ప్రమాదంలో ప్రజాస్వామ్యం! | NCP Slammed BJP And They Say Democracy in Danger | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

Published Sat, Sep 28 2019 8:36 AM | Last Updated on Sat, Sep 28 2019 8:36 AM

NCP Slammed BJP And They Say Democracy in Danger - Sakshi

ముంబై: మహారాష్ట్ర స్టేట్‌ కోఆపరేటివ్‌ (ఎంఎస్‌సీ) బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై మనీ ల్యాండరింగ్‌ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం తాను ఈడీ ముందు హాజరవుతానని స్వయంగా శరద్‌ పవార్‌ ప్రకటించడంతో ముంబైలో ఎన్సీపీ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం ముందు, ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కొన్ని రోజుల్లో ఇది అంతరించిపోనుందని వారు విమర్శించారు. వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందు వల్ల కావాలనే పవార్‌ను లక్ష్యంగా చేసుకున్నారని మోదీ ప్రభుత్వంపై ఎన్సీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ విరుచుకుపడింది. ఈడీ ఆఫీసుకు శరద్‌ పవార్‌ వస్తున్నారని తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు ముంబైలోని ఆ కార్యాలయం ముందు ధర్నా చేస్తారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కార్యాలయం బయట పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.  

ఈడీని దుర్వినియోగం పరుస్తున్నారు.. 
ఎంఎస్‌సీ కుంభకోణంలో శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్సీపీ ఒక ప్రకటనను విడుదల చేసింది. పవార్‌ పేరు ఈడీ కేసులో ఉందని బీజేపీ కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్‌ జారీ చేసినట్లు తెలుస్తోందని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ విలేకరులతో అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని, పార్టీ అధ్యక్షుడిని కించపరిచే కుతంత్రాలను తాము సహించమన్నారు. పరిస్థితులను ఎదుర్కొంనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్యుంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేశారని మాలిక్‌ ఆరోపించారు.

అలాగే ఈడీ కార్యాలయాన్ని పవార్‌ సందర్శించే మాటకు కట్టుబడి ఉంటారని తెలిపారు. అధికార బలంతో, రాజకీయ శక్తితో బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల గొంతులను నొక్కేస్తుందని, ఎన్సీపీ నేత ధనుంజయ్‌ ముండేను అలాగే చేశారని మాలిక్‌ ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌పై కేసుతో ఆ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం గందళగోళానికి గురిచేసిందని జయంత్‌ పాటిల్‌ అన్నారు. అయితే రాష్ట్రంలో పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ కూడా పవార్‌పై ఈడీ కేసును తప్పుబట్టారు.   

శరద్‌ పవార్‌ తప్పుచేయలేదు 
నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్‌ పవార్‌కు బీజేపీ మిత్రపక్షమైన శివసేన నుంచి మద్దతు లభించింది. మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్‌ పవార్‌ ప్రేమేయం ఏమీ లేదని, కుంభకోణం వెలుగుచూసిన సమయంలో పవార్‌ అధికారంలో కూడా లేరని శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో జరిగిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. ‘పవార్‌ పెద్ద నేత. బ్యాంకుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి కేసుల్లో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. స్కామ్‌ జరిగినప్పుడు ఆయన అధికారంలో కూడా లేరు. ఆయన పార్టీ నేతలు ఉండొచ్చేమో కానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు’అని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. 

బీజేపీ నేతల్లో అసంతృప్తి... 
బ్యాంకు కుంభకోణంలో ఆయన పేరు చేర్చడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ సంప్రదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు శరద్‌ పవార్‌కు మద్దతుగా రౌత్‌ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ఈడీ తేల్చింది. పవార్, ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌తో పాటు 70 మంది ఎంఎస్‌సీ బ్యాంకు అధికారు పేర్లను అందులో చేర్చింది.     

ఎన్సీపీ బంద్‌కు మిశ్రమ స్పందన 
పింప్రి: వివిధ కుంభకోణాల కేసులో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, మాజీ మంత్రి అజీత్‌ పవార్, మరికొందరిపై ఈడీ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నిర్వహించిన పుణే, పింప్రి–చించ్‌వడ్‌ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఎన్సీపీ పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. తర్వాత కొందరు షాపులు తెరవడంతో బంద్‌ ప్రభావం అంతగా కనిపించలేదు. రవాణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు యథాతథంగా విధులకు వెళ్లారు. ర్యాలీలో పింప్రి నగర ఎన్సీపీ అధ్యక్షుడు సంజోగ్‌ వాగరే, కార్పొరేటర్లు డబ్బు అస్వాని, నికిత కదం, సులక్షణ ధర్, మాజీ మేయర్‌ యోగేశ్‌ బహల్, యూత్‌ పార్టీ అధ్యక్షురాలు వర్షా జగ్తాప్, ప్రతినిధి ఫజల్‌ శేఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement