Wyra Constituency
-
వైరాలో వార్.. కారు స్పీడ్‌కు కాంగ్రెస్ బ్రేక్ వేస్తుందా?
వైరా నియోజకవర్గంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏవరు గెలుస్తారన్నది పక్కన పెడితే.. రెండు పార్టీలలో గ్రూప్ వార్ చర్చానీయంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ వరించింది. దీంతో పైకి మదన్ లాల్ గెలుపుకోసం పనిచేస్తానని రాములు నాయక్ చెబుతున్నా లోలోపల చేయాల్సిందంతా చేస్తున్నారట. అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఏకంగా అర డజన్ మంది టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైరా ఎన్నికల సమరంలో కారు దూసుకు పోతుందా? కాంగ్రెస్ తన సత్తా చాటుతుందా.? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు. పాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం వైరా. కొనిజర్ల, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 1,97,360 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గం హట్సీట్గా మారునుందనే చెప్పాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరడంతో టికెట్ వచ్చిన వారికి.. రాని వారు సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకాకుండా మాజీ ఎమ్మెల్యేకు టికెట్ రావడంతో ఎమ్మెల్యేవర్గం ఏమాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. అటు కాంగ్రెస్‌లో సైతం అదే పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైరా కాంగ్రెస్‌లో పెద్ద రచ్చనే చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు అరడజన్ పైనే ఉండటం ఇందుకు కారణం. వైరా నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా లావుడియా రాముల నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ఎమ్మెల్యే తరుచూ అనేక సమావేశాల్లో నోరు జారీ చిక్కులు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఆయన నోరు జారీన స్పీచ్‌లు నేషనల్ మీడియా వరకు వెళ్లాయంటేనే స్పీచ్‌లు ఏస్థాయిలో డ్యామేజ్ చేశాయో అర్థమవుతుంది. అంతేకాదు ఇండిపెండెంట్‌గా జనం ఆదరించిన ఎమ్మెల్యేరాములు నాయక్ అభివృద్ధి చేసింది ఏమీ చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే, ఆయన కోడుకు జీవన్ లాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల లిస్ట్ చాంతడంతా ఉందన్నది లోకల్‌గా ప్రచారం నడుస్తూ వస్తుంది. రాములు నాయక్‌కు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే అన్న ప్రచారం ఉంది. మొత్తం ఈక్వేషన్స్ పరిగణంలోకి తీసుకొని బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేరాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని బానోత్ మదన్ లాల్ ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోడు భూములకు పట్టాల పంపిణీ, దళితులకు దళిత బంధువు పది లక్షలు ,రైతులకు లక్ష రూపాయాల రుణ మాఫీ బీసీలకు లక్ష రుపాయల ఆర్థిక సహయం ఓట్లు కురిపిస్తాయని మదన్ లాల్ ఆశిస్తున్నారు. మదన్ లాల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లంబడా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి సానుభూతితో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. మదన్ లాల్ మా బావ ఆయనకి టికెట్ కేసీఆర్ ఇచ్చాడు.. కేసిఆర్ నా దేవుడు ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టే ఆయన గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. దళిత బంధు విషయంలో మంత్రి పువ్వాడ అజయ్, మదన్ లాల్ కలిసి మదన్ లాల్ వర్గానికి చెందిన 600 మందికి అధికారులు దళితబంధు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండనే ఇదంతా జరిగిందని రాములు నాయక్ ఇటివలే చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారమే లేపాయి. అంతేకాదు మంత్రి అజయ్‌పై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఇవి కూడా పార్టీలో హట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం రాములు నాయక్‌ను బుజ్జగించడంతో ప్రస్తుతం కొంత సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ బాంబ్ పేలుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైకి రాముల నాయక్ మదన్ లాల్ మా బావ.. కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఓట్లేపిస్తానని పైకి రాములు నాయక్ చెబుతున్న.. రాములు నాయక్ వర్గం మాత్రం మదన్ లాల్‌కు సపోర్ట్ చేసేదే లేదని చెప్పుకొస్తుంది. సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ రాందాస్ నాయక్ ,బాలాజీ నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, విజయిబాయి.. బీజేపీ నుంచి మోహన్ నాయక్, డీబీ నాయక్, కృష్ణ రాథోడ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. వైరా నియోజకర్గంలో లంబాడి ఓట్లు ఎక్కువ. లంబాడి ఓట్లు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. లంబాడి ఓట్ల తర్వాత బీసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటమిలపై వీరి ప్రభావం ఏక్కువగా ఉంటుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైరా నియెజకర్గంలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాంగిరేస్‌లో... హైరానా!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం వేట మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉన్నా ఆలోపు ఏం జరగనుందోనన్న ఆందోళన ఆశావహుల్లో కనిపిస్తోంది. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి నలుగురు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి అనుచర వర్గాలు తమకే టికెట్లు వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ఇంతలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిక ఖరారైంది. అయితే, ఆయన పార్టీలో చేరకముందే కొన్ని నియోజకవర్గాలకు తన తరఫున అభ్యర్థులను ప్రకటించడంతో ఆశావహుల్లో కంగారు మొదలైంది. నియోజకవర్గాల వారీగా ఇలా... ● కొత్తగూడెం అసెంబ్లీ సీటు జనరల్ కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా పట్టు వదలకుండా రేణుకా చౌదరి వర్గానికి చెందిన ఎడవల్లి కృష్ణ ఎన్నికల బరిలో నిలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే, భట్టి వర్గానికి చెందిన నాగ సీతారాములు కూడా టికెట్ వేటలో ఉన్నారు. ఇంకా అలాగే భట్టి అనుచర నేత పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడమే కాక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. వీరు కాకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను మూడు నియోజకవర్గాల్లో ఒకటి ఎంచుకుంటానని చెప్పడంతో జాబితాలో ఖమ్మం లేదా కొత్తగూడెం ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ♦ భద్రాచలం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొదెం వీరయ్య డీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొదటి ప్రాధాన్యతగా టికెట్లు ఇవ్వనుండడంతో ఆయనకే టికెట్ ఖాయమని సమాచారం. అయితే ఈ స్థానంపై పొంగులేటి ప్రధాన అనుచరుడైన తెల్లం వెంకట్రావు ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, 2018లో టీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేశారు. ♦ ఇల్లెందు నియోజవర్గంలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇక్కడ చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, డాక్టర్ రాంచందర్‌నాయక్, డాక్టర్ జి.రవి, బానోతు విజయలక్ష్మి, కామేపల్లి జెడ్పీటీసీ వెంకటప్రవీణ్‌నాయక్ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఇద్దరు నేతలు భట్టి వర్గం వారు కాగా, మిగతా నేతలు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేణుకౌచౌదరి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వర్గాలకు చెందినవారు. వీరిలో చీమల వెంకటేశ్వర్లు ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను కలిశారు. ఇక జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పొంగులేటి వర్గం నుంచి టికెట్ ఆశిస్తుండగా, ఆయన అభ్యర్థిత్వాన్ని పొంగులేటి కూడా ప్రకటించారు. ♦ అశ్వారావుపేటకు సంబంధించి 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తాటి వెంకటేశ్వర్లు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ స్థానం టికెట్ తనదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. అయితే పొంగులేటి తన వర్గం అభ్యర్థిగా జారె ఆదినారాయణను ప్రకటించడంతో టికెట్ ఎవరికనే చర్చ జరుగుతోంది. ♦ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, కోటూరి మానవతారాయ్, మట్టా దయానంద్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరంతా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మట్టా దయానంద్ ఇటీవలే రేణుకాచౌదరి నేతృత్వాన పార్టీలో చేరగా.. ఈ నియోజకవర్గానికి సంబంధించి కొండూరి సుధాకర్‌ను పొంగులేటి తన అభ్యర్థిగా చెబుతున్నారు. దీంతో టికెట్ తమకేననే ధీమాలో ఉన్న వీరు కేడర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ♦ వైరా నియోజకవర్గంలో పోటీ చేసేందుకు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి వర్గం నుంచి ధరావత్ రామ్మూర్తినాయక్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం నుంచి మాలోతు రాందాస్‌నాయక్, బానోత్ బాలాజీనాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఇక్కడ పొంగులేటి వర్గం నుంచి అభ్యర్థిగా బానోతు విజయాబాయిని ప్రకటించడంతో టికెట్ కోసం బహుముఖ పోటీ నెలకొంది. ♦ పాలేరు నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌తో కలిసిపోతున్నారు. మరోవైపు మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి వర్గానికి చెందిన రామసహాయం మాధవిరెడ్డి, మద్ది శ్రీనివాస్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఇక్కడ పొంగులేటి వర్గం నుంచి మద్దినేని బేబి స్వర్ణకుమారి టికెట్ ఆశిస్తున్నారు. ♦ ఖమ్మంలోనూ రేణుకా చౌదరి, భట్టి అనుచరులు ఒకరిద్దరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వీరిని బరిలో నిలిపేందుకు బలమైన అభ్యర్థులు కారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ స్థానం నుంచి పొంగులేటి కూడా పోటీలో ఉంటారన్న ప్రచారం మొదలైంది. ♦ పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వర్లు అధికార పార్టీకి దీటైన అభ్యర్థి అని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ♦ మధిర నుంచి సీఎల్పీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. పొంగులేటి వర్గం నుంచి కోటా రాంబాబు ఉన్నప్పటికీ.. భట్టినే బరిలో ఉండనున్నారు. అధిష్టానం వద్దకు క్యూ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆశావహులు కాంగ్రెస్ అధిష్టానం వద్దకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పినపాక, ఖమ్మం, మధిర నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట టికెట్ కోసం త్రిముఖ, బహుముఖ పోటీ నెలకొంది. ఇటీవల ఇల్లెందుకు చెందిన నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలవగా.. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి నేతృత్వంలో వైరా నియోజకవర్గం నుంచి రామ్మూర్తి నాయక్, సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా దయానంద్, ఖమ్మంకు చెందిన ఎం.డీ.ముస్తఫా తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను గురువారం కలిశారు. అలాగే, వీరు శుక్రవారం ఢిల్లీలో టీ పీసీసీ ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేను కూడా కలవడం గమనార్హం. ఇక పొంగులేటి పార్టీలో చేరనుండడంతో పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య పెరగగా.. టికెట్ రేసులో ఉన్న ఆశావహులు, వారి అనుచరుల్లో హైరానా నెలకొంది. -
బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట.. మరి టికెట్ ఎవరికో?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో బహు నాయకత్వంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ బీఆర్ఎస్ కేడర్‌తోపాటు సామాన్యుల్లోనూ నెలకొంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, బానోతు చంద్రావతి టికెట్ వేటలో ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారే అధిష్టానం దృష్టిలో పడేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తుండగా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని విధాలుగా నెగ్గుకురాగల నేతకే బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందనే వాదన వినిపిస్తోంది. సై అంటే సై.. గతంలో నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇద్దరు నేతలు కార్యక్రమాల్లో వేగం పెంచారు. నిత్యం స్థానికంగా పలు కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజల మధ్య ఉంటూనే పార్టీ పిలుపునిచి్చన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా లావుడ్యా రాములు నాయక్, బానోత్ మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగానే వేడుకలు నిర్వహించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను కావడంతో తానే బరిలో ఉంటానని లావుడ్యా రాములునాయక్.. గత ఎన్నికల్లో ఓటమి చెందినా పార్టీకి విధేయుడిగా ఉన్నందున తనకే టికెట్ వస్తుందన్న ధీమాలో మదన్‌లాల్ ఉన్నారు. రంగంలోకి చంద్రావతి.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం చంద్రావతికి ప్రభుత్వం టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న ఆమె... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వైరాలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని, నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తాజాగా కారేపల్లిలో మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ విధేయురాలిగానే ఉన్నానని, సీఎం కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉందని.. ఆయన ఆదేశిస్తే తాను బరిలో నిలుస్తానని పేర్కొన్నారు. దీంతో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొన్నట్లయింది. ఈసారైనా జెండా ఎగురవేయాలని.. 2014, 2018 ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. అయితే వచ్చే ఎన్నికల్లోనైనా పార్టీ జెండా ఎగురవేయాలని నాయకత్వం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులతో మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే రాములునాయక్ వర్గాలు నియోజకవర్గంలో దూకుడు పెంచాయి. పొంగులేటి ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వరుసగా అన్ని మండలాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు జిల్లా నాయకత్వంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీ కూడా హాజరవుతుండడంతో వైరాలో ఎన్నికల వేడి మొదలైనట్లయింది. ముగ్గురూ ముగ్గురే.. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్లోని ముగ్గురు నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 2014 ఏడాదిలో బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) నుంచి బానోతు చంద్రావతి బరిలో నిలిచి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన బానోత్ మదన్‌లాల్ గెలిచారు. అనంతర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరిన మదన్‌లాల్ 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లావుడ్యా రాములు నాయక్, సీపీఐ అభ్యర్థిగా విజయాబాయి, సీపీఎం అభ్యర్థిగా వీరభద్రం పోటీ పడడంతో రాములునాయక్ గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ పరిణామాలతో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థాయి నేతలు ముగ్గురు కొనసాగుతున్నారు. వీరు ముగ్గురూ బలమైన నేతలే కావడంతో టికెట్ కోసం అధిష్టానం వద్ద ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
నేను సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్‌గా మార్చకండి
సాక్షి, ఖమ్మం: తాను ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌లాగా పనిచేశానని, తనలో ఉన్న హార్డ్‌వేర్‌ను బయటకు తీయొద్దని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై హార్డ్‌వేర్ ప్రయోగిస్తానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారడానికి కార్యకర్తలు ఎవరూ ప్రయత్నించవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని చెప్పారు. వైరా నుంచి తిరిగి తనను రెండోసారి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దార్నా శేఖర్, బాణాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు విశ్వేశ్వరరావు, డాక్టర్ కోటయ్య, పవిత్రకుమారి, లక్ష్మీబాయి, రామారావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (గంటల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి) -
అప్పుడు నా జీతం రూ.147 : ఎమ్మెల్యే
నాడు ప్రజా రక్షకుడిని.. నేడు ప్రజా సేవకుడిని కష్టాలు, కన్నీళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించా.. ప్రజలతో మమేకం కావడమంటే నాకెంతో ఇష్టం పర్సనల్ టైమ్‌లో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ‘నా చిన్ననాటి జీవితం పుట్టెడు కష్టాలతో ప్రారంభమైంది. వ్యవసాయ కుటుంబం కావడంతో కరువు కాటకాలతో మొక్కజొన్న అన్నం, జొన్నరొట్టెతో కడుపు నింపుకున్నా. కష్టాలను, కన్నీళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించా. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత నాకు అక్షరాలా వర్తిస్తుంది. కష్టాల కడలి నుంచి కానిస్టేబుల్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించా. పోలీస్ శాఖలో పని చేసినంత కాలం అనేక క్రీడా పోటీల్లో పాల్గొని అథ్లెటిక్స్ చాంపియన్‌గా బహుమతులు గెలుచుకున్నా. రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనేక అవార్డులు దక్కించుకున్నా. నాడు ప్రజా పోలీస్‌గా.. నేడు ప్రజా సేవకుడిగా సేవచేసే మహోన్నత అవకాశం నాకు దక్కింది. ఇది ఎంతో సంతృప్తినిస్తోంది’ అంటున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో ఈ వారం పర్సనల్ టైమ్. సాక్షిప్రతినిధి, ఖమ్మం: కనీస సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గ్రామమైన జూలూరుపాడు మండలం పాపకొల్లు మా సొంతూరు. చిన్నప్పుడు కనీస వసతులు లేక పాఠశాలకు వెళ్లడానికి సైతం అనేక ప్రయాసలకు గురైన దీనస్థితి. వాటిని తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది. ఏ హోదాలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పం, సేవాభావమే నన్ను ఎమ్మెల్యేగా చేసింది. వ్యవసాయ కుటుంబం మాది. అనేక కష్టాలకోర్చి జీవనం సాగించిన కుటుంబం మాది. బాల్య దశలో కరువును సైతం మా కుటుంబం అనుభవించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మొక్కజొన్న అన్నం, జొన్న రొట్టెలతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కరువుతో కూడిన చీకటి రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది. సుశిక్షితులైన పోలీస్ అధికారుల నేతృత్వంలో పోలీస్ ఉద్యోగం నిర్వహించడం వల్ల అనేక అంశాలపై పట్టు లభించింది. ఈ పని రాములునాయక్ మాత్రమే చేయగలుగుతాడు. ఈ క్లిష్ట సమస్యను ప్రజలతో ఒప్పించగలిగే నేర్పు అతడి సొంతం అనే స్థాయిలో పోలీస్ శాఖలో నా పనితీరు ఉండేది. అనేక క్లిష్ట సమయాల్లో ప్రజలను సమాధానపరచడానికి, పోలీస్ పరంగా వారి సహకారం తీసుకోవడానికి పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆ బాధ్యతను నాపైనే ఉంచడం ఇప్పటికీ నాకెంతో ఆనందాన్ని, ఒకింత గర్వాన్ని ఇస్తుంది. ప్రజల్లో ఒకడిగా నన్ను ఆయా ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకున్న తీరు సైతం ఎంతో సంతృప్తినిచ్చే అంశం.. పోలీస్ పరంగా ప్రజల నుంచి కావాల్సిన సహకారాన్ని వారికి వివరించే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం పోలీసు అధికారులు దృష్టికి నిక్కచ్చిగా.. నిర్మొహమాటంగా తీసుకెళ్లడంతో పోలీస్ శాఖలో నన్ను ప్రజా పోలీస్ అనేవాళ్లు. విషయాన్ని నిర్మొహమాటంగా, సున్నితంగా సందర్భాన్నిబట్టి ఇటు పోలీస్ అధికారులకు, అటు ప్రజలకు వివరించడం వల్ల అనేక సమస్యలను అధిగమించిన పరిస్థితి ఉండేది. ఉద్యోగపరంగా మారుమూల గ్రామాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు మాకు కేవలం పోలీస్ స్టేషన్లో ఉండే వైర్లెస్ సెట్ మాత్రమే మార్గం. నేను పనిచేస్తున్న ప్రాంతం నుంచి మా సొంతూరి పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్‌కు సెట్లో మాట్లాడి.. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం. కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రత ఉన్నా వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడి సాటి ఉద్యోగుల సహకారంతో కుటుంబ సమస్యలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మాది ఉమ్మడి కుటుంబం. సోదరులందరం కలిసే ఉండేవాళ్లం. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య మాకు ఆత్మీయతానుబంధాలు ఎక్కువ. రూ.147 వేతనంతో.. రూ.147 నెలసరి వేతనంతో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పిల్లలను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ఉండేది. అందుకు అనుగుణంగానే నా కుమారుడు జీవన్ సివిల్ సర్వీస్‌లో ర్యాంక్ సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిలో ఝాన్సీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. జయశ్రీ ఆబ్కారీ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో నా సతీమణి రాంబాయి పాత్ర కీలకం. నేను పోలీస్ ఉద్యోగంలో మారుమూల గ్రామంలో పనిచేస్తున్నా.. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా ఓర్పు.. నేర్పుతో ఆవిడ వ్యవహరించేది. ఇప్పుడు నేను రాజకీయాల్లో తలమునకలైనా కుటుంబ విషయాలు, అవసరాలు ఆవిడే చూసుకుంటుంది. ఆవిడ సహకారం వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి సమయాన్ని వెచ్చించగలుగుతున్నా. నాకు చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. జీవితంలో అత్యంత సంతోషం కలిగిన రోజు జీవన్‌కు సివిల్ సర్వీస్‌లో ర్యాంకు లభించిన రోజు. ఇక పోలీస్ శాఖలో దాదాపు 37 ఏళ్లు వివిధ హోదాల్లో సేవలందించా.. ఇప్పటికీ పోలీస్ శాఖలో నాకు అన్ని హోదాల్లో మంచి మిత్రులున్నారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతోపాటు కుటుంబ విషయాలను మాట్లాడుకోవడం ఇప్పటికీ నాకు రివాజు. అనేక మంది నాతో పనిచేసిన సహచరులు వివిధ హోదాల్లో ఉన్నారు. వారి ద్వారా ప్రజా సమస్యలను సైతం తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పట్లో నాకు ఎంప్లాయ్మెంట్ కార్డు ఉండడంతో సీనియార్టీ ద్వారానే పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం లభించింది. అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజల పక్షాన పనిచేసే.. వారికి సేవచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉంటుంది. ఇక సేవా కార్యక్రమాల నిర్వహణ నా జీవితంలో ఒక భాగంగా మారింది. పోలీస్ శాఖలో ఏ హోదాలో ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా.. ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నది నా తపన. అందుకోసం అనేక ప్రాంతాల్లో వందలాది మందికి కంటి చికిత్సలు చేయించా. రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండేందుకు నావంతు సహకారం అందించా. పోలీస్ శాఖలో పని చేసినంత కాలం అథ్లెటిక్స్ చాంపియన్‌గా అనేక పోటీల్లో పాల్గొని అవార్డులు సాధించాను. విశేషం ఏమిటంటే.. మా ముగ్గురు పిల్లలు సైతం క్రీడాకారులే. అథ్లెటిక్స్‌లో వారిది అందెవేసిన చేయి. అయితే వారంతా తమ ప్రతిభ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. క్రీడా కోటాను ఉపయోగించుకోలేదు. ఇక అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు సమయం చిక్కినా పెండింగ్ సమస్యలపై, కుటుంబ అవసరాలపై దృష్టి సారించడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తా. సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడక కొన్ని ఏళ్లయింది. ఏ సినిమా చూడాలన్నా పిల్లలు ఇంట్లోనే చూసే వెసులుబాటు కల్పించారు. ప్రజాప్రతినిధిగా విద్యాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి మారుమూల గ్రామంలో విద్య పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలనేది నా ఆకాంక్ష. నాకు లభించే ప్రతి అవకాశం అందుకోసమే వినియోగిస్తా. -
ఖమ్మం: వేగం పెంచిన అభ్యర్థులు
ఎన్నికలకు ఆది.. అంతం ఉండదు. పాత నీరు పోతుంది.. కొత్త నీరు వస్తుంది. ఇది కాల గమనం. అదేవిధంగా ప్రజలు కూడా పాత నాయకులను మరిచిపోతుంటారు. కొత్త నాయకులను స్వాగతిస్తుంటారు. ఇదే బాటలో వైరా నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన మెజార్టీ నాయకులు, కార్యకర్తలు పయనిస్తున్నారు. స్థానిక ప్రజలను, నమ్ముకున్న వారికి మేలు చేయలేని అభ్యర్థులను తిరస్కరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కొత్తగా ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములుకు జై కొడుతున్నారు. ఆ పరిణామాలు ఎందుకు ఏర్పడ్డాయో ఎవరికీ అంతగా తెలియవు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. ఈ ఉత్కంఠతకు తెరపడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సాక్షి, వైరా: ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో వైరా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అయితే పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలను అప్పగించారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం వల్ల వారి సమస్యల గుర్తించి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 13 మంది పోటీ చేస్తున్నారు. పోటీ ఎలా ఉన్నా పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచారం నిర్వహించడం వల్ల ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్ల వివరాలను తెలుసుకుంటున్నారు. ఓటర్లకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడానికి అధికార టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం అయ్యారు. మరోవైపు మహాకూటమి అభ్యర్థి కూడా ప్రచారంలో ముందన్నప్పటికీ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల పూర్తి స్థాయి మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రచారంలో ఓటర్ల నుంచి అంతగా స్పందన రావటం లేదు. అలాగే ఓటర్ల సమస్యలను తెలుసుకుని తమ నాయకుడు గెలిస్తే పరిష్కార మార్గాలపై హామీలు ఇస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు 10 మంది నుంచి 15 మంది కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. ప్రచారంలో వెనుపడ్డ బీజేపీ.. నియోజకవర్గంలో రెండోసారి పోటీలో ఉన్న బీజేపీ ప్రచారంలో వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడి బీజేపీ అభ్యర్థినికి సినిమా గ్లామర్ ఉన్నప్పటికీ ఎన్నికల కోసమే నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకుల్లో సమన్వయం లోపించటంతో ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కల్పిచటం లేదు. అత్యధిక ఓటర్లు బీసీ వర్గం కాగా గిరిజనులు వారితోపాటు ఉన్నప్పటికీ ఇక్కడి బీజేపీ అభ్యర్థి రేష్మారాథోడ్ను ఆదరిస్తారో.. లేదో.. వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. 2009లో బీజేపీ నుంచి మీసాల వెంకటేశ్వర్లు పోటీ చేసి 1,171 ఓట్ల సాధించాడు. 2014లో టీడీపీతో పొత్తు కలవటంతో ఇక్కడ పోటీచేసే అవకాశం కూడా లేకపోయింది. ఈ ఎన్నికల్లో అయినా ఆశించిన స్థాయిలో ఓట్లు సాధిస్తారా.. లేదా.. అనే సందేహం స్థానికుల్లో నెలకొంది. సీపీఎంకు గిరిజనుల ఓట్లే కీలకం.. నియోజకవర్గంలో మొదటిసారిగా ఒంటరిగా బరిలో నిలిచిన సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం గిరిజన సమస్యలపై.. పోడు భూములకు పట్టాలకై.. జైలుకెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వారి సమస్యలపై తాను చేసిన పోరాట ఫలితంగా ఇక్కడ ఆ పార్టీకి ఓట్లు ఏ విధంగా రాలతాయో వేచి చూడాల్సిందే. మరోవైపు సీపీఐ పార్టీ గుర్తు, సీపీఎం గుర్తు ఈవీఎంలో మొట్టమొదటి సరిగా కనిపిస్తుండటం, రెండు గుర్తులు కూడా ఒకదాని తరువాత ఒకటి ఉండటంతో ఓటర్లు ఏ మేరకు ఓట్లు వేస్తారో కూడా తెలియని పరిస్థితి. రాములుకు కలిసోచ్చిన గుర్తు.. నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన బలమైన నాయకులు లావుడ్యా రాములుకు అండగా నిలవటం, పార్టీలతో ప్రమేయం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, రాములుకు ‘రైతు నాగలి’ గుర్తు రావటం వంటి విషయాలు ఆయనకు కలిసి వచ్చాయని చెప్పవచ్చు. కాంగ్రెస్, టీఆర్ఎస్లో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు రాములుకు మద్దతు ఇవ్వడంతో రాములు విజయంపై చర్చలు జరుగుతున్నారు. ఏదిఏమైనప్పటికీ త్వరలో జరగనున్న ఎన్నికలు, వాటి ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరిన్ని వార్తాలు... -
రాస్తారోకో కేసులో ఎమ్మెల్యే చంద్రావతి అరెస్ట్
ఏన్కూరు న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు చంద్రావతిని ఏన్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 11న ఏన్కూరులో మంత్రి రాంరెడ్డి భూపట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా లబ్ధిదారులకు సరైన సౌకర్యాలు కల్పించ లేదని ఎమ్మెల్యే రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కల్పించారని ఎమ్మెల్యేతో సహా పలువురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యేను అరెస్టు చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.