శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సోనియా, ఖర్గే, రాహుల్
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర–2024’ విడుదల
రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు
ఎంఎస్పీకి చట్టబద్ధత.. ‘అగ్నిపథ్’ రద్దు
కేంద్ర ఉద్యోగాల్లో స్త్రీలకు 50% కోటా
మేనిఫెస్టోను విడుదల చేసిన సోనియా, ఖర్గే, రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్నవర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది.
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అగ్నిపథ్ పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, దేశవ్యాప్తంగా కుల గణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది.
శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ‘న్యాయ్ పత్ర–2024’ పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద ఐదు గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలు ఇచ్చారు.
ఐదు న్యాయాలు ఏమిటంటే..
నారీ న్యాయ్
► మహాలక్ష్మీ పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళకు ఏడాదికి రూ.లక్ష నగదు బదిలీ
► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
► ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం
► మహిళ హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘మైత్రి’ అధికారి నియామకం
► మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు
కిసాన్ న్యాయ్
► స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత
► రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
► పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు
► రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం
► వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు
యువ న్యాయ్
► కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
► యువత కోసం ‘అప్రెంటీస్íÙప్ హక్కు చట్టం’. డిప్లొమా చదివినవారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్‌కు ఏడాదిపాటు అప్రెంటీస్íÙప్ చేసే అవకాశం. వారికి సంవత్సరానికి రూ.లక్ష సాయం.
► ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం
► గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
► స్టార్టప్ కంపెనీలు ప్రారంభించే యువత కోసం రూ.5,000 కోట్ల నిధి
శ్రామిక్ న్యాయ్
► కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం
► కనీస వేతనం రోజుకు రూ.400. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు
► పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు
► అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు
► ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు
హిస్సేదారీ న్యాయ్
► అధికారంలోకి రాగానే సామాజిక, ఆర్థిక కుల గణన
► ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల విషయంలో 50 శాతం సీలింగ్(పరిమితి) తొలగింపు
► ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు
► జల్, జంగల్, జమీన్‌పై చట్టబద్ధమైన హక్కులు
► గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తింపు
న్యాయ్ పత్రలోని కీలక హామీలు
► సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్
► రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ
► ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ఆలోచనకు చెల్లుచీటి..
► పదో షెడ్యూల్ సవరణ. పార్టీ ఫిరాయించిన నేతల లోక్‌సభ, అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు
► సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు
► అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటా అమలు.
► జమ్మూకశ్మీర్‌కు, పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా
► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి: రాహుల్
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు పరాభవం తప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే బోల్తా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం కాబోతోందని జోస్యం చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం ఖాయమని అన్నారు.
ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలే రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99 శాతం మంది ప్రజలు కోరుకున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదానీ లాంటి కేవలం ఒకటి, రెండు శాతం మంది బడాబాబులు కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment