ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయ్‌కుమార్ రావల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు బీజేపీ సీనియర్ నేతలు, శ్రేణులు రాష్ట్రంలో రీ-ఎలక్షన్‌కు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘శివసేనతో పొత్తు పెట్టుకొని ఉండాల్సింది కాదని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మాకు చాన్స్ ఇవ్వండి. మేం ఈసారి పోటీ చేసి గెలిచి చూపిస్తామని వారు అంటున్నారు’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అనుచరుడైన జయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘శివసేనతో పొత్తు వల్ల కొన్ని స్థానాల్లో తాము పోటీ చేయలేకపోయామని, మరికొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతున్న శివసేన.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకురాకపోవడంతో ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ వందకుపైగా స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయినా ఆ పార్టీ మెజారిటీ మార్కుకు చాలా దూరం నిలిచిపోవడంతో 56 స్థానాలు గెలిచిన శివసేన రియల్ కింగ్‌మేకర్‌గా అవతరించింది. అయితే, ఎన్నికల తర్వాత తమకు సీఎం పదవి కావాల్సిందేనని, చెరిసగం చొప్పున సీఎం పదవిని పంచితేనే బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని శివసేన తెగేసి చెప్తోంది. అందుకు బీజేపీ కూడా ఏమాత్రం సిద్ధపడటం లేదు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని చెప్తున్నా.. అదీ ఎంతవరకు సాధ్యమనేది తేలడం లేదు. ఈ నెల 8వ తేదీ లోపు ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోతే.. మహారాష్ట్రలో గవర్నర్ పాలన విధించే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment