ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్సీపీ ముఖ్య నేత అజిత్ పవార్ ఒక్కసారిగా తిరుగుబాటు చేసి.. బీజేపీతో చేతులు కలుపడంతో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహరాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష విషయమై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం తీర్పు వెలువరించనుండగా.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు సోమవారం గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 162మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు.
‘ఈ రోజు ఉదయం 10 గంటలకు నేను, షీండే, చవాన్, వినాయక్ రావత్ తదితర నేతలతో కలిసి గవర్నర్‌ను కలిశాం. మా కూటమికి 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ తరఫున లేఖ ఇచ్చాం. గవర్నర్ ఎప్పుడు కోరితే అప్పుడు 162 మంది ఎమ్మెల్యేలను ఆయన ముందు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రకటించారు. తప్పుడు పత్రాలతో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైందని, కానీ తమ కూటమికి పూర్తి మెజారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు మహారాష్ట్రలోని రాజకీయ డ్రామాపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. బీజేపీకి మెజారిటీ లేదనే విషయం అందరికీ తెలిసిందేనని, గతంలో తమకు మెజారిటీ లేదనే విషయాన్ని అంగీకరిస్తూ బీజేపీ గవర్నర్‌కు లేఖ కూడా రాసిందని గుర్తు చేశారు. ఇక, అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ విషయమై పార్టీ నేతలు తగిన సమయంలో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు అజిత్ వర్గం ఎమ్మెల్యేలు క్రమంగా తమవైపు చేరుతున్నారని, ప్రస్తుతం 53మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ఎన్సీపీ నేత నవాజ్ మాలిక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment