సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో పంపించిన గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల జాబితాను మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సోమవారం రద్దు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కార్యాలయానికి రాసిన లేఖలో గవర్నర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా మరో జాబితా గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే 12 మంది ఎమ్మెల్సీల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గత మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం 2020 నవంబర్‌లో 12 మంది సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది.
కాని గవర్నర్ ఈ జాబితాను ఆమోదించకుండా సంవత్సర కాలంపాటు పెండింగులో ఉంచారు. ఆ తరువాత శిందే 50 మంది మద్దతుదారులతో తిరుగుబాటుచేసి శివసేన నుంచి బయటపడ్డారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. దీంతో ప్రభుత్వం మారిపోవడంతో గతంలో మహా వికాస్ ఆఘాడి పంపించిన జాబితా నిరుపయోగంగా మారింది. దీంతో ఈ జాబితాను రద్దు చేయాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు గవర్నర్‌కు లేఖ రాశాయి. దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయం ఆఘాడి ప్రభుత్వం పంపించిన జాబితాను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా లేఖ రాసింది. దీంతో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమందికి ఎమ్మెల్సీ పదవి వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తాజాగా మళ్లీ 12 మంది ఎమ్మెల్సీల పేర్లతో కూడిన జాబితా రూపొందించి గవర్నర్‌కు పంపించాల్సి ఉంటుంది. అప్పట్లో శిందేతోపాటు శివసేన పార్టీ నుంచి బయటపడిన మద్దతుదారులు ఎమ్మెల్సీ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. రెండో దశ మంత్రివర్గ విస్తరణకు ముందే గవర్నర్ నామినేటెడ్ 12 మంది ఎమ్మెల్సీల అంశం తెరమీదకు వచ్చింది. దీంతో కనీసం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి కొందరినైన సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుండవచ్చని శిందే వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
లేదంటే అసంతృప్తి హద్దులుదాటి శిందే వర్గం నుంచి బయటపడే ప్రమాదం లేకపోలేదు. దీంతో శిందే, ఫడ్నవీస్ వర్గం నుంచి 12 మంది ఎమ్మెల్సీలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో శిందే వర్గం నుంచి, ఫడ్నవీస్ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం లభిస్తుందనేది వేచిచూడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సమావేశాలకు ముందే ఖాళీగా ఉన్న 12 మంది ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసే ప్రయత్నం శిందే, ఫడ్నవీస్ చేయనున్నారు.
చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్
ప్రభుత్వానివి కుట్ర రాజకీయాలు: ఎన్సీపీ
ఎమ్మెల్సీలుగా 12 మంది పేర్లను ప్రతిపాదించాలని గతంలో మహా వికాస్ అఘాడి చేసిన సిఫార్సును ఉపసంహరించుకోవాలని ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ సోమవారం తీవ్రంగా విమర్శించింది. గవర్నర్ కోటా కింద మరింత మంది నేతలను అధికార శిబిరంలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీలుగా నామినేషన్ కోసం 12 మంది పేర్లను సిఫారసు చేసింది,అయితే ఫైల్‌ను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆమోదించలేదు.
ఎంవీఏ సూచించిన 12 పేర్లలో ప్రముఖంగా కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరిన నటి ఊర్మిళ మటోండ్కర్ కూడా ఉన్నారు. ఈ సిఫార్సును ఉపసంహరించుకున్నట్లుగా పరిగణించాలని శిందే ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసిందని, కొత్త ప్రభుత్వ నిర్ణయాన్ని కోశ్యారీ అంగీకరించారని ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. కాగా, తాజాగా నామినేషన్ల జాబితాను త్వరలో అందజేస్తామని శిందే ప్రభుత్వం గవర్నర్‌కు తెలిపింది.
ఎన్సీపీ ప్రధాన అధికార ప్రతినిథి మహేష్ తపసే సోమవారం మాట్లాడుతూ, ‘శిందే ప్రభుత్వం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు ప్రశ్నార్థకంగా ఉంది. దానిపై సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉంది’ అని గత ఎంవీఏ ప్రభుత్వం సిఫార్సు చేసిన పేర్లను రద్దు చేయాలనే నిర్ణయం విపక్షాలకు చెందిన మరింత మందిని ఆకర్షించడానికి బీజేపీ–శిందే శిబిరంలోని నేతలు ‘క్యారెట్’ అని విమర్శించారు. ఎంవీఏ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను అధిగమించాలనే ఏకైక ఎజెండాతో శిందే మంత్రివర్గం నడుస్తోంది’ అని తపసే ఆరోపించారు. ఈ చర్యద్వారా మహారాష్ట్రలో ఓటర్ల మనోభావాలు బీజేపీ–శిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment