మహారాష్ట్రలో పెరుగుతున్న ఉల్లి ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్యులకు కంటతడి పెట్టిస్తుంటే మరోపక్క ప్రస్తుత మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతిలో భాగమైన అధికార పార్టీ నేతలకు మంట పుట్టిస్తోంది. ఓ పక్క పెరుగుతున్న ధరలతో సామాన్యులు అధికార కూటమి ప్రభుత్వంపై నిప్పులు గక్కుతున్నారు. ఎగుమతులపై నిషేధంతో తమకు గిట్టుబాటు తగ్గిందని రైతులు సైతం గగ్గోలు పెడుతుండటం మహాయుతి కూటమికి సంకటంగా మారింది.
దేశీయ అవసరాలకు అవసరమైన ఉల్లిలో 40 శాతం మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతుండగా, ప్రస్తుత సీజన్‌లో భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మహారాష్ట్రలోని నాసిక్, లాసల్‌గావ్ మార్కెట్లకు తరలివస్తున్న ఉల్లి సరకు పరిమాణం బాగా తగ్గిపోయింది. గత సంవత్సరం ఉల్లిసీజన్‌లో ప్రతి రోజూ దాదాపు 2,000 టన్నుల ఉల్లి మార్కెట్‌వ వచ్చింది. అది ప్రస్తుతం 300–400 టన్నుల మధ్య తచ్చాడుతోంది.
దీనికి తోడు గత రబీలో సేకరించి పెట్టిన ఉల్లి నిల్వలు పూర్తిగా అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో రూ.40–50 నుంచి రూ.90–100కి ఎగబాకింది. దీని ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా పడుతుందని ముందే పసిగట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రంగంలోకి దిగింది. ధర మరీ పెరిగిపోకుండా కట్టడిచేసేందుకు 4.7లక్షల టన్నుల బఫర్ నిల్వలోంచి 1.50లక్షల టన్నుల మేర విడుదలచేసింది.
దీంతో నాసిక్ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని విక్రయ కేంద్రాల్లోకి ఉల్లి సరఫరా సాధ్యమైంది. వీటిల్లో కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తున్నారు. అయినాసరే ధరల పెరుగుదల ఆగడం లేదు. ‘గత రబీ సీజన్‌లోని పాత స్టాక్ దాదాపు అయిపోయింది. కొత్త స్టాక్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఈ సరఫరా–డిమాండ్ అసమతుల్యత ధర పెరుగుదలకు కారణం. దీన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ధరల ఉరవడిపై మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు షిండే సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
ఎగుమతుల నిషేధంపై రైతుల్లో ఆగ్రహం
ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో డిసెంబర్ 2023 వరకు ఉన్న ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రప్రభుత్వం 2024 మార్చినెల వరకు పొడిగించింది. దీనికి తోడు ఎగమతి సుంకాలను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎగుమతి ఆంక్షలు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని మహారాష్ట్ర రైతుల ఆవేదనవ్యక్తంచేస్తున్నారు.
ఉల్లి సాగు అధికంగాఉండే ధూలే, దిండోరి, అహ్మద్‌నగర్, పుణె, నాసిక్‌లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎగుమతులను నిషేధించిన కేంద్రం తమ పార్టీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ నుంచి మాత్రం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కారణంగానే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో మహాయుతి కూటమి ఓటమిని చవిచూసిందని విశ్లేషణలు వెలువడ్డాయి.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి పేలవ ప్రదర్శన వెనుక ఉల్లి రైతుల ఆగ్రహం ఉందని అంగీకరించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రలోని ఉల్లి రైతుల కంటే గుజరాత్‌లోని ఉల్లి రైతుల గురించే పట్టించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉల్లి మంట నుంచి బయట పడేందుకు పాలక కూటమి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే ఎన్నికల్లో సామాన్యులు, రైతుల సానుకూల, ప్రతికూల ఓటింగ్ సరళి ఆధారపడిఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment