సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే.. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపు (సోమవారం) అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రకటన వెలువడనుంది. సీఎం కేసీఆర్ ఈ పేర్ల ప్రకటన చేస్తుండడంతో.. బీఆర్‌ఎస్ రేసు గుర్రాలపై మరింత ఆసక్తి నెలకొంది.
బీఆర్‌ఎస్ అధికారిక జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందుగా చెప్పినట్లు 96 కాకుండా.. ఏకంగా 105 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మిగతా నియోజకవర్గాల విషయంలో ‘లెక్క తేల్చిన’ తర్వాతే అభ్యర్థుల పేర్ల ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం.. పది మంది సిట్టింగ్‌లకైనా ఉద్వాసన తప్పదని లీకులు అందుతున్నాయి.
వివాదాల్లో నిలిచిన వాళ్లతో పాటు పార్టీకి ట్రబుల్ మేకర్స్‌గా ఉన్నవాళ్లను పక్కనపెట్టేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీలకు అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది కూడా. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు.. మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పు లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
మాలో ఒకరికి ఇవ్వాలి, అంతేగానీ..
చాలా నియోజకవర్గాల్లో ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అసమ్మతి గండాలు దాటుకుని ఎంత మంది చివరి లిస్ట్ దాకా చేరుకుంటారో అనే ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా.. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ స్థానంలో బండారి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈ ప్రచారంతో హుటాహుటిన ఎమ్మెల్సీ కవితను కలిసి సుభాష్‌రెడ్డి, బొంతు రామ్మోహన్‌లు చర్చించినట్లు తెలుస్తోంది. ఇస్తే టికెట్ ఇద్దరిలో ఎవరికో ఒకరికే ఇవ్వాలని.. మరొకరికి ఇస్తే పరిణామాలు మారిపోవచ్చని వాళ్లు ఆమెకు తెలియజేసిటనట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆమె వాళ్లకు చెప్పినట్లు సమాచారం.
రేపు ఉదయం 11.05 గంటలకు..
బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన.. రేపు ఉదయం 11.05 గంటలకు ముహూర్తం ఖరారు అయ్యింది. శ్రావణ సోమవారం, పంచమి రోజు 105 మంది పేర్లు ప్రకటించనున్నారు. తెలంగాణ భవన్ నుంచి సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లపై ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఎంతో మంది సీటు ఆశించినా.. ఒక్కరికే అవకాశం దక్కుతుందని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి సమిష్టిగా అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులకు ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాట్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అయితే అసంతృప్త నేతలు.. వాళ్ల వాళ్ల అనుచర గణంతో కేసీఆర్‌ను కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్లు రాని సిట్టింగులకు, ఆశావహులకు బుజ్జగింపులు పూర్తయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment