Indian independence Movement
-
ఉద్యమ వారసత్వమే ఊపిరి
ప్రపంచ చరిత్రలో భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. వలస పాలనలో కుంగి, కృశించిన సామాన్య ప్రజానీకం ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించిన తీరు దానికి ఓ ముఖ్యమైన పార్శ్వం. అలనాటి జాతీయోద్యమ ప్రధాన వారసత్వం – దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ వారసత్వంలో చెప్పుకోదగిన మరో అంశం – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవన్నీ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. దీన్ని సరిదిద్దాలి. ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం నేటి అవసరం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యం కావాలి. ► ఒక దేశ చరిత్రలో 75 ఏళ్ళు గణింపదగ్గ కాలమే! ఇదొక ఉద్విగ్నభరిత సన్నివేశం. మన స్థితిగతులు, దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, వాటిని పక్కనబెట్టి, సంబరాలు చేసుకోవలసిన సమయం. అదేక్రమంలో మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వెనుక ఒక సుదీర్ఘ పోరాటం దాని ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే భారతీయ జాతీయోద్యమం, దాన్ని నిర్వహించిన నాయకత్వం, వారు అనుసరించిన ఎత్తుగడలు, నిర్వహించిన కార్యక్రమాలు అపూర్వమైనవి. అవి అందరి ప్రశంసలూ అందుకొన్నాయి. నాయకత్వం రూపొందించిన కార్యక్రమాలు, నిర్వహించిన ఉద్యమాలు, అనుసరించిన ఎత్తుగడలు ఒక పార్శ్వం. ► కాగా, మరొకవైపు వలస పాలనలో కుంగి, కృశించి, దినదిన గండంగా కాలం వెళ్ళదీస్తున్న సామాన్య ప్రజానీకం – అక్షరం ముక్క తెలియని గ్రామీణ ప్రజలు – ఉద్యమ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపుకూ స్పందించిన తీరు మరో ముఖ్య పార్శ్వం. బెంగాల్ విభజన, సహాయ నిరాకరణోద్యమం, బార్డోలీ రైతు సత్యాగ్రహం, క్విట్ ఇండియా – ఇలా అన్ని దశల్లోనూ, అన్ని పోరాటాల్లోనూ పురుషులతో పాటు స్త్రీలూ పాల్గొని ఉద్యమాలను నడిపించారు. పోరాటాలు, త్యాగాలు ఎందుకోసం? ఉజ్వల భవిష్యత్తు కోసం! స్వతంత్ర జాతిగా ఆత్మ గౌరవంతో బతకడం కోసం! రానున్న భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయడం కోసం! ► జాతీయోద్యమ వారసత్వం ఏమిటి? ఆ వారసత్వానికి నేడు ప్రాసంగికత (రిలవెన్స్) ఉందా? ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ముఖ్యంగా, ప్రధానంగా చెప్పుకోవాల్సింది 1857 తిరుగుబాటు. చరిత్రకారులు వర్ణించినట్లు... ఇది ‘ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్’. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం. జాతీయతాభావం ఎక్కడో మసక మసకగా అంతర్లీనంగా ఉన్నా, ఇది ప్రధానంగా ఆంగ్లపాలనకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు. హిందూ, ముస్లిం మత విభేదాలు లేకుండా, కలసికట్టుగా, అనేక సందర్భాల్లో సామాన్య ప్రజానీకంతో కలిసి జరిపిన సైనిక తిరుగుబాటు. ఇది ఫలవంతం కాకున్నా మనకు మిగిల్చిన వారసత్వం – ఆంగ్ల పాలనకు వ్యతిరేకత, స్వతంత్రత, వీటిని మించి హిందూ–ముస్లిం ఐక్యత! జాతీయోద్యమంలో ఈ ధార దాదాపు 1940వ దశకం దాకా కొనసాగింది. ► రవీంద్రుని ‘జనగణమన’ గీతం, బంకించంద్రుని ‘వందేమాతరం’, ఇక్బాల్ గేయం ‘సారే జహాసే అచ్ఛా’ – ఇవి దేశ నైసర్గిక, ప్రజా సముదాయాలను ఉద్దేశించి రాసినవే! ఈ సమైక్యతను దెబ్బతీయడానికి విదేశీ పాలకులు ‘ద్విజాతి’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రోది చేశారు. జాతీయోద్యమ ప్రధాన వారసత్వం – దేశ సమైక్యత, మతసహనం, భిన్న సంస్కృతుల మధ్య సయోధ్య. జాతీయోద్యమ క్రమంలో పౌరహక్కులను, ప్రజాస్వామిక భావాలను, పార్లమెంటరీ వ్యవస్థను నిర్ద్వంద్వంగా బలపరిచి, పదిలపరచి, భారత రాజ్యాంగంలో పొందుపరచగలిగిందీ జాతీయోద్యమ వారసత్వమే! ► జాతీయోద్యమం కేవలం రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిపర ప్రాథమిక హక్కుల కోసమే పాటుపడలేదు. ఆర్థికాభివృద్ధి వైపు దృష్టి సారించింది. ఆంగ్లపాలన... ఒకవైపు తాను పారిశ్రామికంగా బలపడుతూ, మరో పార్శ్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తమ దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించుకుంది. ఈ అంశాన్ని ‘సంపద తరలింపు’గా సిద్ధాంతీకరించాడు దాదాభాయ్ నౌరోజీ. జాతీయ నాయకత్వం దీన్ని గ్రహించి, అది భారతీయ ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న కీడును ప్రజలకు ఎరుకపరిచింది. వాస్తవంలో వలసపాలన ఆర్థికదోపిడీని బట్టబయలు చేసింది తొలితరం జాతీయోద్యమ నాయకులే! ఆధునిక యంత్ర పరిశ్రమల ప్రాధాన్యాన్ని గుర్తించి, అవి రాజ్య(స్టేట్) పరిధిలో ఉండి ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలని ఉద్ఘాటించారు. ► జాతీయోద్యమం ప్రారంభదశ నుండి పౌరహక్కుల సంరక్షణ కోసం పోరాడుతూ వచ్చింది. లోకమాన్య తిలక్ నిర్వహించిన ఆంగ్ల వ్యతిరేక సమీకరణలు (మహారాష్ట్రలో), ఆ తర్వాత జరిగిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రోదిచేశాయి. పౌరహక్కుల పరిరక్షణకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు జాతీయోద్యమంలో ప్రధాన భాగాలు. గాంధీజీ మాటల్లో, ‘‘సివిల్ లిబర్టీ... ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ స్వరాజ్. ఇటీజ్ వాటర్ ఆఫ్ లైఫ్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ వాటర్ బీయింగ్ డైల్యూటెడ్.’’ ► జాతీయోద్యమమనేది ప్రారంభంలో సమాజంలోని శిష్టులకే (ఎలైట్స్కే) పరిమితమైనా, ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమానికి (1920–21) పూర్వమే విస్తృత ప్రజాపోరాటంగా రూపుదిద్దుకుంది. సహాయ నిరాకరణ, గ్రామ పునర్నిర్మాణం, మద్యపాన నిషేధం, కుటీర పరిశ్రమల పెంపుదల – ఇవన్నీ మహాత్ముడు ఆరంభించిన ప్రజా కార్యక్రమాలు. ఇవి సామాన్య ప్రజానీకాన్ని – స్త్రీ, పురుషులను ఉద్యమ భాగస్వాములుగా చేశాయి. ఈ ధోరణి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం (1942)తో పరాకాష్ఠకు చేరుకొంది. ఉద్యమాలు నాయకులు ప్రారంభించినా, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ, ఊపిరులూదిందీ సామాన్య ప్రజానీకమే! జాతీయోద్యమ వారసత్వంలో గ్రహించాల్సిన ప్రధాన అంశం ఇదే! దీనికి ప్రబల ఉదాహరణ – సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ‘బార్డోలీ రైతు సత్యాగ్రహం’. పటేల్ పిలుపునందుకొని లక్షలాది స్త్రీ, పురుషులు, రైతులు ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ప్రజలే ఉద్యమానికి ఊపిరులు! ► జాతీయోద్యమ వారసత్వంలో ప్రధానంగా చెప్పుకోదగింది – రాజకీయ స్వాతంత్య్రంతో పాటు పౌరహక్కులు. ఇటీవలి కాలంలో ఇవి ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ప్రజాఉద్యమాలు, వార్తాసాధనాలు వీటిని కాపాడుకొంటూ వస్తున్నాయి. జాతీయోద్యమ స్వప్నం భావితరాలకు అందించిన సందేశం, చూపిన దారి ఏమిటి? ఉద్యమ ఆశయాలు, కన్న కలలు, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపరచబడ్డాయి. ఇవి చట్టపరమైనహక్కులు. వీటికి భంగం కలగకూడదు. కానీ, ఇవి ఇటీవలి కాలంలో ప్రశ్నార్థకమవుతున్నాయి. కాగా రాజ్యాంగంలో మరో ముఖ్య అధికరణం – రాజ్యం అనుసరించదగ్గ ‘ఆదేశిక సూత్రాలు’(ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ). ప్రజా శ్రేయస్సుపరంగా ఆచరింపదగ్గవి. అయితే, ఇవి ఆశించే ఫలితాలు చేకూరతాయా? ఈ ప్రశ్నకు సమాధానం – విశాల భారతీయ సమాజం స్పందించి, చేపట్టే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. ► జాతీయోద్యమ వారసత్వం... ప్రజాశ్రేయస్సు – పేద వర్గాల అభ్యున్నతి, శాస్త్రీయ విజ్ఞానసమాజ నిర్మాణం, పౌరహక్కులు, చట్టం ముందు అందరూ సమానం! వీటిని సాధించే క్రమంలో ఆర్థిక ప్రయోగాలతో పాటు లౌకిక సమాజ నిర్మాణం, స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించడం నేటి అవసరం. భారతీయ సంస్కృతిని ‘భిన్నత్వంలో ఏకత్వం’గా చెప్పుకుంటాం. ఇటీవలి కాలంలో దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల దృష్ట్యా... దేశీయతలో ఏకత్వం లోపించి, భిన్నత్వం మరింత వృద్ధి చెందుతోంది. ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఆయాప్రాంతాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉత్పన్నమై, రాజ్యస్వభావంలో మౌలిక మార్పులకు దోహదం చేస్తున్నాయి. ► ఈ పరిణామం భారత దేశీయతకు అడ్డు కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని గూర్చి పరిగణిస్తూనే, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భిన్నత్వాన్ని గుర్తించి దానికి తగిన చోటును మనం కల్పించుకోవాలి. అలా చేసినప్పుడు భారతదేశ సమైక్యత, జాతీయత మరింతగా వృద్ధి చెందుతాయి. జాతీయోద్యమ బృహత్ ప్రణాళికలో లక్ష్యాలైన పేదరిక, నిరక్షరాస్యత నిర్మూలన ఇంకా అపరిష్కృత సమస్యలుగానే ఉండిపోయాయి. నిజానికి ఇవే మన దేశీయతకు భంగం కలిగించే ముఖ్యాంశాలు. వీటిని అధిగమించగలిగితే మనం భారతీయతను సాధించగలం. స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ఇదే మన లక్ష్యంగా ఉండాలి. డా‘‘ వకుళాభరణం రామకృష్ణ వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ఆచార్యులు -
జైహింద్ స్పెషల్: చంద్రయ్య, జగ్గయ్య.. రంపలో రఫ్ఫాడించారు..
‘‘భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అమరులైన వారి వివరాలతో కూడిన ఒక నిఘంటువు తయారు కావాలి. దేశ చరిత్రలో ఒక ముఖ్య భాగమైన వారిని గురించి లేదా చరిత్రను సృష్టించిన వారిని స్మరించుకోని, గౌరవించుకోని దేశానికి భద్రమైన భవిష్యత్తు ఉండదు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల ఆరంభ సందర్భంలో అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ వీర ఘట్టాలను, స్వాతంత్య్ర సమరయోధుల అసమాన ధైర్య సాహసాలను స్మరించుకోవాలి, అలాంటి విలువలను పెంపొందించుకోవాలి. మన స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో భాగస్వాములైన ఆదివాసీ నాయకుల అసమాన ధైర్య సాహసాలను సైతం స్మరించుకొంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపాలి. అడవి బిడ్డలపై బ్రిటిష్ దౌర్జన్యం తూర్పు గోదావరి, ఖమ్మం, విశాఖ జిల్లాలలో మన్యం అటవీ ప్రాంతం విస్తరించి వుంది. అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను ముఠాదార్లు, భూస్వాములూ, జమీందార్లూ, బ్రిటిష్ ప్రభుత్వం దౌర్జన్యంగా, పోడు వ్యవసాయం చేయరాదని, అటవీ వస్తువులను సేకరించరాదనీ, అడవి జంతువులను వేటాడరాదనీ, కాయలూ, పండ్లూ, కట్టెలూ ఏరుకోరాదనీ అటవీ చట్టం అమలు చేసింది ఎవరైనా వీటిని అతిక్రమిస్తే శిక్షార్హులని హెచ్చరించింది. అడవిని ఆధారంగా చేసుకుని బ్రతికే అడవి బిడ్డలు అమాయకులు. ఎక్కడికి పోగలరు? ఎలా బ్రతకగలరు? వీరిని దౌర్జన్యంగా అణగతొక్కుతూ పంటలను దోచుకుంటూ ఉండేవారు. దానితో అన్ని విధాలా విసిగిపోయి.. నాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1879 లో ద్వారబంధాల చంద్రయ్య లేదా చంద్రారెడ్డి నాయకత్వం లో ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును బ్రిటిష్ అధికారులు ‘రంపా పితూరీ‘ ఉద్యమం అని పిలిచారు. అడుగో... చంద్రయ్య! ద్వారబంధాల లక్ష్మయ్య, లక్ష్మమ్మల కుమారుడే ద్వారబంధాల చంద్రారెడ్డి లేక ద్వారబంధాల చంద్రయ్య, తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం, నెల్లిపూడిలో తన మేనమామల ఇంట పెరిగాడు. ఆరు అడుగుల ఆజానుబాహువు, తేనె రంగు శరీర ఛాయ, ఉంగరాల జుత్తూ, వెనక జులపాలు కలిగి గుర్రంపై తుపాకీతో కూర్చుని వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవాడు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, రేఖపల్లి నుండి విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ ప్రాంతం వరకూ తన ఆధిపత్యంలో ఉండేది. ఈయనకు సహచరులుగా పులిచింత సాంబయ్య, బాదులూరి అంబుల్రెడ్డి, ఎలుగూరి జగ్గయ్య, జంపా పండయ్య, కోడుం నరసయ్యలు ఉండేవారు. వారి సహాయంతో చంద్రయ్య పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. నాటి బ్రిటిష్ అధికారులలో గిరిజన ఆడపిల్లల పై అత్యాచారం చేసిన వారి తలలు తెగనరికేవాడు. బ్రిటిష్ వారికి దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతూ అడవి లో దాక్కునేవాడు. 1879 ఏప్రిల్ లో అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసి అక్కడి నుండి అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే అదే సంవత్సరం నవంబర్ లో ఇతని అనుచరులను 79మందిని అత్యంత నేర్పుతో వలపన్ని పట్టుకుని ‘విల్లాక్‘ అనే పోలీసు అధికారి ఉరి తీయించాడు. అప్పటికే లాగరాయి కేంద్రంగా దుచ్ఛేర్తి దగ్గర ద్వారబంధాల చంద్రయ్య తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ గొడవలన్నీ చూశాక సైన్యాన్ని రప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. సెంట్రల్ ప్రావిన్స్ నుండి ‘కల్నల్ లోబ్’ నాయకత్వం లో పోలీసు బలగాలు వచ్చాయి. పిఠాపురం సంస్థానం నుంచి 500 మంది గైడ్లను దింపారు. ద్వారబంధాల చంద్రయ్యను పట్టించిన వారికి 2000 రూపాయలు బహుమానం ప్రకటించారు. బ్రిటిష్ వారు తనకు నమ్మకస్థుడు, అనుయాయుడుగానున్న జంపా పండయ్యను ఉసిగొల్పితే, 1880 ఫిబ్రవరి 12న గుర్తేడు లో అతడు చంద్రయ్యను పట్టించాడు. ద్వారబంధాల చంద్రయ్యను కాల్చి చంపారు. అయినా రంపా పితూరీ (ఉద్యమం) ఆగలేదు. ఆ ఉద్యమాన్ని ఎలుగూరి జగ్గయ్య కొనసాగించాడు. అడుగడుగో.. జగ్గయ్య! ఎలుగూరి జగ్గయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వెడ్ల గెడ్డ వాసి. 1879 లో ద్వారబంధాల చంద్రయ్యకు కుడిభుజంగా పని చేశాడు. ఇతను అడవి పక్షులను, జంతువులను వేటాడి తన పొట్ట పోసుకునేవాడు. అడవి పక్షులను చంపడం నేరమని అలా చేస్తే శిక్షార్హమవుతుందని అధికారులు హెచ్చరించారు. పైగా అతనిపై వేటకు వెళ్లకుండా నిఘా పెట్టారు బ్రిటిష్ వారు. తద్వారా తన జీవనోపాధిని కోల్పోయాడు. ద్వారబంధాల చంద్రయ్య తో కలసి పోరాటం ప్రారంభించాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను రెండు సార్లు తగలబెట్టడానికి మూలకారకుడు ఎలుగూరి జగ్గయ్యే. ఈయన్ని పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ ఎంగ్లిడో ను నియమించారు బ్రిటిష్ వారు. జడ్డంగిలో క్యాంపు ను ఏర్పాటు చేసుకుని ప్రణాళికలు రచించారు. ఎలుగూరి జగ్గయ్య ఆచూకీ చెప్పిన వారికి 2000 రూపాయల బహుమానం ప్రకటించి ‘కొటుమ్ నరసయ్య‘ అనే తన అనుచరుడికి డబ్బుపై ఆశ చూపారు, ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎలుగూరి జగ్గయ్య వెలగలపాలెం అడవిలో దాక్కున్న సంగతి నరసయ్యకు తప్ప మరెవ్వరికీ తెలియదు. డబ్బుకు ఆశపడి వెలగలపాలెం ఎలా వెళ్లాలో మార్గం కూడా చెప్పాడు కొటుమ్ నరసయ్య. కొటుమ్ నరసయ్య ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఇన్స్పెక్టర్ ఎంగ్లిడో 10 మంది శిక్షణ పొందిన కానిస్టేబుల్స్‌ను తీసుకుని వెలగలపాలెం లో తిరుగుబాటుదారులు దాక్కున్న స్థావరానికి నేరుగానే వెళ్లి చుట్టుముట్టాడు. అక్టోబర్ 31, 1880 సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ఎలుగూరి జగ్గయ్యను కాల్చగా అది సరిగ్గా బొడ్డు కింద భాగంలో తగిలింది, పారిపోవాల నుకున్నాడు. ఓ 100 గజాలు పరుగెత్తి కింద పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఓ పెద్ద కర్రకు కట్టి తమ ‘జడ్డంగి క్యాంపు‘ కు తీసుకు వస్తూండగా దారిలోనే చనిపోయాడు. ఇలా ఎందరో అడవి బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం త్యాగం చేశారు. జాతీయోద్యమంలో సైతం ఆటవికులు చురుగ్గా పాల్గొని తమ దేశభక్తి ని చాటుకున్నారు. స్వాతంత్య్రం కొరకు, మాతృదేశ దాస్య విముక్తికై పోరాడి అసువులు బాసారు. – కాశింశెట్టి సత్యనారాయణ విశ్రాంత ఆచార్యుడు -
ఉద్యమశీల కార్యకర్త.. రామ్ మనోహర్ లోహియా
లోహియా కులాంతర వివాహాలయితేనే∙ఏ పెళ్లికయినా వెళ్లేవారు. విడాకులను సమర్థించారు. ఆస్తికి ఆయన వ్యతిరేకి. దానిని ఆచరణలో చూపించారు కూడా. ఆయన హరిజన దేవాలయాలకూ వెళ్లారు. జాతికి కొత్త జవ జీవాలను తీసుకురావడానికి ఆయన తాను చేయగలిగిందంతా చేశారు. ఆయన తన యాభై ఏడేళ్ల జీవితంలో మొత్తం ఇరవై సార్లు అరెస్టు అయినట్లు ఎక్కడో చదివాను. చదవండి: ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి లోహియా ఢిల్లీ వార్తాపత్రికలకు పెద్ద పెద్ద ఆదర్శాలతో వ్యాసాలు రాయడానికే పరిమితం కాలేదు. పేదల కోసం తన పోరాటాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. బహుశా అందుకే కావచ్చు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చాకే జరిగాయి! ఆయన బాగా చదువుకున్న, బాగా పర్యటనలు చేసిన రాజకీయ నాయకుడు. డాక్టర్ లోహియా అనే పేరులోని డాక్టర్ అనే మాట ఆయన చేసిన పరిశోధనలకు లభించింది. బెర్లిన్ నుంచి ఎకనామిక్స్‌లో ఆయనకు డాక్టరేట్ లభించింది. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్లు. పరిశోధనను జర్మనీ భాషలో చేశారు. బ్రిటన్‌లో చదువుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కులం, మతం, జాతి, రాజకీయాలు, సంగీతం, కళలు, అర్థశాస్త్రం, రాజ్యాంగం, న్యాయశాస్త్రం, సాహిత్యం వంటి అంశాలను సమదృష్టితో పరిశీలించి, విమర్శించారు. ఆయన ఢిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న తన ఇంటి తలుపులను అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తన మాట్లాడవచ్చు. మా నాన్నగారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆయనకు సహచరుడు. ఆయన తరచు లోహియా ఇంటికి వెళుతుండేవారు. లోహియా హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతుండేవారు. ఇంగ్లిషు మీద ఆయన పోరాటం సాగించినప్పటికీ, ఆ భాషలో కూడా నిష్ణాతుడే. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద మనుషుల మధ్య అసమానతలు ఉంటూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ అంతరం మరీ దుర్భరంగా ఉంటోంది’’ అని ఆయన ఆవేదన చెందేవారు. ఆయన బతికి ఉంటే ఇప్పుడు కూడా జైల్లోనే ఉండేవారేమో. – నిరంజన్ రామకృష్ణ, లోహియా వెబ్సైట్ రూపకర్త -
గాందీజీ అంటే నాకు ఎంతో గౌరవం: ఎంపీ హెగ్డే
-
గాంధీజీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బనశంకరి : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే శనివారం మహాత్మాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, ఇలాంటి వ్యక్తి దేశానికి మహా పురుషుడా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ.. ఎవరు దేశం కోసం ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారో వారందరూ ఉరికి వేలాడారని, ఎవరు తమ సిద్ధాంతాలు, వాదనలతో దేశ నిర్మాణం కోసం ప్రయత్నించారో వారందరూ చీకటి గదుల్లో మగ్గిపోయారని అన్నారు. ఎవరు బ్రిటీషు వారితో ఒప్పందం కుదుర్చుకుని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని సర్టిఫికెట్ తీసుకున్నారో వారందరూ నేటి చరిత్ర పుటల్లో విరాజిల్లుతున్నారని చెప్పారు. ఇదంతా దేశం చేసుకున్న దైర్భాగ్యం అంటూ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో మూడు వర్గాలు ఉండేవని, ఒకరు విప్లవకారులు, మరొకరు ఆయుధాలు పట్టుకున్నవారు, మరో వర్గం ప్రముఖ జాతీయవాదులని తెలిపారు. బెంగుళూరు హిందుత్వ రాజధాని కావాలని, ప్రపంచాన్ని హిందుత్వంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. -
చెరగని ఈ ముద్రలు వెండితెరకెక్కవా?
మొఘల్ సామ్రాజ్యం చివరి రాణి బేగం జీనత్ మహల్, భర్త స్వాతంత్య్రోద్యమంలో జైలు కెళితే ఖుదాఫీజ్ చెప్పిన జులైకా బేగం, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి, ముత్తులక్ష్మీ రెడ్డి, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి వంటి భారతీయ ధీరమహిళల జీవితచరిత్రలను భారతీయ చిత్రపరిశ్రమ వెండితెరపై ఇంతవరకు ఎందుకు చిత్రించలేకపోయింది? భారతీయ పురాణాల చిత్రణపై మనకు పట్టు ఉంది కానీ చరిత్ర చిత్రీకరణలో తడబడుతుంటాం. వీరోచిత కార్యాలకు పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకమే. బ్రిటిష్ నాటకరంగంలో, సినిమాల్లో విశిష్ట నటి జూడి డెంచ్ వంటివారు భారతీయ చిత్ర రంగంమీదికి ఇంకా రాలేదు. ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, పసలేని వీరోచిత కృత్యాలను తోసిపడేస్తారని ఆశిద్దాం. బేగం జీనత్ మహల్ అత్యద్భుతమైన జీవితం ఇంతవరకు వెండితెరపై ఎందుకు కనిపించలేదు? చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అవశేష రాజ్యాన్ని పాలించిన చివరి భారతీయ రాణి ఈమె. ఆత్మగౌరవం, ఒంటరితనంతో, దర్పం, భయాందోళనల మిశ్రమ స్థితిలో ఎర్రకోటలోని పరిమిత పరిస్థితుల్లో జీవితం కోసం తపనపడిన ధీర వనిత ఈమె. దృఢచిత్తం ఉన్నప్పటికీ అదృష్టానికి నోచుకోని బేగం జీనత్ తన ఏకైక పుత్రుడు మీర్జా జావన్ బక్త్ని సింహాసనంపై కూర్చుండబెట్టడానికి తన రాణి హోదాను, దర్బారును ఎంతగానో ఉపయోగించి కూడా విఫలమైంది. షా జాఫర్ మునుపటి భార్యలకు పుట్టిన ఇద్దరు కుమారులకంటే తన కుమారుడికి ఆమె ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. తన కుమారుడిని గద్దెనెక్కించడానికి ఆమె విఫల ప్రయత్నాలు చేసింది. అతడికి భవిష్యత్ సింహాసనం కట్టబెట్టడం కోసం 1857లో చెలరేగిన సిపాయి తిరుగుబాట్లకు దూరంగా ఉంచింది. తన భర్తను దురదృష్టం కోరల నుంచి బయటపడేయటానికి చేయగలిగినంతా చేసింది కానీ నిష్ఫలమే అయింది. సింహాసనం కోల్పోయి ప్రవాస శిక్షకు గురైన భర్త షా జాఫర్‌తోపాటు ఆమె రంగూన్‌కి పయనమైంది. ఎర్రకోట నుంచి బేగం జీనత్ మహల్ నిష్క్రమిం చడం బాధాకరమైన ఘటన. రంగూన్‌లోనే చనిపోయిన తన భర్త సమాధి పక్కనే నాలుగేళ్ల తర్వాత ఆమెని కూడా సమాధి చేశారు. మన కాలంలో బేగం జీనత్ మహల్‌కు సరిసమానమైన వ్యక్తిత్వం కలిగిన మరొక ధీరవనిత జులైకా బేగం గురించి కూడా భారతీయ సినిమా చిత్రించకపోవడం శోచనీయం. ఈమె మౌలానా ఆజాద్ అని మనందరికీ తెలిసిన అబుల్ కలామ్ గులాం మొహియుద్దీన్ భార్య. విద్యాధికుడైన తిరుగుబాటుదారు, లౌకికవాద పునీతుడు అయిన మౌలానా ఆజాద్ పుస్తకాలూ పోరాటాలే ప్రపంచంగా జీవించిన వారు. 13 ఏళ్ల ప్రాయంలో ఆయన్ని పెళ్లాడిన జులైకా బేగం తన భర్త స్వాతంత్య్ర పోరాటంలో మునిగి తేలుతున్న సమయంలో కలకత్తాలో గడిపారు. ముస్లిం లీగ్ తన లక్ష్యం పాకిస్తాన్ ఏర్పాటేనని ప్రకటించిన తర్వాత అవిభక్త హిందూస్తాన్ కోసం మౌలానా పోరాడుతూ వచ్చారు. 1942లో గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైన పోరాటంలోకి దిగినప్పుడు కలకత్తాలో తన గృహంలో ఉండిన ఆజాద్.. బొంబాయిలో క్విట్ ఇండియా కోసం పిలుపుని చ్చిన వెంటనే ఇంటిని వదిలి వెళ్లారు. ‘మరి కుటుంబం గురించి ఆలోచించు’ అని ఆమె అడిగి ఉంటారా? మనకు తెలిసినంతవరకు జులైకా బేగం వెళ్లిపోతున్న మౌలానాను అనుసరించి ఇంటి గేటు దాటి అక్కడే నిలబడి నిశ్శ బ్దంగా చూస్తూ, కారెక్కుతున్న భర్తకు ఖుదాఫీజ్ చెప్పారు. క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించగానే తనను కూడా అరెస్టు చేస్తారన్న విషయం ఆజాద్‌కు బహుశా తెలిసి ఉంటుంది. అలాగే నెహ్రూ, పటేల్, కృపలానీ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు ఆజాద్ కూడా మూడేళ్లపాటు అహ్మద్ నగర్ పోర్ట్ జైలులో గడిపారు. ప్రచురితమవుతాయా లేదా అని కూడా తెలీని పరిస్థితుల్లో తన జైలు గదిలోని రెండు ఊరపిచ్చుకల ప్రేమ జీవితాన్ని చూస్తూ, పరిశీలిస్తూ ఆయన ఉత్తరాల్లో రాస్తూ వచ్చారు. సుదీర్ఘ కారాగార ఏకాంత జీవితంలో ఇద్దరు దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత బలోపేతమవుతుంది. తన భర్త ఖైదీగా ఉండగానే జులైకా కలకత్తాలో మరణిం చారు. అక్కడే ఆమెను సమాధి చేశారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి బ్రిటన్‌లో చదువుకుని సంగీత సాహిత్యాల్లో ప్రావీణ్యత పొందిన సరోజినీ నాయుడిపైనా మనదేశంలో ఎలాంటి సినిమా తీయలేదు. తన ప్రవృత్తికి భిన్నమైన హైదరాబాద్ నివాసి, శస్త్రవైద్యుడు గోవిందరాజులు నాయుడిని పెళ్లాడి అయిదుగురు బిడ్డలకు తల్లి అయిన సరోజిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. అమెరికన్ రచయిత కేథరీన్ మేయో రాసిన ‘మదర్ ఇండియా’ దేశంపై కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆమె అమెరికాకు కూడా వెళ్లారు. దండి సత్యాగ్రహ సమయంలో పోలీసు చర్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రాజ్యాంగ సభలో సేవలందించారు. యునైటెడ్ ప్రావిన్స్ ప్రథమ గవర్నర్ అయ్యారు. తర్వాత అచిరకాలంలోనే స్వల్ప అస్వస్థతకు గురై మరణించారు. అంతిమ క్షణాల్లోనూ ఆమె తనకు సేవలందిస్తున్న నర్సును పాటపాడి వినిపించమన్నారు. అలాగే 20వ శతాబ్ది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి వంటి ధీరవనితలపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. వీరిలో మొదటివారు సోషలిస్టు, రెండోవారు కమ్యూనిస్టు, మూడో వ్యక్తి వ్యష్టివాదిగా ప్రసిద్ధులు. మృదులా సారాబాయి దేశ విభజన సమయంలో అపహరించబడి, త్యజించబడిన అనేకమంది మహిళలను కాపాడారు. అలాగే తదనంతర కాలంలో ముత్తులక్ష్మీ రెడ్డిగా పేరొందిన చంద్ర నారాయణ స్వామి ముత్తులక్ష్మిపై కూడా ఇంతవరకూ ఎవరూ సినిమా తీయలేదు. పుదుక్కోటై సంస్థానంలో దేవదాసీ కమ్యూనిటీలో పుట్టిన ముత్తులక్ష్మి చదువుకోవడానికి పెద్ద పోరాటమే చేశారు. తర్వాత పురుషుల కాలేజీలో సీటు సాధించిన తొలి విద్యార్థినిగా చరిత్రకెక్కారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి మహిళా హౌస్ సర్జన్ అయ్యారు. తర్వాత బ్రిటిష్ ఇండియాలో తొలి శాసనసభ్యురాలిగా ఎన్నికై దేవదాసీ వ్యవస్థ రద్దుకు కృషిచేశారు. అలాగే దేవదాసీ తల్లికి పుట్టిన ప్రతిభావంతురాలైన కుమార్తెగా మదురైలో పెరిగిన ఎమ్ఎస్ సుబ్బులక్ష్మిపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. అనంతర కాలంలో సంగీత విద్మన్మణిగా అద్భుత ప్రావీ ణ్యత సాధించిన ఈమె స్వరాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి కానీ ఆమె జీవితం గురించిన అద్భుత సినిమా ఇంకా వెలువడలేదు. ఇలాంటి భారతీయ ధీరవనితల జీవితాలు ఇంతవరకు సినిమా రూపంలోకి ఎందుకు రాలేదు? ఎందుకంటే భారతదేశంలో పురాణాల గురించి మనకు బాగా తెలుసు కానీ చరిత్ర చిత్రణలో తడబడుతుంటాం. మానసిక సంక్షోభాలు, బుద్ధిజీవులకు చెందిన వ్యత్యాసాలను, డైలమాల చిత్రీకరణ మనకు సాధ్యం కాదు. వీరోచిత కార్యాలకు మనం పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకంగానే ఉంటోంది. మరొక కారణం ఉంది. మన కాలంలో కొంతమంది అతిగొప్ప నటీమణులను చూశాం. కానీ వ్యక్తిత్వ చిత్రణలను పండించే వారిని దొరకబుచ్చుకోవడం చాలా కష్టం. చారిత్రక హీరోయిన్ పాత్రల్లో ధరించేటటువంటి భారతీయ జూడి డెంచ్లు ఇంకా రంగంమీదికి రావడం లేదు. జూడి డెంచ్ బ్రిటన్ థియేటర్ నటి, వెండితెర నటి. ప్రస్తుతం ఆమె వయస్సు 85 ఏళ్లు. వర్జిన్ మేరీలో మేరీగా, హామ్లెట్‌లో ఒఫెలియాలా, రోమియో అండ్ జూలియట్లో జూలియట్‌లా, మాక్‌బెత్‌లో లేడీ మాక్బెత్లా, షేక్స్పియర్ ఇన్ లవ్‌లో క్వీన్ ఎలిజిబెత్‌లా, ది డచెస్ ఆఫ్ మాల్ఫిలో డచెస్లా, మిస్టర్ బ్రౌన్ టెలి ప్లేలో క్వీన్ విక్టోరియాలా, ఐరిస్‌లో ఐరిస్ మర్దోక్లా, జేమ్స్ బాండ్ సీరీస్‌లో ‘ఎమ్’ పాత్రధారిణిలా ఆమె విశిష్ట పాత్రలు పోషించారు. సమకాలీన, టెక్నో స్పై చిత్రాల్లో డెంచ్ పాత్ర ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం. జీరబోయిన ఆమె స్వరమే ఆమె సిగ్నేచర్‌గా మారిపోయింది. అయితే జ్వలించిపోయే ఆమె నేత్రాలు సకలభావాలను పలుకుతాయి. ఒక గొప్ప షాట్లో ఆమెను చంపబోతున్న హంతకుడు చేతిలో తుపాకితో ఆమెకు ఎదురు నిలబడతాడు. సరిగ్గా తుపాకి ట్రిగ్గర్ నొక్కుతుండగా డెంచ్ అతడికేసి తీక్షణంగా చూస్తుంది. మరుక్షణంలో ఆమె సురక్షితంగా ఒక డెస్క్ వెనుక పడిపోతుంది. సెకన్ల తేడాతో టెర్రరిస్టు తన తుపాకిని గురి పెట్టడం, ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అతడికేసి తీక్షణంగా చూడటం ఎంత ప్రతిభావంతంగా షాట్‌గా మల్చారంటే క్రెడిట్ మొత్తం ఆమెకు, దర్శకుడికి మాత్రమే దక్కుతుంది. మన గొప్ప నటీమణులలో జూడి డెంచ్ ఒకరై ఉండినట్లయితే, మన జీనత్ మహల్, జులైకా, సరోజినీ నాయుడు, కమలాదేవి తదితర భారతీయ ధీరవనితల పాత్రలన్నీ ఆమె పోషించి ఉండేది. కానీ మనం నిరాశచెందాల్సిన పనిలేదు. కానీ మనం కోల్పోయిన జాతి రత్నాలను మనం తిరిగి ఆవిష్కరించడానికి మరొక తరం గడిచిపోవాల్సి ఉంటుంది కాబోలు. 85 ఏళ్ల ప్రాయంలో జూడీ డెంచ్ జన్మ దినోత్సవాన్ని ఈ డిసెంబర్ 9న జరుపుకున్న తరుణంలో, ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, కళా, సంస్కృతీ సౌందర్యాన్ని చూడని మన క్షుద్ర సినీ జీవుల బుర్రలేని వీరోచిత కృత్యాలను ఈ భవిష్యత్ తారలు తోసిపడేస్తారని మనసారా ఆశిస్తూ సంబరాలు చేసుకుందాం. వ్యాసకర్త : గోపాలకృష్ణ గాంధీ, మాజీ ఐఏఎస్ అధికారి, దౌత్యవేత్త, మాజీ గవర్నర్ -
సాహసి
‘ఇంగ్లండ్‌ను పాలించే హక్కు జర్మన్లకు లేనప్పుడు, భారత్‌ను పరిపాలించడానికి ఇంగ్లండ్‌కు మాత్రం ఉన్న హక్కు ఏమిటి?’ లండన్‌లోని 65, క్రోమ్‌వెల్ అవెన్యూలోని ఇండియా హౌస్. ఆ రోజు ఆదివారం.ప్రతి ఆదివారం జరిగినట్టే ఆ రోజు కూడా భారతీయ విద్యార్థులతో, స్వాతంత్య్రోద్యమానికి అండగా ఉండే మేధావులతో సమావేశం జరుగుతోంది. ఇండియా హౌస్ మేనేజర్ వినాయక్ దామోదర్ సావర్కర్ భవిష్యత్ భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. సమావేశం జరుగుతున్న గదిని ఆనుకుని ఉన్న గదిలో కొందరు యువకులు పెద్దగా మాట్లాడుకుంటూ, ఒకరి మీద ఒకరు చతురోక్తులు విసురుకుంటూ బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. దీనితో సావర్కర్‌కు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఉపన్యాసం ఆపేసి ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నవారిలో ఒక యువకుడే మదన్‌లాల్ థింగ్రా. లండన్ యూనివర్సిటీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థి. ‘ఏం మదన్! ఎప్పుడూ ధైర్యసాహసాల గురించి మాట్లాడతావ్? ఏదో చేయాలని నిరంతరం చెబుతూ ఉంటావ్! ఇదేనా నీ ధైర్యం? ఇక్కడ జరిగే సమావేశాలకు కూడా రావడం మానేశావ్! ఇదా ధైర్యమంటే? ఏదో చేయడమంటే ఇదేనా?’ అని అరిచారు సావర్కర్. నిజానికి థింగ్రాకు (సెప్టెంబర్ 18, 1883– ఆగస్ట్ 17, 1909) తొలి రోజులలో స్వాతంత్య్రోద్యమం మీద గొప్ప ఆసక్తి లేదు. కానీ ఏదో చెప్పి ఉండాలి సావర్కర్‌కి. అందంగా ఉండేవాడు. ఎప్పుడూ చతురోక్తులతో మాట్లాడుతూ, ప్రేమ గీతాలు ఆలపిస్తూ మిత్రులతో గంటలు గంటలు గడిపేవాడు. అలాంటివాడు కూడా ఆ ఆదివారం సావర్కర్ అన్న మాటలతో మారిపోయాడు. విన్నపాలు, విజ్ఞాపన పత్రాలు బ్రిటిష్ జాతిని కదిలించవన్న సంగతిని భారత జాతీయ కాంగ్రెస్ చేత అంగీకరింప చేసే ప్రయత్నం 1905 నుంచి ఆరంభమైంది. బెంగాల్ విభజన కోసం బ్రిటిష్ జాతి ఆడిన నాటకం భారతీయుల అభిప్రాయాలను పూర్తిగా మార్చివేసింది. మితవాదంతో కాకుండా, సంఘర్షణతో, సాయుధ సమరంతో బ్రిటిష్ జాతిని ఎదుర్కొనాలన్న ఆవేశం ఒక వర్గంలో పెల్లుబుకింది. వీరు జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులను కూడా ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపించదు. నిజంగానే భారత స్వాతంత్య్ర సమరంలో అదొక దశ. కానీ ఇది చరిత్ర పుస్తకాలలో కానరాదు. ఈ దశకు చెందినవారే మదన్‌లాల్ థింగ్రా. ఆరంభంలో చెప్పుకున్న ఆ రెండు మాటలు ఆయన పలికినవే. అది కూడా కర్జన్ వైలీని హత్య చేసినందుకు విచారణ ఎదుర్కొంటున్న సమయంలో లండన్‌లోని పెంటన్‌విల్లె జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో థింగ్రా ఇచ్చిన వాగ్మూలంలో ఈ మాటలు అన్నాడు. మదన్‌లాల్ థింగ్రా అనుకోకుండా ఇంగ్లండ్‌లో భారతీయ విప్లవకారుల ప్రభావంలో పడ్డారు. థింగ్రా అమృత్‌సర్‌లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ వైద్యుడు. ఇంగ్లిష్ జాతి అంటే అభిమానించేవాడు కూడా.ఏడుగురు మగపిల్లలు ఆయనకు. థింగ్రా ఆరోవాడు. ఆయన ఇద్దరు అన్నలు కూడా వైద్యశాస్త్రమే చదివారు.థింగ్రా లాహోర్ తదితర ప్రాంతాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత జనవరి 1, 1906న ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇంజనీరింగ్ చదవడానికి లండన్‌లోని యూనివర్సిటీ కళాశాలలో చేరారు. భారతీయ విద్యార్థుల కోసం అక్కడే ‘ఇండియా హౌస్’ ఉండేది. థింగ్రా కూడా అందులోనే ఉన్నారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇండియా హౌస్ గురించి కొంచెం తెలుసుకోవాలి. దీనిని 1905లోనే శ్యామ్‌జీకృష్ణవర్మ నెలకొల్పారు. ఇందులో ఎవరైనా చేరవచ్చు. ఏ రాజకీయ సిద్ధాంతం వారికైనా కూడా హౌస్ తలుపులు తెరిచే ఉంచుతుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావర్కర్ చెప్పడం విశేషం. కానీ భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ హౌస్ నుంచి మద్దతు ఉండేది. అసలు ఉద్దేశమే అది. దీనికే 1906 జూన్‌లో వినాయక్ దామోదర్ సావర్కర్ మేనేజర్ అయ్యారు. ఆయన కూడా విద్యార్థిగానే అక్కడకు వచ్చారు. ఆయన న్యాయశాస్త్రం అభ్యసించేవారు. ఆయన వెళ్లిన తరువాత వారం వారం సమావేశాలు జరిగేవి. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ఇవ్వడం గురించి, భావి భారతం రూపురేఖల గురించి చర్చించడమే వాటి ఉద్దేశం. సావర్కర్ ఇంకా రష్యా, చైనా, ఐర్లండ్, టర్కీ, ఈజిప్టులలో ఉన్న విప్లవకారులతో సంప్రతింపులు జరుపుతూ ఉండేవారు. అభినవ్ భారత్ సంస్థను స్థాపించి భారతీయ విద్యార్థులను ఉద్యమం వైపు దృష్టి సారించేటట్టు చేసేవారు. 1907 నాటికి గ్రేట్ బ్రిటన్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 700. ఇందులో 380 మంది లండన్‌లోనే ఉండేవారు. చిత్రం ఏమిటంటే, స్వాతంత్య్రోద్యమానికి దేశ విదేశాలలోని అభిమానులను, విద్యార్థులను ఏకం చేయడానికి భారతదేశంలో లేని వెసులుబాటు ఇంగ్లండ్‌లో దొరికేది. దీనినే ఇండియా హౌస్ వినియోగించుకునేది. శ్యామ్‌జీ కృష్ణవర్మ, సావర్కర్, మేడం కామా, బారిస్టర్ సర్దార్ సింగ్ రాణా, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ (సరోజినీదేవి సోదరుడు), సర్దార్ అజిత్‌సింగ్, లాలా హరదయాళ్, రాస్బిహారీ బోస్, మహేంద్ర ప్రతాప్, చంపక్రామన్ పిళ్లై వంటివారు విదేశాల నుంచే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఇక ఇండియా హౌస్‌కు వచ్చిన ప్రముఖుల జాబితా కూడా విశిష్టమైనదే. లాల్, పాల్, బాల్, గాంధీజీ వంటివారంతా కూడా హౌస్‌ను సందర్శించారు. సావర్కర్, గాంధీల తొలి సమావేశం ఇక్కడే జరిగింది. సావర్కర్ మందలించిన తరువాత థింగ్రా ఇండియా హౌస్‌ను విడిచి పెట్టి వెళ్లిపోయాడు. తరువాత ఎప్పుడో ఒకసారి వచ్చి కలిశాడు. సావర్కర్ అప్పటికీ తన మీద కోపంతోనే ఉన్నారని థింగ్రా అనుకున్నాడు. కానీ సావర్కర్ అసలేమీ జరగనట్టే ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడే అడిగాడు థింగ్రా, ‘అమరత్వానికి సమయం వచ్చిందా?’ అని. ‘అమరుడు కావాలని అనుకునేవారు సంసిద్ధులయ్యామని నమ్మితే అమరత్వానికి సమయం వచ్చినట్టే’ అన్నారు సావర్కర్. కానీ అప్పటికే థింగ్రా నేషనల్ ఇండియన్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నాడు. ఈ సంస్థ ఉద్దేశం భారతీయ యువకులు స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులు కాకుండా చూడటమే. మిస్ ఎమ్మా జోసఫీన్ బెక్ కార్యదర్శిగా ఉండేవారు. బ్రిటిష్ ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పిస్తూ, భారతీయ విద్యార్థులను విందులకు, వినోదాలకు ఆహ్వానిస్తూ ఆమె కార్యక్రమాలు నిర్వహించేవారు. జూలై 1, 1909.లండన్‌లోనే ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఒక సమావేÔ¶ ం (ఎట్ హోం) ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథి చాలా ప్రముఖుడు. ఇండియన్ ఆఫీస్‌లో ఉన్నతోద్యోగి కర్జన్ వైలీ. పాస్ చూపించి థింగ్రా కూడా లోపలికి వెళ్లాడు. వైలీ ఉపన్యాసం పూర్తయింది. అతడు లేచి వెళ్లిపోతున్నాడు. అప్పుడే థింగ్రా కూడా వెళ్లాడు. అతడు గ్లాస్ డోర్ తెరవబోతున్నాడు. ‘ముఖ్యమైన విషయం మాట్లాడాలి’ అన్నాడు థింగ్రా. ఏమిటన్నట్టు చెవి ఒగ్గాడు వైలీ. వెంట తెచ్చిన రివాల్వర్ బయటకు తీసి ఆరేడు సార్లు కాల్చాడు. థింగ్రా పారిపోలేదు. వెంటనే అరెస్టయ్యాడు. నిజానికి ఇండియా హౌస్‌ను వీడిన తరువాత థింగ్రా చేసిన పని– టోటెన్హ్యామ్ కోర్ట్ రోడ్డులో ఒకచోట తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. మొదట అతడి లక్ష్యం వైలీ కాదు. లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన పేరుతో దేశంలో కర్జన్ చేసిన కల్లోలం తక్కువేమీ కాదు. అంతేకాదు, భారతీయులంటే ఇతడికి ఉన్న చిన్నచూపు కూడా తక్కువేమీ కాదు. అలాగే బెంగాల్ మాజీ గవర్నర్ భ్రామ్ఫీల్డ్ ఫుల్లర్ని కూడా చంపాలని అనుకున్నాడు. ఆఖరికి కర్జన్ వైలీ దొరికాడు. వైలీతో పాటు అతడికి రక్షణగా వెళ్లిన పార్సీ వైద్యుడు డాక్టర్ లాల్కాకా కూడా ఆ కాల్పులలో చనిపోయాడు. థింగ్రా వెంట అతని మిత్రుడు కొరెగాంకార్ కూడా ఉన్నాడు. వైలీ వెళ్లిపోతున్న సంగతి థింగ్రాకు ఆయనే చెప్పాడు. నాలుగురోజుల తరువాత వైలీ సంతాప సభ జరిగింది. ఇందులో భజన్‌లాల్ అనే గ్రేస్ ఇన్ కళాశాల న్యాయశాస్త్ర విద్యార్థి మదన్‌లాల్ థింగ్రా చర్యను ఖండిస్తున్నట్టు ప్రకటించాడు. అతడు స్వయంగా థింగ్రా సోదరుడే. తరువాత బ్రిక్స్టన్ జైలులో ఉండగా కలుసుకోవడానికి వెళ్లాడు. కానీ థింగ్రా అతడిని కలుసుకోవడానికి నిరాకరించాడు. మరొక సంతాప సభను భారతీయులు నిర్వహించారు. దీనికి ఆగాఖాన్ అధ్యక్షుడు. ఈ సభ కూడా వైలీ హత్యను ఖండించింది. తీర్మానం ఏకగ్రీవమని ఆగాఖాన్ ప్రకటిస్తే, ఒక గొంతు తన అసమ్మతిని ప్రకటించింది. ఆ గొంతు సావర్కర్‌ది. ఆయనను వెంటనే అధ్యక్షుడి ఆదేశం మేరకు సభ నుంచి బహిష్కరించారు. థింగ్రా మత్తుమందులకు బానిస అంటూ ఇంగ్లండ్ పత్రికలు ప్రచారం చేశాయి. భారతదేశంలో దొరికే భంగు అనే మందును అతడు తీసుకుంటాడని అవి రాశాయి. కానీ కోర్టులో ఇది రుజువు కాలేదు. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ కార్యదర్శి ఎమ్మా, థింగ్రా నివాసం ఇంటి యజమానురాలు కూడా ఈ ఆరోపణను తిరస్కరించారు. కాగా థింగ్రా సాహసాన్ని మెచ్చుకుంటూ రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పత్రిక వ్యాసం ప్రచురించింది. ఇది ఐర్లండ్ విప్లవోద్యమాన్ని సమర్థించేది. దీనితో ఆ పత్రిక సంపాదకుడిని జైలుకు పంపారు. తన ప్రజల గళాలను అణచివేసే వారిని తుదముట్టించడం కోసం ఈ హత్య తనే చేశానని థింగ్రా ముందే అంగీకరించాడు. ఈ సందర్భంగా స్వేచ్ఛాస్వాతంత్య్రాల మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసాధారణంగా ఉన్నాయి. విచారణ అయిందనిపించి థింగ్రాను పెంటన్‌విల్లె జైలులో (లండన్) ఉరి తీశారు. విచారణ ఆరంభంలోనే థింగ్రా తన వైఖరి ఏమిటో చెప్పేశాడు. ‘‘నేను మీ దయాదాక్షిణ్యాల కోసం అర్థించను. అసలు మీ న్యాయ వ్యవస్థనే నేను విశ్వసించడం లేదు.’’ ∙డా. గోపరాజు నారాయణరావు -
మనలో మననంలో
ఔను! గాంధీ ఉన్నాడు.చరిత్ర పుటల్లో ఎక్కడో చిక్కుకుపోయి లేడు.మనలో ఉన్నాడు, మననంలో ఉన్నాడు.ప్రతి విప్లవాత్మక ఆలోచనలోనూ మహాత్ముడు ఉన్నాడు.ప్రపంచంలో భారతావనికి ఉన్న కీర్తి ప్రతిష్ఠల్లో ఇప్పటికీ ఉన్నాడు.హింసను అహింసతో ఎదుర్కొన్న శౌర్యంలో ఉన్నాడు.మరి ఈ మహాత్ముడు రేపటి తరంలోనూ ఉండాలి.తరతరానికీ ఇంకా ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. కత్తితో ఛేదించనిది కరుణతో సాధించాలి అనే అహింసా సూత్రాన్ని ఆచరణాత్మకంగా పాటించిన తొలి జాతీయ నాయకుడు ఆయన. అసలు పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అయినా, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అహింసామార్గంలో పోరాటం సాగించి, మహాత్మాగాంధీగా ప్రసిద్ధుడయ్యాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిని కూడగట్టి, ఏకతాటిపై నడిపించి, దేశ స్వాతంత్య్ర సముపార్జనలో కీలక పాత్ర పోషించి జాతిపితగా చరిత్రకెక్కాడు. గాంధీ మార్గం తర్వాతి కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. అమెరికాలో నల్లజాతి వారి హక్కుల కోసం పౌరహక్కుల ఉద్యమాన్ని సాగించిన మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించిన నెల్సన్ మండేలా వంటి వారు గాంధీ స్ఫూర్తితోనే తమ ఉద్యమాలు సాగించారు. సమాజంలో హింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో అహింసను బోధించిన మహాత్ముని ఒకసారి మననం చేసుకోవడం అవసరం. రేపటి తరాలకు వెలుగు బాటలు చూపగల మహాత్ముని మాటలు మీ కోసం... ►నా జీవితమే నా సందేశం. ►పొరపాట్లు లేని స్వేచ్ఛే లేకుంటే ఆ స్వేచ్ఛకు అర్థమే లేదు. ►ప్రపంచంలో ఏ మార్పును చూడాలనుకుంటున్నారో మీరే ఆ మార్పుగా మారండి. ►సత్యం ఒక్కటే, దాని మార్గాలే అనేకం. ►అందరూ కంటికి కన్ను అనే సూత్రం పాటిస్తే, ప్రపంచమే గుడ్డిదైపోతుంది. ►సత్యాన్ని పలకాల్సిన సందర్భంలో, దానికి అనుగుణంగా ముందుకు కదలాల్సిన సందర్భంలో మౌనం పాటించడం పిరికితనమే అవుతుంది. ►మనంతట మనమే ఇవ్వకుంటే ఎవరూ మన ఆత్మగౌరవాన్ని తీసుకుపోలేరు. ►సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్నే వణికించగలరు. ►నా బుద్ధి మేరకు ఒక గొర్రె ప్రాణం ఒక మనిషి ప్రాణం కంటే తక్కువ విలువైనదేమీ కాదు. ► ఏ పని చేసినా ఆ పనిని ప్రేమతో చేయండి. లేకుంటే, ఆ పనిని చేయనే చేయవద్దు. ► వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలను విరిచేయవచ్చు, చివరకు వాళ్లు నన్ను చంపేయవచ్చు. వాళ్లు నా శవాన్ని పొందవచ్చు తప్ప నా లొంగుబాటును కాదు. ► నా అనుమతి లేకుండా ఇతరులెవ్వరూ నన్ను గాయపరచలేరు. ►‘శాంతిమార్గం’ అంటూ ఏదీ ఉండదు. ‘శాంతి’ మాత్రమే ఏకైక మార్గం. ►మన చర్యల పర్యవసానాల నుంచి పారిపోవాలనుకోవడం పొరపాటు మాత్రమే కాదు, అనైతికం కూడా. ►అహింస దృఢమనస్కుల ఆయు«ధం. ►మీ ప్రత్యర్థి ఎప్పుడు మీకు తారసపడినా, అతడిని ప్రేమతోనే జయించండి. ►నిర్భీకతే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. పిరికితనం నైతికతకు అవరోధం. ►న్యాయమైన ప్రయోజనాన్ని సత్యం ఏనాడూ దెబ్బతీయదు. ►బలహీనులు ఇతరులను క్షమించలేరు. క్షమాగుణం బలవంతులకు మాత్రమే సాధ్యమైన సుగుణం. ►మీరు భయాన్ని నిరాకరిస్తే, ప్రపంచంలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ ఉండదు. ►నిజాయితీతో కూడిన అభిప్రాయభేదాలు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సంకేతాలు. ►ప్రేమ ఎక్కడ ఉంటుందో, జీవం అక్కడే ఉంటుంది. ►కొండంత ప్రబోధం కంటే ఇసుమంత ఓరిమి చాలా విలువైనది. ►బలం అనేది శారీరక సామర్థ్యం నుంచి వచ్చేది కాదు, చెక్కుచెదరని సంకల్పం నుంచి వచ్చేది. ►నాకే గనుక హాస్యస్ఫూర్తి లేకుంటే, ఏనాడో నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ►పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి. ►మీరు ఈ రోజు చేసే చర్యలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ►పిరికివాళ్లు ప్రేమను ప్రదర్శించలేరు, అది ధైర్యవంతుల లక్షణం. ►ఈ భూమి ప్రతి మనిషి అవసరాలు తీర్చడానికి తగినంత ఇస్తుంది. కానీ, ప్రతి మనిషి లోభానికి తగినంత కాదు. ►ప్రార్థన అనేది ఉదయానికి తాళం చెవిలాంటిది, రాత్రికి గడియలాంటిది. ►ఏ రోజు ప్రేమకు గల శక్తి అధికారంపై గల ప్రేమను జయిస్తుందో ఆ రోజే ప్రపంచశాంతి సిద్ధిస్తుంది. ►మితభాషి అయిన మనిషి అనాలోచితంగా ఏదీ మాట్లాడడు. ►కర్మ మాత్రమే మనిషి నియంత్రణలో ఉంటుంది కానీ, దాని ఫలితం కాదు. ►సత్యాన్ని మించిన దైవం లేదు. ►పేదరికం అత్యంత దారుణమైన హింసారూపం. ►మూసి ఉన్న పిడికిలితో కరచాలనం చేయలేం. ►ప్రేమ ఎక్కడ ఉంటుందో, దైవం అక్కడే ఉంటుంది. ►నీ పొరుగువానిలో దేవుడిని కనుగొనలేనప్పుడు, దేవుని గురించిన నీ అన్వేషణ వ్యర్థం. ►వినయంతో చేయని సేవ స్వార్థమూ, అహంభావమే అవుతుంది. ►మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. అవి: నిన్న, రేపు. ►భయమే శత్రువు. మనం దానిని ద్వేషం అనుకుంటాం. నిజానికది భయమే! ►ప్రవర్తన అద్దంలాంటిది. అందులో మనల్ని మనం స్పష్టంగా చూసుకోగలం. ►వ్యక్తుల మధ్య దృఢంగా గల ప్రేమ పునాదులపైనే దేశాల మధ్య శాంతి ఆధారపడి ఉండాలి. ►క్రోధం, అసహనం సరైన అవగాహనకు జంట శత్రువులు. ►భగవంతునికి మతం లేదు. ►మనిషి తన ఆలోచనలకు తానే ప్రతిరూపం. మీరు మీ ఆలోచనలకు అనుగుణంగానే తయారవుతారు. ►ఎలాంటి కష్టం లేకుండా సిసలైన జీవితాన్ని గడపడం సాధ్యం కాదు. ►భౌతిక అనుబంధం కంటే ఆధ్యాత్మిక అనుబంధం గొప్పది. ఆధ్యాత్మికత లేని జీవితం ఆత్మ లేని శరీరంలాంటిది. ►మనం ఇతరులకు ఎంత సత్వరంగా న్యాయం చేయగలిగితే మనమూ అంతే సత్వరంగా న్యాయాన్ని పొందగలం. ►భగవంతుడు మనతో ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉంటాడు. మనకే ►ఆ మాటలను ఎలా వినాలో తెలియదు. ►150 దేశాల తపాలా బిళ్లలపై గాంధీ బొమ్మ మనదేశంలో తపాలా బిళ్లల మీద, కరెన్సీ నోట్ల మీద, నాణేల మీద మహాత్మాగాంధీ బొమ్మ ఉండటం విడ్డూరం కాదు గానీ, ఏకంగా 150 దేశాలు మహాత్ముని బొమ్మతో తపాలా బిళ్లలు ముద్రించడం మాత్రం నిజంగా విశేషం. మహాత్మాగాంధీకి ప్రపంచవ్యాప్తంగా గల ఆదరణకు ఇదొక నిదర్శనం. దాదాపు రెండు దశాబ్దాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్‌వారి నుంచి విముక్తి కోసం గాంధీజీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు. తమ దేశానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన గాంధీజీ బొమ్మతో బ్రిటన్ కూడా తపాలా బిళ్లలు ముద్రించడం మరింత విశేషం. బ్రిటిష్ రాచ కుటుంబీకుల బొమ్మలు తప్ప ఇతరుల బొమ్మలతో తపాలా బిళ్లలు, కరెన్సీ ముద్రించని బ్రిటన్‌లో గాంధీజీకి మాత్రమే ఈ విషయంలో మినహాయింపు లభించింది. అలహాబాద్‌కు చెందిన పప్పుదినుసుల వ్యాపారి అనిల్ రస్తోగికి స్టాంపుల సేకరణ హాబీ. ఆయన ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ బొమ్మతో ముద్రితమైన 800 స్టాంపులను సేకరించి, తపాలాశాఖ ద్వారా సత్కారాన్ని పొందారు. రస్తోగీ సేకరణలో గాంధీజీ బొమ్మతో భూటాన్ ముద్రించిన ప్లాస్టిక్ స్టాంపు, ‘లీడర్ ఆఫ్ ట్వెంటీయత్ సెంచురీ’ పేరిట మైక్రోనేసియా ముద్రించిన అరుదైన స్టాంపులు కూడా ఉండటం విశేషం. దక్షిణాఫ్రికా, మాల్టా, సమోవా వంటి కొన్ని దేశాలు గాంధీజీ బొమ్మతో నాణేలు కూడా ముద్రించాయి. ప్రపంచ దేశాల్లో గాంధీజీ గాంధీజీ పుట్టి పెరిగిన భారత్‌లోను, ఉన్నత చదువులు చదువుకున్న ఇంగ్లండ్‌లోను, న్యాయవాదిగా పనిచేసిన దక్షిణాఫ్రికాలోను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో గాంధీజీ విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... ►భారత్‌కు ఇంకా స్వాతంత్య్రం రాకముందే అమెరికాలో స్థిరపడిన జర్మన్ కళాకారుడు ఫ్రిట్జ్ ఈషెన్బర్గ్ 1942లో ‘గాంధీ, ది గ్రేట్ సోల్’ పేరిట కలపపై చెక్కిన శిల్పం అమెరికాలో ఇప్పటికీ నిలిచి ఉంది. ►ఫ్రెడ్డా బ్రిలియంట్ అనే శిల్పి రూపొందించిన గాంధీజీ శిల్పాన్ని 1968లో లండన్‌లో నెలకొల్పారు. అప్పటి బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ దానిని ఆవిష్కరించారు. ► భారత దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1984లో డెన్మార్క్‌కు బహూకరించిన గాంధీజీ విగ్రహాన్ని డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నడిబొడ్డున నెలకొల్పారు. ►న్యూయార్క్‌లోని యూనియన్ స్క్వేర్ పార్కులో 1986 అక్టోబర్ 2న గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. భారతీయ శిల్పి కాంతిలాల్ పటేల్ ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో 1993 సంవత్సరంలో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. మొదటి తరగతి బోగీలో ప్రయాణిస్తున్న గాంధీని ఇదే చోట బలవంతంగా రైలు నుంచి తోసేసిన సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా నెలకొల్పిన ఈ విగ్రహాన్ని నోబెల్ బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా క్రైస్తవ మతబోధకుడు డెస్మండ్ టుటు ఆవిష్కరించారు.ఇవి మాత్రమే కాదు, దాదాపు యాభైకి పైగా దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, స్మారక కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో మరే నాయకుని పేరిటా ఇన్ని స్మారక చిహ్నాలు లేవు. అహింసామార్గంలో ఆయన సాగించిన పోరాటానికి ప్రపంచ దేశాలు పలికిన నీరాజనాలు ఈ స్మారక చిహ్నాలు. -
జాతీయవాద ప్రవక్త
‘ఇంకో ప్రభుత్వం ఏర్పడకుండానే ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించాలని ఈ గాంధీ భజనబృందం కోరుకుంటోంది. లేదా మహాత్ముడు ప్రవచిస్తున్న పురోహిత తత్వం కలిగిన ఏకవ్యక్తి పాలన రావాలని అది ఆశిస్తోంది.’1919 తరువాత భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వం గాంధీజీ చేతికి వచ్చింది. ఆయనకు తొలినాళ్లలో పాతతరం నాయకత్వం నుంచి గొప్ప మద్దతు లభించిన దాఖలాలు కనిపించవు. పైగా తీవ్ర ప్రతిఘటన కూడా ఉండేది. గాంధీజీతో విభేదించినవారు సా«మాన్యులు కారు. వారికి చరిత్ర రచనలో తగిన స్థానం లభించకపోయినా, వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడలేము. అన్నింటికంటే గాంధీజీ కంటే ముందు ఈ దేశంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని నడిపినవారు వారే కదా! అలా గాంధీయుగం తొలినాళ్లలో ఆయన ఉద్యమ పంథాను, ఎత్తుగడలను విమర్శించిన వారిలో బిపిన్‌చంద్ర పాల్ (నవంబర్ 7,1858–మే 20,1932) ప్రసిద్ధులు. పైన ఉదహరించిన మాటలు ఒక సందర్భంలో పాల్ అన్నవే. ‘గాంధీ ఆరాధన’ను ఎద్దేవా చేసినవారిలో ఆయన ఒకరు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం (1905)లో కీలక పాత్ర వహించిన ‘లాల్, పాల్, బాల్’ త్రయంలో ఒకరు బిపిన్‌చంద్ర ‘పాల్’. ‘మహా శక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త’ అని పాల్‌ను అరవిందులు కీర్తించారు. పాల్ నమ్మిన జాతీయవాదం భారత స్వాతంత్య్రోద్యమంలో ఒక గొప్ప చారిత్రక భూమికను నిర్వహించి, అంతే గొప్ప సందర్భాన్ని సృష్టించింది. బెంగాల్ విభజనను వ్యతిరేకించే ఒక బలీయమైన శక్తిగా భారతీయ సమాజాన్ని ఆవిష్కరించడానికి జాతీయవాదమే ఆయనకు తోడ్పడింది. వీటిని విశ్వసించిన నాటి ఉద్యమం విజయం సాధించిన మాట వాస్తవం. స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి అన్ని అంశాలను ప్రజానీకానికి చేరువగా తీసుకు వెళ్లడానికి పాల్‌కు ఉపకరించిన ఆయుధం కూడా ఆ వాదమే. విదేశీ విద్య, అంటే ఆంగ్లం మనకి జ్ఞాపకశక్తిని ఇవ్వవచ్చు. కానీ, విద్య అనే వ్యవస్థ ఇవ్వవలసిన నైతిక ప్రమాణాలని అది ఇవ్వడం లేదు. సమాజం పట్ల పౌరులు చూపించవలసిన బాధ్యతని అది గుర్తు చేయడం లేదు. మనదైన సృజన అడుగంటి పోవడానికి కారణం కూడా విదేశీ విద్యే అని చాటినవారు పాల్. విదేశీ వస్తు బహిష్కరణలో ప్రధానంగా కనిపించేది మాంచెస్టర్ నుంచి వచ్చే వస్త్రాలు. వాటిని బహిష్కరిస్తే దేశంలో పేదరికం, నిరుద్యోగం తగ్గుతాయని ఊహించినవారు పాల్. అసలు సహాయ నిరాకరణ వంటి సున్నితమైన నిరసన కార్యక్రమాలతో వలస పాలకులను దిగి వచ్చేటట్టు చేయగలమని అనుకోవడమే పెద్ద భ్రమ అని పాల్ నమ్మారు. పాల్‌ను ఆధునిక భారతదేశంలో ‘విప్లవ భావాలకు పితామహుడు’ అనే అంటారు. ఈ విప్లవ ఆలోచనల పితామహుని రాజకీయ, సాంఘిక జీవితం అస్సాం టీ తోటలలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడం దగ్గర మొదలైంది. 1880 ప్రాంతంలోనే ఆయన ప్రజాజీవితం అడుగులు వేయడం నేర్చుకుంది. భారత స్వాతంత్య్రోద్యమం తొలిదశలో కనిపించే సురేంద్రనాథ్ బెనర్జీ పాల్‌గారి రాజకీయ గురువు. మొదట పాల్ మీద కేశవచంద్ర సేన్ (బ్రహ్మ సమాజ్ నేత), శివనాథ్ శాస్త్రి, బీకే గోస్వామి వంటివారి ప్రభావం ఉండేది. పాల్ అఖండ వంగదేశంలోని పొయిల్ అనే చోట పుట్టారు (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌లో ఉంది). తండ్రి రామచంద్రపాల్, తల్లి నారాయణీదేవి. తండ్రి పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. అయితే ఆ కుటుంబం జమీందారీ కుటుంబం. పాల్‌ను కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చినప్పటికీ చదువు పూర్తి చేయలేదు. తరువాత కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా, మరి కొంతకాలం కలకత్తా పబ్లిక్ లైబ్రరీ అధికారిగా కూడా పనిచేశారు. బిపిన్‌చంద్ర పాల్ స్వాతంత్య్రోద్యమానికి చేసిన సేవ అంచనాలకు మించినది. వందేమాతరం నినాదాన్ని దేశమంతా తిరిగి వినిపించారాయన. ఈ దేశంలో గాంధీజీ కంటే ముందే నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన ఘనత బిపిన్‌పాల్‌కు కూడా దక్కుతుంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన భారత జాతికి సంకెళ్లు ఉన్నాయన్న సంగతినీ, ఈ పురాతన భూమి వలస పాలనలో మగ్గిపోతున్న కఠోర వాస్తవాన్నీ సాధారణ భారతీయుడికి అర్థమయ్యేటట్టు తెలియచెప్పినవారు పాల్. ఇందుకు బెంగాల్ విభజన సందర్భాన్ని పాల్ అద్భుతంగా ఉపయోగించుకున్నారు. అరబిందొ ఘోష్, రవీంద్రనాథ్ టాగోర్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, చిత్తరంజన్‌దాస్, అనీబిసెంట్ వంటి మహనీయులతో కలసి నడిచారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన మరుసటి సంవత్సరమే పాల్ ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1886 నాటి కలకత్తా సభలకీ, 1887 నాటి మద్రాస్ సభలకి కూడా ఆయన హాజరయ్యారు. భారతీయుల పట్ల ఎంతో వివక్షాపూరితంగా ఉన్న ఆయుధ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన మద్రాస్ సభల వేదిక మీద నుంచి పిలుపునిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. కాంగ్రెస్ తొలినాటి నాయకత్వం మితవాదులదే. కానీ వారి ధోరణి, పంథా జాతీయవాదులకి సరిపడేది కాదు. విన్నపాలతో వలసపాలకులు లొంగి వస్తారని అనుకోవడం అమాయకత్వమేనని అప్పటికే గట్టిగా విశ్వసించిన వారు లేకపోలేదు. మితవాదుల విన్నపాలు వ్యర్థమనీ, జాతీయవాదుల ఆలోచనలే సరైనవనీ భావించేందుకు వీలు కల్పించినదే బెంగాల్ విభజన. దీనితో బ్రిటిష్ జాతి పట్ల ఉన్న భ్రమల నుంచి చాలామంది బయటపడ్డారు. స్వరాజ్, స్వదేశీ, జాతీయ విద్య వంటివి ప్రజలను కదిలించాయి. ఇవే కొత్త ఉద్యమానికి బీజాలు వేశాయి. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మేరునగధీరుని వలే కనిపించే విప్లవనేత పాల్. బిపి¯Œ బాబు కలం ఎంతో పదునైనది. పత్రికా రచయితగా, గ్రంథకర్తగా ఆయన స్థానం అసాధారణమైనది. నేషనాలిటీ అండ్ ఎంపైర్, ఇండియన్ నేషనలిజం, స్వరాజ్ అండ్ ది ప్రజెంట్ సిట్యుయేషన్, ది సోల్ ఆఫ్ ఇండియా, ది బేసిస్ ఆఫ్ సోషల్ రిఫార్మ్, ది హిందూయిజం, ది న్యూ స్పిరిట్ ఆయన గ్రంథాలు. డెమోక్రాట్, ఇండిపెండెంట్ పత్రికలకు ఆయన సంపాదకుడు. పరిదర్శక్, న్యూ ఇండియా, వందేమాతరం, స్వరాజ్ పాల్ ప్రారంభించిన పత్రికలు. ట్రిబ్యూన్ (లాహోర్) పత్రికకు కొంతకాలం ఆయన సంపాదకుడు. బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్ పత్రిక సంపాదక మండలి సభ్యుడు. ఇవి కాకుండా మోడరన్ రివ్యూ, అమృతబజార్ పత్రిక, ది స్టేట్స్‌మన్ పత్రికలకు నిరంతరం వ్యాసాలు రాస్తూ ఉండేవారు. వక్తగా బిపిన్ పాల్ అంటే వంద ప్రభంజనాలతో సమానం. ఆయన పలుకు విన్న ప్రాంతంలో చైతన్యం తొణికిసలాడింది. జాతీయ భావాల తుపాను వీచింది. బెంగాల్ విభజనను రద్దు చేయాలని కోరే ఒక సందేశాన్ని పట్టుకుని పాల్ దక్షిణ భారతదేశం వచ్చారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, బందరు, మద్రాస్‌లలో సభలు జరిగాయి. ఇవి కూడా చరిత్రాత్మక ఘట్టాలుగానే మిగిలాయి. రాజమండ్రి గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సభలోనే చిలకమర్తి లక్ష్మీనరసింహం నోటి నుంచి ‘భరతఖండమ్ము చక్కని పాడియావు’ అన్న పద్యం వచ్చింది. ముట్నూరి కృష్ణారావుగారు పాల్ గారిని ఆ ప్రదేశాలన్నీ తిప్పారు. రాజమండ్రి సభలో పాల్‌గారిని ఆయనే జనానికి పరిచయం చేశారు. నాడు పాల్ విశాఖ నుంచి రాజమండ్రి చేరుకోగానే ఆయన గౌరవార్థం జరిగిన స్వాగతోత్సవం చిరస్మరణీయమైనది. పాల్ అక్కడ అయిదారు ఉపన్యాసాలు ఇచ్చారు. అవి రాజమండ్రి సామాజిక, రాజకీయ వాతావరణాన్నే మార్చేశాయి. తెలిసిన వారు ఎదురైతే ‘వందేమాతరం’ అని పలకరించుకోవడం మొదలైంది. అందరి గుండెల మీద వందేమాతరం బ్యాడ్జీలు వెలిశాయి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ‘వందేమాతరం’ అని విద్యార్థులు నినదించినందుకు బహిష్కరణకు గురయ్యారు. నాడు అక్కడే ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు వారిలో ఒకరు. హరిసర్వోత్తమరావు కూడా పాల్‌గారి వెంట తిరుగుతూ సభలలో పాల్గొన్నారు. ఇది ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌కు రుచించలేదు. ఆనాటి సభలో పాల్గొన్న, వందేమాతరమని తరగతి గదులలో నినదించిన 111 మందిని కళాశాల నుంచి బహిష్కరించారు. కాకినాడలో కెంప్ అనే ఆంగ్ల వైద్యాధికారి ఎదుట కోపల్లె కృష్ణారావు అనే పాఠశాల విద్యార్థి అదే నినాదం పలికినందుకు చావు దెబ్బలు తిన్నాడు. కెంప్ నిత్య వ్యాయామం చేసే పహిల్వాన్. కృష్ణారావు బాలుడు. కెంప్ అతడిని స్పృహ పోయేటట్టు కొట్టడమే కాదు, అదే స్థితిలో ఉండగా తీసుకెళ్లి పోలీసు స్టేషన్లో పడేసి వెళ్లిపోయాడు. కృష్ణారావు చనిపోయాడని పట్టణంలో వదంతి వ్యాపించింది. దీనికి ఆగ్రహించిన కాకినాడ వాసులు ఆంగ్లేయుల క్లబ్బును దగ్ధం చేశారు. కెంప్ రహస్యంగా పట్టణం విడిచి పారిపోయాడు. మద్రాస్ మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేసిన పాల్ సభలకు అధ్యక్షత వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో టంగుటూరి ప్రకాశం ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఈ దేశంలో ఉన్నత వర్గాలు చేవ చచ్చి ఉన్నాయని, ఇక ప్రజా బాహుళ్యమే ఉద్యమించాలని పాల్ పిలుపునిచ్చారు. దేశమాతను దుర్గామాతగా దర్శించుకుంటున్న ఈ తరానిదే భవిష్యత్తు అంతానని పాల్ చేసిన ప్రసంగాలు సహజంగానే ప్రజలను ఆకట్టుకున్నాయి. 1907లో తిలక్ అరెస్టు తరువాత జాతీయవాదుల మీద బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగించింది. ఏదో విధంగా పాల్‌ను కటకటాల పాల్జేయాన్నదే బ్రిటిష్ జాతి ఆశయం. అదే సమయంలో అరవిందుల మీద దేశద్రోహం కేసు నమోదైంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వడానికి బిపిన్‌పాల్ నిరాకరించారు. దీనితో ఆయనకు ఆరు మాసాల జైలు శిక్ష పడింది. బెంగాల్ విభజన నేపథ్యంలో పాల్ వందేమాతరం పత్రిక నెలకొల్పారు. దీనికి అరవిందులు సంపాదకుడు. జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత బిపిన్‌బాబు ఇంగ్లండ్ వెళ్లారు. కొన్ని అంశాల మీద తులనాత్మక అధ్యయనం చేయడం ఆయన ఉద్దేశం. అక్కడ ఉన్న మూడేళ్ల కాలంలో ఇండియా హౌస్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఇండియా హౌస్ అంటే విదేశీ గడ్డ మీద నుంచి భారత స్వాతంత్య్ర సమరానికి సహకరిస్తున్న భారతీయ యువకుల అడ్డా. వీరంతా హింసాత్మక పంథాను స్వాగతించినవారే. అక్కడ ఉండగానే పాల్ స్వరాజ్ పత్రికను ప్రారంభించారు. కానీ ఇండియాలో 1909 కర్సన్ వైలీ హత్య జరిగింది. మదన్‌లాల్ థింగ్రా ఈ సాహసం చేశారు. కానీ దీని ప్రభావం ఇంగ్లండ్ నుంచి వెలువడుతున్న స్వరాజ్ పత్రిక మీద తీవ్రంగా పనిచేసింది. పత్రిక మూత పడింది. పాల్ ఆర్థికంగా చితికిపోయారు. కొద్దికాలం మనశ్శాంతి కోల్పోయారు. భారతదేశానికి వచ్చిన తరువాత కూడా ఆయన గాంధీజీ నాయకత్వాన్ని సమర్థించలేకపోయారు. నిజానికి గాంధీ నాయకత్వం వహించే నాటికి పాతతరం నాయకులు తక్కువే ఉన్నారు. వారు కూడా గాంధీ ఆకర్షణలో పడిపోయారు. కానీ పాల్ మాత్రం చివరికంటా తనదైన పంథాలోనే నడిచారు. బిపిన్‌పాల్ ఉద్యమ జీవితంలో చివరి అంకం నిండా ఏకాంతమే కనిపిస్తుంది. ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించారు. అది ఆయన ఉద్యమ జీవితాన్నే తెరమరుగయ్యేటట్టు చేసింది. 1921లో పాల్ గాంధీ మీద చేసిన విమర్శ అసాధారణమైనది. ‘మీరు మ్యాజిక్ చే శారు. కానీ నేను మీకు లాజిక్‌ను అందివ్వాలని అనుకున్నాను. ప్రజాసమూహాలు సంభ్రమాశ్చర్యాలలో తలమునకలైతే తర్కం (లాజిక్) రుచించదు. మీరు మంత్రించారు. నేను రుషిని కాను. కాబట్టి మంత్రం ఇవ్వలేను. సత్యమేమిటో నాకు తెలిసినప్పుడు నేను అర్థసత్యాలను పలకలేను. ప్రజలకి విశ్వాసాలనే గంతలు కట్టి నడిపించాలని నేను ఏనాడూ ప్రయత్నించలేదు.’ బిపిన్‌బాబు రెండు వివాహాల గురించి కూడా చెప్పుకోవాలి. 1881లో ఆయనకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. కానీ ఆమె అనతికాలంలోనే మరణించారు. తరువాత 1891లో మరొకరిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు నృత్యకాళీదేవి, వితంతువు. రెండు విషయాలను స్పష్టం చేయడానికి పాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి సంస్కరణ కోసం. రెండు వయో పరిమితి బిల్లుకు (బాల్య వివాహాలను నిషేధించినది) తన పూర్తి మద్దతు ఉందని చెప్పడం. కానీ వితంతువును వివాహం చేసుకున్నందుకు పాల్ తన కుటుంబానికి దూరమయ్యారు. బిపిన్‌బాబు ఆలోచనలలోనివే కాదు, అడుగులలో కనిపించినవీ విప్లవ భావాలే. - ∙డా. గోపరాజు నారాయణరావు -
అక్షరంలో జ్వాలను రగిలించినవాడు
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రకు రాజకీయ కోణమే ప్రధానమైనది. రాజ్యాంగ రూపకల్పన, గ్రంథాలయోద్యమం, బడుగు బలహీనవర్గాలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, జాతీయ విద్య, దేశీయ పరిశ్రమల అభివృద్ధి వంటి చాలా విషయాలు స్వాతంత్య్రోద్యమంలో అంతర్లీనంగా సాగాయి. చరిత్ర పుటలకు ఎక్కని మరొక మహత్తర ఉద్యమం కూడా స్వాతంత్య్రోద్యమంతో సమాంతరంగా సాగిన సంగతి గమనించాలి. స్వాతంత్య్ర సాధన కోసం పాటు పడడంతో పాటు భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం సాగిన మహత్తర పోరాటమది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మీద ఇంగ్లిష్ జాతి ప్రదర్శించిన జులుం కూడా విశేషమైన చారిత్రక అంశమే. ఏ రాజకీయ పోరాటానికైనా పత్రికా రచనే అంతరాత్మగా వెలుగొందడం ప్రపంచ చరిత్రలో ఎన్నో సందర్భాలలో కనిపిస్తుంది. అందుకే అంత నిర్బంధం. అంతటి అణచివేత. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను మాండలే జైలుకు పంపడానికి కారణం ఆ ఉద్యమమే. తెలుగువాడైన గాడిచర్ల హరిసర్వోత్తమరావును బెజవాడ వీధులలో సంకెళ్లు వేసి నడిపించడానికి కూడా కారణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకే. గాడిచర్ల అండమాన్ సెల్యులార్ జైలులో కఠిన శిక్ష అనుభవించారు. అనీబిసెంట్, బీజీ హార్నిమన్, గాంధీజీ, అరవింద్‌ఘోష్, ముట్నూరి కృష్ణారావు వంటివారంతా కూడా పత్రికా రచయితలుగా కూడా స్వాతంత్య్ర పోరాటంలో తెల్లజాతి ఆగ్రహాన్ని చవిచూశారు. ‘ప్రమాదకర రచనలు’ చేసి, ‘రాజద్రోహం’ కింద కారాగారానికి వెళ్లినవారే వీరంతా. ఇలాంటి వారందరితో పాటు ప్రతితరం గుర్తుంచుకోదగిన మరొక పత్రికా పోరాటయోధుడు కూడా ఉన్నారు. ఆయన– మద్దూరి అన్నపూర్ణయ్య. స్వాతంత్య్ర పోరాటం, భావ ప్రకటనాస్వేచ్ఛ కోసం జరిపిన పోరాటం పుణ్యమా అని ఆయన 42వ సంవత్సరం వచ్చే నాటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఆయన 33 సంవత్సరాలు స్వరాజ్య ఉద్యమంలో పనిచేస్తే, అందులో దాదాపు 15 సంవత్సరాలు జైలులోనే గడిపారు. ఏకైక కుమార్తె పెళ్లికీ, భార్య వెంకటరమణమ్మగారి మరణం సమయంలోను కూడా ఆయన పెరోల్ దొరక్క జైలులోనే ఉండిపోయారు. అన్నపూర్ణయ్య (మార్చి 20, 1899– సెప్టెంబర్ 11, 1954) తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గర కొమరగిరిలో పుట్టారు. కాకినాడ పిఠాపురం రాజా విద్యా సంస్థలలో ఇంటర్ చదివారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాస సమయంలో ఆయన సహపాఠి అల్లూరి శ్రీరామరాజు. మరొక విశేషం– ఆ సమయంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు. అన్నపూర్ణయ్య జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, సిద్ధాంతపరంగా అన్నే ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. ఆయన మొదట భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. అది గాంధీ పిలుపు ఫలితం. తరువాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోకి వెళ్లారు. తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్‌లో పనిచేశారు. ఆపై కమ్యూనిస్టులతో కలసి పనిచేశారు. అంతిమంగా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. అవతార్ మెహెర్‌బాబా భక్తుడయ్యారు. ‘వెలుగు’ అనే పత్రికను స్థాపించి ఆయన ప్రవచనాలను ప్రచారం చేశారు. ఆయన జీవితం, పోరాట పంథా, ప్రస్థానం అంతా ‘కాంగ్రేసు’ పత్రికతో ముడిపడి ఉన్నాయి. నవశక్తి, నవభారత్ అనే పత్రికలను కూడా ఆయన నిర్వహించారు. ఇందులో నవశక్తి పత్రికను కమ్యూనిస్టులు వారి శిక్షణ తరగతులలో పంచి పెడుతూ ఉండేవారు. అల్లూరి శ్రీరామరాజు జీవిత విశేషాలను, ఉద్యమాన్ని గాంధీజీ దృష్టికి తీసుకువెళ్లిన వారు అన్నపూర్ణయ్యే. జిల్లా విద్యార్థి మహాసభ కార్యదర్శిగా ఎంపిక కావడం నుంచి అన్నపూర్ణయ్య సామాజిక, రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ సమయంలోనే గోదావరి ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమంలో ఎంతో కీలకంగా ఉన్న బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యంగారితో పరిచయం ఏర్పడింది. ఆయన గాంధీ సన్నిహితులలో ఒకరు. అన్నపూర్ణయ్యను సుబ్రహ్మణ్యంగారే జాతీయ విద్యాలయంలో అధ్యాపకునిగా నియమించారు. ఆ సమయంలోనే ఆంధ్ర యువజన కాంగ్రెస్ సభ ఏర్పడింది. ఈ సంస్థ తరఫున నిర్వహించిన పత్రికే ‘కాంగ్రేసు’. 1921 మే నెలలో ఈ పత్రిక ప్రచురణ ఆరంభమైంది. వ్యవస్థాపకుడు, సంపాదకుడు కూడా అన్నపూర్ణయ్యే. రాజమండ్రి కేంద్రంగా మొదట ఈ పత్రిక సైక్లోస్టైల్ పద్ధతిన పాఠకుల దగ్గరకు వెళ్లేది. 1925లో ఈ పత్రికను సీతానగరం ఆశ్రమానికి తరలించారు. దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ఖ్యాతి గాంచిన ఈ ప్రశాంత ధామం రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనినే గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం అని పిలుస్తారు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతం నుంచి వెలువడిన పత్రికగా కూడా ‘కాంగ్రేసు’కు పేరు వచ్చింది. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఒక సందర్భంలో ‘కాంగ్రేసు’ పత్రికను చూశారు. ఆయనే ఒక అచ్చు యంత్రాన్ని జర్మనీ నుంచి తెప్పించి కానుకగా ఇచ్చారు.కాంగ్రెస్ పత్రిక సంపాదక బాధ్యతలను ప్రధానంగా అన్నపూర్ణయ్య గారే నిర్వహించేవారు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు కూడా సంపాదక మండలిలో ఉండేవారు. 14 పేజీలతో రాయల్ సైజులో దీనిని వెలువరించేవారు. ఇందులో రచనలు కొన్ని విలువలకు కట్టుబడి ఉండేవి. స్వాతంత్య్రం సాధన పత్రిక ఉద్దేశం. సంపూర్ణ స్వరాజ్యం పత్రిక ఆశయం. ఇందుకు భిన్నంగా ఉండే వ్యాపార ప్రకటనలకు వారు ఇందులో చోటు ఇవ్వలేదు. అంటే మత్తుమందులు, పొగ తాగడం గురించి వ్యాపార ప్రకటనలకు చోటివ్వలేదు. 1921 నుంచి 1932 వరకు దాదాపు దశాబ్దం పాటు ఈ పత్రిక నడిచింది. ఈ పదేళ్ల కాలంలోనూ సంపాదక మండలిలో ఒకరు ఎప్పుడూ కారాగారంలో ఉండేవారు. శిక్షలు కూడా ఐపీసీ 124, 153–ఏ, 505 నిబంధనల మేరకు వారికి తీవ్ర శిక్షలు పడినాయి. నిరంతర నిఘా, పోలీసుల తనిఖీలు, మితవాదుల నిరసనల మధ్య పదేళ్ల కాలం నడిచింది పత్రిక. 1929, 1933 సంవత్సరాలలో గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పుడే అన్నపూర్ణయ్య సంపాదకత్వంలోని ‘కాంగ్రేసు’లోని అంశాలను చూసి ఆయన కలవరపడ్డారు. 1929 మే సంచిక 1857 నాటి భారత ప్రథమ స్వాతంత్య్ర సమర ఘట్టం సంస్మరణ సంచికగా వెలువరించారు అన్నపూర్ణయ్య. అందులో ‘చిచ్చుర పిడుగు’ అనే నాటిక ఉంది. అందులో కథానాయకుడు మంగల్ పాండే. అంటే ఆ పోరాటంలో తొలి తూటా పేల్చిన సిపాయి. నాటిక మొత్తం తెల్లజాతి మీద నిప్పులు కురిపించే సంభాషణలు మాట్లాడించినా, గాంధేయవాదులు కాబట్టి చివర శాంతి సందేశం మాత్రం ఉంచారు. కానీ వాటిని కూడా అన్నపూర్ణయ్య తొలగించారు. గాంధీజీ భయపడినట్టే ఆ సంవత్సరం జూలైలో 124–ఎ సెక్షన్ కింద సంపాదకుడు అన్నపూర్ణయ్య మీద కేసు నమోదయింది. రాజమండ్రి మేజిస్ట్రేట్ రెండేళ్లు కఠిన శిక్ష విధించాడు. నిజానికి ఈ నాటిక రాసిన వారు అన్నపూర్ణయ్య కాదు. రామచంద్రుని వెంకటప్ప. కానీ తాను పత్రికకు సంపాదకుడు కాబట్టి తన మీదే ఆ నెపం వేసుకున్నారు అన్నపూర్ణయ్య. జైలుకు వెళ్లారు. ఉప్పు సత్యాగ్రహం వేళ నిషేధం కారణంగా పత్రిక తాత్కాలికంగా మూత పడింది. గాంధీ–ఇర్విన్ ఒప్పందంతో పత్రికల మీద ఆంక్షలు తొలగి ‘కాంగ్రేసు’ కూడా పునర్దర్శనం ఇచ్చింది. ఇందులో సంపాదకీయం– ‘వీరబలి’. అది భగత్‌సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ రాశారు. మళ్లీ నిఘా మొదలయింది. సీతానగరం ఆశ్రమ నిర్వహణ చట్ట వ్యతిరేకమని మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజెట్ 1932లో ప్రకటించింది. ఆ జనవరి 12న రాజమండ్రి సర్కిల్ సీఐ ముస్తఫా అలీఖాన్ పోలీసు బలగంతో వచ్చి ఆశ్రమంలో ఏమీ మిగల్చకుండా ధ్వంసం చేయించాడు. కాంగ్రేస్ పత్రిక ఆస్తులు, విలువైన జర్మన్ ట్రెడిల్ అచ్చుయంత్రం కూడా ధ్వంసమైనాయి. ఆపై ఇక ఆ పత్రిక వెలుగు చూడలేదు. ఫార్వార్డ్ బ్లాక్ సభ్యునిగా క్విట్ ఇండియా ఉద్యమం సమయం. రాజమండ్రిలోనే సుబ్రహ్మణ్య మైదానంలో అన్నపూర్ణయ్య ప్రసంగిస్తుంటే అరెస్టు చేయించింది ప్రభుత్వం. ఆ జైలు నుంచి ఈ జైలుకీ ఈ జైలు నుంచి ఆ జైలుకీ తిప్పి, ఎట్టకేలకు మధ్య భారతంలో (నేటి మధ్యప్రదేశ్) దమో అనే చోట జైలుకు పంపించారు. కూతురికి మేనమామతో వివాహం జరిగింది. కూతురు పెళ్లికి వెళ్లడానికి ప్రభుత్వం పెరోల్ ఇవ్వలేదు. తరువాత అన్నపూర్ణయ్యగారి భార్య వెంకటరమణమ్మ కూతురు దగ్గరే ఉండేది. అంటే తన సొంత తమ్ముడి దగ్గరే. దుర్భర దారిద్య్రం. ఆ రోజులలో పోస్ట్ కార్డు మూడు పైసలు. భర్తకు ఉత్తరం రాయడానికి కార్డు కొనడానికి మూడు పైసలు తమ్ముడిని అడగడానికి కూడా ఇంట్లో అనుకూలమైన పరిస్థితి లేదు. ఇక అంత దూరం వెళ్లి భర్తని చూసి రావడమన్న ఆలోచనే చేయలేదు. నిజానికి అన్నపూర్ణయ్య జైలులో ఎంతో ఉల్లాసంగా గడిపేవారని సన్నిహితులు చెప్పేవారు. నేను జైలులో మగ్గిపోతున్నానని మీ అందరి బాధ, కానీ బయటకు వస్తే తగ్గిపోతానేమోనని నా బాధ అనేవారట ఆయన. పైగా ఆయన భోజనప్రియుడు. మొత్తానికి వెంకటరమణమ్మగారు ఎలాగో ఒక కార్డు కొని ఉత్తరం రాశారు. ‘ఇంటి దగ్గర నుంచి మీకు ఉత్తరం రావాలని మీకు ఎప్పుడు అనిపించినా ఈ కార్డే తీసుకుని చదువుకోవలసినది. దీని మీద తేదీ వేయనిది అందుకే.’ అదే ఉత్తరాన్ని ఆయన పదే పదే చదువుకునేవారు. ఆయన జైలులో ఉండగానే వెంకటరమణమ్మ కన్నుమూశారు. స్వాతంత్య్ర భారతాన్ని అన్నపూర్ణయ్య దర్శించుకున్నారు. కానీ ఆయనను అప్పుడే జనం మరచిపోయారు. తరువాత ఏలూరులో దుర్భర పరిస్థితులలో కొంతకాలం గడిపారు. అక్కడే కన్నుమూశారు. డా. గోపరాజు నారాయణరావు · -
బ్రిటిష్ రెసిడెన్సీ
ప్రధాన రెసిడెన్సీ భవనాన్ని ఆనుకునివున్న విశాలమైన ప్రాంగణంలో ఆనాటి బ్రిటిష్ అధికారుల కోసం నిర్మించిన ఆఫీసు గదులు, వారి నివాసం కోసం నిర్మించిన క్వార్టర్లు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా చుట్టూతా ఎలాంటి ప్రహరీ నిర్మించ లేదు. ఐతే, 1857లో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమకారుల దండయాత్ర జరిగింది. దాంతో దీని చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు. చారిత్రక పురాతన వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ రెసిడెన్సీ. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. హైదరాబాద్‌లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ఉంది. అసఫ్ జాహీల కాలంలో (1724-1948) బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం అధికంగా ఉండేది. స్థానిక నిజాం ప్రభువులు కల్పించిన క్వార్టర్సలోనే బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జె.ఎ. కిర్క్‌పాట్రిక్, బ్రిటిష్ అధికారులకు వారి హోదాకు దీటుగా ఒక పెద్ద బంగళా ఉండాలని, అందుకోసం కోఠి ప్రాంతంలో మూసీనది సమీపంలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ పెద్ద భవంతి నిర్మించాలని ప్రతిపాదించాడు. అప్పటి నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకయిన ఖర్చునంతా నిజాం ప్రభువే భరించాడు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్లు లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్, మద్రాసు, ఈ భవన నమూనాను రూపొందించారు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి శ్రీరాజా కంద స్వామి ముదిలియార్ తదితరులు సివిల్ పనులు పర్యవేక్షించారు. 22 పాలరాతి మెట్లు రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి. ఇది దాటి రాజప్రాసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్లో అత్యంత ప్రతి భావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బారుహాల్లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన చాండిలియర్లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు, అద్దాల మహల్‌ను తలపిస్తూ దర్శకుల మనసులను దోచుకుంటాయి. అన్నిరకాల హంగులున్నా బ్రిటిష్ రెసిడెన్సీలోని ప్రధాన భవనం చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. వాటికి తక్షణ రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన భవన సముదాయానికి కొద్దిపాటి దూరంలో బ్రిటిష్ రెసిడెంట్ల సమాధులు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడ నమూనా కూడా ఇక్కడ దగ్గర్లోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో నేడు కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటికి తగిన రక్షణ, మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. న్యూయార్కులోని గిౌటఛీ కౌఠఝ్ఛ్ట గ్చ్టిఛిజి అనే సంస్థ బ్రిటిష్ రెసిడెన్సీలో తగిన మరమ్మతుల కోసం ఒక లక్ష అమెరికన్ డాలర్లు గ్రాంటుగా ప్రకటించింది. చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఆసక్తి గల వారందరికీ బ్రిటిష్ రెసిడెన్సీ ఎన్నో కథలు తెలియజేస్తుంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com