ఎన్నికలకు ఆది.. అంతం ఉండదు. పాత నీరు పోతుంది.. కొత్త నీరు వస్తుంది. ఇది కాల గమనం. అదేవిధంగా ప్రజలు కూడా పాత నాయకులను మరిచిపోతుంటారు. కొత్త నాయకులను స్వాగతిస్తుంటారు. ఇదే బాటలో వైరా నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన మెజార్టీ నాయకులు, కార్యకర్తలు పయనిస్తున్నారు. స్థానిక ప్రజలను, నమ్ముకున్న వారికి మేలు చేయలేని అభ్యర్థులను తిరస్కరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కొత్తగా ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములుకు జై కొడుతున్నారు. ఆ పరిణామాలు ఎందుకు ఏర్పడ్డాయో ఎవరికీ అంతగా తెలియవు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. ఈ ఉత్కంఠతకు తెరపడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
సాక్షి, వైరా: ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో వైరా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అయితే పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలను అప్పగించారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం వల్ల వారి సమస్యల గుర్తించి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 13 మంది పోటీ చేస్తున్నారు. పోటీ ఎలా ఉన్నా పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచారం నిర్వహించడం వల్ల ఫలితాలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్ల వివరాలను తెలుసుకుంటున్నారు. ఓటర్లకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడానికి అధికార టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం అయ్యారు. మరోవైపు మహాకూటమి అభ్యర్థి కూడా ప్రచారంలో ముందన్నప్పటికీ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల పూర్తి స్థాయి మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రచారంలో ఓటర్ల నుంచి అంతగా స్పందన రావటం లేదు. అలాగే ఓటర్ల సమస్యలను తెలుసుకుని తమ నాయకుడు గెలిస్తే పరిష్కార మార్గాలపై హామీలు ఇస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు 10 మంది నుంచి 15 మంది కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు.
ప్రచారంలో వెనుపడ్డ బీజేపీ..
నియోజకవర్గంలో రెండోసారి పోటీలో ఉన్న బీజేపీ ప్రచారంలో వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడి బీజేపీ అభ్యర్థినికి సినిమా గ్లామర్ ఉన్నప్పటికీ ఎన్నికల కోసమే నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ నాయకుల్లో సమన్వయం లోపించటంతో ఓటర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కల్పిచటం లేదు. అత్యధిక ఓటర్లు బీసీ వర్గం కాగా గిరిజనులు వారితోపాటు ఉన్నప్పటికీ ఇక్కడి బీజేపీ అభ్యర్థి రేష్మారాథోడ్‌ను ఆదరిస్తారో.. లేదో.. వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. 2009లో బీజేపీ నుంచి మీసాల వెంకటేశ్వర్లు పోటీ చేసి 1,171 ఓట్ల సాధించాడు. 2014లో టీడీపీతో పొత్తు కలవటంతో ఇక్కడ పోటీచేసే అవకాశం కూడా లేకపోయింది. ఈ ఎన్నికల్లో అయినా ఆశించిన స్థాయిలో ఓట్లు సాధిస్తారా.. లేదా.. అనే సందేహం స్థానికుల్లో నెలకొంది.
సీపీఎంకు గిరిజనుల ఓట్లే కీలకం..
నియోజకవర్గంలో మొదటిసారిగా ఒంటరిగా బరిలో నిలిచిన సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం గిరిజన సమస్యలపై.. పోడు భూములకు పట్టాలకై.. జైలుకెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వారి సమస్యలపై తాను చేసిన పోరాట ఫలితంగా ఇక్కడ ఆ పార్టీకి ఓట్లు ఏ విధంగా రాలతాయో వేచి చూడాల్సిందే. మరోవైపు సీపీఐ పార్టీ గుర్తు, సీపీఎం గుర్తు ఈవీఎంలో మొట్టమొదటి సరిగా కనిపిస్తుండటం, రెండు గుర్తులు కూడా ఒకదాని తరువాత ఒకటి ఉండటంతో ఓటర్లు ఏ మేరకు ఓట్లు వేస్తారో కూడా తెలియని పరిస్థితి.
రాములుకు కలిసోచ్చిన గుర్తు..
నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన బలమైన నాయకులు లావుడ్యా రాములుకు అండగా నిలవటం, పార్టీలతో ప్రమేయం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం, రాములుకు ‘రైతు నాగలి’ గుర్తు రావటం వంటి విషయాలు ఆయనకు కలిసి వచ్చాయని చెప్పవచ్చు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు రాములుకు మద్దతు ఇవ్వడంతో రాములు విజయంపై చర్చలు జరుగుతున్నారు. ఏదిఏమైనప్పటికీ త్వరలో జరగనున్న ఎన్నికలు, వాటి ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment