సాక్షిప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో బహు నాయకత్వంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ బీఆర్‌ఎస్ కేడర్‌తోపాటు సామాన్యుల్లోనూ నెలకొంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, బానోతు చంద్రావతి టికెట్ వేటలో ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారే అధిష్టానం దృష్టిలో పడేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తుండగా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని విధాలుగా నెగ్గుకురాగల నేతకే బీఆర్‌ఎస్ టికెట్ దక్కుతుందనే వాదన వినిపిస్తోంది.
సై అంటే సై..
గతంలో నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇద్దరు నేతలు కార్యక్రమాల్లో వేగం పెంచారు. నిత్యం స్థానికంగా పలు కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజల మధ్య ఉంటూనే పార్టీ పిలుపునిచి్చన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా లావుడ్యా రాములు నాయక్, బానోత్ మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగానే వేడుకలు నిర్వహించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను కావడంతో తానే బరిలో ఉంటానని లావుడ్యా రాములునాయక్.. గత ఎన్నికల్లో ఓటమి చెందినా పార్టీకి విధేయుడిగా ఉన్నందున తనకే టికెట్ వస్తుందన్న ధీమాలో మదన్‌లాల్ ఉన్నారు.
రంగంలోకి చంద్రావతి..
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం చంద్రావతికి ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న ఆమె... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వైరాలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని, నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తాజాగా కారేపల్లిలో మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ విధేయురాలిగానే ఉన్నానని, సీఎం కేసీఆర్‌పై తనకు నమ్మకం ఉందని.. ఆయన ఆదేశిస్తే తాను బరిలో నిలుస్తానని పేర్కొన్నారు. దీంతో వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొన్నట్లయింది.
ఈసారైనా జెండా ఎగురవేయాలని..
2014, 2018 ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఓటమి చవిచూసింది. అయితే వచ్చే ఎన్నికల్లోనైనా పార్టీ జెండా ఎగురవేయాలని నాయకత్వం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులతో మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే రాములునాయక్ వర్గాలు నియోజకవర్గంలో దూకుడు పెంచాయి. పొంగులేటి ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వరుసగా అన్ని మండలాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు జిల్లా నాయకత్వంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీ కూడా హాజరవుతుండడంతో వైరాలో ఎన్నికల వేడి మొదలైనట్లయింది.
ముగ్గురూ ముగ్గురే..
వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోని ముగ్గురు నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 2014 ఏడాదిలో బీఆర్‌ఎస్(అప్పటి టీఆర్‌ఎస్) నుంచి బానోతు చంద్రావతి బరిలో నిలిచి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి దిగిన బానోత్ మదన్‌లాల్ గెలిచారు. అనంతర పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన మదన్‌లాల్ 2018 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లావుడ్యా రాములు నాయక్, సీపీఐ అభ్యర్థిగా విజయాబాయి, సీపీఎం అభ్యర్థిగా వీరభద్రం పోటీ పడడంతో రాములునాయక్ గెలిచి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఈ పరిణామాలతో వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్థాయి నేతలు ముగ్గురు కొనసాగుతున్నారు. వీరు ముగ్గురూ బలమైన నేతలే కావడంతో టికెట్ కోసం అధిష్టానం వద్ద ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment