భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రకు రాజకీయ కోణమే ప్రధానమైనది. రాజ్యాంగ రూపకల్పన, గ్రంథాలయోద్యమం, బడుగు బలహీనవర్గాలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, జాతీయ విద్య, దేశీయ పరిశ్రమల అభివృద్ధి వంటి చాలా విషయాలు స్వాతంత్య్రోద్యమంలో అంతర్లీనంగా సాగాయి. చరిత్ర పుటలకు ఎక్కని మరొక మహత్తర ఉద్యమం కూడా స్వాతంత్య్రోద్యమంతో సమాంతరంగా సాగిన సంగతి గమనించాలి. స్వాతంత్య్ర సాధన కోసం పాటు పడడంతో పాటు భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం సాగిన మహత్తర పోరాటమది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ మీద ఇంగ్లిష్ జాతి ప్రదర్శించిన జులుం కూడా విశేషమైన చారిత్రక అంశమే. ఏ రాజకీయ పోరాటానికైనా పత్రికా రచనే అంతరాత్మగా వెలుగొందడం ప్రపంచ చరిత్రలో ఎన్నో సందర్భాలలో కనిపిస్తుంది. అందుకే అంత నిర్బంధం. అంతటి అణచివేత. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను మాండలే జైలుకు పంపడానికి కారణం ఆ ఉద్యమమే. తెలుగువాడైన గాడిచర్ల హరిసర్వోత్తమరావును బెజవాడ వీధులలో సంకెళ్లు వేసి నడిపించడానికి కూడా కారణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకే. గాడిచర్ల అండమాన్ సెల్యులార్ జైలులో కఠిన శిక్ష అనుభవించారు. అనీబిసెంట్, బీజీ హార్నిమన్, గాంధీజీ, అరవింద్‌ఘోష్, ముట్నూరి కృష్ణారావు వంటివారంతా కూడా పత్రికా రచయితలుగా కూడా స్వాతంత్య్ర పోరాటంలో తెల్లజాతి ఆగ్రహాన్ని చవిచూశారు. ‘ప్రమాదకర రచనలు’ చేసి, ‘రాజద్రోహం’ కింద కారాగారానికి వెళ్లినవారే వీరంతా. ఇలాంటి వారందరితో పాటు ప్రతితరం గుర్తుంచుకోదగిన మరొక పత్రికా పోరాటయోధుడు కూడా ఉన్నారు. ఆయన– మద్దూరి అన్నపూర్ణయ్య. స్వాతంత్య్ర పోరాటం, భావ ప్రకటనాస్వేచ్ఛ కోసం జరిపిన పోరాటం పుణ్యమా అని ఆయన 42వ సంవత్సరం వచ్చే నాటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఆయన 33 సంవత్సరాలు స్వరాజ్య ఉద్యమంలో పనిచేస్తే, అందులో దాదాపు 15 సంవత్సరాలు జైలులోనే గడిపారు. ఏకైక కుమార్తె పెళ్లికీ, భార్య వెంకటరమణమ్మగారి మరణం సమయంలోను కూడా ఆయన పెరోల్ దొరక్క జైలులోనే ఉండిపోయారు.
అన్నపూర్ణయ్య (మార్చి 20, 1899– సెప్టెంబర్ 11, 1954) తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గర కొమరగిరిలో పుట్టారు. కాకినాడ పిఠాపురం రాజా విద్యా సంస్థలలో ఇంటర్ చదివారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాస సమయంలో ఆయన సహపాఠి అల్లూరి శ్రీరామరాజు. మరొక విశేషం– ఆ సమయంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు. అన్నపూర్ణయ్య జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, సిద్ధాంతపరంగా అన్నే ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. ఆయన మొదట భారత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. అది గాంధీ పిలుపు ఫలితం. తరువాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోకి వెళ్లారు. తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్‌లో పనిచేశారు. ఆపై కమ్యూనిస్టులతో కలసి పనిచేశారు. అంతిమంగా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. అవతార్ మెహెర్‌బాబా భక్తుడయ్యారు. ‘వెలుగు’ అనే పత్రికను స్థాపించి ఆయన ప్రవచనాలను ప్రచారం చేశారు. ఆయన జీవితం, పోరాట పంథా, ప్రస్థానం అంతా ‘కాంగ్రేసు’ పత్రికతో ముడిపడి ఉన్నాయి. నవశక్తి, నవభారత్ అనే పత్రికలను కూడా ఆయన నిర్వహించారు. ఇందులో నవశక్తి పత్రికను కమ్యూనిస్టులు వారి శిక్షణ తరగతులలో పంచి పెడుతూ ఉండేవారు. అల్లూరి శ్రీరామరాజు జీవిత విశేషాలను, ఉద్యమాన్ని గాంధీజీ దృష్టికి తీసుకువెళ్లిన వారు అన్నపూర్ణయ్యే.
జిల్లా విద్యార్థి మహాసభ కార్యదర్శిగా ఎంపిక కావడం నుంచి అన్నపూర్ణయ్య సామాజిక, రాజకీయ జీవితం ఆరంభమైంది. ఆ సమయంలోనే గోదావరి ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమంలో ఎంతో కీలకంగా ఉన్న బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యంగారితో పరిచయం ఏర్పడింది. ఆయన గాంధీ సన్నిహితులలో ఒకరు. అన్నపూర్ణయ్యను సుబ్రహ్మణ్యంగారే జాతీయ విద్యాలయంలో అధ్యాపకునిగా నియమించారు. ఆ సమయంలోనే ఆంధ్ర యువజన కాంగ్రెస్ సభ ఏర్పడింది. ఈ సంస్థ తరఫున నిర్వహించిన పత్రికే ‘కాంగ్రేసు’. 1921 మే నెలలో ఈ పత్రిక ప్రచురణ ఆరంభమైంది. వ్యవస్థాపకుడు, సంపాదకుడు కూడా అన్నపూర్ణయ్యే. రాజమండ్రి కేంద్రంగా మొదట ఈ పత్రిక సైక్లోస్టైల్ పద్ధతిన పాఠకుల దగ్గరకు వెళ్లేది. 1925లో ఈ పత్రికను సీతానగరం ఆశ్రమానికి తరలించారు. దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ఖ్యాతి గాంచిన ఈ ప్రశాంత ధామం రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనినే గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం అని పిలుస్తారు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతం నుంచి వెలువడిన పత్రికగా కూడా ‘కాంగ్రేసు’కు పేరు వచ్చింది. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఒక సందర్భంలో ‘కాంగ్రేసు’ పత్రికను చూశారు. ఆయనే ఒక అచ్చు యంత్రాన్ని జర్మనీ నుంచి తెప్పించి కానుకగా ఇచ్చారు.కాంగ్రెస్ పత్రిక సంపాదక బాధ్యతలను ప్రధానంగా అన్నపూర్ణయ్య గారే నిర్వహించేవారు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు కూడా సంపాదక మండలిలో ఉండేవారు. 14 పేజీలతో రాయల్ సైజులో దీనిని వెలువరించేవారు. ఇందులో రచనలు కొన్ని విలువలకు కట్టుబడి ఉండేవి. స్వాతంత్య్రం సాధన పత్రిక ఉద్దేశం. సంపూర్ణ స్వరాజ్యం పత్రిక ఆశయం. ఇందుకు భిన్నంగా ఉండే వ్యాపార ప్రకటనలకు వారు ఇందులో చోటు ఇవ్వలేదు. అంటే మత్తుమందులు, పొగ తాగడం గురించి వ్యాపార ప్రకటనలకు చోటివ్వలేదు. 1921 నుంచి 1932 వరకు దాదాపు దశాబ్దం పాటు ఈ పత్రిక నడిచింది. ఈ పదేళ్ల కాలంలోనూ సంపాదక మండలిలో ఒకరు ఎప్పుడూ కారాగారంలో ఉండేవారు. శిక్షలు కూడా ఐపీసీ 124, 153–ఏ, 505 నిబంధనల మేరకు వారికి తీవ్ర శిక్షలు పడినాయి. నిరంతర నిఘా, పోలీసుల తనిఖీలు, మితవాదుల నిరసనల మధ్య పదేళ్ల కాలం నడిచింది పత్రిక.
1929, 1933 సంవత్సరాలలో గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పుడే అన్నపూర్ణయ్య సంపాదకత్వంలోని ‘కాంగ్రేసు’లోని అంశాలను చూసి ఆయన కలవరపడ్డారు. 1929 మే సంచిక 1857 నాటి భారత ప్రథమ స్వాతంత్య్ర సమర ఘట్టం సంస్మరణ సంచికగా వెలువరించారు అన్నపూర్ణయ్య. అందులో ‘చిచ్చుర పిడుగు’ అనే నాటిక ఉంది. అందులో కథానాయకుడు మంగల్ పాండే. అంటే ఆ పోరాటంలో తొలి తూటా పేల్చిన సిపాయి. నాటిక మొత్తం తెల్లజాతి మీద నిప్పులు కురిపించే సంభాషణలు మాట్లాడించినా, గాంధేయవాదులు కాబట్టి చివర శాంతి సందేశం మాత్రం ఉంచారు. కానీ వాటిని కూడా అన్నపూర్ణయ్య తొలగించారు. గాంధీజీ భయపడినట్టే ఆ సంవత్సరం జూలైలో 124–ఎ సెక్షన్ కింద సంపాదకుడు అన్నపూర్ణయ్య మీద కేసు నమోదయింది. రాజమండ్రి మేజిస్ట్రేట్ రెండేళ్లు కఠిన శిక్ష విధించాడు. నిజానికి ఈ నాటిక రాసిన వారు అన్నపూర్ణయ్య కాదు. రామచంద్రుని వెంకటప్ప. కానీ తాను పత్రికకు సంపాదకుడు కాబట్టి తన మీదే ఆ నెపం వేసుకున్నారు అన్నపూర్ణయ్య. జైలుకు వెళ్లారు. ఉప్పు సత్యాగ్రహం వేళ నిషేధం కారణంగా పత్రిక తాత్కాలికంగా మూత పడింది.
గాంధీ–ఇర్విన్ ఒప్పందంతో పత్రికల మీద ఆంక్షలు తొలగి ‘కాంగ్రేసు’ కూడా పునర్దర్శనం ఇచ్చింది. ఇందులో సంపాదకీయం– ‘వీరబలి’. అది భగత్‌సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ రాశారు. మళ్లీ నిఘా మొదలయింది. సీతానగరం ఆశ్రమ నిర్వహణ చట్ట వ్యతిరేకమని మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ గెజెట్ 1932లో ప్రకటించింది. ఆ జనవరి 12న రాజమండ్రి సర్కిల్ సీఐ ముస్తఫా అలీఖాన్ పోలీసు బలగంతో వచ్చి ఆశ్రమంలో ఏమీ మిగల్చకుండా ధ్వంసం చేయించాడు. కాంగ్రేస్ పత్రిక ఆస్తులు, విలువైన జర్మన్ ట్రెడిల్ అచ్చుయంత్రం కూడా ధ్వంసమైనాయి. ఆపై ఇక ఆ పత్రిక వెలుగు చూడలేదు. ఫార్వార్డ్ బ్లాక్ సభ్యునిగా క్విట్ ఇండియా ఉద్యమం సమయం. రాజమండ్రిలోనే సుబ్రహ్మణ్య మైదానంలో అన్నపూర్ణయ్య ప్రసంగిస్తుంటే అరెస్టు చేయించింది ప్రభుత్వం. ఆ జైలు నుంచి ఈ జైలుకీ ఈ జైలు నుంచి ఆ జైలుకీ తిప్పి, ఎట్టకేలకు మధ్య భారతంలో (నేటి మధ్యప్రదేశ్) దమో అనే చోట జైలుకు పంపించారు. కూతురికి మేనమామతో వివాహం జరిగింది. కూతురు పెళ్లికి వెళ్లడానికి ప్రభుత్వం పెరోల్ ఇవ్వలేదు. తరువాత అన్నపూర్ణయ్యగారి భార్య వెంకటరమణమ్మ కూతురు దగ్గరే ఉండేది. అంటే తన సొంత తమ్ముడి దగ్గరే. దుర్భర దారిద్య్రం. ఆ రోజులలో పోస్ట్ కార్డు మూడు పైసలు. భర్తకు ఉత్తరం రాయడానికి కార్డు కొనడానికి మూడు పైసలు తమ్ముడిని అడగడానికి కూడా ఇంట్లో అనుకూలమైన పరిస్థితి లేదు. ఇక అంత దూరం వెళ్లి భర్తని చూసి రావడమన్న ఆలోచనే చేయలేదు. నిజానికి అన్నపూర్ణయ్య జైలులో ఎంతో ఉల్లాసంగా గడిపేవారని సన్నిహితులు చెప్పేవారు. నేను జైలులో మగ్గిపోతున్నానని మీ అందరి బాధ, కానీ బయటకు వస్తే తగ్గిపోతానేమోనని నా బాధ అనేవారట ఆయన. పైగా ఆయన భోజనప్రియుడు. మొత్తానికి వెంకటరమణమ్మగారు ఎలాగో ఒక కార్డు కొని ఉత్తరం రాశారు. ‘ఇంటి దగ్గర నుంచి మీకు ఉత్తరం రావాలని మీకు ఎప్పుడు అనిపించినా ఈ కార్డే తీసుకుని చదువుకోవలసినది. దీని మీద తేదీ వేయనిది అందుకే.’ అదే ఉత్తరాన్ని ఆయన పదే పదే చదువుకునేవారు. ఆయన జైలులో ఉండగానే వెంకటరమణమ్మ కన్నుమూశారు. స్వాతంత్య్ర భారతాన్ని అన్నపూర్ణయ్య దర్శించుకున్నారు. కానీ ఆయనను అప్పుడే జనం మరచిపోయారు. తరువాత ఏలూరులో దుర్భర పరిస్థితులలో కొంతకాలం గడిపారు. అక్కడే కన్నుమూశారు.
డా. గోపరాజు నారాయణరావు
·
అక్షరంలో జ్వాలను రగిలించినవాడు
Published Sun, Jul 22 2018 12:22 AM | Last Updated on Sun, Jul 22 2018 12:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment