సాహసి | Special story to madan lal dhingra | Sakshi
Sakshi News home page

సాహసి

Published Sun, Oct 21 2018 1:45 AM | Last Updated on Sun, Oct 21 2018 1:45 AM

Special story to madan lal dhingra - Sakshi

‘ఇంగ్లండ్‌ను పాలించే హక్కు జర్మన్లకు లేనప్పుడు, భారత్‌ను పరిపాలించడానికి  ఇంగ్లండ్‌కు మాత్రం ఉన్న హక్కు ఏమిటి?’ 

లండన్‌లోని 65, క్రోమ్‌వెల్‌ అవెన్యూలోని ఇండియా హౌస్‌. ఆ రోజు ఆదివారం.ప్రతి ఆదివారం జరిగినట్టే ఆ రోజు కూడా భారతీయ విద్యార్థులతో, స్వాతంత్య్రోద్యమానికి అండగా ఉండే మేధావులతో సమావేశం జరుగుతోంది. ఇండియా హౌస్‌ మేనేజర్‌ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ భవిష్యత్‌ భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. సమావేశం జరుగుతున్న గదిని ఆనుకుని ఉన్న గదిలో కొందరు యువకులు పెద్దగా మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు చతురోక్తులు విసురుకుంటూ బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. దీనితో సావర్కర్‌కు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఉపన్యాసం ఆపేసి ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నవారిలో ఒక యువకుడే మదన్‌లాల్‌ థింగ్రా. లండన్‌ యూనివర్సిటీ కళాశాలలో ఇంజనీరింగ్‌ విద్యార్థి.  ‘ఏం మదన్‌! ఎప్పుడూ ధైర్యసాహసాల గురించి మాట్లాడతావ్‌? ఏదో చేయాలని నిరంతరం చెబుతూ ఉంటావ్‌! ఇదేనా నీ ధైర్యం? ఇక్కడ జరిగే సమావేశాలకు కూడా రావడం మానేశావ్‌! ఇదా ధైర్యమంటే? ఏదో చేయడమంటే ఇదేనా?’ అని అరిచారు సావర్కర్‌.

నిజానికి థింగ్రాకు (సెప్టెంబర్‌ 18, 1883– ఆగస్ట్‌ 17, 1909) తొలి రోజులలో స్వాతంత్య్రోద్యమం మీద గొప్ప ఆసక్తి లేదు. కానీ ఏదో చెప్పి ఉండాలి సావర్కర్‌కి. అందంగా ఉండేవాడు. ఎప్పుడూ చతురోక్తులతో మాట్లాడుతూ, ప్రేమ గీతాలు ఆలపిస్తూ మిత్రులతో గంటలు గంటలు గడిపేవాడు. అలాంటివాడు కూడా ఆ ఆదివారం సావర్కర్‌ అన్న మాటలతో మారిపోయాడు. విన్నపాలు, విజ్ఞాపన పత్రాలు బ్రిటిష్‌ జాతిని కదిలించవన్న సంగతిని భారత జాతీయ కాంగ్రెస్‌ చేత అంగీకరింప చేసే ప్రయత్నం 1905 నుంచి ఆరంభమైంది. బెంగాల్‌ విభజన కోసం బ్రిటిష్‌ జాతి ఆడిన నాటకం భారతీయుల అభిప్రాయాలను పూర్తిగా మార్చివేసింది. మితవాదంతో కాకుండా, సంఘర్షణతో, సాయుధ సమరంతో బ్రిటిష్‌ జాతిని ఎదుర్కొనాలన్న ఆవేశం ఒక వర్గంలో పెల్లుబుకింది. వీరు జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులను కూడా ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపించదు. నిజంగానే భారత స్వాతంత్య్ర సమరంలో అదొక దశ. కానీ ఇది చరిత్ర పుస్తకాలలో కానరాదు. ఈ దశకు చెందినవారే మదన్‌లాల్‌ థింగ్రా. ఆరంభంలో చెప్పుకున్న ఆ రెండు మాటలు ఆయన పలికినవే. అది కూడా కర్జన్‌ వైలీని హత్య చేసినందుకు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో లండన్‌లోని పెంటన్‌విల్లె జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో థింగ్రా ఇచ్చిన వాగ్మూలంలో ఈ మాటలు అన్నాడు. 

మదన్‌లాల్‌ థింగ్రా అనుకోకుండా ఇంగ్లండ్‌లో భారతీయ విప్లవకారుల ప్రభావంలో పడ్డారు.  థింగ్రా అమృత్‌సర్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ వైద్యుడు. ఇంగ్లిష్‌ జాతి అంటే అభిమానించేవాడు కూడా.ఏడుగురు మగపిల్లలు ఆయనకు. థింగ్రా ఆరోవాడు. ఆయన ఇద్దరు అన్నలు కూడా వైద్యశాస్త్రమే చదివారు.థింగ్రా లాహోర్‌ తదితర ప్రాంతాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత జనవరి 1, 1906న ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. ఇంజనీరింగ్‌ చదవడానికి లండన్‌లోని యూనివర్సిటీ కళాశాలలో చేరారు.  భారతీయ విద్యార్థుల కోసం అక్కడే ‘ఇండియా హౌస్‌’ ఉండేది. థింగ్రా కూడా అందులోనే ఉన్నారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.  ఇండియా హౌస్‌ గురించి కొంచెం తెలుసుకోవాలి. దీనిని 1905లోనే శ్యామ్‌జీకృష్ణవర్మ నెలకొల్పారు. ఇందులో ఎవరైనా చేరవచ్చు. ఏ రాజకీయ సిద్ధాంతం వారికైనా కూడా హౌస్‌ తలుపులు తెరిచే ఉంచుతుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావర్కర్‌ చెప్పడం విశేషం. కానీ భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ హౌస్‌ నుంచి మద్దతు ఉండేది. అసలు ఉద్దేశమే అది. దీనికే 1906 జూన్‌లో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ మేనేజర్‌ అయ్యారు. ఆయన కూడా విద్యార్థిగానే అక్కడకు వచ్చారు. ఆయన న్యాయశాస్త్రం అభ్యసించేవారు. ఆయన వెళ్లిన తరువాత వారం వారం సమావేశాలు జరిగేవి. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ఇవ్వడం గురించి, భావి భారతం రూపురేఖల గురించి చర్చించడమే వాటి ఉద్దేశం. సావర్కర్‌ ఇంకా రష్యా, చైనా, ఐర్లండ్, టర్కీ, ఈజిప్టులలో ఉన్న విప్లవకారులతో సంప్రతింపులు జరుపుతూ ఉండేవారు. అభినవ్‌ భారత్‌ సంస్థను స్థాపించి భారతీయ విద్యార్థులను ఉద్యమం వైపు దృష్టి సారించేటట్టు చేసేవారు. 1907 నాటికి గ్రేట్‌ బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 700. ఇందులో 380 మంది లండన్‌లోనే ఉండేవారు. చిత్రం ఏమిటంటే, స్వాతంత్య్రోద్యమానికి దేశ విదేశాలలోని అభిమానులను, విద్యార్థులను ఏకం చేయడానికి భారతదేశంలో లేని వెసులుబాటు ఇంగ్లండ్‌లో దొరికేది. దీనినే ఇండియా హౌస్‌ వినియోగించుకునేది. శ్యామ్‌జీ కృష్ణవర్మ, సావర్కర్, మేడం కామా, బారిస్టర్‌ సర్దార్‌ సింగ్‌ రాణా, వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ (సరోజినీదేవి సోదరుడు), సర్దార్‌ అజిత్‌సింగ్, లాలా హరదయాళ్, రాస్‌బిహారీ బోస్, మహేంద్ర ప్రతాప్, చంపక్‌రామన్‌ పిళ్లై వంటివారు విదేశాల నుంచే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఇక ఇండియా హౌస్‌కు వచ్చిన ప్రముఖుల జాబితా కూడా విశిష్టమైనదే. లాల్, పాల్, బాల్, గాంధీజీ వంటివారంతా కూడా హౌస్‌ను సందర్శించారు. సావర్కర్, గాంధీల తొలి సమావేశం ఇక్కడే జరిగింది. సావర్కర్‌ మందలించిన తరువాత థింగ్రా ఇండియా హౌస్‌ను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. తరువాత ఎప్పుడో ఒకసారి వచ్చి కలిశాడు. సావర్కర్‌ అప్పటికీ తన మీద కోపంతోనే ఉన్నారని థింగ్రా అనుకున్నాడు. కానీ సావర్కర్‌ అసలేమీ జరగనట్టే ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడే అడిగాడు థింగ్రా, ‘అమరత్వానికి సమయం వచ్చిందా?’ అని. ‘అమరుడు కావాలని అనుకునేవారు సంసిద్ధులయ్యామని నమ్మితే అమరత్వానికి సమయం వచ్చినట్టే’ అన్నారు సావర్కర్‌. 

కానీ అప్పటికే థింగ్రా నేషనల్‌ ఇండియన్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. ఈ సంస్థ ఉద్దేశం భారతీయ యువకులు స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులు కాకుండా చూడటమే. మిస్‌ ఎమ్మా జోసఫీన్‌ బెక్‌ కార్యదర్శిగా ఉండేవారు. బ్రిటిష్‌ ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పిస్తూ, భారతీయ విద్యార్థులను విందులకు, వినోదాలకు ఆహ్వానిస్తూ ఆమె కార్యక్రమాలు నిర్వహించేవారు. జూలై 1, 1909.లండన్‌లోనే ఇంపీరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేషనల్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఒక సమావేÔ¶ ం (ఎట్‌ హోం) ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథి చాలా ప్రముఖుడు. ఇండియన్‌ ఆఫీస్‌లో ఉన్నతోద్యోగి కర్జన్‌ వైలీ. పాస్‌ చూపించి థింగ్రా కూడా లోపలికి వెళ్లాడు. వైలీ ఉపన్యాసం పూర్తయింది. అతడు లేచి వెళ్లిపోతున్నాడు. అప్పుడే థింగ్రా కూడా వెళ్లాడు. అతడు గ్లాస్‌ డోర్‌ తెరవబోతున్నాడు. ‘ముఖ్యమైన విషయం మాట్లాడాలి’ అన్నాడు థింగ్రా. ఏమిటన్నట్టు చెవి ఒగ్గాడు వైలీ. వెంట తెచ్చిన రివాల్వర్‌ బయటకు తీసి ఆరేడు సార్లు కాల్చాడు. 
థింగ్రా పారిపోలేదు. వెంటనే అరెస్టయ్యాడు. 

నిజానికి ఇండియా హౌస్‌ను వీడిన తరువాత థింగ్రా చేసిన పని– టోటెన్‌హ్యామ్‌ కోర్ట్‌  రోడ్డులో ఒకచోట తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. మొదట అతడి లక్ష్యం వైలీ కాదు. లార్డ్‌ కర్జన్‌. బెంగాల్‌ విభజన పేరుతో దేశంలో కర్జన్‌ చేసిన కల్లోలం తక్కువేమీ కాదు. అంతేకాదు, భారతీయులంటే ఇతడికి ఉన్న చిన్నచూపు కూడా తక్కువేమీ కాదు. అలాగే బెంగాల్‌ మాజీ గవర్నర్‌ భ్రామ్‌ఫీల్డ్‌ ఫుల్లర్‌ని కూడా చంపాలని అనుకున్నాడు. ఆఖరికి కర్జన్‌ వైలీ దొరికాడు. వైలీతో పాటు అతడికి రక్షణగా వెళ్లిన పార్సీ వైద్యుడు డాక్టర్‌ లాల్‌కాకా కూడా ఆ కాల్పులలో చనిపోయాడు. థింగ్రా వెంట అతని మిత్రుడు కొరెగాంకార్‌ కూడా ఉన్నాడు. వైలీ వెళ్లిపోతున్న సంగతి థింగ్రాకు ఆయనే చెప్పాడు. నాలుగురోజుల తరువాత వైలీ సంతాప సభ జరిగింది. ఇందులో భజన్‌లాల్‌ అనే గ్రేస్‌ ఇన్‌ కళాశాల న్యాయశాస్త్ర విద్యార్థి మదన్‌లాల్‌ థింగ్రా చర్యను ఖండిస్తున్నట్టు ప్రకటించాడు. అతడు స్వయంగా థింగ్రా సోదరుడే. తరువాత బ్రిక్స్‌టన్‌ జైలులో ఉండగా కలుసుకోవడానికి వెళ్లాడు. కానీ థింగ్రా అతడిని కలుసుకోవడానికి నిరాకరించాడు. మరొక సంతాప సభను భారతీయులు నిర్వహించారు. దీనికి ఆగాఖాన్‌ అధ్యక్షుడు. ఈ సభ కూడా వైలీ హత్యను ఖండించింది. తీర్మానం ఏకగ్రీవమని ఆగాఖాన్‌ ప్రకటిస్తే, ఒక గొంతు తన అసమ్మతిని ప్రకటించింది. ఆ గొంతు సావర్కర్‌ది. ఆయనను వెంటనే అధ్యక్షుడి ఆదేశం మేరకు సభ నుంచి బహిష్కరించారు. 

థింగ్రా మత్తుమందులకు బానిస అంటూ ఇంగ్లండ్‌ పత్రికలు ప్రచారం చేశాయి. భారతదేశంలో దొరికే భంగు అనే మందును అతడు తీసుకుంటాడని అవి రాశాయి. కానీ కోర్టులో ఇది రుజువు కాలేదు. నేషనల్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎమ్మా, థింగ్రా నివాసం ఇంటి యజమానురాలు కూడా ఈ ఆరోపణను తిరస్కరించారు. కాగా థింగ్రా సాహసాన్ని మెచ్చుకుంటూ రివ్యూ ఆఫ్‌ రివ్యూస్‌ అనే పత్రిక వ్యాసం ప్రచురించింది. ఇది ఐర్లండ్‌ విప్లవోద్యమాన్ని సమర్థించేది. దీనితో ఆ పత్రిక సంపాదకుడిని జైలుకు పంపారు. తన ప్రజల గళాలను అణచివేసే వారిని తుదముట్టించడం కోసం ఈ హత్య తనే చేశానని థింగ్రా ముందే అంగీకరించాడు. ఈ సందర్భంగా స్వేచ్ఛాస్వాతంత్య్రాల మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసాధారణంగా ఉన్నాయి. విచారణ అయిందనిపించి థింగ్రాను పెంటన్‌విల్లె జైలులో (లండన్‌) ఉరి తీశారు. విచారణ ఆరంభంలోనే థింగ్రా తన వైఖరి ఏమిటో చెప్పేశాడు.  ‘‘నేను మీ దయాదాక్షిణ్యాల కోసం అర్థించను. అసలు మీ న్యాయ వ్యవస్థనే నేను విశ్వసించడం లేదు.’’
∙డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement