ముంబై: మహారాష్ట్ర 14వ శాసనసభ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో పదవీ స్వీకార ప్రమాణం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కోలంబర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మాజీ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ (ఎన్సీపీ), హరిభావు భగడే (బీజేపీ) తదితరులు ప్రమాణం చేశారు.
అయితే, మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే, ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయకముందే అసెంబ్లీ కొలువుదీరి.. ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేస్తుండటం గమనార్హం. ‘గత కొన్ని దశాబ్దాలుగా అసెంబ్లీలో మొదట ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత ఎమ్మెల్యేలు పదవీ స్వీకార ప్రమాణం చేసేవారు. ఆ వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుత సభలో ముఖ్యమంత్రి లేరు. సీఎం ప్రమాణం చేయకుండానే ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది అరుదైన దృశ్యం’ అని మహారాష్ట్ర అసెంబ్లీ తాత్కాలిక కార్యదర్శి రాజేంద్ర భగవత్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment