వైరా నియోజకవర్గంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏవరు గెలుస్తారన్నది పక్కన పెడితే.. రెండు పార్టీలలో గ్రూప్ వార్ చర్చానీయంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ వరించింది. దీంతో పైకి మదన్ లాల్ గెలుపుకోసం పనిచేస్తానని రాములు నాయక్ చెబుతున్నా లోలోపల చేయాల్సిందంతా చేస్తున్నారట.
అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఏకంగా అర డజన్ మంది టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైరా ఎన్నికల సమరంలో కారు దూసుకు పోతుందా? కాంగ్రెస్ తన సత్తా చాటుతుందా.?
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు. పాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం వైరా. కొనిజర్ల, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 1,97,360 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గం హట్‌సీట్‌గా మారునుందనే చెప్పాలి.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరడంతో టికెట్ వచ్చిన వారికి.. రాని వారు సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేకాకుండా మాజీ ఎమ్మెల్యేకు టికెట్ రావడంతో ఎమ్మెల్యేవర్గం ఏమాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. అటు కాంగ్రెస్‌లో సైతం అదే పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైరా కాంగ్రెస్‌లో పెద్ద రచ్చనే చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు అరడజన్ పైనే ఉండటం ఇందుకు కారణం.
వైరా నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా లావుడియా రాముల నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ఎమ్మెల్యే తరుచూ అనేక సమావేశాల్లో నోరు జారీ చిక్కులు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఆయన నోరు జారీన స్పీచ్‌లు నేషనల్ మీడియా వరకు వెళ్లాయంటేనే స్పీచ్‌లు ఏస్థాయిలో డ్యామేజ్ చేశాయో అర్థమవుతుంది. అంతేకాదు ఇండిపెండెంట్‌గా జనం ఆదరించిన ఎమ్మెల్యేరాములు నాయక్ అభివృద్ధి చేసింది ఏమీ చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు.
దీనికి తోడు ఎమ్మెల్యే, ఆయన కోడుకు జీవన్ లాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల లిస్ట్ చాంతడంతా ఉందన్నది లోకల్‌గా ప్రచారం నడుస్తూ వస్తుంది. రాములు నాయక్‌కు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే అన్న ప్రచారం ఉంది. మొత్తం ఈక్వేషన్స్ పరిగణంలోకి తీసుకొని బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేరాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ కేటాయించింది.
బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని బానోత్ మదన్ లాల్ ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోడు భూములకు పట్టాల పంపిణీ, దళితులకు దళిత బంధువు పది లక్షలు ,రైతులకు లక్ష రూపాయాల రుణ మాఫీ బీసీలకు లక్ష రుపాయల ఆర్థిక సహయం ఓట్లు కురిపిస్తాయని మదన్ లాల్ ఆశిస్తున్నారు. మదన్ లాల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లంబడా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి సానుభూతితో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు.
మదన్ లాల్ మా బావ ఆయనకి టికెట్ కేసీఆర్ ఇచ్చాడు.. కేసిఆర్ నా దేవుడు ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టే ఆయన గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. దళిత బంధు విషయంలో మంత్రి పువ్వాడ అజయ్, మదన్ లాల్ కలిసి మదన్ లాల్ వర్గానికి చెందిన 600 మందికి అధికారులు దళితబంధు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండనే ఇదంతా జరిగిందని రాములు నాయక్ ఇటివలే చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారమే లేపాయి.
అంతేకాదు మంత్రి అజయ్‌పై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఇవి కూడా పార్టీలో హట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం రాములు నాయక్‌ను బుజ్జగించడంతో ప్రస్తుతం కొంత సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ బాంబ్ పేలుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైకి రాముల నాయక్ మదన్ లాల్ మా బావ.. కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఓట్లేపిస్తానని పైకి రాములు నాయక్ చెబుతున్న.. రాములు నాయక్ వర్గం మాత్రం మదన్ లాల్‌కు సపోర్ట్ చేసేదే లేదని చెప్పుకొస్తుంది.
సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ రాందాస్ నాయక్ ,బాలాజీ నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, విజయిబాయి.. బీజేపీ నుంచి మోహన్ నాయక్, డీబీ నాయక్, కృష్ణ రాథోడ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు.
వైరా నియోజకర్గంలో లంబాడి ఓట్లు ఎక్కువ. లంబాడి ఓట్లు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. లంబాడి ఓట్ల తర్వాత బీసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటమిలపై వీరి ప్రభావం ఏక్కువగా ఉంటుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైరా నియెజకర్గంలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment