
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్ వర్గం) బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అజిత్ పవార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత శరద్ పవార్‌తో మాట్లాడించినట్టు సమాచారం.
అజిత్‌ను బుజ్జగించి తిరిగి తనవైపు తిప్పుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ అజిత్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. శరద్ పవార్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతునివ్వబోరని ఛగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిన అజిత్‌కు ఎమ్మెల్యేలెవరూ మద్దతునివ్వడం లేదని, ఎన్సీపీకి 54మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 53మంది శరద్ పవార్ వెంటే ఉన్నారని, స్వయంగా ఎమ్మెల్యే అయిన అజిత్ ఒక్కడే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఎన్సీపీ నేతలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment