kubheer
-
మాజీ సీఎం కుమారులు.. పల్సి గ్రామ మనువళ్లు
సాక్షి, భైంసా(ముథోల్): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుభీర్ మండలం పల్సి గ్రామ అల్లుడు. పల్సి గ్రామానికి చెందిన వైశాలిని విలాస్రావుదేశ్ముఖ్కు ఇచ్చి వివాహం జరిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన విలాస్‌రావుదేశ్‌ముఖ్ దంపతులకు ముగ్గురు కుమారులు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన పెద్ద కొడుకు అమిత్దేశ్ముఖ్, చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు రితేశ్‌దేశ్‌ముఖ్ బాలివుడ్లో కథానాయకుడిగా రాణిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ సొంతగడ్డ లాథూర్‌లో అసెంబ్లీ పోరు కొనసాగుతోంది. ఇద్దరు కొడుకులు కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఇందులో లాథూర్ అర్బన్ నుంచి అమిత్దేశ్ముఖ్, లాథూర్ రూరల్ నుంచి చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ పోటీకి దిగారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దేశమంతటా బీజేపీ గాలివీస్తున్నప్పటికీ తమ తండ్రి సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఈ కుటుంబం ముందుకెళ్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా విలాస్‌రావుదేశ్‌ముఖ్ లాథూర్ ప్రాంతంలో విస్తరించిన సేవలే వీరి గెలుపునకు నాంది పలుకుతాయని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. ప్రచార బాధ్యతలు రితేశ్పైనే... మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం అక్కడ రాజకీయవారసత్వం కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించింది. ఇద్దరు సోదరులకు గెలిపించేందుకు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రచార బాధ్యతలు నెత్తినవేసుకున్నారు. ప్రచార పర్వంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ వేదికలపై ప్రసంగాలు చేస్తూ హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. లాథూర్ తన సొంత గడ్డ అని ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ చేసిన సేవలకు ప్రజలు గెలిపించి తీరుతారంటూ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. వైశాలినితో ముగ్గురు కుమారులు పల్సి గ్రామంలో ఆసక్తి.. ప్రస్తుతం లాథూర్ ఎన్నికల ప్రచార తీరు... అక్కడి సభలపై పల్సి గ్రామంలో ఆసక్తి నెలకొంది. పిళ్లుబాయి మనువళ్లు ఎమ్మెల్యేలుగా నిల్చున్నారని వారంతా చర్చించుకుంటున్నారు. మరాఠీ చానళ్లలో మీడియా కథనాలు చూస్తూ అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. లాథూర్ రాజకీయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. పిళ్లుబాయి మనువళ్లు.. పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండవ భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్ముఖ్తో వివాహం జరిపించారు. పిళ్లుబాయి మనువడే రితేశ్ అంటూ పల్సివాసులు చెప్పుకుంటున్నారు. జెడ్పీ మొదటి చైర్మన్ రంగారావు ఊరిపేరే ఇంటిపేరుగా వస్తోంది. పల్సి గ్రామం వారికి ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. అప్పట్లో జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా ఎన్నికైన పల్సికర్ రంగారావు అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలు స్వగ్రామంలోనే చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ మామ పెద్ద కర్మ నిర్వహించే 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు. వైశాలి చిన్న తనంలో పెరిగిన ఇల్లు అంతటా చర్చ... రితేశ్ తల్లి వైశాలిని చిన్ననాడు పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులు అంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది ఇంటికి మరమ్మతు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలు ఉన్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు. రితేశ్ జెనీలియాల పెళ్లి వేడుకకు పల్సి గ్రామస్తులు ముంబయికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ అంత్యక్రియలకు సైతం పల్సి గ్రామస్తులు లాథూర్‌కు చేరుకున్నారు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులతో పల్సి గ్రామానికి విడదీయలేని అనుబంధమే ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా పోటీచేయడంతో మళ్లీ ఈ గ్రామస్తుల చూపు లాథూర్వైపునకు మళ్లింది. ప్రతిరోజు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రసంగాలను పల్సి గ్రామస్తులు తమ ఇళ్ల నుంచే తిలకిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పల్సి గ్రామస్తుల చూపంతా లాథూర్ జిల్లాపైనే ఉంది. -
మల్లన్నదేవుడితో బాలుడి పెళ్లి
మండలంలో అనాదిగా వస్తున్న ఆచారం పాల్గొన్న అగ్గుమల్లన్నలు కుభీర్ : ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రమైన కుభీర్‌లో శుక్రవారం అగ్గు మల్లన్నలు ప్యాట ఆకాష్(14)కు మల్లన్న దేవుడితో పెళ్లి(పట్టం) ఘనంగా జరిపించారు. ముజ్గీ, తురాటీ, దేగాం, కామోల్, ముథోల్, రాజూరా, కుభీర్ గ్రామాల్లో అగ్గుమల్లన్నలు ఉదయం భిక్షాటన చేసి సాయంత్రం పెళ్లి తంతు పూర్తి చేసి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమాలను గురువ య్యా మల్లేష్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో నిర్మల్ పట్టణానికి దగ్గరలో ముజ్గీ గ్రామంలో ఉన్న మల్లన్న దేవునికి చాలామంది భక్తులు ఉన్నారు. మల్లన్నతో పెళ్లి జరిపించుకున్న వారు దేవుడి పేరుపై భిక్షాటన చేస్తూ, నిష్టగా జీవితాంతం ఉండాలి. గొల్లసుద్దులు, దేవుని కథలను చెబుతూ సంవత్సరానికి ఒకసారి పౌర్ణమికి జరిగే జాతరలో పాల్గొంటారు. వీరు కాళ్లకు గజ్జెలు కట్టుకుని, ఢమరుకం, డప్పు వాయిస్తూ, గొంగళి వేసుకుని, పట్కా చుట్టుకుని పాటలు పాడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. వీరిని అగ్గువారు, అగ్గు మల్లన్నలు అంటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంగుబాయి, మాజీ సర్పంచ్ అగ్గు నాగన్న, ప్యాట ముత్యం, ప్యాట విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్‌కార్డుల్లో పేర్లు గల్లంతు
కుభీర్, న్యూస్‌లైన్ : ఆన్లైన్ వ్యవస్థ రేషన్‌కార్డు వినియోగదారుల పాలిట శాపంగా మారింది. రేషన్‌కార్డుల ను ఆన్లైన్ చేసే ఉద్దేశంతో చేపట్టిన ప్రక్రియ కారణంగా పలువురి పేర్లు గల్లంతయ్యాయి. ఫలితంగా రేషన్ సరుకులకు కోత పడింది. రేషన్‌కార్డులను ఆన్లైన్ చేసే ఉద్దశంతో రెవెన్యూ శా ఖ మూడేళ్ల క్రితం అన్ని గ్రామాల్లో ఐరీష్ కేం ద్రాలు ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల ఫొటోలు తీసే కార్యక్రమాన్ని కొన్ని ప్రైవేటు సంస్థల ద్వారా చేపట్టారు. కొన్ని బృందాలను ఇంటింటికీ పంపి సర్వే చేయించారు. వారు చేసిన తప్పులు, సాంకేతిక సమస్యల కారణంగా లబ్ధిదారుల పేర్లు తొలగిపోయాయి. మండలంలోని పార్డి(బి), హాల్దా, చాత, మార్లగొండ గ్రామ పంచాయతీల్లో సుమారు 1200 కార్డుల్లో పేర్లు గల్లంతయ్యాయి. పార్డి(బి) గ్రామానికి చెందిన సంతోష్ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉండగా ముగ్గురి పేర్లు తొలగించారు. నాలుగు కిలోల బియ్యమే వస్తున్నాయి. చిమ్మన్ పోశెట్టి కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నా.. 8 కిలోల బియ్యమే అందుతున్నాయి. హాల్దా గ్రామానికి చెందిన నమాల భోజన్న కుటుంబంలో ముగ్గురు సభ్యులుండగా.. రెండు పేర్లు తొలగిపోయాయి. ఒకరికే బియ్యం ఇస్తున్నారు. దీంతో గతంలో ఆయా గ్రామాల రేషన్‌కార్డు వినియోగదారులు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోని అధికారులు పేర్లు తొలగిపోయిన విషయమై ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారులు పేర్లు తొలగిపోయిన వారి రేషన్‌కార్డు జిరాక్స్ ప్రతులను ప్రభుత్వానికి పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. గతంలో మొత్తంగా తొలగించిన, అంత్యోదయ కార్డులు పునరుద్ధరించినా.. తొలగింపు పేర్ల సవరణ జరగడం లేదు. హాల్దా గ్రామంలో అంత్యోదయ కార్డులు పూర్తిగా తొలగించారు. గతంలో 115 క్వింటాళ్ల బియ్యం సరఫరా కాగా ప్రస్తుతం 95 క్వింటాళ్లే సరఫరా అవుతున్నాయి. చాత గ్రామంలో మూడు అంత్యోదయ కార్డులు తొలగించి సాధారణ రేషన్‌కార్డులు అందజేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి రేషన్‌కార్డుల్లో పేర్లను పునరుద్దరించాలని కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ డి.సైదులును సంప్రదించగా.. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశామని, మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.