
మహా రాజకీయాల్లో ఇవాళ డబుల్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ కేంద్రంగా రాజకీయం..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగు.. తూనే ఉంది. ఈ తరుణంలో డబుల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. గవర్నర్ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ, షిండే వర్గం. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.
గవర్నర్ కోష్యారికి మరోసారి గువాహతి హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు బలనిరూపణ కోసం లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని షిండే వర్గం కోరే అవకాశం కనిపిస్తోంది. శివ సేన నుంచి బయటకు వచ్చిన తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బలనిరూపణకు అవకాశం ఇస్తేనే.. ముంబై తిరిగి వస్తామని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కోరే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారి లేఖ రాశారు. ఈ మధ్య విడుదల చేసిన నిధులు, జీవోలపై వివరాలు అందజేయాలని లేఖలో కోరారు ఆయన. ప్రతిపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గవర్నర్ కొష్యారి ఈ లేఖ రాసినట్లు స్పష్టం అవుతోంది.