
బ్రిటిష్ మాజీ ప్రధాని హెరాల్డ్ విల్సన్ 55 ఏళ్ల క్రితం చెప్పినట్లుగా రాజకీయాల్లో ఒక వారం రోజులు సుదీర్ఘ కాలమైనట్లయితే, భారత్‌లో ప్రతి రోజూ సుదీర్ఘకాలంగానే కనబడుతుంది. అత్యంత జాగ్రత్తతో కూడిన వ్యూహంతో, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పట్ల తిరస్కరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గొప్ప రాజకీయ కుట్రను నడిపారు. ఆ దెబ్బకు రాహుల్‌ని ప్రధాని పదవికి అభ్యర్థిగా ప్రకటించడం ఆగిపోయింది. సాధారణంగా పాకిస్తాన్ వంటి దేశాల్లో కుట్రలు హింసాత్మకంగా సాగుతుంటాయి. కానీ మమత కాంగ్రెస్ పార్టీపై అహింసాత్మకంగా సాగించిన భీకర కుట్రకు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వమే పక్కకు పోయింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ 2018 జూలై 31 వరకు ప్రతిపక్షం తరపున పీఎం పదవికి అభ్యర్థిని తానే అని ప్రకటించుకుంటూ వచ్చారు. కానీ ఆగస్టు 2 నాటికి అంటే రెండురోజుల వ్యవధిలో మమతా బెనర్జీ ప్రతిపక్షాల తరపున ప్రధాని పదవికి అభ్యర్థిగా ఆవిర్భవించారు. 2019 జనవరిలో తాను జరపనున్న భారీ ర్యాలీకి హాజరు కావలిసిందిగా ఆహ్వానించడానికి సోనియా, రాహుల్‌లను జనపథ్ 10లో మమత కలిసినప్పుడు మీడియా మొత్తంగా మమతే ప్రధాని పదవికి అభ్యర్థి అని అభిప్రాయపడింది. నేరుగా ఇదే ప్రశ్నను మీడియా సంధించినప్పుడు ‘ఈ నేలపై ఎవరైనా రాజు కావచ్చు’ అనే రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తిని ఆమె వల్లించారు.
ఆగస్టు 2న మమత తమను కలిసినప్పుడు సోనియా, రాహుల్‌ల మొహాల్లోని భావరహిత చిరునవ్వుల ద్వారా స్పష్టమైంది ఏమిటంటే మమత తమను రాజకీయ పోటీలో అధిమించేశారన్నదే. రాహుల్ అభ్యర్థిత్వాన్ని మమత అంగీకరిస్తుందని కాంగ్రెస్ భావించింది కానీ ఇన్నాళ్లుగా తాను సాగించిన కఠోరమైన ప్రయత్నాలను, 35 ఏళ్లపాటు తాను అవలంభించిన గాంధియన్ జీవిత శైలిని త్యాగం చేయడానికి మమత సంసిద్ధం కాలేదు. ప్రధాని పదవి ఎట్టకేలకు తనకు సమీపంలోనికి వచ్చిందని మమత స్పష్టంగా గుర్తించారు.
మోదీ, మమత దిగువ మధ్యతరగతి నేపథ్యం లోంచి రాజకీయాల్లోకి వచ్చారు. పెద్దగా చదువుకోని, గాడ్ ఫాదర్లు, కుటుంబ నేపథ్యం లేని వీరిద్దరూ అత్యంత కష్టసాధ్యమైన పరిస్థితులను తట్టుకుంటూ విజేతలై నిలిచారు. వీరిద్దరూ రాజకీయాలు మినహా మరే జీవితం లేనివారే. కుటుంబాలు లేవు, ఎస్టేట్లు లేవు, కంపెనీలు లేవు, రాజవంశాలు లేవు. వీరికున్న పోలికలు దిగ్భ్రాంతి గొలుపుతాయి.
రాహుల్ గాంధీ ప్రతిపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిని తానే అవుతానని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటున్న సమయంలో బలమైన ప్రతిపక్షాలను కూడగట్టిన మమత ఉన్నట్లుండి రాహుల్‌ను తోసిరాజంది. ప్రతి పక్షాల్లో చాలావరకు అటు కాంగ్రెస్‌ని, ఇటు బీజేపీని తిరస్కరిస్తున్నాయి. ఈ వ్యతిరేకతను అనువుగా మల్చుకున్న మమత తన అభ్యర్థిత్వాన్ని ముందుపీఠికి తెచ్చారు. జయలలిత తర్వాత అత్యధిక ఎంపీలను గెల్చుకున్న ప్రతిపక్ష సీఎంగా మమత అవతరించారు. ప్రాంతీయ పార్టీలు రాహుల్‌ని కోరుకోనందున మమత ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చారు. ఇలా ఒక్క దెబ్బకు అటు గాంధీలను, ఇటు కాంగ్రెస్ పార్టీని అధిగమించేశారు.
ఒకరకంగా మమత సాధించిన విజయం భారత రాజకీయాల్లో ఒక పెను భూకంపం లాంటిది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ప్రధాని అభ్యర్థి పదవి ప్రతిపాదన నుంచి వెనుకంజ వేయడం పెను సమస్యే. రాహుల్ పరువు ఏ కాస్తయినా మిగలాలంటే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో త్వరలో జరుగనున్న ఎన్నికల ఫలి తాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడమే. అప్పుడు మాత్రమే రాహుల్ తన అభ్యర్థిత్వాన్ని బలంగా ముందుకు తీసుకురాగలరు. కాంగ్రెస్ ముందు పొంచి ఉన్న అవమానం ఏదైనా ఉందా అంటే పై మూడు రాష్ట్రాల్లో ఏ రెండింట్లోనైనా అది అధికారంలోకి రాలేకపోవడమే. ప్రతిపక్షాలు కోరుకునేది సరిగ్గా దీన్నే.
భారతప్రధాని కావాలంటే అన్ని కారణాలతోపాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. యుద్ధాల్లో మీకు ఎలాంటి సైనిక జనరల్స్ కావాలని అడిగితే అదృష్టం తోడుగా ఉన్న జనరల్స్ కావాలని నెపోలియన్ టపీమని సమాధానమిచ్చాడట. అంటే ఏ విజయానికైనా అదృష్టం చాలా ముఖ్యమే మరి. సుభాష్ చంద్రబోస్‌కు సాధ్యం కాని అవకాశం తన ముందు నిలబడిందని మమత ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అయితే బెంగాలీల చిరకాల స్వప్నం ఫలించాలంటే మోదీ వరుసగా తీవ్ర తప్పిదాలు చేస్తూ పోవాలి. మమత భవిష్యత్తు మొత్తంగా మోదీ దురదృష్టంపైనే ఆధారపడి ఉంది. మానవ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. సాధారణంగా మనం విజయం కోసం ఇతరుల తప్పిదాలపైనే ఆధారపడుతుంటాం. ఇప్పటికి మాత్రం మమత రాహుల్‌ని తోసిరాజనడమే పెనువాస్తవం.
పెంటపాటి పుల్లారావు, వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment