
సాక్షి, ముంబై : ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది కాలంలోనే మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడి సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న అబ్దుల్ సత్తార్ కేబినెట్ నుంచి వైదొలిగినట్లు వార్తులు వినిపిస్తున్నాయి. కేబినెట్ హోదా ఇవ్వకపోవడం, మంత్రిగా ప్రమాణం చేసి వారం గడుస్తున్నా ఇంకా శాఖలు కేటాయించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాజీనామాపై అబ్దుల్ సత్తార్ ఇప్పటి వరకు బహిరంగ ప్రకటన చేయలేదు. మరోవైపు అధికార శివసేన మాత్రం రాజీనామా వార్తలను తీవ్రంగా ఖండించింది. సత్తార్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సిల్లోద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ సీటు ఆశించిన ఆయన.. తనకు సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి శివసేన కండువా కప్పుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. (జాక్‌పాట్ కొట్టిన శరద్ పవార్.. ప్రభుత్వంలో కీ రోల్)
Comments
Please login to add a commentAdd a comment