Abdul Sattar
-
మహా సంకీర్ణంలో కేబినెట్ చిచ్చు
-
ఠాక్రే సర్కారుకు షాక్!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కేబినెట్లో సహాయ మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ రాజీనామా చేశారన్న వార్తలు శనివారం కలకలం రేపాయి. అదేవిధంగా, కాంగ్రెస్ నేత, తెలుగు ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల్ కూడా రాజీనామా ఇవ్వనున్నారని తెలిసింది. జాల్నా ఎమ్మెల్యే అయిన గోరింట్యాల్ ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించారు. అది లభించక పోవడంతోనే అసంతృప్తితో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి మండలి విస్తరణ అనంతరం ఐదురోజులు తిరగకుండానే శివసేన నేత, సహాయ మంత్రి అబ్దుల్ సత్తార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ హోదా లభించలేదన్న అసంతృప్తితోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. దీనికితోడు, ఔరంగాబాదులో శివసేనకు ఆరుగురు ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్‌కు ఒక్కరూ లేరు. జిల్లా పరిషత్‌తో శివసేనకు చెందిన 18 మంది సభ్యులుండగా కాంగ్రెస్‌కు 10 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు శివసేన నిర్ణయం తీసుకుంది. దీనిపై ముందుగా తనతో చర్చించలేదని అబ్దుల్ సత్తార్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అందుకే సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంతోపాటు శివసేనకు తొలి షాక్‌గా చెప్పవచ్చు. కాగా, శివసేన నేత చంద్రకాంత్ ఖైరే అబ్దుల్ సత్తార్‌ను ద్రోహి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఔరంగాబాద్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయన అనుచరులు సంకీర్ణ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని అధిష్టానాన్ని కోరారు. సీఎంతో నేడు సత్తార్ భేటీ రాజీనామా వార్తలు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపగా దీనిపై అబ్దుల్ సత్తార్ మాత్రం స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకు సందిగ్ధం కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ ఉందని, అనంతరమే ఒక ప్రకటన చేస్తానని తెలిపారు. -
శివసేనకు భారీ షాక్.. మంత్రి రాజీనామా!
సాక్షి, ముంబై : ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది కాలంలోనే మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడి సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ కేబినెట్ నుంచి వైదొలిగినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. కేబినెట్ హోదా ఇవ్వకపోవడం, మంత్రిగా ప్రమాణం చేసి వారం గడుస్తున్నా ఇంకా శాఖలు కేటాయించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాజీనామాపై అబ్దుల్ సత్తార్ ఇప్పటి వరకు బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు అధికార శివసేన మాత్రం రాజీనామా వార్తలను తీవ్రంగా ఖండించింది. సత్తార్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సిల్లోద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ సీటు ఆశించిన ఆయన.. తనకు సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి శివసేన కండువా కప్పుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. (జాక్‌పాట్ కొట్టిన శరద్ పవార్.. ప్రభుత్వంలో కీ రోల్) -
నెత్తి పగలకొడతాం.. కాళ్లు విరగ్గొడతాం!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘మహా వికాస్ అఘాది’ పేరిట ఏర్పాటుకానున్న సంకీర్ణ సర్కారు విషయమై శుక్రవారం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే.. శివసేనలో చీలిక వచ్చే అవకాశముందనే కథనాలు వస్తున్నాయి. పలువురు శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసిందని, శివసేన ప్రభుత్వ ఏర్పాటు యత్నాలకు బ్రేక్ వేసేందుకు కమలదళం ఈ మేరకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీ చీలిక యత్నాలపై తీవ్రంగా స్పందించారు. ఎవరైనా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. తీవ్ర హింసాత్మక చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఎవరైనా శివసేన ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తే.. మేం వారి తల పగలగొడతాం. దాంతోపాటు కాళ్లు కూడా విరగొడతాం. ఆ తర్వాత వారి బాగోగులు కూడా శివసేననే చూసుకుంటుంది. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాం. ఇందుకోసం అంబులెన్స్ కూడా సిద్ధం చేస్తాం’ అని అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారు..
ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కోలుకోకముందే కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవులకు పలువురు నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. కాగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉందన్న వార్తల నేపథ్యంలో రాధాకృష్ణ మంత్రి పదవి దక్కించుకునే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆయన తనయుడు సుజయ్ విఖే పాటిల్ సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు.. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ హస్తం గూటిని వీడిన అనంతరం మాట్లాడుతూ.. తనతో పాటు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారని పేర్కొన్నారు. తామంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 41 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ తన పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. -
సీటివ్వలేదని కుర్చీలెత్తుకెళ్లాడు..
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు కోపాన్ని, అసంతృప్తిని తలోరకంగా వ్యక్తం చేస్తారు. కొందరు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగితే, మరి కొందరు టికెట్ ఇచ్చే మరో పార్టీలోకి దూకేస్తారు. అయితే, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీ ఆఫీసులోని కుర్చీలను ఎత్తుకెళ్లిపోయి తన కోపాన్ని వినూత్నంగా వెల్లడించాడు. సిలోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సత్తార్ ఔరంగాబాద్ లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నించాడు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో కోపించిన సత్తార్ స్థానిక పార్టీ కార్యాలయం ‘గాంధీభవన్’లో ఉన్న 300 కుర్చీలను తన మద్దతుదారుల సాయంతో ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ కుర్చీలన్నీ తనవేనని, టికెట్ ఇవ్వనందున తాను కాంగ్రెస్‌ను వదిలేస్తున్నానని చెప్పాడు. తాను పార్టీలో లేనప్పుడు తన కుర్చీలు ఎందుకుండాలని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయానని వివరణ ఇచ్చాడు. మిత్రపక్షమైన ఎన్సీపీతో కలిసి గాంధీభవన్‌లో సమావేశం జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సంగతి తెలిసిన సత్తార్ సమావేశానికి ముందే కుర్చీలన్నీ తీసుకెళ్లాడు. కుర్చీలు లేకపోవడంతో సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చాల్సి వచ్చింది. అలా అని సత్తారేమీ తక్కువోడు కాదు. జిల్లాలో ఆయనకు పలుకుబడి బాగా ఉంది. పార్టీ నాయకులు మాత్రం సత్తార్‌కు ఏదో అవసరం వచ్చి కుర్చీలు తీసుకెళ్లాడని, టికెట్ ఇవ్వనందుకు ఆయనకేం కోపం లేదని సర్దిచెబుతున్నారు. -
నకిలీ పాసుపోర్టు ముఠా గుట్టురట్టు
నకిలీ పాసుపోర్టులను తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు కోరుట్ల పోలీసులు. వారి నుంచి భారీగా నకిలీ పాసుపోర్టులు, నకిలీ విద్యార్హత, జనన, నివాస దృవీకరణ పత్రాలతో పాటు కంప్యూటర్, స్కానర్, ప్రింటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కోరుట్లకు చెందిన కమ్రుద్దీన్, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ సత్తార్‌లను అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేవిల్ నిందితుల వివరాలు వెల్లడించారు. -
మన గీతకూ కావాలి.. ఒక బజరంగీ భాయ్‌జాన్!
సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమా బజరంగీ భాయ్‌జాన్ కథ కల్పితం. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో అలాంటి క థ నిజంగానే సాగుతోంది. 14 ఏళ్ల క్రితం రైలు ద్వారా పొరపాటుగా పాకిస్తాన్‌కు చేరిన ఓ బాలిక.. భారత్‌లోని తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఇంకా ఎదురుచూస్తోంది. సినిమాలో మాదిరిగా ఆమెను పుట్టిన ఊరికి చేర్చేందుకు ఇప్పుడు నిజంగానే ఒక బజరంగీ భాయ్‌జాన్ అవసరం! సినిమాలో మాదిరిగానే ఈమెకూ మాటలు రావు. వినపడదు. పాక్‌కు చేరిన ఈమెను తొలుత పంజాబ్ రేంజర్స్ సైనికులు గుర్తించి ఈదీ ఫౌండేషన్ చెంతకు చేర్చారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ భార్య, ‘మదర్ ఆఫ్ పాకిస్తాన్’ బిల్కిస్ ఈదీ ఈమెను హిందువుగా గుర్తించి.. ‘గీత’ అని పేరు పెట్టారు. ఫౌండేషన్ కార్యకర్తలు గీత తల్లిదండ్రులెవరో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రస్తుతం గీత వయసు 23 ఏళ్లు. కరాచీలోని ఈదీ ఫౌండేషన్ కేంద్రంలో ఉంటోంది. గీతకు ఒక ప్రార్థన గది, అందులో హిందూ దేవుళ్ల చిత్రపటాలు ఏర్పాటుచేశారు. తన పుట్టిన ఊరు గురించి తెలిసిన కొన్ని విషయాలనూ గీత చెప్పలేకపోతోంది. సైగలు, హావభావాల ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. అచ్చం ఇలాంటి కథతోనే వచ్చిన బజరంగీ భాయ్‌జాన్ హిట్ అయిన నేపథ్యంలో అక్కడి సామాజిక కార్యకర్తలు గీత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాక్ మానవ హక్కుల కార్యకర్త, మాజీ మంత్రి అన్సార్ బర్నీ గీత కోసం ఫేస్బుక్ ప్రచారం ప్రారంభించారు. గతేడాది భారత అధికారులు గీతను కలుసుకుని ఆమె ఫొటో, వివరాలను సేకరించినా ఆమె తల్లిదండ్రులెవరో తెలుసుకోలేకపోయారు. పాకిస్తాన్‌లోనే ఓ హిందూ యువకుడిని పెళ్లి చేసుకుని గీత అక్కడే స్థిరపడాలని ఈదీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని గీత తెగేసి చెబుతోందట. ఏదేమైనా.. మన గీతకూ ఒక పాకిస్తాన్ బజరంగీ భాయ్‌జాన్ దొరకాలని.. ఈ నిజజీవిత కథ కూడా సుఖాంతమై.. ఆమె రాత మారాలని ఆశిద్దాం! ఇవీ హింట్లు.. * భారత చిత్రపటాన్ని గీత గుర్తుపడుతోంది. కానీ ఓసారి జార్ఖండ్‌ను మరోసారి తెలంగాణను చూపిస్తోంది. * తనకు ఏడుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నట్లు సైగల ద్వారా చెబుతోంది. * పాకిస్తాన్‌కు పొరపాటుగా రైలులో వచ్చిన హిందూ బాలికగా గీతను గుర్తించారు. * హిందీ భాషలో రాయగలుగుతోంది. కానీ ఆ పదాలతో ఆమె వివరాలు మాత్రం తెలియడం లేదు. * గీత రాసే రాతల్లో తరచూ 193 సంఖ్య కనిపిస్తోంది. బహుశా అది ఆమె ఇంటి నంబర్ కావచ్చని అనుకుంటున్నారు. -
కాంగ్రెస్ కోటా భర్తీ
ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించిన చవాన్ సాక్షి, ముంబై: ఎట్టకేలకు కాంగ్రెస్ కోటాలోని మంత్రి పదవులు భర్తీ అయ్యియి. శనివారం రాత్రి ముగ్గురు మంత్రులకు శాఖలు కే టాయించారు. అబ్దుల్ సత్తార్ కు పాడిపరిశ్రమ, పశుసంవర్ధకశాఖ, మధుకర్ చవాన్‌కు రవాణ, అమిత్ దేశ్‌ముఖ్‌కు ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరిలో అబ్దుల్ సత్తార్, అమిత్ దేశ్‌ముఖ్ గత సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో తేరుకున్న ఎన్సీపీ ఇటీవల మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీచేసి చేతులు దులుపేసుకుంది. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులను కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. దీంతో ఎవరికి? ఏ శాఖ? కేటాయిస్తారనే విషయమై సర్వత్రా నెలకొన్ని ఉత్కంఠకు పృథ్వీరాజ్ చవాన్ శనివారం రాత్రి తెరదించారు. అయితే ఇంత ఆదరాబాదరగా శాఖలు కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే సమయమున్నందున గెలుపుదిశగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులోభాగంగానే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎన్సీపీ కాస్త ముందున్నా కాంగ్రెస్ మాత్రం దూకుడుగా వ్యవహరించినట్లు కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులు భర్తీ కావడం జరగని పనే అనుకున్నారంతా. అయితే అకస్మాత్తుగా శనివారం రాత్రి భర్తీ చేయడంతో పార్టీ నేతలు సైతం నివ్వెరపోయారు.