
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ మరింత సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా నగదును సీజ్ చేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆశ్చర్యకర ఉదంతం వెలుగుచూసింది. స్కూటర్‌పై ఏకంగా రూ.1.5 కోట్లతో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడాన్ని చూసిన పోలీసులు తెగ ఆశ్యర్యపోయారు. ఈ భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశామన్నారు. పట్టుబడిన రూ.1.5 కోట్ల నగదును ఏదైనా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారా లేదా ఎన్నికల్లో మనీలాండరింగ్‌కు సంబంధించినదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు యశోధర నగర్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతనిని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానితుడు స్కూటర్ ట్రంక్‌లో దాచిన రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, దీంతో తమకు అతనిపై అనుమానం పెరిగిందని పోలీసులు తెలిపారు. కాగా మహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment