ఆధిపత్యం ఎవరిది!?  | Ground report from From joint Adilabad | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం ఎవరిది!? 

Published Mon, Nov 27 2023 4:23 AM | Last Updated on Mon, Nov 27 2023 4:23 AM

Ground report from From joint Adilabad - Sakshi

వెనుకబడిన ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో  స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. ఆదివాసీలు, సింగరేణి కార్మికులు, రైతులు, కూలీలతో పాటు యువతరం ఈసారి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వెంట  నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పాగా వేసేందుకు కాంగ్రెస్‌ శక్తివంచన లేని కృషి  పట్టు సాధించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

పది నియోజకవర్గాలున్న ఉమ్మడిజిల్లాలో ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌ ఎస్టీలకు రిజర్వు కాగా, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీల రిజర్వ్‌డ్‌ స్థానాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందించిన సంక్షేమ పథకాలు, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి జిల్లాకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అభ్యర్థులు ముందున్నారు.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వల్ల ముంపునకు గురవుతున్న భూముల సమస్యపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్‌ చేస్తున్నాయి. బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ ప్రధాన పక్షాలకు సవాల్‌ విసురుతున్నారు. అధికార బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి జిల్లాలో తూర్పు ప్రాంతమైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌లలో కాంగ్రెస్‌ బలమైన ప్రత్యర్థిగా ఉండగా, పశ్చిమాన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్‌లలో బీజేపీ గట్టి పోటీనిస్తోంది. ఖానాపూర్, సిర్పూర్‌లలో వివిధ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 

ఆదిలా‘బాద్‌షా’ ఎవరో? 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో జోగు రామన్నకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ మరోసారి బరిలో నిలిచి సవాల్‌ విసురుతున్నారు. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా  ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి బరిలోకి  దిగారు. ఆదిలాబాద్‌లో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో  ఈసారి కూడా బీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

ఆదిలాబాద్‌లో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓటు బ్యాంకుతో మళ్లీ విజయం వరిస్తుందనే ఆశాభావంతో జోగు రామన్న ఉన్నారు. ప్రభుత్వంతో పాటు జోగు రామన్న పట్ల సహజంగా ఉండే అసంతృప్తి, పెరిగిన బీజేపీ బలం తనకు కలిసి వస్తుందని పాయల్‌ శంకర్‌ భావిస్తున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి సైతం విజయంపై ధీమాతో ఉన్నారు.

బోథ్‌: ఆదివాసీలే కీలకం 
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలై, బీజేపీలో చేరి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు మరోసారి బోథ్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ రాక ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచిన అనిల్‌ జాదవ్‌ ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఆ వర్గం అభ్యర్థిగా ప్రధాన పార్టీల నుంచి సోయం బాపూరావు మాత్రమే బరిలో నిలిచారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనిల్‌ జాదవ్, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆడె గజేందర్‌ ఇద్దరూ లంబాడీ వర్గానికి చెందిన వారే. బీఎస్పీ నుంచి మరో ఆదివాసి మెస్రం జంగుబాపు బరిలో ఉన్నప్పటికీ, ఆదివాసీల ప్రతినిధిగా సోయం బాపూరావునే ఆ వర్గీయులు భావిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశం. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు సైతం బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతిస్తుండటం గమనార్హం.

ఆసిఫాబాద్‌: కలిసి రానున్న‘ఆదివాసీ’ ఓటు 
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, ఈసారి ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కోవా లక్ష్మినే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఖానాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించడంతో ఆమె తన భర్త మాజీ ఆర్టీఏ అధికారి శ్యాం నాయక్‌తో పాటు కాంగ్రెస్‌ లో చేరారు.

దీంతో శ్యాంనాయక్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో, అప్పటివరకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వారు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీ అభ్యర్థిగా ఆత్మారాంనాయక్‌ బరిలో నిలిచినప్పటికీ, ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే నెలకొంది. పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవా లక్ష్మి ఒక్కరే ఆదివాసీ కావడం, ఆదివాసీ ఓట్లు ఏకంగా 70 వేల ఓట్లు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఖానాపూర్‌: అభ్యర్థి మారినా ‘రాత’ మారుతుందా?
సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అభ్యర్థిత్వాన్ని కాదని కేటీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న జాన్సన్‌నాయక్‌కు బీఆ ర్‌ఎస్‌ ఇక్కడ సీటిచ్చింది. బీజేపీ  నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ పోటీ పడుతుండగా, కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ఆది వాసీ ఉద్యమ నాయకుడు వెడ్మ బొజ్జును బరిలో నిలిపింది.  ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ ముగ్గురి మధ్యనే త్రిముఖ పోటీ నెలకొంది.

అయితే బీఆర్‌ఎస్, బీజేపీ తరపున పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు లంబాడీ వర్గానికి చెందిన వారు కావడం, కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు కలిసి వచ్చే అంశం. ఆదివాసీ ఓట్లతో పాటు లంబాడీ వర్గం ఓట్లు భారీగానే ఉన్నప్పటికీ, లంబాడీ ఓట్ల చీలిక కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను మార్చడం బీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నప్పటికీ, జాన్సన్‌నాయక్‌ను లంబాడీలు ఆదరించడంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది.

సిర్పూరు: ‘ఏనుగు’ మళ్లీ ఎగురుతుందా? 
2004లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనే 2018లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. ఇప్పుడు   బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలవగా, ఆయనకు చెక్‌ పెట్టేందుకు ఈసారి మూడు పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ‘ఏనుగు’ గుర్తుపై పోటీలో నిలిచి రాష్ట్ర స్థాయిలో అందరినీ ఆకర్షిస్తున్నారు.

గతంలో కోనప్ప గెలిచిన బీఎస్పీ తరపునే పోటీ చేసి ఆయనను ఓడించాలనే ధ్యేయంతో అటవీ, మైదాన ప్రాంతాల్లో కలియతిరుగుతున్నారు. సిర్పూరులో ఎస్సీ, బుద్ధిస్ట్‌ ఓట్లు భారీగా ఉండడం, మైనారిటీలతో పాటు గిరిజన వర్గాల ఓట్లు కూడా చీలి తనకు కలిసి వస్తుందని ప్రవీణ్‌కుమార్‌ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కోనప్పపై కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన పాల్వాయి హరీశ్‌బాబు ఈసారి బీజేపీ పక్షాన పోరాడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి రావి శ్రీనివాస్‌ బరిలో నిలిచారు.  ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, బీఎస్పీ, బీజేపీ మధ్యనే నెలకొంది. 

నిర్మల్‌: కారు, కమలం మధ్యన పోటీ.. 
సీనియర్‌ నేత, మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో ఈసారి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరి ఆపార్టీ అభ్యర్థిగా పోటీ ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న ప్రభావం, భైంసా, నిర్మల్‌లలో జరిగిన మతఘర్షణల నేపథ్యంలో మారిన  రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ బలం పెరిగిందని అంటున్నారు. కాగా మైనారిటీ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై అల్లోల్ల ఇంద్ర కరణ్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

ముథోల్‌: ఇక్కడా బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే..
రాష్ట్రంలో సున్నిత ప్రాంతంగా పేరున్న భైంసా ప్రధాన కేంద్రంగా ఉన్న ముథోల్‌ నియోజకవర్గంలో అధికార పార్టీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెడ్డన్నగారి విఠల్‌రెడ్డికి  బీజేపీ అభ్యర్థి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పవార్‌ రామారావు పటేల్‌  గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రామీ ణ ఓటర్లతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లతో విజయం తనదేనని సిట్టింగ్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ధీమాతో ఉన్నారు.

భైంసాలోని ముస్లిం మైనారిటీల ఓట్లతో బీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, భైంసాలో నెలకొన్న పరిస్థితుల వల్లనే హిందూ ఓట్లన్నీ ఈసారి గంపగుత్తగా బీజేపీకే పడతాయని ఆపార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాని కాంగ్రెస్‌ పార్టీ ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు.

మంచిర్యాల: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటీ 
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  నడిపెల్లి దివాకర్‌రావు ఐదో విజయం కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో 4,877 ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఈసారి  కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోసారి తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో దివాకర్‌రావు ఉన్నారు.

 ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీ అభ్యర్థిపై ప్రజల్లో నెల కొన్న అసంతృప్తి తనను ఈసారి విజయ తీరాలకు చేరుస్తుందని ప్రేంసాగర్‌రావు ఆశాభావంతో ఉన్నారు. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్‌ మరోసారి బరిలో నిలవగా, ఆయనకు వచ్చే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది ప్రశ్నార్థకం. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురిది వెలమ సామాజికవర్గమే.

బెల్లంపల్లి: గెలుపుపై రెండు పార్టీల్లోనూ ధీమా.. 
సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్ల నెలకొన్న వ్యతిరేకత, బీఆర్‌ఎస్‌ మండల స్థాయి నాయకుల వ్యవహారశైలి... కాంగ్రెస్‌ అభ్యర్థి, గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిన మాజీ మంత్రి గడ్డం వినోద్‌పై ఉన్న సానుభూతి బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశం.  అయితే ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు తనను గట్టెక్కిస్తారనే ధీమాతో చిన్నయ్య ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బరిలో ఉన్నప్పటికీ పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే నెలకొంది.

చెన్నూరు: నువ్వా నేనా..? 
బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విజయం నల్లేరు మీద నడక అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ గడ్డం వివేకానంద రావడం రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది.  చెన్నూరులో రూ. వందల కోట్లతో చేసిన అభివృద్ధి, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని సుమన్‌ కోరుతున్నారు.

వివేక్‌ రాకతో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు సుమన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వివేక్‌ చెన్నూరులో విజయం కోసం కోట్లు వెచ్చిస్తున్నారని, నాయకులను కొంటున్నారని ఎమ్మెల్యే సుమన్‌ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈడీ రైడ్స్‌ చెన్నూరులో రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీనెలకొంది.  విజయం కోసం ఇద్దరూ శ్రమిస్తున్నారు.

కేసీఆర్‌ వల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగం..  
సింగరేణిలో ఇక రావు అనుకున్న డిపెండెంట్‌ ఉద్యోగాలను కేసీఆర్‌ ఇప్పించారు. టీడీపీ హయాంలో రద్దయిన ఈ ఉద్యోగాలను  ఏ ప్రభుత్వం మళ్లీ ఇవ్వదనుకున్నాం.  నేను ఎంఏ, బీఈడీ చదివాను. వారసత్వ ఉద్యోగాల్లో అల్లుళ్లకు కూడా ఉద్యోగాలివ్వడంతో మా మామ  ఉద్యోగం నాకు వచ్చింది.

సింగరేణి పరంగా బీఆర్‌ఎస్‌ హయాంలో  కార్మికులకు అనేక హక్కులతో పాటు సదుపాయాలు కూడా  వచ్చాయి.  గతంలో  క్వార్టర్లలో ఉంటే బేసిక్‌ జీతంపై ఒక శాతం విద్యుత్‌చార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని తీసేశారు. ఏసీ కూడా పెట్టుకుంటున్నాం. మా తల్లిదండ్రులకు కార్పొరేట్‌ వైద్యం కూడా అందిస్తున్నారు. 
– దుర్గం రవికుమార్, జనరల్‌ మజ్దూర్, ఆర్కే 5 గని

వీధి వ్యాపారిగా మారిన.. 
రెక్కల కష్టం తప్ప మాకు ఏ ఆధారం లేదు. నా భర్త నృత్య కళాకారుడు. వందలాదిమంది కళాకారులను తయారు చేశారు. ఆయనకు కళాకారుల ఉద్యోగం ఈ సర్కారులో రాలేదు. బీసీబంధు పథకం మాకు ఇయ్యలేదు. పేదలకుమేలు చేస్తున్నామని సర్కారు చెప్పుకునుడే తప్ప అమల్లో లేదు. ఏ ఒక్క ప్రభుత్వ పథకం మంజూ రు కాని మేము అనేక కష్టనష్టాలు పడుతున్నాం. చివరికి వీధి వ్యాపారిగా మారాల్సి వచ్చింది.  – హనుమాన్ల సువర్ణ, చిరు వీధి వ్యాపారి, బెల్లంపల్లి

కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో అపార నష్టం..  
నాకు మూడున్నర ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి సాగు చేశాను. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో  గత నాలుగేళ్లుగా పంట మునిగిపోతోంది. తీవ్రంగా నష్టపోయిన. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు. మాకోసం ఆలోచించే వారినే మేం గెలిపించుకుంటాం.   –సుంకరి మల్లయ్య, రైతు, కోటపల్లి (చెన్నూరు)

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇవ్వలేదుబీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో మాటలు 
చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏవేవో పథకాలన్నారు. ఎన్ని పథకాలు పెట్టినా పేదలకు మాత్రం ఎలాంటి ఫాయిదా లేదు. నాకు ఇల్లు లేదు.  డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి  కోసం దరఖాస్తు చేసుకున్న. ఎంతో ఆశతో ఎదురు చూసినా మంజూరు చేయలేదు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ను చూసాం. పేదోళ్లకు ఏం మేలు జరగలేదు. ఈసారి కాంగ్రెస్‌ కు అవకాశం ఇచ్చి చూస్తాం.  – సయ్యద్‌ ఖాజాపాషా, పంక్చర్‌ కొట్టు నిర్వాహకుడు, బెల్లంపల్లి

- ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి పోలంపల్లి ఆంజనేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement