
ఉద్ధవ్ ఠాక్రేతో అబ్దుల్ సత్తార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘మహా వికాస్ అఘాది’ పేరిట ఏర్పాటుకానున్న సంకీర్ణ సర్కారు విషయమై శుక్రవారం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే.. శివసేనలో చీలిక వచ్చే అవకాశముందనే కథనాలు వస్తున్నాయి. పలువురు శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసిందని, శివసేన ప్రభుత్వ ఏర్పాటు యత్నాలకు బ్రేక్ వేసేందుకు కమలదళం ఈ మేరకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీ చీలిక యత్నాలపై తీవ్రంగా స్పందించారు. ఎవరైనా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. తీవ్ర హింసాత్మక చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఎవరైనా శివసేన ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తే.. మేం వారి తల పగలగొడతాం. దాంతోపాటు కాళ్లు కూడా విరగొడతాం. ఆ తర్వాత వారి బాగోగులు కూడా శివసేననే చూసుకుంటుంది. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం. ఇందుకోసం అంబులెన్స్ కూడా సిద్ధం చేస్తాం’ అని అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment