సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏటా పది వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుందని.. ఇది భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాత్మకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి ఉండటానికి తెల్లరక్త కణాలు ఏ విధంగా పనిచేస్తయో.. తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశానికి రక్షగా నిలుస్తారని చెప్పారు.
రాష్ట్ర వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలిచేలా పురోగమించడం మనకు గర్వకారణమన్నారు. శుక్రవారం కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో కలిపి మొత్తం 9 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. రాష్ట్ర వైద్య రంగ చరిత్రలో చారిత్రక ఘట్టం ఇది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యానికి చేరువయ్యాం. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని ఎకసెక్కాలు పలికిన వారి సమయంలో తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 26కు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మరో 8 వైద్య కాలేజీలను ప్రారంభించుకోనున్నాం.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటాయి. వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఒక్క కాలేజీ కూడా లేని ఉమ్మడి నల్గొండలో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేసి మెడికల్ కాలేజీలను స్థాపించుకున్నాం. హరీశ్‌రావు ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డైనమిక్‌గా పనిచేస్తున్నారు. మంచి విజయాలు సాధించారు.
ఏటా పది వేల మంది డాక్టర్లు..
తెలంగాణలో 2014లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 8,515కు చేరుకున్నాయి. ఇందులో 85శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు చేపట్టాం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి ఎదుగుతున్నాం. వారు రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ సేవలు అందిస్తారు.
ప్రజలకు మంచి వైద్య సేవలు కూడా..
దేశంలోనే అత్యధికంగా ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ఏకైక రాష్ట్రం మనదే. 34 వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే 34 పెద్దాస్పత్రులలో వేలాది పడకలతో పేదలకు మంచి వైద్య సేవలు అందుతాయి. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు పెడుతున్నాం.
2014లో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 17వేల పడకలుంటే.. ఇప్పుడు 34 వేలకు పెరిగాయి. మరో 6 ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌లో టిమ్స్ బ్యానర్ కింద నాలుగు ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. నిమ్స్‌ను విస్తరిస్తున్నాం. మొత్తంగా బెడ్ల సంఖ్యను 50వేలకు పెంచుకుంటున్నాం. ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు మొత్తం 50వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా సిద్ధం చేసుకుంటున్నాం.
రాష్ట్రంలో మానవీయ పాలన
తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతోంది. అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి గోండు గూడాలు, ఆదివాసీ, బంజారా తండాలు, మారుమూల ప్రాంతాల్లోని గర్భవతులను ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ప్రసవం అయ్యాక తిరిగి ఇంటివద్ద దింపుతున్నాం. తల్లీపిల్లల కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను అమలు చేస్తున్నాం. వైద్య వృత్తి పవిత్రమైనది. తెలంగాణ వైద్యులంటే గొప్ప పేరు రావాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి..’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
దేశ చరిత్రలోనే తొలిసారి: హరీశ్‌రావు
ఒక రాష్ట్రం ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని.. ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో సుదినమని చెప్పారు. గత ఏడాది ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఈసారి మన రికార్డును మనమే అధిగమించామని తెలిపారు.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో ఒక్క తెలంగాణ వాటానే 43 శాతమని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కాగా.. సీఎం కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లాల్లో కాలేజీల వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment