మల్లన్నదేవుడితో బాలుడి పెళ్లి
Published Sat, Feb 27 2016 9:43 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
మండలంలో అనాదిగా వస్తున్న ఆచారం
పాల్గొన్న అగ్గుమల్లన్నలు
కుభీర్ : ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రమైన కుభీర్‌లో శుక్రవారం అగ్గు మల్లన్నలు ప్యాట ఆకాష్(14)కు మల్లన్న దేవుడితో పెళ్లి(పట్టం) ఘనంగా జరిపించారు. ముజ్గీ, తురాటీ, దేగాం, కామోల్, ముథోల్, రాజూరా, కుభీర్ గ్రామాల్లో అగ్గుమల్లన్నలు ఉదయం భిక్షాటన చేసి సాయంత్రం పెళ్లి తంతు పూర్తి చేసి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమాలను గురువ య్యా మల్లేష్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో నిర్మల్ పట్టణానికి దగ్గరలో ముజ్గీ గ్రామంలో ఉన్న మల్లన్న దేవునికి చాలామంది భక్తులు ఉన్నారు.
మల్లన్నతో పెళ్లి జరిపించుకున్న వారు దేవుడి పేరుపై భిక్షాటన చేస్తూ, నిష్టగా జీవితాంతం ఉండాలి. గొల్లసుద్దులు, దేవుని కథలను చెబుతూ సంవత్సరానికి ఒకసారి పౌర్ణమికి జరిగే జాతరలో పాల్గొంటారు. వీరు కాళ్లకు గజ్జెలు కట్టుకుని, ఢమరుకం, డప్పు వాయిస్తూ, గొంగళి వేసుకుని, పట్కా చుట్టుకుని పాటలు పాడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. వీరిని అగ్గువారు, అగ్గు మల్లన్నలు అంటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంగుబాయి, మాజీ సర్పంచ్ అగ్గు నాగన్న, ప్యాట ముత్యం, ప్యాట విఠల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement