ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..ప్రజలు ఊరుకోరు! | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..ప్రజలు ఊరుకోరు!

Published Sat, Feb 3 2024 4:02 AM

Telangana CM Revanth Reddy sounds LS poll bugle in Indravelli - Sakshi

అలా చేస్తే ఊర్లలోకి రానిస్తరా? 
‘‘ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నరు. మూడు నెలలు, ఆరు నెలల్లో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. నీ అయ్యా.. ఎవడు పడగొట్టేటోడు.. మా యువకులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. పడగొడితే వారంతా చూస్తూ ఊరుకుంటరా? ఊర్లలోకి రానిస్తరా? ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే.. మీ ఊర్ల వేపచెట్టుకు కట్టేసి కొట్టండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇదేమైనా మీరు దోపిడీ చేసిన లక్ష కోట్ల కాళేశ్వరం కూలినట్టు అనుకున్నరా? ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరు’’

సాక్షి, ఆదిలాబాద్‌:  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని, త్వరలోనే కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతాడని కొందరు మాట్లాడుతున్నారని.. ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంసం చేశారని.. తాము పునర్నిరి్మంచే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పదిహేను రోజుల్లో కానిస్టేబుల్‌ నియామకాలను చేపడతామని ప్రకటించారు.

శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది. సీఎం రేవంత్‌ ఇందులో పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంస రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్‌ తన సొంత కుటుంబ సభ్యుల కోసమే తప్ప ఏనాడూ ప్రజల కోసం ఆలోచించలేదు. మిషన్‌ భగీరథ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు.

నాడు ఇంద్రవెల్లి సాక్షిగా సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నాం. మళ్లీ ఇదే ఇంద్రవెల్లి సాక్షిగా పార్లమెంట్‌ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తాం. గత పదేళ్ల పాలనలో ఏనాడైనా అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? గూడేలు, తండాలకు నిజంగా నీళ్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మేం రూ.65 కోట్లతో ఇంద్రవెల్లిలో పనులు మొదలుపెట్టాల్సి వచ్చేదా? ప్రగతిభవన్‌ వద్ద నాడు గద్దర్‌ను నిరీక్షించేలా చేసిన కేసీఆర్‌కు ఉసురు తగిలింది. 

మోదీ దగ్గర గులాంగిరీ.. 
దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తొమ్మిది ఎంపీ సీట్లను గెలిస్తే.. కేసీఆర్‌ వాటిని ఢిల్లీలో తాకట్టు పెట్టి మోదీ దగ్గర గులాంగిరీ చేశారు. ఇప్పుడు మోదీ, కేడీ ఒక్కటై ముందుకొస్తున్నారు. మతం పేరిట బీజేపీ, మద్యంతో కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలి. రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కావాలి. 

నాటి ఘటనకు క్షమాపణ చెప్తున్నా.. 
1981 ఏప్రిల్‌లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లి పోరాటకారులను కాల్చి చంపి, ఇప్పుడు నివాళులు అరి్పస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నాటి సీమాంధ్ర పాలకుల కారణంగా ఆ ఘటన జరిగింది. దానిపట్ల నేను క్షమాపణ చెప్తున్నాను. ఆదివాసీలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

ధరణితో కోల్పోయిన భూములను అప్పగిస్తాం: భట్టి 
అటవీప్రాంతాల్లోని గిరిజనులకు నీటి వనరులను అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములను గోండు గిరిజనులకు తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. సీఎం కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్, వివేక్, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్, మల్లురవి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. 

నాగోబాకు పూజలు చేసి.. మహిళలతో భేటీ.. 
ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నివాళి అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్లస్థలాల పట్టాలు అందజేశారు. ఇక్కడి కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మెప్మా, వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాగోబా దర్బార్‌ హాల్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్‌ ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల స్కూల్‌ యూనిఫారాలు కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement