సాక్షి ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మహారాష్ట్రలో శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని ఆయన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని శుక్రవారం రాత్రి వరకు అందరు అనుకున్నారు. కానీ, తెల్లారేసరికి ఎవరూ ఊహించని విధంగా ఉదయం ఎనిమిది గంటల లోపే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని పరిణామాలు రాష్ట్రంతోపాటు దేశంలోనే తీవ్ర కలకలం రేకేత్తించేలా చేశాయి. ఈ ఊహించని పరిణామాలపై ముంబైతోపాటు రాష్ట్రంలోని తెలుగు ప్రజలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలంటి నేపథ్యంలో తెలుగు ప్రజల అభిప్రాయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం..
రాజకీయాల్లో అవకాశవాదులదే ఆధిపత్యం
ఓటు ఎవరికి వేసిన అది అవకాశ వాదుల చేతికి ఆయుధంగా మారుతుండటం విషాదకరం. ఓటర్ల మనోభావాలను క్రూరంగా అవహేళన చేస్తూ ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషం. కాని జనాదేశాన్ని కాదని మొదట్లో శివసేన పార్టీ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి, అధికారం కోసం వెంపడ్లాడడం, ఇప్పుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించడం. చూస్తుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనం మాత్రమే అనిపిస్తోంది. అవకాశవాదులదే ఆధిపత్యం కొనసాగుతోంది.
– సంగెవేని రవీంద్ర (మహారాష్ట్ర తెలుగురైటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి)
ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి
రాష్ట్రంలో ఎవరు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తు అయితే బలపరీక్ష నిరూపణ మరో ఎత్తు కానుంది. రాజకీయాల్లో విలువలులేకుండా పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్రలో గత నెల రోజులుగా కొనసాగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మవద్దనేది అర్థంకాని పరిస్థితి. అందుకే ఎవరిని తప్పుబట్టలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా సరే రాష్ట్రప్రజల హితవు కోసం రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా. – మాదిరెడ్డి కొండారెడ్డి (తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి).
శివసేన అత్యాశనే కొంప ముంచింది
ముఖ్యమంత్రి పీఠంపై పెంచుకున్న అత్యాశనే శివసేన పార్టీ కొంపముంచింది. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై అంతగా ఆశపెంచుకోకుంటే ఇలా జరిగేది కాదు. ఆర్‌పీఐ నేత రామ్‌దాస్ ఆఠావలే పేర్కొన్నట్టుగానే భారతీయ జనతా పార్టీకి మూడేళ్లు, శివసేన పార్టీకి రెండేళ్లపాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అంగీకరించి ఉండాల్సింది. ఈ విషయంపై చర్చలకు ఇరు పార్టీలు ముందుకు వచ్చినట్టయితే మహారాష్ట్ర రాజకీయాల్లో నేటి పరిస్థితి ఉద్బంవించి ఉండేది కాదు.
– పుట్టపాక తిరుపతి (చర్నీ రోడ్డు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు)
బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది
మహారాష్ట్ర హితవు కోసం బీజేపీ సరైన నిర్ణయం తీసుకుంది. ఓ వైపు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెబుతూ రోజు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. మరోవైపు రాష్ట్రపతి పాలన కారణంగా రాష్టంలో రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇతర సమస్యలు పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఎంతో అవసరం. దీంతో బీజేపీ, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సరైన నిర్ణయం తీసుకుంది. – కొదురుపాక మహేష్ (కాందివలి)
విశ్వాసం పోతోంది
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే రాజకీయాలతోపాటు రాజకీయ నాయకులపై విశ్వాసం పోతోంది. ఎవరిని నమ్మాలో..? ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. పార్టీ సిద్దాంతాలు లేవు. పదవులకోసం పాకులాటే కని్పస్తోంది. ఈ రోజు ఓ పారీ్టలో ఉన్నవారు రేపు ఏ పారీ్టలో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా పార్టీ నాయకులే కాకుండా రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు, ఎన్నికల తర్వాత మరొకరితో పొత్తు పెట్టుకుంటున్నాయి. మరోవైపు సొంత పారీ్టల ఎమ్మెల్యేలపై విశ్వాసం లేక రహస్య స్థలాల్లో ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడటం రాజకీయాల్లో అత్యంత శోచనీయం. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాజకీయాలపై సామాన్య ప్రజలకు విశ్వాసం పోతోంది. – పోతు రాజారాం (ఆంధ్ర మహాపభ ట్రస్టీ చైర్మన్)
ఇది వెన్ను పోటే
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ, అజిత్ పవార్‌తో కలిసి ప్రజాసామ్యానికి వెన్నుపోటు పోడిచారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖారారైన సమయంలో ఇలా చేయడం సబబుకాదు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వంలో కూడా అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి లేదా ఇతర కీలక మంత్రి పదవి లభించి ఉండేది. కాని ఆయన వెన్నుపోటు పొడిచారు. – నాయన జగదీశ్ (థానే జిల్లా శివసేన సౌత్ సెల్ కార్యధ్యక్షులు)
బల పరీక్షలో పరాజయం ఖాయం
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మురిసిపోతుంది. కానీ, అజిత్ పవార్‌కు ఎన్సీపీ మద్దతు లేదు. దీంతో బలపరీక్షలో నెగ్గడం కష్టం. నవంబరు 30 వ తేదీన బీజేపీ బలపరీక్షలో పరాజయం అయిన తర్వాత మళ్లీ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయం.
– వాసాల శ్రీహరి (వంశి) (శివసేన)
బీజేపీ చేస్తే తప్పా?
కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జతకడితే తప్పులేదు. కాని బీజేపీ ఎన్సీపీతో జత కడితే తప్పా..? రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ అజిత్‌పవార్ మద్దతు తీసుకుంది. దీంట్లో బీజేపీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నించింది. కాని బీజేపీని పక్కనబెట్టాలని శివసేన చూసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం అవుతుండడంతో రాష్ట్ర ప్రజల హితవు కోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇలా ముందుకు వచి్చంది. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. –కోడూరు శ్రీనివాస్ (రాయిగడ్ జిల్లా బీజేపీ సౌత్ సెల్ ప్రధాన కార్యధర్శి)
Comments
Please login to add a commentAdd a comment