కాంగ్రెస్ కోటా భర్తీ
ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించిన చవాన్
సాక్షి, ముంబై: ఎట్టకేలకు కాంగ్రెస్ కోటాలోని మంత్రి పదవులు భర్తీ అయ్యియి. శనివారం రాత్రి ముగ్గురు మంత్రులకు శాఖలు కే టాయించారు. అబ్దుల్ సత్తార్ కు పాడిపరిశ్రమ, పశుసంవర్ధకశాఖ, మధుకర్ చవాన్‌కు రవాణ, అమిత్ దేశ్‌ముఖ్‌కు ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి పదవులు కట్టబెట్టారు. వీరిలో అబ్దుల్ సత్తార్, అమిత్ దేశ్‌ముఖ్ గత సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఘోరంగా పరాజయం పాలైంది.
దీంతో తేరుకున్న ఎన్సీపీ ఇటీవల మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీచేసి చేతులు దులుపేసుకుంది. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులను కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగినా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. దీంతో ఎవరికి? ఏ శాఖ? కేటాయిస్తారనే విషయమై సర్వత్రా నెలకొన్ని ఉత్కంఠకు పృథ్వీరాజ్ చవాన్ శనివారం రాత్రి తెరదించారు. అయితే ఇంత ఆదరాబాదరగా శాఖలు కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే సమయమున్నందున గెలుపుదిశగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులోభాగంగానే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తున్నాయి. ఈ విషయంలో ఎన్సీపీ కాస్త ముందున్నా కాంగ్రెస్ మాత్రం దూకుడుగా వ్యవహరించినట్లు కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ కోటాలోని మంత్రిపదవులు భర్తీ కావడం జరగని పనే అనుకున్నారంతా. అయితే అకస్మాత్తుగా శనివారం రాత్రి భర్తీ చేయడంతో పార్టీ నేతలు సైతం నివ్వెరపోయారు.