నేను వెళ్లేటప్పటికే సోనియాజీ నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు!
‘‘సారీ సోనియాజీ మిమ్మల్ని మీ ఇంట్లోనే ఎంతోసేపటిగా నా కోసం వేచి ఉండేలా చేశాను’’ అన్నాను నొచ్చుకుంటూ.
సోనియా నవ్వారు. ‘‘నేనెక్కడ మిమ్మల్ని నాకోసం ఎంతోసేపటిగా వేచి ఉండేలా చేస్తానోనన్న జాగ్రత్తతో ముందుగానే నేను మీకోసం వేచి ఉన్నాను పవార్‌జీ. టైమ్ చూడండి. వస్తానన్న సమయానికంటే కాస్త ముందుగానే వచ్చారు మీరు’’ అన్నారు.
‘‘హాహ్హాహా.. అవునా సోనియాజీ’’ అని సోఫాలో ఒక వైపు కూర్చున్నాను.
‘‘కూర్చోండి పవార్‌జీ’’ అన్నారు సోనియాజీ!
వస్తానన్న సమయానికంటే ముందే వచ్చినట్లు.. కూర్చోవలసిన సమయమింకా రాకముందే కూర్చున్నట్లున్నాను!!
‘‘సారీ సోనియాజీ మీరు కూర్చోమనక ముందే కూర్చున్నట్లున్నాను’’ అన్నాను.
‘‘సారీ నేను చెప్పాలి పవార్‌జీ. మీరు కూర్చోడానికి ముందే ‘కూర్చోండి’ అని నేను మీతో అని ఉండవలసింది’’ అన్నారు సోనియా.
సోనియాజీలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సొంత పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఆమె కోసం సందర్శకుల గదిలో గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చేది!
‘‘వీళ్ల కాన్ఫిడెన్స్ చూశారా పవార్‌జీ! గవర్నర్ పిలిచి మరీ కూర్చోమంటే కూర్చోవడం చేతకానివాళ్లు.. ‘వీళ్లెలా కూర్చుంటారో, ఎన్నాళ్లు కూర్చుంటారో మేమూ చూస్తాం’ అని మనల్ని అంటున్నారు!’’ అన్నారు సోనియాజీ.
‘‘విన్నాను సోనియాజీ. నేను ఢిల్లీ వచ్చే ముందు కూడా బీజేపీ వాళ్లెవరో నాకు వినబడేలా గట్టిగా ఎవరితోనో అంటున్నారు.. ఎవరు ఎవరితో కలిసినా చివరికి మహారాష్ట్రలో గవర్నమెంట్‌ని ఫామ్ చేయబోయేది వాళ్లేనట’’ అన్నాను.
‘‘చూపిద్దాం పవార్‌జీ. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిస్తే ఎలా ఉంటుందో బీజేపీకి చూపిద్దాం’’ అన్నారు సోనియాజీ.
‘‘ఏం చేద్దాం సోనియాజీ? ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెడదామా సీఎం సీట్లో..’’ అన్నాను.
‘‘ఏం ఆలోచిస్తున్నారు పవార్‌జీ! మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్యను కూర్చోబెట్టామా.. మహారాష్ట్రలో ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెట్టడానికి! రాజస్తాన్‌లో సచిన్ పైలట్‌ని కూర్చోబెట్టామా మహారాష్ట్రలో ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెట్టడానికి! నలభైలలో ఉన్న చిన్నారులనే సీఎం సీటుకు వద్దనుకున్నప్పుడు ఇరవైలలో ఉన్న పసికందును సీఎం సీట్లో కాంగ్రెస్ ఎలా కూర్చోబెడుతుంది?’’ అన్నారు సోనియా.
సోనియాజీలోకి మళ్లీ పాత సోనియాజీ ప్రవేశించినట్లున్నారు. కాంగ్రెస్ కన్నా ఎన్సీపీకి పది సీట్లు ఎక్కువ వచ్చిన సంగతి పక్కనపెట్టి, సీఎం పోస్టు కాంగ్రెస్ చేతిలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు!
‘‘సోనియాజీ.. కాంగ్రెస్‌వీ, ఎన్సీపీవి కలిపి శివసేన కన్నా ఎన్ని ఎక్కువ సీట్లు ఉన్నాయో మీరు లెక్కేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా, ఎన్సీపీకన్నా ఎన్ని ఎక్కువ సీట్లున్నాయో శివసేన లెక్క వేసుకుని కూర్చుంది’’ అన్నాను.
‘‘లాజిక్ ఆలోచించండి పవార్‌జీ’’ అన్నారు సోనియా!
నాకేం లాజిక్ అందలేదు. అంకెల్ని మించిన లాజిక్ ఏముంటుంది?!
‘‘పవార్‌జీ.. ఫడ్నవిస్‌ని కూర్చోమన్నారు. కూర్చోలేకపోయాడు. ఠాక్రేని కూర్చోమన్నారు. కూర్చోలేకపోయారు. కూర్చోమన్నప్పుడు కూర్చోలేకపోయిన వారు సీఎం సీటుకు సూట్ అవుతారా, కూర్చోమనకుండానే కూర్చున్నవారు సీఎం సీటుకు సూట్ అవుతారా ఆలోచించండి..?’’ అన్నారు సోనియాజీ.
సోనియా చెప్పదలచుకోనిదేమిటో అర్థం చేసుకోడానికి నేను పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదని నాకు అర్థమైంది.
- మాధవ్ శింగరాజు
రాయని డైరీ: శరద్ పవార్ (ఎన్సీపీ చీఫ్)
Published Sun, Nov 17 2019 12:53 AM | Last Updated on Sun, Nov 17 2019 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment