సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించడంతో.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ పార్టీ ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. అదే రోజు బీఫామ్స్‌ను అభ్యర్థులకు అందజేయడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
ఇక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. నాలుగు రోజుల పాటు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15., 16., 17.,18 తేదీల్లో ఈ టూర్ ఖరారైంది. 15వ తేదీ బీఫామ్స్ అందజేసి.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తారు కేసీఆర్. అదే రోజు.. హుస్నాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో, అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం జడ్చర్లలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
ఇక.. నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డిలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు వేసి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నాం కామారెడ్డికి వెళ్లి మరో నామినేషన్ వేస్తారు. ఆపై అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment