ఆసియా కప్-2023లో పాల్గొనే టీమిండియాకు సంబంధించి పలు కీలక అప్‌డేట్లు వచ్చాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఈనెల 21న ప్రకటిస్తారని తెలుస్తుంది. సెలెక్షన్ కమిటీ మీటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉంటాడని సమాచారం. మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తుంది. ఈ లెక్కన రాహుల్ ఆసియాకప్ జట్టులో ఉండటం ఖాయం.
శ్రేయస్ అయ్యర్ సైతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తున్నప్పటికీ, ఆసియాకప్‌కు అతన్ని ఎంపిక చేస్తారో లేదో క్లారిటీ లేదు. ఒకవేళ సెలెక్టర్లు అయ్యర్‌ను పరిశీలనలోకి తీసుకోకపోతే.. సూర్యకుమార్ యాదవ్ వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటాడని సమాచారం. సెలెక్షన్ కమిటీ మీటింగ్ సందర్భంగా యువ కెరటం తిలక్ వర్మ గురించి కూడా చర్చిస్తారని తెలుస్తుంది.
తిలక్‌ను ఆసియాకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఫామ్, లెఫ్ట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ కావడం అతనికి అడ్వాంటేజ్‌గా మారనుందని తెలుస్తుంది. ఆసియాకప్‌కు సంబంధించి ఈ అంశాలన్ని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్తాన్, శ్రీలంకలు వేదికగా ఆసియాకప్-2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్‌తో మొదలై.. సెప్టెంబర్ 17న కొలొంబోలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మధ్య సమరం సెప్టెంబరు 2న శ్రీలంకలోని పల్లెకెలె వేదిక జరుగనుంది. పాక్‌తో మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 4న టీమిండియా.. నేపాల్‌తో తలపడనుంది.
ఏ గ్రూప్‌లో ఏయే జట్లు..
గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ దశలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
సూపర్-4లో ఎలా..
ఈ దశలో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశ మ్యాచ్‌లు సెప్టెంబరు 6న మొదలై సెప్టెంబరు 15తో ముగుస్తాయి. ఈ దశలో టాప్-2 జట్లు సెప్టెంబరు 17న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment