అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై నామినేషన్ల పర్వానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రచార పర్వంలో ఎదురయ్యే సవాళ్లు, ప్రతి సవాళ్లపై లోతుగా పోస్ట్‌మార్టం చేస్తోంది. పార్టీతోపాటు అభ్యర్థుల బలాలు, బలహీనతలు, గెలుపు అవకాశాలు, విపక్షాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. తెలంగాణ ఉద్యమ పార్టీ మొదలై అధికార పార్టీగా తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానం ఓట్లు సాధించి పెడుతుందనే ధీమా బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర అంశాలు తమను మూడోసారి అధికారంలోకి తెస్తాయని నమ్ముతోంది.
వ్యతిరేకతను ఇలా అధిగమించాలని..
2014లో తొలిసారి ఉద్యమ చైతన్యం, రెండోసారి 2018లో సంక్షేమ సంబురం అధికారంలోకి తీసుకురాగా.. ఇప్పుడు మూడోసారి ‘పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం’ తమను అధికారంలోకి తెస్తుందని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయితే.. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉండటంతో అటు ప్రభుత్వం, ఇటు బీఆర్‌ఎస్ అభ్యర్థులపై నెలకొన్న కొద్దిపాటి వ్యతిరేకతను ‘తెలంగాణ మోడల్’తో అధిగమించాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పారీ్టలు వాటి వాస్తవ బలం కంటే ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయన్న అంచనాతో ఇందుకు దీటుగా వ్యూహాలకు పదును పెడుతోంది.
పనితీరుతో మూడోసారి అధికారం
తెలంగాణ సాధనలో, సీఎంగా కేసీఆర్ సాధించిన ఫలితాలు మూడోసారి అధికారాన్ని సాధించి పెడతాయనే ధీమా బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా వంటి పథకాలు పార్టీ సానుకూల ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేశాయన్న భావన వ్యక్తమవుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సరఫరా మెరుగుదల, వైద్య రంగం బలోపేతం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అంశాలు సానుకూలత తెస్తాయని బీఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు..
రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త ఉపాధి అవకాశాలు, ఐటీ, ఫార్మా, బయోటెక్ రంగాలకు రాష్ట్రం హబ్‌గా మారడం, మెరుగైన శాంతిభద్రతలు వంటివి పార్టీ గెలుపునకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు సాధించిన బీఆర్‌ఎస్.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ పాజిటివ్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. క్షేత్రస్థాయిలో 65లక్షల మందితో కూడిన పార్టీ యంత్రాంగం, పార్టీ ఖాతాలోని రూ.1,250 కోట్ల నిధులతో అంగ, అర్థబలం కలసివస్తాయని భావిస్తోంది.
జనంలోకి ఇలా...
ఇప్పటికే తెలంగాణ మోడల్‌ను జాతీయస్థాయిలో ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ అంశానికి పెద్దపీట వేయాలని భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలనలోని లోపాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందన్న అంశాలను విస్తృతంగా ప్రచారం చేయా లని భావిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, ఆసరా పెన్షన్ల పెంపు, పేదలకు జీవిత బీమా, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం వంటి హామీలు ప్రజలను ఆకట్టుకోవడం ఖాయమన్న ధీమాతో ఉంది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రంలో సగానికిపైగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ నెల 15 నుంచే కేసీఆర్ కూడా పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగారు.
ప్రతికూలతలున్న చోట ప్రతివ్యూహాలు
పోలింగ్‌కు వంద రోజులు ముందే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ 115 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. మిగతాచోట్ల క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిందిగా ఆశావహులకు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న వారిలో ఎక్కువ మంది వరుసగా రెండు, మూడుసార్లుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారే. వారిలో కొందరు పారీ్టలో అంతర్గత అసమ్మతిని, ప్రజాక్షేత్రంలో కొంత మేర ఇబ్బందులు పడుతున్నారని భావిస్తున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నేరుగా రంగంలోకి దిగింది.
కేసీఆర్ సూచనలకు అనుగుణంగా కేటీఆర్, హరీశ్‌రావు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, గతంలో ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన నేతలను అక్కున చేర్చుకోవడం తదితరాల ద్వారా ప్రత్యర్ధి పక్షాలను అష్ట దిగ్బంధనం చేసే వ్యూహాలను అమలు చేస్తున్నారు.
-కల్వల మల్లికార్జున్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment