WC 2023: వరల్డ్‌కప్‌ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్‌! అతడికి అవకాశం! | Kris Srikkanth Picks His Preferred Indian15-Member Squad For World Cup 2023, Leaves Out Key Batter - Sakshi
Sakshi News home page

WC 2023: వరల్డ్‌కప్‌ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్‌! అతడికి అవకాశం!

Published Mon, Aug 28 2023 3:49 PM | Last Updated on Mon, Aug 28 2023 4:42 PM

Kris Srikkanth Picks 15 Member Squad For WC 2023 Leaves Key Batter - Sakshi

World Cup 2023: ఆసియా కప్‌-2023 ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్‌కు సిద్ధం కానుంది. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబరు 8న ఆసీస్‌తో తలపడనుంది.

ఈసారి ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్లో జరుగనున్న తరుణంలో ప్రపంచకప్‌లోనూ ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వన్డే వరల్డ్‌కప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించాడు.

చహల్‌కు అవకాశమిచ్చిన చిక్కా
ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌కు అవకాశమిచ్చిన చిక్కా.. అనూహ్యంగా శ్రేయస్‌ అ‍య్యర్‌కు మొండిచేయి చూపాడు. అదే సమయంలో.. వన్డేల్లో అంతంత మాత్రంగానే ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు తన జట్టులో చోటివ్వడం విశేషం.

రాహుల్‌ను వద్దని ఇప్పుడిలా
అంతేకాదు.. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించని కేఎల్‌ రాహుల్‌ను ఆసియా కప్‌-2023కి ఎందుకు ఎంపిక చేశారన్న శ్రీకాంత్‌.. తన వరల్డ్‌కప్‌ జట్టులో మాత్రం అతడిని ఎంపిక చేయడం గమనార్హం. కాగా టీమిండియా మిడిలార్డర్‌ స్టార్లు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శస్త్ర చికిత్స అనంతరం ఇద్దరూ జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందారు. ఇందులో భాగంగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన అయ్యర్‌, రాహుల్‌.. నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. పూర్తిగా కోలుకుని ఆసియా కప్‌ జట్టులో చోటు సంపాదించారు.

అయితే, రాహుల్‌ను గాయం వెంటాడుతోందని.. అతడు పాకిస్తాన్‌(సెప్టెంబరు 2)తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ జట్టు ప్రకటన సందర్భంగా వెల్లడించాడు. దీంతో అతడిని సెలక్ట్‌ చేసి తప్పు చేశారంటూ ఫైర్‌ అయ్యాడు చిక్కా. 

తిలక్‌, ప్రసిద్‌కు నో ఛాన్స్‌
ఇక అయ్యర్‌తో పాటు ఆసియా కప్‌ ఆడే అవకాశం దక్కించుకున్న హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ సహా ప్రసిద్‌ కృష్ణకు 1983 విన్నర్‌ శ్రీకాంత్‌ తన జట్టులో చోటివ్వలేదు. కాగా క్రిష్ణమాచారి చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న సమయంలో(2011)నే టీమిండియా రెండోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్‌ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. 

వన్డే వరల్డ్‌కప్‌-2023కి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

చదవండి: నవీన్‌కు గట్టి షాక్‌.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌! అయ్యో పాపం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement