రేషన్‌కార్డుల్లో పేర్లు గల్లంతు | names missing in ration cards | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డుల్లో పేర్లు గల్లంతు

Published Mon, Jan 27 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

names missing in ration cards

కుభీర్, న్యూస్‌లైన్ :  ఆన్‌లైన్ వ్యవస్థ రేషన్‌కార్డు వినియోగదారుల పాలిట శాపంగా మారింది. రేషన్‌కార్డుల ను ఆన్‌లైన్ చేసే ఉద్దేశంతో చేపట్టిన ప్రక్రియ కారణంగా పలువురి పేర్లు గల్లంతయ్యాయి. ఫలితంగా రేషన్ సరుకులకు కోత పడింది. రేషన్‌కార్డులను ఆన్‌లైన్ చేసే ఉద్దశంతో రెవెన్యూ శా ఖ మూడేళ్ల క్రితం అన్ని గ్రామాల్లో  ఐరీష్ కేం ద్రాలు ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల ఫొటోలు తీసే కార్యక్రమాన్ని కొన్ని ప్రైవేటు సంస్థల ద్వారా చేపట్టారు.

కొన్ని బృందాలను ఇంటింటికీ పంపి సర్వే చేయించారు. వారు చేసిన తప్పులు, సాంకేతిక సమస్యల కారణంగా లబ్ధిదారుల పేర్లు తొలగిపోయాయి. మండలంలోని పార్డి(బి), హాల్దా, చాత, మార్లగొండ గ్రామ పంచాయతీల్లో సుమారు 1200 కార్డుల్లో పేర్లు గల్లంతయ్యాయి. పార్డి(బి) గ్రామానికి చెందిన సంతోష్ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉండగా ముగ్గురి పేర్లు తొలగించారు. నాలుగు కిలోల బియ్యమే వస్తున్నాయి.

 చిమ్మన్ పోశెట్టి కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నా.. 8 కిలోల బియ్యమే అందుతున్నాయి. హాల్దా గ్రామానికి చెందిన నమాల భోజన్న కుటుంబంలో ముగ్గురు సభ్యులుండగా.. రెండు పేర్లు తొలగిపోయాయి. ఒకరికే బియ్యం ఇస్తున్నారు. దీంతో గతంలో ఆయా గ్రామాల రేషన్‌కార్డు వినియోగదారులు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.

 పట్టించుకోని అధికారులు
 పేర్లు తొలగిపోయిన విషయమై ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారులు పేర్లు తొలగిపోయిన వారి రేషన్‌కార్డు జిరాక్స్ ప్రతులను ప్రభుత్వానికి పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. గతంలో మొత్తంగా తొలగించిన, అంత్యోదయ కార్డులు పునరుద్ధరించినా.. తొలగింపు పేర్ల సవరణ జరగడం లేదు.

 హాల్దా గ్రామంలో అంత్యోదయ కార్డులు పూర్తిగా తొలగించారు. గతంలో 115 క్వింటాళ్ల బియ్యం సరఫరా కాగా ప్రస్తుతం 95 క్వింటాళ్లే సరఫరా అవుతున్నాయి. చాత గ్రామంలో మూడు అంత్యోదయ కార్డులు తొలగించి సాధారణ రేషన్‌కార్డులు అందజేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి రేషన్‌కార్డుల్లో పేర్లను పునరుద్దరించాలని కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ డి.సైదులును సంప్రదించగా.. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశామని, మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement