సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ వివాదం తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దూకుడును పెంచారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటనను విజయంతంగా ముగించుకున్న దీదీ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ప్రతి రెండు నెలలకోసారి తాను ఢిల్లీకి వస్తానని వెల్లడించారు. బీజేపీని అధికారం నుంచి కూలదోసేంత వరకు ''ఖేలా హాబ్' కొనసాగుతుందని గర్జించిన దీదీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని తాజాగా ప్రకటించారు.
ప్రతిపక్ష నేతలతో విస్తృత భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఢిల్లీ పర్యటన ఫలవంతమైందని 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ' తన నినాదమని టీఎంసీ అధినేత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా దేశీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్, గ్యాస్ ధరలపై ఆమె మండిపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలి, ప్రజల కోసం అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే రానున్న కరోనా మూడో దశ ముప్పుపై కూడా ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు.
2024 ఎన్నికల వ్యూహాలపై ప్రశ్నించినపుడు మాత్రం సమాధానాన్ని దాటవేసిన మమతా..ప్రతి ఒక్కరి నినాదం దేశాన్ని రక్షించడమే అని నొక్కి వక్కాణించారు. దేశ రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించామని వెల్లడించారు. ప్రతిపక్ష ఐక్యత సమస్యపై కూడా చర్చించామని ఆమె చెప్పారు. తదుపరి టూర్‌లో శరద్ పవార్‌తో భేటీకానున్నట్టు వెల్లడించారు.
కాగా తన ఢిల్లీ పర్యనటలో భాగంగా మమతా బెనర్జీకాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితర పలువురు ప్రతిపక్ష నాయకులతో సమావేశాలు నిర‍్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ-షాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే హస్తిన పర్యటనపై మమతా తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ కావడం ఈ అంచనాలకు మరింత బలాన్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment