
ప్రచార పర్వంలో రితేశ్‌దేశ్‌ముఖ్
సాక్షి, భైంసా(ముథోల్): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుభీర్ మండలం పల్సి గ్రామ అల్లుడు. పల్సి గ్రామానికి చెందిన వైశాలిని విలాస్‌రావుదేశ్‌ముఖ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన విలాస్‌రావుదేశ్‌ముఖ్ దంపతులకు ముగ్గురు కుమారులు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన పెద్ద కొడుకు అమిత్‌దేశ్‌ముఖ్, చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు రితేశ్‌దేశ్‌ముఖ్ బాలివుడ్‌లో కథానాయకుడిగా రాణిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ సొంతగడ్డ లాథూర్‌లో అసెంబ్లీ పోరు కొనసాగుతోంది. ఇద్దరు కొడుకులు కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఇందులో లాథూర్ అర్బన్ నుంచి అమిత్‌దేశ్‌ముఖ్, లాథూర్ రూరల్ నుంచి చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ పోటీకి దిగారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దేశమంతటా బీజేపీ గాలివీస్తున్నప్పటికీ తమ తండ్రి సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఈ కుటుంబం ముందుకెళ్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా విలాస్‌రావుదేశ్‌ముఖ్ లాథూర్ ప్రాంతంలో విస్తరించిన సేవలే వీరి గెలుపునకు నాంది పలుకుతాయని అక్కడి వారు చెప్పుకుంటున్నారు.
ప్రచార బాధ్యతలు రితేశ్‌పైనే...
మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం అక్కడ రాజకీయవారసత్వం కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించింది. ఇద్దరు సోదరులకు గెలిపించేందుకు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రచార బాధ్యతలు నెత్తినవేసుకున్నారు. ప్రచార పర్వంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ వేదికలపై ప్రసంగాలు చేస్తూ హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. లాథూర్ తన సొంత గడ్డ అని ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ చేసిన సేవలకు ప్రజలు గెలిపించి తీరుతారంటూ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు.
వైశాలినితో ముగ్గురు కుమారులు
పల్సి గ్రామంలో ఆసక్తి..
ప్రస్తుతం లాథూర్ ఎన్నికల ప్రచార తీరు... అక్కడి సభలపై పల్సి గ్రామంలో ఆసక్తి నెలకొంది. పిళ్లుబాయి మనువళ్లు ఎమ్మెల్యేలుగా నిల్చున్నారని వారంతా చర్చించుకుంటున్నారు. మరాఠీ చానళ్లలో మీడియా కథనాలు చూస్తూ అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. లాథూర్ రాజకీయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు.
పిళ్లుబాయి మనువళ్లు..
పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండవ భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌తో వివాహం జరిపించారు. పిళ్లుబాయి మనువడే రితేశ్ అంటూ పల్సివాసులు చెప్పుకుంటున్నారు. జెడ్పీ మొదటి చైర్మన్ రంగారావు ఊరిపేరే ఇంటిపేరుగా వస్తోంది. పల్సి గ్రామం వారికి ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. అప్పట్లో జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా ఎన్నికైన పల్సికర్ రంగారావు అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలు స్వగ్రామంలోనే చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ మామ పెద్ద కర్మ నిర్వహించే 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
వైశాలి చిన్న తనంలో పెరిగిన ఇల్లు
అంతటా చర్చ...
రితేశ్ తల్లి వైశాలిని చిన్ననాడు పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులు అంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది ఇంటికి మరమ్మతు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలు ఉన్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు. రితేశ్ జెనీలియాల పెళ్లి వేడుకకు పల్సి గ్రామస్తులు ముంబయికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ అంత్యక్రియలకు సైతం పల్సి గ్రామస్తులు లాథూర్‌కు చేరుకున్నారు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులతో పల్సి గ్రామానికి విడదీయలేని అనుబంధమే ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా పోటీచేయడంతో మళ్లీ ఈ గ్రామస్తుల చూపు లాథూర్‌వైపునకు మళ్లింది. ప్రతిరోజు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రసంగాలను పల్సి గ్రామస్తులు తమ ఇళ్ల నుంచే తిలకిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పల్సి గ్రామస్తుల చూపంతా లాథూర్ జిల్లాపైనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment