Asia Cup 2023- World Cup 2023: ఆసియా కప్-2023 క్రికెట్ సమరానికి ఆరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్- బి నుంచి బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక హోరాహోరీ పోరులో తలపడనున్నాయి. పాకిస్తాన్‌తో కలిసి డిపెండింగ్ చాంపియన్ శ్రీలంక సంయుక్తంగా ఈ వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
టీమిండియా తొలి మ్యాచ్ పాక్‌తో
ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో రోహిత్ సేన విఫలమైన విషయం విదితమే. అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. ఫైనల్లో పాక్‌ను ఢీకొట్టిన శ్రీలంక టైటిల్ విజేతగా నిలిచింది.
అయితే, ఈసారి మాత్రం టీమిండియా గతం తాలూకు తప్పులు పునరావృతం కాకుండా 50 ఓవర్ల ఫార్మాట్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఆ తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది.
ఆసియా కప్ భారత్‌దే.. కానీ
ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్ మదన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా కచ్చితంగా ఆసియా కప్ గెలుస్తుంది. కానీ.. ప్రపంచకప్ విజేత గురించి ఇప్పుడే అంచనా వేయలేం. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాలకు కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అదే ప్లస్.. అదే మైనస్..
స్వదేశంలో ఆడటం మనకు సానుకూలాంశమే అయినా.. అదే ప్రతికూలంగానూ మారే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఆడుతున్నపుడు భారీ అంచనాల కారణంగా ఒత్తిడి ఉండటం సహజం. అయితే, అదృష్టవశాత్తూ మన జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లే ఉన్నారు.
ఒత్తిడిని ఎలా అధిగమించాలో వారికి బాగా తెలుసు’’ అని మదన్ లాల్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పునరాగమనం గురించి ప్రస్తావిస్తూ.. వారిద్దరు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తేనే టీమిండియా మిడిలార్డర్ పటిష్టమవుతుందని పేర్కొన్నాడు.
రాహుల్, అయ్యర్‌లకు గత అనుభవం ఉన్నా.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎలా రాణిస్తారన్నదే కాస్త ఆందోళన కలిగించే అంశమని మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: విరాట్ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ!
Comments
Please login to add a commentAdd a comment