగోళానికి గురిచేసిందని జయంత్ పాటిల్ అన్నారు. అయితే రాష్ట్రంలో పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కూడా పవార్‌పై ఈడీ కేసును తప్పుబట్టారు. శరద్ పవార్ తప్పుచేయలేదు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్‌కు బీజేపీ మిత్రపక్షమైన శివసేన నుంచి మద్దతు లభించింది. మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్ పవార్ ప్రేమేయం ఏమీ లేదని, కుంభకోణం వెలుగుచూసిన సమయంలో పవార్ అధికారంలో కూడా లేరని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో జరిగిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. ‘పవార్ పెద్ద నేత. బ్యాంకుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి కేసుల్లో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. స్కామ్ జరిగినప్పుడు ఆయన అధికారంలో కూడా లేరు. ఆయన పార్టీ నేతలు ఉండొచ్చేమో కానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు’అని సంజయ్ రౌత్ తెలిపారు. బీజేపీ నేతల్లో అసంతృప్తి... బ్యాంకు కుంభకోణంలో ఆయన పేరు చేర్చడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ సంప్రదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు శరద్ పవార్‌కు మద్దతుగా రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ఈడీ తేల్చింది. పవార్, ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు 70 మంది ఎంఎస్సీ బ్యాంకు అధికారు పేర్లను అందులో చేర్చింది. ఎన్సీపీ బంద్‌కు మిశ్రమ స్పందన పింప్రి: వివిధ కుంభకోణాల కేసులో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మాజీ మంత్రి అజీత్ పవార్, మరికొందరిపై ఈడీ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నిర్వహించిన పుణే, పింప్రి–చించ్వడ్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఎన్సీపీ పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. తర్వాత కొందరు షాపులు తెరవడంతో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. రవాణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు యథాతథంగా విధులకు వెళ్లారు. ర్యాలీలో పింప్రి నగర ఎన్సీపీ అధ్యక్షుడు సంజోగ్ వాగరే, కార్పొరేటర్లు డబ్బు అస్వాని, నికిత కదం, సులక్షణ ధర్, మాజీ మేయర్ యోగేశ్ బహల్, యూత్ పార్టీ అధ్యక్షురాలు వర్షా జగ్తాప్, ప్రతినిధి ఫజల్ శేఖ్ తదితరులు పాల్గొన్నారు. -
‘2019 తరువాత ప్రధానిగా మోదీ ఉండరు’
సాక్షి, ముంబై : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పరాభావం తప్పదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో సాగుతున్న బీజేపీ పాలన తిరిగి అధికారం నిలబెట్టుకోలేదని.. మహారాష్ట్రలో కూడా తిరిగి అధికారంలోకి రావడం అంత తేలిక కాదని ఆయన అభిప్రాపడ్డారు. మంగళవారం ముంబైలో జరిగిన ఓ మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పార్లమెంటేరియన్ పలు అంశాలపై ముచ్చటించారు. 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశం లేదని.. 2004లో జరిగిన విధంగానే విపక్షాలతో కూటమి ఏర్పడక తప్పదని అన్నారు. రాహుల్ కష్టమే.. ఆయన మాట్లాడుతూ.. ‘‘1999 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి పాలనపై ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినా.. 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే పునరావృత్తమైయ్యే అవకాశం లేకపోలేదు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకవపోవచ్చు. ప్రతిపక్షాల్లో మోదీని ఢీ కొట్టే నాయకడు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. విపక్షాలు అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరనేది స్పష్టత లేదు. 2004లో అనూహ్యంగా ఆర్థికగా వేత్త మన్మోహన్ సింగ్ ప్రధాని ఐనట్లు ఎవరైనా కావచ్చు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ మోదీ, రాహుల్ మధ్య ఉంటుందనుకుంటే పొరపాటే. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి నిలబడే అవకాశం లేదు. కూటమి మధ్య అవగహన ఏర్పడడం కష్టమే’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరును పవార్ కొట్టిపారేశారు. ఎన్నికల ముందుగానే రాహుల్‌ను ప్రధానిగా ప్రకటించి.. కాంగ్రెస్ పార్టీ సాహాసం చేయలేదని అన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించమని మాజీ కేంద్ర మంత్రి ఇటీవల పీ. చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాజస్తాన్‌లో బీజేపీకి ఓటమి తప్పదని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ నెలకొందని విశ్లేషించారు. కాగా ఎన్నికల నుంచి శరద్ పవార్ రిటైరైన విషయం తెలిసిందే. చివరి సారిగా జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం పవార్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
సాహసి
‘ఇంగ్లండ్‌ను పాలించే హక్కు జర్మన్లకు లేనప్పుడు, భారత్‌ను పరిపాలించడానికి ఇంగ్లండ్‌కు మాత్రం ఉన్న హక్కు ఏమిటి?’ లండన్‌లోని 65, క్రోమ్‌వెల్ అవెన్యూలోని ఇండియా హౌస్. ఆ రోజు ఆదివారం.ప్రతి ఆదివారం జరిగినట్టే ఆ రోజు కూడా భారతీయ విద్యార్థులతో, స్వాతంత్య్రోద్యమానికి అండగా ఉండే మేధావులతో సమావేశం జరుగుతోంది. ఇండియా హౌస్ మేనేజర్ వినాయక్ దామోదర్ సావర్కర్ భవిష్యత్ భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. సమావేశం జరుగుతున్న గదిని ఆనుకుని ఉన్న గదిలో కొందరు యువకులు పెద్దగా మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు చతురోక్తులు విసురుకుంటూ బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. దీనితో సావర్కర్‌కు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఉపన్యాసం ఆపేసి ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నవారిలో ఒక యువకుడే మదన్‌లాల్ థింగ్రా. లండన్ యూనివర్సిటీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థి. ‘ఏం మదన్! ఎప్పుడూ ధైర్యసాహసాల గురించి మాట్లాడతావ్? ఏదో చేయాలని నిరంతరం చెబుతూ ఉంటావ్! ఇదేనా నీ ధైర్యం? ఇక్కడ జరిగే సమావేశాలకు కూడా రావడం మానేశావ్! ఇదా ధైర్యమంటే? ఏదో చేయడమంటే ఇదేనా?’ అని అరిచారు సావర్కర్. నిజానికి థింగ్రాకు (సెప్టెంబర్ 18, 1883– ఆగస్ట్ 17, 1909) తొలి రోజులలో స్వాతంత్య్రోద్యమం మీద గొప్ప ఆసక్తి లేదు. కానీ ఏదో చెప్పి ఉండాలి సావర్కర్‌కి. అందంగా ఉండేవాడు. ఎప్పుడూ చతురోక్తులతో మాట్లాడుతూ, ప్రేమ గీతాలు ఆలపిస్తూ మిత్రులతో గంటలు గంటలు గడిపేవాడు. అలాంటివాడు కూడా ఆ ఆదివారం సావర్కర్ అన్న మాటలతో మారిపోయాడు. విన్నపాలు, విజ్ఞాపన పత్రాలు బ్రిటిష్ జాతిని కదిలించవన్న సంగతిని భారత జాతీయ కాంగ్రెస్ చేత అంగీకరింప చేసే ప్రయత్నం 1905 నుంచి ఆరంభమైంది. బెంగాల్ విభజన కోసం బ్రిటిష్ జాతి ఆడిన నాటకం భారతీయుల అభిప్రాయాలను పూర్తిగా మార్చివేసింది. మితవాదంతో కాకుండా, సంఘర్షణతో, సాయుధ సమరంతో బ్రిటిష్ జాతిని ఎదుర్కొనాలన్న ఆవేశం ఒక వర్గంలో పెల్లుబుకింది. వీరు జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులను కూడా ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపించదు. నిజంగానే భారత స్వాతంత్య్ర సమరంలో అదొక దశ. కానీ ఇది చరిత్ర పుస్తకాలలో కానరాదు. ఈ దశకు చెందినవారే మదన్‌లాల్ థింగ్రా. ఆరంభంలో చెప్పుకున్న ఆ రెండు మాటలు ఆయన పలికినవే. అది కూడా కర్జన్ వైలీని హత్య చేసినందుకు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో లండన్‌లోని పెంటన్‌విల్లె జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో థింగ్రా ఇచ్చిన వాగ్మూలంలో ఈ మాటలు అన్నాడు. మదన్‌లాల్ థింగ్రా అనుకోకుండా ఇంగ్లండ్‌లో భారతీయ విప్లవకారుల ప్రభావంలో పడ్డారు. థింగ్రా అమృత్‌సర్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ వైద్యుడు. ఇంగ్లిష్ జాతి అంటే అభిమానించేవాడు కూడా.ఏడుగురు మగపిల్లలు ఆయనకు. థింగ్రా ఆరోవాడు. ఆయన ఇద్దరు అన్నలు కూడా వైద్యశాస్త్రమే చదివారు.థింగ్రా లాహోర్ తదితర ప్రాంతాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత జనవరి 1, 1906న ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇంజనీరింగ్ చదవడానికి లండన్‌లోని యూనివర్సిటీ కళాశాలలో చేరారు. భారతీయ విద్యార్థుల కోసం అక్కడే ‘ఇండియా హౌస్’ ఉండేది. థింగ్రా కూడా అందులోనే ఉన్నారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇండియా హౌస్ గురించి కొంచెం తెలుసుకోవాలి. దీనిని 1905లోనే శ్యామ్‌జీకృష్ణవర్మ నెలకొల్పారు. ఇందులో ఎవరైనా చేరవచ్చు. ఏ రాజకీయ సిద్ధాంతం వారికైనా కూడా హౌస్ తలుపులు తెరిచే ఉంచుతుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావర్కర్ చెప్పడం విశేషం. కానీ భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ హౌస్ నుంచి మద్దతు ఉండేది. అసలు ఉద్దేశమే అది. దీనికే 1906 జూన్‌లో వినాయక్ దామోదర్ సావర్కర్ మేనేజర్ అయ్యారు. ఆయన కూడా విద్యార్థిగానే అక్కడకు వచ్చారు. ఆయన న్యాయశాస్త్రం అభ్యసించేవారు. ఆయన వెళ్లిన తరువాత వారం వారం సమావేశాలు జరిగేవి. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ఇవ్వడం గురించి, భావి భారతం రూపురేఖల గురించి చర్చించడమే వాటి ఉద్దేశం. సావర్కర్ ఇంకా రష్యా, చైనా, ఐర్లండ్, టర్కీ, ఈజిప్టులలో ఉన్న విప్లవకారులతో సంప్రతింపులు జరుపుతూ ఉండేవారు. అభినవ్ భారత్ సంస్థను స్థాపించి భారతీయ విద్యార్థులను ఉద్యమం వైపు దృష్టి సారించేటట్టు చేసేవారు. 1907 నాటికి గ్రేట్ బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 700. ఇందులో 380 మంది లండన్‌లోనే ఉండేవారు. చిత్రం ఏమిటంటే, స్వాతంత్య్రోద్యమానికి దేశ విదేశాలలోని అభిమానులను, విద్యార్థులను ఏకం చేయడానికి భారతదేశంలో లేని వెసులుబాటు ఇంగ్లండ్‌లో దొరికేది. దీనినే ఇండియా హౌస్ వినియోగించుకునేది. శ్యామ్‌జీ కృష్ణవర్మ, సావర్కర్, మేడం కామా, బారిస్టర్ సర్దార్ సింగ్ రాణా, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ (సరోజినీదేవి సోదరుడు), సర్దార్ అజిత్‌సింగ్, లాలా హరదయాళ్, రాస్బిహారీ బోస్, మహేంద్ర ప్రతాప్, చంపక్రామన్ పిళ్లై వంటివారు విదేశాల నుంచే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఇక ఇండియా హౌస్‌కు వచ్చిన ప్రముఖుల జాబితా కూడా విశిష్టమైనదే. లాల్, పాల్, బాల్, గాంధీజీ వంటివారంతా కూడా హౌస్‌ను సందర్శించారు. సావర్కర్, గాంధీల తొలి సమావేశం ఇక్కడే జరిగింది. సావర్కర్ మందలించిన తరువాత థింగ్రా ఇండియా హౌస్‌ను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. తరువాత ఎప్పుడో ఒకసారి వచ్చి కలిశాడు. సావర్కర్ అప్పటికీ తన మీద కోపంతోనే ఉన్నారని థింగ్రా అనుకున్నాడు. కానీ సావర్కర్ అసలేమీ జరగనట్టే ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడే అడిగాడు థింగ్రా, ‘అమరత్వానికి సమయం వచ్చిందా?’ అని. ‘అమరుడు కావాలని అనుకునేవారు సంసిద్ధులయ్యామని నమ్మితే అమరత్వానికి సమయం వచ్చినట్టే’ అన్నారు సావర్కర్. కానీ అప్పటికే థింగ్రా నేషనల్ ఇండియన్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. ఈ సంస్థ ఉద్దేశం భారతీయ యువకులు స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులు కాకుండా చూడటమే. మిస్ ఎమ్మా జోసఫీన్ బెక్ కార్యదర్శిగా ఉండేవారు. బ్రిటిష్ ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పిస్తూ, భారతీయ విద్యార్థులను విందులకు, వినోదాలకు ఆహ్వానిస్తూ ఆమె కార్యక్రమాలు నిర్వహించేవారు. జూలై 1, 1909.లండన్‌లోనే ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఒక సమావేÔ¶ ం (ఎట్ హోం) ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథి చాలా ప్రముఖుడు. ఇండియన్ ఆఫీస్‌లో ఉన్నతోద్యోగి కర్జన్ వైలీ. పాస్ చూపించి థింగ్రా కూడా లోపలికి వెళ్లాడు. వైలీ ఉపన్యాసం పూర్తయింది. అతడు లేచి వెళ్లిపోతున్నాడు. అప్పుడే థింగ్రా కూడా వెళ్లాడు. అతడు గ్లాస్ డోర్ తెరవబోతున్నాడు. ‘ముఖ్యమైన విషయం మాట్లాడాలి’ అన్నాడు థింగ్రా. ఏమిటన్నట్టు చెవి ఒగ్గాడు వైలీ. వెంట తెచ్చిన రివాల్వర్ బయటకు తీసి ఆరేడు సార్లు కాల్చాడు. థింగ్రా పారిపోలేదు. వెంటనే అరెస్టయ్యాడు. నిజానికి ఇండియా హౌస్‌ను వీడిన తరువాత థింగ్రా చేసిన పని– టోటెన్హ్యామ్ కోర్ట్ రోడ్డులో ఒకచోట తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. మొదట అతడి లక్ష్యం వైలీ కాదు. లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన పేరుతో దేశంలో కర్జన్ చేసిన కల్లోలం తక్కువేమీ కాదు. అంతేకాదు, భారతీయులంటే ఇతడికి ఉన్న చిన్నచూపు కూడా తక్కువేమీ కాదు. అలాగే బెంగాల్ మాజీ గవర్నర్ భ్రామ్ఫీల్డ్ ఫుల్లర్ని కూడా చంపాలని అనుకున్నాడు. ఆఖరికి కర్జన్ వైలీ దొరికాడు. వైలీతో పాటు అతడికి రక్షణగా వెళ్లిన పార్సీ వైద్యుడు డాక్టర్ లాల్కాకా కూడా ఆ కాల్పులలో చనిపోయాడు. థింగ్రా వెంట అతని మిత్రుడు కొరెగాంకార్ కూడా ఉన్నాడు. వైలీ వెళ్లిపోతున్న సంగతి థింగ్రాకు ఆయనే చెప్పాడు. నాలుగురోజుల తరువాత వైలీ సంతాప సభ జరిగింది. ఇందులో భజన్‌లాల్ అనే గ్రేస్ ఇన్ కళాశాల న్యాయశాస్త్ర విద్యార్థి మదన్‌లాల్ థింగ్రా చర్యను ఖండిస్తున్నట్టు ప్రకటించాడు. అతడు స్వయంగా థింగ్రా సోదరుడే. తరువాత బ్రిక్స్టన్ జైలులో ఉండగా కలుసుకోవడానికి వెళ్లాడు. కానీ థింగ్రా అతడిని కలుసుకోవడానికి నిరాకరించాడు. మరొక సంతాప సభను భారతీయులు నిర్వహించారు. దీనికి ఆగాఖాన్ అధ్యక్షుడు. ఈ సభ కూడా వైలీ హత్యను ఖండించింది. తీర్మానం ఏకగ్రీవమని ఆగాఖాన్ ప్రకటిస్తే, ఒక గొంతు తన అసమ్మతిని ప్రకటించింది. ఆ గొంతు సావర్కర్‌ది. ఆయనను వెంటనే అధ్యక్షుడి ఆదేశం మేరకు సభ నుంచి బహిష్కరించారు. థింగ్రా మత్తుమందులకు బానిస అంటూ ఇంగ్లండ్ పత్రికలు ప్రచారం చేశాయి. భారతదేశంలో దొరికే భంగు అనే మందును అతడు తీసుకుంటాడని అవి రాశాయి. కానీ కోర్టులో ఇది రుజువు కాలేదు. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ కార్యదర్శి ఎమ్మా, థింగ్రా నివాసం ఇంటి యజమానురాలు కూడా ఈ ఆరోపణను తిరస్కరించారు. కాగా థింగ్రా సాహసాన్ని మెచ్చుకుంటూ రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పత్రిక వ్యాసం ప్రచురించింది. ఇది ఐర్లండ్ విప్లవోద్యమాన్ని సమర్థించేది. దీనితో ఆ పత్రిక సంపాదకుడిని జైలుకు పంపారు. తన ప్రజల గళాలను అణచివేసే వారిని తుదముట్టించడం కోసం ఈ హత్య తనే చేశానని థింగ్రా ముందే అంగీకరించాడు. ఈ సందర్భంగా స్వేచ్ఛాస్వాతంత్య్రాల మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసాధారణంగా ఉన్నాయి. విచారణ అయిందనిపించి థింగ్రాను పెంటన్‌విల్లె జైలులో (లండన్) ఉరి తీశారు. విచారణ ఆరంభంలోనే థింగ్రా తన వైఖరి ఏమిటో చెప్పేశాడు. ‘‘నేను మీ దయాదాక్షిణ్యాల కోసం అర్థించను. అసలు మీ న్యాయ వ్యవస్థనే నేను విశ్వసించడం లేదు.’’ ∙డా. గోపరాజు నారాయణరావు -
గుజరాత్ పోరు.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్
-
గుజరాత్ పోరు.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. కాంగ్రెస్‌తో కలిసి మిత్రపక్షంగా బరిలో దిగుతుందని భావించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. కాంగ్రెస్‌తో కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని తొలుత భావించామని, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, అయితే ఆ పార్టీ తాత్సారం చేస్తుండడంతో తాము సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. అన్ని సీట్లకు పోటీ చేయాలని ఏడాదిన్నర క్రితం నుంచే సిద్ధమయ్యామని, ఇపుడు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఒంటరి పోరుతో అత్యధిక స్థానాలను గెలుచుకోగలమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక 77 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించిన మర్నాడే ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హార్దిక్‌తో మంతనాలపై కూడా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఎన్సీపీ ఎన్నికల ప్రచారం షురూ..
కొల్హాపూర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పశ్చిమ మహారాష్ర్టలోని కొల్హాపూర్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్హాపూర్ ఎంపీ, ఎన్సీపీ నేత ధనంజయ్ మహదిక్ మాట్లాడుతూ 1999లో పార్టీని స్థాపించినప్పటి నుంచి కొల్హాపూర్ ఎన్సీపీకి అండగా ఉంటూ వస్తోందని, అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతటా నరేంద్ర మోడీ హవా నడిచినా కొల్హాపూర్‌వాసులు మాత్రం ఎన్సీపీకే పట్టం గట్టారని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి మునుపటి మద్దతు లభించడంలేదన్నది స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఈ బహిరంగ సభకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని కొల్హాపూర్ డీఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. సభకు సుమారు 70 వేల మంది హాజరయినట్లు అంచనా.. కాగా ఈ సభలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ర్ట అధ్యక్షుడు సునీల్ తట్కరే తదితరులు హాజరయ్యారు. -
పోరుకు సిద్ధమవుతున్న ఎన్సీపీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల తొలి జాబితానూ దీపావళి తరువాత విడుదల చేస్తామని జాతీయవాది కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. పండుగకు ముందే మేనిఫెస్టోను విడుదల చేయాలని అనుకున్నా.. మరింత సమయం అవసరమైనందున వచ్చే నెలలో ప్రకటించాలని భావిస్తున్నామని ఢిల్లీ ఎన్సీపీ అధ్యక్షుడు కన్వర్ ప్రతాప్ సింగ్ శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘మొత్తం 70 స్థానాల్లో మేం అభ్యర్థులను నిలబెడతాం. ఒక్కో స్థానంలో పోటీకి దాదాపు ఐదు దరఖాస్తులు వచ్చాయి. సచ్ఛరిత్ర కలిగి ఉండడంతోపాటు అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడైన వారికే టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిపతి శరద్ పవార్, ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ ఆదేశించారు. పోయినసారి కేవలం 15 స్థానాల్లోనే పోటీ చేసినా ఈసారి జాతీయ పార్టీ మాదిరిగానే అన్ని చోట్లా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నాం’ అని సింగ్ వివరించారు. తమ పార్టీ ఎన్నికల ప్రచారానికి వ్యాపార, మేధోవర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోందని ప్రకటించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విపిన్‌కుమార్ గోయల్, అమర్‌సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌మంచ్ ఢిల్లీశాఖ ప్రధాన కార్యదర్శి భగవతి ప్రసాద్నిషాద్ వంటి ప్రముఖులు ఎన్సీపీలో చేరారని తెలిపారు. ఢిల్లీ ఎన్సీపీ ఉపాధ్యక్షుడిగా గోయల్‌ను నియమించామని వెల్లడించారు. ‘ఎన్సీపీ జెండాపై గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిజానికి అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య ఉంది’ అని తెలిపారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం వ్యాపారులతో కుమ్మక్కు కావడం వల్లే ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలను తీసుకువస్తున్నప్పటికీ రవాణాభారం కిలోకు రూ.25కు మించ దు కాబట్టి కిలో ధర రూ.70 వరకు ఉండాలన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీవ్యాప్తంగా రూ.100 కు కిలో ఉల్లిపాయలు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఉల్లి ధరలు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్ ముందుగానే హెచ్చరించినా షీలా దీక్షిత్ ప్రభుత్వం పట్టించుకోలేదని కన్వర్ప్రతాప్ సింగ్ విమర్శించారు.