పది జిల్లాలకు జల ప్రసాదం: మంత్రి హరీశ్‌రావు  | T Harish Rao Praises On Cm Kcr In Mallanna Sagar Project Inauguration Program | Sakshi
Sakshi News home page

పది జిల్లాలకు జల ప్రసాదం: మంత్రి హరీశ్‌రావు 

Published Thu, Feb 24 2022 2:40 AM | Last Updated on Thu, Feb 24 2022 3:30 PM

T Harish Rao Praises On Cm Kcr In Mallanna Sagar Project Inauguration Program - Sakshi

దుబ్బాక టౌన్‌: ‘దేశ చరిత్రలోనే లేనివిధంగా నదిలేని చోట నిర్మించిన పెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్‌. నదికే నడక నేర్పి తానే స్వయంగా ఇంజనీరింగ్‌ నిపుణులతో కలిసి డిజైన్‌ చేసి ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌..’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సహజంగా ప్రాజెక్టులు నదికి అడ్డంగా కడతారని.. కానీ నదిలేని చోట సముద్ర మట్టానికి 667 మీటర్ల ఎత్తులో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్‌ నిర్మించిన కారణ జన్ముడు అని కొనియాడారు. మల్లన్నగర్‌ ప్రాజెక్టుతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. బుధవారం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు.  

మండుటెండల్లోనూ మత్తడులు దునికించారు 
మల్లన్నదేవుడు పుట్టినరోజునే ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రాజెక్టు ఆపాలని కోర్టులో వేసిన కేసులు కొట్టివేయడం కూడా ఇదే తేదీన కావడం గమనార్హమని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ నడిగడ్డపై మల్లన్నసాగర్‌ నిర్మించడంతో సగం తెలంగాణలో శాశ్వతంగా కరువు అనేదే ఉండదని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వానాకాలం కూడా ఎండాకాలం లాగానే ఉండేదని, గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టేవారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఎండాకాలం కూడా వానా కాలమైందన్నారు.

మండు టెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువులు మత్తడిలు దునికించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రసమయి బాలకిషన్, సతీష్‌ కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, చిట్టి దేవేందర్‌రెడ్డి, ఈఎన్‌సీ హరేరాం, కలెక్టర్‌ హనుమంతరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement