పృథ్వీరాజ్‌ చవాన్‌ (కాంగ్రెస్‌ దిగ్గజం) రాయని డైరీ | Congress Leader Prithviraj Chavan Rayani Diary | Sakshi
Sakshi News home page

పృథ్వీరాజ్‌ చవాన్‌ (కాంగ్రెస్‌ దిగ్గజం) రాయని డైరీ

Published Sun, Nov 17 2024 12:09 AM | Last Updated on Sun, Nov 17 2024 12:09 AM

Congress Leader Prithviraj Chavan Rayani Diary

‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్‌ భారత్‌లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్‌ చేసి! ఆ ఫోన్‌ వచ్చింది ఆరెస్సెస్‌ నుంచి. ఆ ఫోన్‌ చేసింది ఆరెస్సెస్‌లోని ఒక పెద్ద మనిషి. 

‘‘నేనిప్పుడు నా 78లో ఉన్నాను. అయినప్పటికీ... ‘మీరు మీ వృద్ధాప్యంలో ఆలోచిస్తారు...’ అని మీరు నాతో అనటం ద్వారా నా వయసు పట్ల మీరు కనబరుస్తున్న గొప్ప ఔదార్యం నన్ను కట్టిపడేస్తోంది. అలాగని నేను కాంగ్రెస్‌ కట్లు తెంపుకొని బీజేపీలోకి వచ్చేయలేను...’’ అన్నాను మృదువుగా.

‘‘కట్లు అని మీరే అంటున్నారు. తెంపుకొని వచ్చేయటానికి ఏమిటి ఆలోచన?!’’ అన్నారాయన.
‘‘అవి నన్ను నేను కాంగ్రెస్‌తో కట్టేసుకున్న కట్లు. కాంగ్రెస్‌ నన్ను ఫోన్‌ చేసి పిలిపించుకుని కట్టిపడేసిన కట్లు కావు...’’ అన్నాను. పెద్దగా నవ్వారాయన.

‘‘మీలోని ఈ కట్టుబాటే నా చేత మీకు ఫోన్‌ చేయించేలా బీజేపీని ప్రేరేపించింది చవాన్‌జీ! ఢిల్లీలో బీజేపీకి మీ అవసరం ఉంది. సీనియర్‌ మోస్ట్‌గా మీకూ బీజేపీలో తగినంత గౌరవం ఉంటుంది. వచ్చేయండి...’’ అన్నారు.

కోరుకున్న చోట దక్కే గౌరవం, కోరుకోని చోట పొందే గౌరవం... రెండూ ఒకటి కావు. దక్కింది సంతృప్తిని ఇస్తుంది. పొందింది
సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది.

‘‘నాకిక్కడ కాంగ్రెస్‌లో తగినంత గౌరవం దక్కుతూనే ఉంది మహోదయ్‌ జీ...’’ అన్నాను. 
ఆయన మళ్లీ నవ్వారు.

‘‘నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆరేళ్లు ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌లో సహాయ మంత్రిగా ఉండటం, ఒక టర్మ్‌కు పైగా రాజ్య సభలో ఉండటం, రెండు టర్మ్‌లు లోక్‌సభలో ఉండటం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం... ఇవన్నీ నిజంగా దక్కుదలలే అంటారా చవాన్‌ జీ... ఒక్కసారి మీ మనసును అడగండి...’’ అన్నారాయన!

ఆయన ఉద్దేశం – ఇవేవీ ఆరెస్సెస్‌ ‘ప్రచారక్‌ ’, ‘విచారక్‌’లతో కానీ, బీజేపీ ‘మార్గదర్శక్‌ మండల్‌’ సభ్యత్వంతో కానీ సమానమైనవి కావన్నట్లుగా ఉంది!

మొదటిసారి ఆయన నాకు ఫోన్‌ చేసింది ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు. రెండోసారి ఫోన్‌ చేసింది నామినేషన్‌లకు ముందు. మూడోసారి ఫోన్‌ చేసింది నవంబర్‌ 4న నామినేషన్‌ల ఉపసంహరణ గడువుకు ముందు. 

ఇప్పుడు మళ్లీ ఫోన్‌ చేసి, ‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేయండి, చవాన్‌ జీ...’’ అంటున్నారు 20న పోలింగ్, 23న
కౌంటింగ్‌ పెట్టుకుని!

కరద్‌ సౌత్‌ నుంచి వరుసగా రెండుసార్లు నా మీద పోటీ చేసి ఓడిపోయిన అతుల్‌ సురేశ్‌ భోసలేనే మళ్లీ నాపై నిలబెట్టింది బీజేపీ. మొదటిసారి 18 వేలు, రెండోసారి 9 వేల ఓట్ల తేడాతో అతుల్‌ ఓడిపోయారు కనుక ఈసారి ఆయన కచ్చితంగా గెలిచి తీరుతారని ఆ పార్టీ నమ్మకం.

నమ్మకాలు బీజేపీకి మాత్రమే ఉంటాయా?! కరద్‌ సౌత్‌లో మళ్లీ నేనే వస్తానని కాంగ్రెస్‌ నమ్ముతోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్‌ వస్తే నేనే సీఎం అని నేను నమ్ముతున్నాను. తనే సీఎం అని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ నానా పటోలే నమ్ముతున్నారు.

అడ్డు తొలగించుకోవటం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. బీహార్‌లో తమ కన్నా తక్కువ సీట్లు వచ్చిన నితీశ్‌కు సీఎం సీటును ఇచ్చేస్తుంది. కరద్‌ సౌత్‌లో అతుల్‌కి దీటైన పోటీ లేకుండా నన్ను పార్టీలోకి తీసుకోటానికి ఆరెస్సెస్‌తో ఫోనూ చేయిస్తుంది. 

‘‘వృద్ధాప్యంలో మీరు ఆలోచిస్తారు...’’అంటూ ఈసారి మళ్లీ ఆ ఆరెస్సెస్‌ మహోదయ్‌ ఫోన్‌ చేస్తే ఒకటే చెప్పాలి... కాంగ్రెస్‌లో వృద్ధాప్యమనేదే ఉండదని గట్టిగా చెప్పాలి! 
- మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement