India’s squad for #AsiaCup2023 announced: టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మకు లక్కీ ఛాన్స్! జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన రోజుల వ్యవధిలోనే మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. ఆసియా వన్డే కప్-2023లో పాల్గొనబోయే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించింది.
కీలక టోర్నీలో 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. గాయాల కారణంగా సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి వచ్చారు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ నిరూపించుకుని రీఎంట్రీకి సిద్దమయ్యారు.
హైబ్రిడ్ మోడల్‌లో..
ఈ క్రమంలో పాకిస్తాన్, శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్‌లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో ఈ ఇద్దరు స్టార్లు పునరాగమనం చేయనున్నారు. ఇక ఆసియా కప్ జట్టులో సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. కేఎల్ రాహుల్‌కు బ్యాక్యప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూను ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఇక హార్దిక్‌తో పాటు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లకు ఆల్‌రౌండర్లుగా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కగా.. బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో షమీ, సిరాజ్, ప్రసిద్ కృష్ణలకు స్థానం లభించింది.
అరంగేట్రంలో అదరగొట్టి
కాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లలో కలిపి 173 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్‌తో బిజీగా ఉన్న తిలక్ వర్మ ఏకంగా ఆసియా కప్ టోర్నీతో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు.
ఆసియా వన్డే కప్-2023కి భారత జట్టు:
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
చదవండి: ఐర్లాండ్ కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment