ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కోలుకోకముందే కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవులకు పలువురు నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు స్పీకర్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. కాగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉందన్న వార్తల నేపథ్యంలో రాధాకృష్ణ మంత్రి పదవి దక్కించుకునే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆయన తనయుడు సుజయ్ విఖే పాటిల్ సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు..
ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ హస్తం గూటిని వీడిన అనంతరం మాట్లాడుతూ.. తనతో పాటు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారని పేర్కొన్నారు. తామంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 41 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ తన పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment